Saibaba Satcharitra 15 Adhyayam

శ్రీసాయిసచ్చరిత్ర

పదహేనవ అధ్యాయం

ఆరవ అధ్యాయంలో షిరిడీలో జరిగే శ్రీరామనవమి ఉత్సవం ఎలా ప్రారంభం అయిందో? ఆ సమయంలో హరిదాసును తీసుకుని రావడం ఎంత కష్టంగా ఉండేదో? చివరికి ఆ పనిని దాసగుణు మహారాజ్ నిర్వహించేలా బాబా శాశ్వతంగా నియమించడం, దాన్ని ఇప్పటివరకు దాసగుణు జయప్రదంగా నడపడం అనేవి చదివారు జ్ఞాపకం ఉంచుకునే ఉంటారు. ఈ అధ్యాయంలో దాసగుణు హరికథలు ఎలా చెప్పేవారో వర్ణిస్తాను.

నారదీయ కీర్తన పధ్ధతి

సాధారణంగా మహారాష్ట్రలో హరికథ చెప్పే సమయంలో ఆడంబరమైన నిండు అంగరఖాలు వేసుకుంటారు. తలపైన పాగా కాని, పేటా (ఒక విధమైన ఎఱ్ఱని మహారాష్ట్రపు టోపీ)కానీ, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయం, మామూలుగా ధరించే ధోవతిని కట్టుకుంటారు. ఈ ప్రకారంగా దుస్తులు ధరించి, షిరిడీలో హరికథ చెప్పడానికి దాసగుణు తయారయ్యారు. బాబా సెలవు పొందడానికి మసీదుకు వెళ్ళాడు. బాబా అతనితో 'ఏమోయ్, పెళ్ళికొడకా! యింత చక్కగా ముస్తాబై ఎక్కడికి వెళుతున్నావు?' అన్నారు. హరికథ చెప్పడానికి వెళుతున్నాను అని దాసగుణు జవాబు చెప్పారు. అప్పుడు బాబా ఇలా అన్నారు 'దానికి ఈ దుస్తులు అన్నీ ఎందుకు? కోటు, కండువ, టోపీ మొదలైనవి ముందు వెంటనే తీసి పారేయ్. శరీరంపై ఈ అలంకారాలు అన్నీ ఎందుకు?' వెంటనే దాసగుణు వాటిని అన్నింటినీ తీసి బాబా పాదాల దగ్గర ఉంచాడు. అప్పటినుంచి హరికథ చెప్పే సమయంలో వాటిని దాసగుణు ఎప్పుడూ ధరించలేదు. నడుము మొదలు తలవరకూ ఏమీ వేసుకునేవాడు కాదు. చేతిలో చిరుతలు మెడలో పూలమాల మాత్రం ధరించేవాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంభించే పద్ధతికి వ్యతిరేకం. నారద మహర్షే హరికథలు ప్రరంభించినవారు. వారు తలపైన, శరీరంపైన ఏమీ తొడిగేవారు కాదు. చేతిలో వీణను ధరించి ఒక చోటునుంచి మరొక చోటికి హరినామ సంకీర్తన చేస్తూ వెళ్ళేవారు.

చోల్కరు చక్కరలేని తేనీరు

పూణా ఆహ్మదునగరు జిల్లలో బాబాను గురించి అందరికీ తెలుసుకాని, నానాసాహెబు ఛాందొర్కరు ఉపన్యాసాల వల్ల, దాసగుణు హరికథల వల్ల బాబా పేరు కొంకణదేశం అంతా ప్రాకింది. నిజంగా దాసగుణు తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకమందికి పరిచయం చేశారు. హరికథలు వినడానికి వచ్చినవారికి అనేక రుచులు ఉంటాయి. కొందరు హరిదాసు పాండిత్యానికి సంతోషిస్తారు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యం, చమత్కారం, సంతోషం కలిగిస్తుంది. కథా పూర్వంలో దాసుగారు సంభాషించే వేదాంత విషయాలు వినడానికి కొందరు, అసలు కథను వినడానికి కొందరు వస్తారు. వచ్చినవారిలో చాలా కొద్దిమందికి మాత్రమే భగవంతుడిలో కాని, యోగులలో కానీ, ప్రేమవిశ్వాసాలు కలుగుతాయి. కాని దాసగుణు యొక్క హరికథలు వినేవారి మనస్సులపై కలిగే ప్రభావం అతి సమ్మోహనకరంగా ఉంటుంది. ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తాను. ఠాణాలో ఉన్న కౌపీనేశ్వర ఆలయంలో ఒకనాడు దాసగుణు మహారాజ్ హరికథ చెపుతూ సాయి మహిమను పాడుతున్నాడు. కథను వినడానికి వచ్చిన వారిలో చోల్కర్ అనే అతను ఉన్నాడు. అతడు పేదవాడు. ఠాణా కోర్టులో గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడు. అతడు దాసగుణు కీర్తన అత్యంత శ్రద్ధగా విన్నాడు. వాడి మనస్సు కరిగింది. వెంటనే అక్కడికక్కడే మనస్సులో బాబాను ధ్యానించి ఇలా మొక్కుకున్నాడు 'బాబా! నేను పేదవాడిని, నా కుటుంబాన్నే నేను పోషించుకోలేను. మీ అనుగ్రహంతో సర్కారువారి పరీక్షలో ఉత్తీర్ణుడై స్థిరమైన ఉద్యోగం లభిస్తే నేను షిరిడీకి వస్తాను. నీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తాను, నీ పేరున కలకండ పంచిపెడతాను'. బాబా కృపతో చోల్కరు పరీక్షలో ఉత్తీర్ణుడు అయ్యాడు. స్థిరమైన ఉద్యోగం దొరికింది. కాబట్టి మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీరిస్తే అంత బాగుంటుంది అనుకున్నాడు. చోల్కరు బీదవాడు. వాడి కుటుంబం చాలా పెద్దది. కాబట్టి షిరిడీ యాత్ర చేయడానికి ఖర్చు పెట్టలేకపోయాడు. ఎవరైనా పర్వత శిఖరాన్నైనా దాటవచ్చు గాని, బీదవాడు తన యింటి గడపనే దాటలేడని కదా లోకోక్తి! చోల్కరుకి ఎలాగైనా శ్రీసాయి మొక్కును త్వరలో చెల్లించాలని ఆతృత కలిగింది. కాబట్టి తన సంసారానికి అయ్యే ఖర్చులను తగ్గించి కొంత పైకాన్ని మిగుల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. తేనీటిలో వేసే చెక్కరని మాని ఆ మిగిలిన ద్రవ్యాన్ని మిగుల్చుకున్న తరువాత, షిరిడీకి వచ్చి బాబా పాదాలపై పడ్డాడు. ఒక టెంకాయ బాబాకు సమర్పించుకున్నాడు. తాను మొక్కుకున్న ప్రకారం కలకండ పంచిపెట్టాడు. తన మనసులోని కోరికలు అన్నీ ఆనాడు నెరవేరాయని తనకు ఎంతో తృప్తిగా ఉన్నదని బాబాతో చెప్పాడు. చోల్కరు బాపూసాహెబు జోగు గృహంలో దిగాడు. అప్పుడు వీరిద్దరూ  మసీదులో వున్నారు. ఇంటికి వెళ్ళడం కోసం వారు లేచి నిలబడగా బాబా జోగును పిలిచి ఇలా అన్నారు 'నీ అతిథికి టీ కప్పులో విరివిగా చెక్కెర వేసి యివ్వు' ఈ పలుకులలోని భావాన్ని గ్రహించిన చోల్కరు మనస్సు కరిగింది. అతడు ఆశ్చర్య నిమగ్నుడు అయ్యాడు. వాడి కళ్ళు భాష్పాలతో నిండాయి. తిరిగి బాబా పాదాలపై పడ్డాడు. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చెక్కెర ఎక్కువగా కలపటం అనేదాని భావం ఏమై ఉంటుందా అని ఆలోచించాడు. బాబా తన పలుకులతో చోల్కరు మనస్సులో భక్తి, నమ్మకాలను కలుగజేయాలని ఉద్దేశించారు. వాడి మొక్కు ప్రకారం తనకు రావలసిన కండ

చెక్కెర ముట్టిందనీ, తేయాకు నీళ్ళలో చెక్కెరను ఉపయోగించకుండా పోవడం అనే రహస్య మనోనిశ్చయాన్ని చక్కగా కనుగొన్నారని చెప్పాడు. బాబా యిలా ఉద్దేశించారు 'నా ముందర భక్తితో మీ చేతులు చాపితే వేంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేను ఉంటాను. నా దేహం యిక్కడ ఉన్నప్పటికీ సప్తసముద్రాల అవతల మీరు చేస్తున్న పనులు నాకు తెలుసు. ప్రపంచంలో మీకు యిష్టమొచ్చిన చోటుకు వెళ్ళండి. నేను మీ శరీరంలోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయంలో సర్వజన హృదయాలలో ఉన్న నన్ను పూజించండి. ఎవరు నన్ను ఈ విధంగా గుర్తిస్తారో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు.' బాబా చోల్కరుకి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధంగా బోధించారో కదా!

రెండు బల్లులు

ఈ అధ్యాయంలో రెండు చిన్న బల్లుల కథతో ముగిస్తాను. ఒకరోజు బాబా మసీదులో కూర్చుని ఉన్నారు. ఒక భక్తుడు బాబా మందిరంలో కూర్చుని ఉన్నాడు. ఒక బల్లి టిక్కుటిక్కుమని పలికింది. కుతూహలంతో ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థం ఏమిటని బాబాని అడిగాడు. అది శుభశకునమా, లేక అశుభమా అని ప్రశ్నించాడు. తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూడడానికి వస్తుందని ఆ బల్లి ఆనందిస్తూ ఉందని బాబా చెప్పారు. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనకుండా కూర్చున్నాడు. బాబా పలికినదాన్ని అతడు గ్రహించలేకపోయాడు. కొంతసేపటి తరువాత ఔరంగాబాదునుండి ఎవరో గుఱ్ఱంపై బాబా దర్శనానికి షిరిడీ వచ్చారు. అతను ఇంకా కొంత దూరం వెళ్ళవలసి ఉంది. కాని వాడి గుఱ్ఱం ఆకలితో ముందుకు వెళ్ళలేకపోయింది. గుఱ్ఱానికి ఉలవలు కావలసి వచ్చింది. తన భుజంపై ఉన్న సంచిని తీసి ఉలవలు తీసుకుని రావడానికి వెళుతున్న సమయంలో దానిలో ఉన్న ధూళిని విదిలించాడు. అందులోనుండి ఒక బల్లి కిందపడి అందరూ చూస్తుండగా గోడ ఎక్కింది. ప్రశ్నించిన భక్తుడిని అదంతా జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పారు. వెంటనే ఆ బల్లి తన సోదరి దగ్గరికి సంతోషంతో వెళ్ళింది. చాలాకాలం తరువాత అక్కాచెల్లెళ్లు కలుసుకున్నారు. ఒకరినొకరు కౌగలించుకుని ముద్దాడుకున్నారు. గుండ్రంగా తిరుగుతూ అధికమైన ప్రేమతో ఆడారు. షిరిడీ ఎక్కడ? ఔరంగాబాదు ఎక్కడ? గుఱ్ఱపు రౌతు ఔరంగాబాదు నుండి బల్లిని తీసుకుని షిరిడీకి ఎలా వచ్చాడు? రాబోయే యిద్దరు అక్కాచెల్లెళ్లు కలుసుకుంటారని బాబా ముందుగానే ఎలా చెప్పగలిగారు? ఇది అంతా బహువిచిత్రంగా ఉన్నది. ఇది బాబా సర్వజ్ఞుడు అని నిరూపిస్తుంది.

ఉత్తర లేఖనము:

ఎవరయితే ఈ అధ్యాయాన్ని భక్తిశ్రద్ధలతో నిత్యం పారాయణ చేస్తారో వారి కష్టాలు అన్నీ శ్రీసాయినాథుని కృపతో తొలగిపోతాయి.

పదిహేనవ అధ్యాయం సంపూర్ణం

రెండవరోజు పారాయణ సమాప్తం

పదహారు - పదిహేడవ అధ్యాయాలు

0 Comments To "Saibaba Satcharitra 15 Adhyayam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!