Saibaba Satcharitra 8 Adhyayam

శ్రీసాయిసచ్చరిత్ర

రెండవరోజు పారాయణం

ఎనిమిదవ అధ్యాయం

మానవజన్మ యొక్క ప్రాముఖ్యం

ఈ అద్భుత విశ్వంలో భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించాడు. దేవ, యక్ష, గంధర్వులు, జంతు , కీటకాలు, మనుషులు మొదలైన వాటిని సృష్టించాడు. స్వర్గం, నరకం, భూమి, మహాసముద్రం, ఆకాశంలో నివశించే జీవకోటి అంతా సృష్టించాడు. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువ అవుతుందో వారు స్వర్గానికి వెళ్ళి వారి పుణ్యఫలం అనుభవించిన తరువాత త్రోసివేయబాడతారు. ఎవరి పాపం ఎక్కువ అవుతుందో వారు నరకానికి వెళతారు. అక్కడ వారు చేసిన పాపాలకు తగినవిధంగా బాధలను పొందుతారు. పాపపుణ్యాలు సమానంగా ఉన్నప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్షసాధనం కోసం అవకాశం పొందుతారు. వారి పాపపుణ్యాలు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షం కలుగుతుంది. వేయి సంవత్సరాల మోక్షాన్నిగాని, పుట్టుకగాని వారు వారు చేసుకున్న కర్మపై ఆధారపడి ఉంటుంది.

మానవశరీరము యొక్క ప్రత్యేక విలువ

జీవకోటి అంతటికీ ఆహారం, నిద్ర, భయం, సంభోగం సామాన్యం. మానవునికి ఇవి కాకుండా మరొక ప్రజ్ఞ వుంది. అదే జ్ఞానం. దీని సహాయంతోనే మానవుడు భగవంతుడి సాక్షాత్కారం పొందగలడు. ఇంకే జన్మలోనూ దీనికి అవకాశం లేదు. ఈ కారణంతోనే దేవతలు సైతం మానవజన్మను ఈర్ష్యతో చూస్తారు. వారు కూడా భూమిపై మానవజన్మ ఎత్తి మొక్షాన్ని సాధించాలని కోరుకుంటూ ఉంటారు. కొంతమంది మానవజన్మ చాల నీచమైనది అని, చీము, రక్తం, మలాలతో కూడుకుని ఉంటుందని, చివరికి శిథిలమై రోగానికి, మరణానికి కారణం అవుతుందని అంటారు. కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ మానవునికి జ్ఞానం సంపాదించే శక్తి వుంది. శరీరం ఉన్నది కాబట్టే మానవుడు తన దేహం యొక్క జగత్తు యొక్క అనిత్యత్వాన్ని గ్రహించి, ఇంద్రియ సుఖాలపట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకంతో చివరికి భగవంతుడి సాక్షాత్కారాన్ని పొందగలుగుతున్నాడు. శరీరం మలభూయిష్టమైనదని నిరాకరిస్తే మోక్షాన్ని సంపాదించే అవకాశాన్ని పోగొట్టుకుంటాము. దేహాన్ని ముద్దుగా పెంచి విషయ సుఖాలకు అలవాటు పడితే నరకంలో పడతాం. ఉచిత మార్గం ఏమిటంటే దేహాన్ని అశ్రద్ధ చేయకూడదు, దాన్ని లోలత్వంతో పోషించకూడదు. తగిన జాగ్రత్త మాత్రమె తీసుకోవాలి. గుఱ్ఱం రౌతు తన గమ్యస్థానాన్ని చేరుకునేవరకు గుఱ్ఱాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో అంత జాగ్రత్త మాత్రమే తీసుకోవాలి. ఈ శరీరాన్ని మోక్షసాధన, లేక ఆత్మసాక్షాత్కారం కోసం జాగ్రత్త మాత్రమే తీసుకోవాలి. ఈ శరేరాన్ని మోక్షసాధన, లేక ఆత్మసాక్షాత్కారం కోసం వినియోగించు కోవాలి. ఇదే జీవుడి పరమావధి అయి ఉండాలి. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృప్తి కలగలేదట. ఎందుకంటే భగవంతుడి శక్తిని అవి ఏవీ గ్రహించలేకపోయాయి. అందుకే భగవంతుడు ప్రత్యేకంగా మానవుడిని సృష్టించాడు. వారికి జ్ఞానం అనే ప్రత్యేక శక్తిని ఇచ్చాడు. మానవుడు భగవంతుడి లీలలను, అద్భుత కార్యాలను, శేముషీ విజ్ఞానాలను చూసి పరవశం పొందినప్పుడు భగవంతుడు చాలా సంతోషించి ఆనందిస్తాడు. అందుకే

మానవజన్మ లభించడం గొప్ప అదృష్టం. బ్రాహ్మణ జన్మ పొందటం అందులోనూ శ్రేష్ఠం. అన్నింటి కంటే గొప్పది సాయిబాబా చరణారవిందాలపై సర్వస్య శరణాగతి చేసే అవకాశం కలగటం.

మానవుని విద్యుక్త ధర్మము

మానవజన్మ విలువైనదని, దానికి ఎప్పటికైనా మరణం అనివార్యం అని గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగ్రత్తపడుతూ ఉండి జీవిత పరమావధిని సాధించడం కోసం ప్రయత్నించాలి. ఏమాత్రం ఆశ్రద్ధకాని, ఆలస్యంకాని చేయకూడదు. త్వరలో దాన్ని సంపాదించడానికి ప్రయత్నించాలి. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కోసం ఎంత తాపత్రయ పడతాడో, తప్పిపోయిన యువరాజు కోసం చక్రవర్తి ఎంతగా వెదికే ప్రయత్నం చేస్తాడో అలాగే విసుగూ విరామం లేకుండా రేయింబవళ్ళు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని సంపాదించుకోవాలి. బద్దకాన్ని, అలసటను, కునికిపాట్లను దూరంగా వుంచి రాత్రింబవళ్ళు ఆత్మలోనే ధ్యానాన్ని నిలపాలి. ఈ మాత్రం చేయలేకపోతే మనం పశువులం అవుతాము.

తక్షణ కర్తవ్యము

మన ధ్యేయం త్వరగా ఫలించే మార్గం ఏమిటంటే, వెంటనే భగవంతుడి సాక్షాత్కారం పొందిన సద్గురువు దగ్గరికి వెళ్ళడం ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఎన్ని విన్నా పొందనటువంటిదీ, ఆధ్యాత్మికగ్రంథాలు ఎన్ని చదివినా తెలియనటువంటిది ఆత్మసాక్షాత్కారం సద్గురువుల సాంగత్యంతో పొందవచ్చు. నక్షత్రాలు అన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురుని సూర్యుడు ఎలా ఇవ్వగలుగుతున్నాడో అలాగే ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, గ్రంధాలు ఇవ్వలేని జ్ఞానాన్ని సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు, సామాన్య సంభాషణలే మనకు మౌనప్రభోదాలు. శాంతి, క్షమా, వైరాగ్యం, దానం, ధర్మం, మనోదేహాలను స్వాధీనంలో ఉంచుకోవడం, అహంకారం లేకుండా ఉండడం మొదలైన శుభలక్షణాలను వారి ఆచరణలో చూసి, భక్తులు నేర్చుకుంటారు. వారి పావనచరితాలు భక్తుల మనసులకు ప్రబోధాన్ని కలగచేసి వారిని పారమార్థికంగా ఉద్ధరిస్తుంది. సాయిబాబా అటువంటి మహాపురుషుడు, సద్గురువు. బాబా సామాన్య ఫకీరులా సంచరిస్తున్నప్పటికీ వారు ఎప్పుడూ ఆత్మానుసంధానంలోనే నిమగ్నమవుతుంటారు. దైవభక్తి గల హృదయం ఉన్నవారు వారికి ఎప్పుడూ ప్రీతిపాత్రులు. వారు సుఖాలకు ఉప్పొంగిపోయేవారు కాదు, కష్టాల వలన కృంగిపోయేవారు కాదు. రాజైనా, నిరుపేద అయినా వారికి సమానమే. తమ దృష్టిలో మాత్రం ముష్టివాణ్ణి చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికీ తిరిగి భిక్ష ఎత్తుకునేవారు! వారి భిక్ష ఎలాంటిదో పరిశీలిద్దాం.

బాబా యొక్క భిక్షాటన

షిరిడీ వాసులు పుణ్యాత్ములు ... ఎందుకంటే వారి ఇళ్ళ ఎదుటే కదా బాబా భిక్షకుడిలా నిలబడి 'అమ్మా! రొట్టెముక్క పెట్టు' అంటూ, దాన్ని అందుకోవడానికి చేయి చాచేవారు! చేతిలో ఒక రేకుడబ్బా పట్టుకుని, భుజానికి ఒక గుడ్డజోలె తగిలించుకుని భిక్షాటనకు వెళ్ళేవారు. బాబా కొన్ని ఇళ్ళకు మాత్రమే భిక్షకి వెళ్ళేవారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవపదార్థాలను, కూరలు మొదలైనవి రేకుడబ్బాలో పోసుకునేవారు. అన్నం, రొట్టెలు మొదలైనవి జోలెలో వేయించుకునేవారు. బాబాకు రుచి అన్నది లేదు. వారు జిహ్వాన్ని స్వాధీనంలో ఉంచుకున్నారు. కాబట్టి అన్ని పదార్థాలను రేకుడబ్బాలోను, జోలెలోను వేసుకునేవారు. అన్ని పదార్థాలను ఒకేసారి కలిపేసి భుజించి సంతోషం పొందుతూ ఉండేవారు. పదార్థాల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అన్నది లేనట్టే కనిపిస్తూ ఉండేది. బాబా భిక్షకి ఒక పధ్ధతి, కాల నియమం లేకపోయేది. ఒక్కొక్క రోజు కొన్ని ఇళ్ళ దగ్గర మాత్రమే భిక్ష అడిగేవారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకి వెళ్ళేవారు, భిక్షలో దొరికిన పదార్థాలు అన్నిటినీ ఒక మట్టిపాత్రలో వేసేవారు. దాన్ని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తింటుండేవి. వాటిని తరిమేవారు కాదు. మసీదు తుడిచి, శుభ్రం చేసే స్త్రీ 10-12 రొట్టెముక్కల్ని నిరాటంకంగా తీసుకుంటూ ఉండేది. కుక్కలను, పిల్లులను కూడా కలలో సైతం అడ్డుపెట్టనివారు, ఆకలితో వున్న పేదల ఆహారానికి అడ్డు చెపుతారా? 'ఫకీరు పదవే నిజమైన మహారాజు పదవి అనీ, అదే శాశ్వతం అనీ, మామూలు సిరిసంపదలు క్షణభంగం అనీ' బాబా అంటూ ఉండేవారు. ఆ పావనచరితుడి జీవితం వంటి జీవితమే కదా అత్యంత ధన్యమైనది! మొదట షిరిడీ ప్రజలు బాబాని ఒక పిచ్చి ఫకీరు అని భావించి, అలాగే పిలిచేవారు. భోజన ఉపాధి కోసం, రొట్టెముక్కల కోసం గ్రామంలో భిక్ష ఎత్తి పొట్ట నింపుకునే పేదఫకీరు అంటే ఎవరికి గౌరవం వుంటుంది.? కానీ ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేశమైనా లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చంచలుగా, స్థిరత్వంలేని వారిగానూ కనిపించినా లోపల వారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతపట్టనివి. ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్ముడిగా గుర్తించి, సేవించిన ధన్యజీవులు కొద్దిమంది ఉన్నారు. అలాంటివారిలో ఒకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోతున్నాను.

జాయజాబాయి యొక్క ఎనలేని సేవ

తాత్యాకోతె పాటిల్ తల్లి పేరు జయజాబాయి. ఆమె ప్రతిరోజూ మధ్యాహ్నం తలపై ఒక గంపలో రొట్టె, కూర పెట్టుకుని, సమీపంలో ఉన్న చిట్టడవిలో ముళ్ళపొదలను లెక్కచేయకుండా క్రోసులకొద్దీ దూరం నడిచి, ఆత్మధ్యానంలో నిశ్చలంగా ఎక్కడో కూర్చున్న బాబాను వెదికి పట్టుకొని, భోజనం పెడుతూ ఉండేది. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి, వారి ఎదుట విస్తరి ఒకటి పరచి తాను తీసుకుని వచ్చిన రొట్టె, కూర మొదలైన భోజన పదార్థాలను వడ్డించి, కొసరికొసరి వాటిని బాబాతో తినిపిస్తూ ఉండేది. ఆమె భక్తివిశ్వాసాలు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరచిపోలేదు. ఆమె సేవకు తగినట్లుగా ఆమె కుమారుడు అయిన తాత్యాకోతె పాటిల్ ను ఎంతో ఆదరించి, ఉద్దరించారు. ఆ తల్లీకొడుకులకు బాబా సాక్షాత్తూ భగవంతుడే అనే విశ్వాసం ఉండేది. కొన్ని సంవత్సరాల తరువాత బాబా అడవులకు వెళ్ళటం మానుకుని మసీదులోనే కూర్చుని భోజనం చేయసాగారు. అప్పటి నుంచి అడవిలో తిరిగి బాబాను వెతికి పట్టుకునే శ్రమ బాయజాబాయికి తప్పింది. ఎవరి హృదయంలో సదా వాసుదేవుడు నివశిస్తూ ఉంటాడో అలాంటి మహాత్ములు ధన్యులు. అలాంటి మహాత్ముల సాంగత్యం లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యాకోతె పాటిల్, మహాల్సాపతి ఇద్దరూ అలాంటి అదృష్టవంతులు. బాబా వారిద్దరినీ సమానంగా ప్రేమిస్తూ ఉండేవారు. బాబా వీరిద్దరితో పాటు కలిసి, మసీదులో తమ తలలను తూర్పు పడమర, ఉత్తరాల వైపు చేసి, మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగిలేలా పడుకొనేవారు. పక్కలు పరచుకొని వాటిపై చతికిలపడి సగం రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చటించుకుంటూ ఉండేవారు. తాత్యా పడుకుని గుర్రుపెడితే బాబా అతన్ని అటూ యిటూ ఊపి, అతని శిరస్సును గట్టిగా నొక్కుతూ ఉండేవారు. బాబా ఒక్కొక్కసారి మహాల్సాపతిని అక్కున చేర్చుకుని, అతని కాళ్ళు నొక్కి వీపు తోమేవారు. ఈ విధంగా 14 సంవత్సరాలు తాత్యా తన తల్లిదండ్రులను విడిచిపెట్టి బాబాపై ప్రేమతో మసీదులోనే పడుకునేవారు. అవి మరపురాని మధుర రోజులు. బాబా ప్రేమానురాగాలు కొలవలేనివి, వారి అనుగ్రహం యింత అని చెప్పడానికి చాలదు. తండ్రి మరణించిన తరువాత తాత్యా గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రపోవడం ప్రారంభించారు.

రహతా నివాసి కుశాల్ చంద్

షిరిడీలో (తాత్యా తండ్రిగారైన)  గణపతిరావుకోతె పాటిల్ ను బాబా ఎంత ప్రేమాభిమానాలతో చూసేవారో, అంతటి ప్రేమాదారాలతోనే రహతా నివాసి అయిన చంద్రభాను శేట్ మార్వాడీపై చూపిస్తూ ఉండేవారు, ఆ శేట్ మరణించిన తరువాత అతని అన్న కొడుకైన కుశాల్ చంద్ ను కూడా అమితమైన ప్రేమతో చూస్తూ అహర్నిశలు అతని యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు టాంగాలోనూ, మరొకప్పుడు ఎద్దులబండి మీద బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా వెళ్ళేవారు. రహతా ప్రజలు భాజాభజంత్రీలతో ఎదురేగి, బాబాను గ్రామసరిహద్దు ద్వారం దగ్గర దర్శించి, సాష్టాంగ నమస్కారాలు చేసేవారు. తరువాత అత్యంత వైభవంగా బాబాను గ్రామం లోపలికి సాదరంగా తీసుకుని వెళ్ళేవారు. కుశాల్ చంద్ బాబాను తన యింటికి తీసుకుని వెళ్ళి తగిన ఆసనంలో కూర్చుండపెట్టి భోజనం పెట్టేవాడు. ఇద్దరూ కొద్దిసేపు ప్రేమతో ఉల్లాసంగా ముచ్చటించుకునేవారు. తరువాత బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుకుంటూ ఉండేవారు. షిరిడీ గ్రామానికి సమాన దూరంలో ఒకవైపు (దక్షిణంలో) రహతా, మరొకవైపు (ఉత్తరదిశలో)నీంగావ్ ఉన్నాయి. ఈ రెండు గ్రామాలు దాటి బాబా ఎన్నడూ ఎక్కడికీ వెళ్ళలేదు. వారు ఎప్పుడూ రైలుబండిలో ప్రయాణం చేసి ఎరుగరు. రైలుబండిని కనీసం చూసి కూడా ఉండలేదు. కానీ, సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలుస్తూ ఉండేవి. బాబా దగ్గర సెలవు పుచ్చుకుని వారి ఆజ్ఞానుసారం ప్రయాణం చేసేవారికి ఎలాంటి కష్టాలు ఉండేవి కాదు. బాబా ఆదేశానికి వ్యతిరేకంగా వెళ్ళేవారు అనేక కష్టాలపాలు అవుతుండేవారు. అటువంటి కొన్ని సంఘటనలను, మరికొన్ని ఇతర విషయాలను రాబోవు అధ్యాయాలలో చెప్పుకుందాము.

ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం

తొమ్మిదవ అధ్యాయం 

0 Comments To "Saibaba Satcharitra 8 Adhyayam "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!