Saibaba Satcharitram 6 Adhyayam

శ్రీసాయిసచ్చరిత్ర

ఆరవ అధ్యాయం

సంసారం అనే సాగరంలో జీవుడు అనే ఓడను సద్గురువే సారంగు అయి నడుపుతున్నప్పుడు అది సులభంగా సురక్షితంగా గమ్యం చేరుకుంటుంది. సద్గురువు అనగానే సాయిబాబా స్ఫురణకు వస్తున్నారు. నా కళ్ళ ఎదుట సాయిబాబా నిలబడినట్లు, నా నుదుట ఊదీ పెడుతునట్టు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదిస్తున్నట్లు అనిపిస్తుంది. నా మనస్సు సంతోషంతో నిండిపోయి, కళ్ళనుండి ప్రేమ పొంగి పొరలుతున్నది. గురుహస్త స్పర్శ మహిమ అద్భుతమైనది, ప్రలయాగ్నితో కూడా కాలనటువంటి వాహనమైన సూక్ష్మశరీరం గురు కరస్పర్శ తగలగానే భస్మమైపోతుంది. అనేక జన్మలలో ఆర్జించిన పాపం అంతా పటాపంచలై పోతుంది. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు వినడానికే విసుగు చెందేవారి వాక్కు నెమ్మదిస్తుంది. శ్రీసాయి సుందరమైన రూపం వీక్షించడంతోనే కంఠం ఆనందాతిరేకంతో గద్గదం అవుతుంది, కన్నులనుండి ఆనందాశ్రువులు పొంగి పొరలుతాయి, హృదయం భావోద్రేకంతో ఉక్కిరిబిక్కిరి అవుతాయి. 'నేనే తాన' అనే (పరబ్రహ్మస్వరూపాన్ని) స్ఫురణ మేల్కొని, ఆత్మసాక్షాత్కార ఆనందం కలిగిస్తుంది. 'నేనే నీవు' అనే భేదాభావాన్ని తొలగించి బ్రహ్మైక్యానుభావం సిద్ధింప చేస్తుంది. నేను వేదపురాణాల వంటి సద్గ్రంధాలు చదువుతున్నప్పుడు నా సద్గురుమూర్తే అడుగడుగునా జ్ఞాపకానికి వస్తున్నాడు. నా సద్గురువైన శ్రీసయిబాబాయే శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా నా ముందు నిలబడి, తన లీలలను తామే వినిపించేలా చేస్తున్నట్లు అనిపిస్తుంది. నేను భాగవత పారాయణకు పూనుకోగానే శ్రీసాయిబాబా ఆపాదమస్తకం శ్రీకృష్ణుడిలా కనిపిస్తాడు. భాగవతమో, ఉద్ధవగీతమో తామే పాడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణలుగా యివ్వడం జ్ఞాపకానికి వస్తుంది. నాకై నేను ఏదైనా రాయడానికి సిద్ధపడినప్పుడు, ఒక మాటగాని వాక్యంగాని రాయటం రాదు. వారి ఆశీర్వాదం లభించిన వెంటనే రచన ధార అంతులేనట్లు సాగుతుంది. భక్తునిలో అహంకారం విజృంభించగానే బాబా అణచివేస్తారు. తన శక్తితో వారి కోరికలను నెరవేర్చి సంతృప్తులను చేసి ఆశీర్వదిస్తారు. సాయి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్యశరణాగతి చేసినవారికి ధర్మార్థ కామమోక్షలు వశమవుతాయి. భగవత్ సాన్నిధ్యానికి వెళ్ళడానికి కర్మ, జ్ఞాన, యోగ, భక్తిమార్గాలనే నాలుగు దిక్కులు ఉన్నాయి. అన్నింటితో భక్తిమార్గం అత్యంత కష్ట సాధ్యమైనది. అది ముళ్ళు, గోతులతో నిండి ఉంటాయి. సద్గురువు సహాయంతో ముళ్ళు, గోతులను తప్పించుకుని ముందుకు సాగితే గమ్యస్థానం అవలీలగా చేరుకోవచ్చు. ఈ సత్యాన్ని దృఢంగా నమ్మమని శ్రీసాయిబాబా నొక్కివక్కానించారు. స్వయంసత్తాకమైన బ్రహ్మాన్ని, జగత్తుని సృష్టించే ఆ బ్రహ్మం యొక్క శక్తి (మాయ), సృష్టి అనే ఈ మూడింటి గురించి తత్త్వ విచారం చేసి, వాస్తవానికి మూడూ ఒక్కటే అని సిద్ధాంతీకరించి, బాబా తన భక్తుల శ్రేయస్సు కోసం చేసిన అభయ ప్రధాన వాక్యాలను రచయిత ఈ క్రింద ఉదాహరిస్తున్నాడు :

'నా భక్తుని యింట్లో అన్నం, వస్త్రాలకు ఎప్పుడూ లోటు ఉండదు. నాలోనే మనస్సు నిలిపి, భక్తిశ్రద్ధలతో మనస్ఫూర్తిగా నన్నే ఆరాదించేవారి యోగక్షేమాలను నేను చూసుకుంటాను. కాబట్టి వస్త్రాలు, ఆహారాల కోసం ప్రయాస పడవద్దు. నీకు ఏమైనా కావాలంటే భగవంతుణ్ణి వేడుకో. ప్రపంచంలోని కీర్తిప్రతిష్ఠల కోసం ప్రాకులాడటం మాని, దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందడానికి, భగవంతుడి కరుణాకటాక్షాలు సంపాదించడానికి ప్రయత్నించు. ప్రపంచ గౌరవం అనుకునే భ్రమను విడిచిపెట్టు. మనస్సులో ఇష్టదైవం యొక్క ఆకారాన్ని నిలుపుకో. సమస్త ఇంద్రియాలను మనస్సును భగవంతుడి ఆరాధన కోసమే నియమించు. మిగిలినవాటి వైపు మనస్సు వెళ్ళనీయకు. ఎప్పుడూ నన్నే జ్ఞాపకం ఉంచుకో. మనస్సుని ధనం సంపాదించడానికి, దేహ పోషణకు, గృహ సంరక్షణకు మొదలైన విషయాల పట్ల సంచరించకుండా గట్టిగా నిలబెట్టుకో. అప్పుడు అది నెమ్మదించి, శాంతం వహిస్తుంది. చింతారహితం అయి ఉంటుంది. మనస్సు సరైన సాంగత్యంలో ఉన్నది అనడానికి ఇదే గుర్తు. చంచల మనస్సుకు స్వాస్థ్యం చిక్కదు.'

బాబా పలుకులను ఉదాహరించిన తరువాత రచయిత షిరిడీలో జరిగే ఉత్సవాల అన్నింటిలో శ్రీరామనవమే గొప్పది. సాయిలీల (1925, పుట 197) పత్రికలో షిరిడీలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాల గురించి విపులంగా వర్ణించబడింది. దాని విషయాలు ఇక్కడ వివరించబడుతున్నాయి .

కోపర్ గావ్ లో గోపాల్ రావు గుండ్ అనే అతను పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉండేవాడు. అతను సాయిబాబాకి గొప్ప భక్తుడు. అతనికి ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలగలేదు. శ్రీ సాయిబాబా ఆశీర్వాదంతో అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో 'ఉరుసు' ఉత్సవం (ఉరుసు అంటే సమాధి చెందిన మహమ్మదీయ మహాత్ముల దర్గాల {సమాధుల} దగ్గర ప్రతి యేటా భక్తులు జరుపుకునే ఆరాధనోత్సవం) నిర్వహించాలనే ఆలోచన వచ్చింది. తన ఆలోచనను తాత్యాకోతే పాటీలు, దాదాకోతే పాటీలు, మాధవరావు దేశ్ పాండే తదితర మిగిలిన సాయిభక్తుల ముందు ఉంచాడు. వారు అంతా దీనికి ఆమోదం తెలిపారు. బాబా ఆశీర్వాదం, అనుమతి పొందరు. ఇది 1897వ సంవత్సరంలో జరిగింది. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టరు అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. గ్రామ కులకర్ణి దానిపై ఎదో వ్యతిరేకంగా చెప్పడం వల్ల అనుమతి దొరకలేదు. కానీ బాబా ఆశీర్వదించి ఉండడంతో మళ్ళీ ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చింది. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమి రోజు జరపడానికి నిశ్చయించుకున్నారు. ఈ ఉరుసు ఉత్సవాన్ని జరుపుకోవటంలో హిందూ-మహమ్మదీయుల సమైక్యతా భావం బాబా ఉద్దేశ్యం కాబోలు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూస్తే బాబా సంకల్పం నెరవేరినట్లు స్పష్టం అవుతుంది. ఉత్సవం జరుపుకోవడానికి అనుమతి అయితే దొరికింది కానీ యితర అవాంతరాలు మరికొన్ని ఎదురయ్యాయి. చిన్న గ్రామం అయిన షిరిడీలో నీటి ఎద్దడి అధికంగా వుంది. గ్రామం అంతటికీ రెండు బావులు ఉండేవి, ఒకటి ఎండాకాలంలో ఎండిపోయేది. రెండవ బావిలోని నీళ్ళు ఉప్పగా ఉండేవి, ఈ సమస్యను బాబాకు చెప్పగా బాబా ఆ ఉప్పునీటి బావిలో పువ్వులు వేశారు. ఆశ్చర్యంగా ఆ ఉప్పునీరు మంచినీళ్ళుగ మారిపోయాయి. ఆ నీరు కూడా చాలకపోవడంతో తత్యాపాటీలు దూరం  నుండి మూటల ద్వారా నీరు తెప్పించారు. తాత్కాలికంగా అంగళ్ళు వెలిశాయి, కుస్తీపోటీల కోసం ఏర్పాట్లు చేయబడ్డాయి. గోపాలరావు గుండుకు ఒక మిత్రుడు ఉన్నాడు. వారి పేరు దాము అన్నా కాసార్. అతనిది అహమదునగరు. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ సంతానం లేదు. అతనికి కూడా బాబా ఆశీర్వాదంతో పుత్ర సంతానం కలిగింది. ఉత్సవం కోసం ఒకే జండా తయారు చేయించాలని గోపాలరావు అతనికి పురమాయించాడు. అలాగే నానాసాహెబు నిమోకర్ ను ఒక నగిషీ జెండా తీసుకుని రమ్మని కోరాడు. ఆ రెండు జెండాలను ఉత్సవంతో తీసుకుని వెళ్ళి మసీదు రెండు మూలలలో నిలబెట్టారు. ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంభిస్తున్నారు. బాబా తాము నివశించిన ఈ మసీదును 'ద్వారకామాయి' అని పిలిచేవారు.

చందనోత్సవం

సుమారు అయిదేళ్ళ తరువాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభం అయ్యింది. కోరాలా గ్రామానికి చెందిన అమీరుశక్కర్ దలాల్ అనే మహామ్మదీయ భక్తుడు చందన ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయ ఫకీరులా గౌరవార్థం చేస్తారు. వెడల్పు పళ్ళెంలో చందనపు ముద్ద పెట్టి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపాలతో, భాజాభజంత్రీలతో ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉత్సవం ఊరేగిన తరువాత మసీదుకు వచ్చి మసీదు గూటి (నింబారు)లోపల, గోడలపైన ఆ చందనాన్ని చేతితో అందరూ తడతారు. మొదటి మూడు సంవత్సరాలు ఈ ఉత్సవం అమీరుశక్కర్ నిర్వహించారు. తరువాత అతని భార్య ఆసేవను కొనసాగించారు. ఒకేరోజు పగలు హిందువులతో జండా ఉత్సవాన్ని, రాత్రిపూట మహామ్మదీయులతో చందనోత్సవం ఎటువంటి అరమరికలు లేకుండా జరుగుతున్నాయి.

ఏర్పాట్లు షిరిడీలో జరిగే శ్రీరామనవమి ఉత్సవం బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులు అందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనే వారు. బయటి ఏర్పాట్లు అన్నీ తాత్యాకోతే పాటీలు చూసుకుంటూ ఉండేవారు. ఇంటిలోపల చేయవలసినవి అన్నీ రాధాకృష్ణమాయి అనే భక్తురాలు చూసుకుంటూ ఉండేది. ఉత్సవ రోజులలో ఆమె నివాసం భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూసుకోవడమే కాక, ఉత్సవాలకి కావలసిన సరంజామా అంతా సిద్ధపరుస్తూ ఉదేది. అంతేకాదు, స్వయంగా ఆమె మసీదును శుభ్రపరచి గోడలకు సున్నం వేసిది. మసీదు గోడలు బాబా వెలిగించే ధుని మూలంగా మసిపట్టి ఉండేవి. మండుతున్న ధునితో సహా, మసీదులోని వస్తువులన్నీ తీసి బయట పెట్టి, మసీదు గోడలను చక్కగా కడిగి వెల్ల వేయిస్తూ ఉండేది. ఆమె ఇదంతా బాబా (రోజు మార్చి రోజు) చావడిలో పడుకున్నప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామవావామికి ఒకరోజు ముందే పూర్తి చేస్తూ ఉండేది. పేదలకు అన్నదానం అంటేబాబాకి చాలా ప్రీతి. అందుకే ఈ ఉత్సవ సమయంలో పేదలకు అన్నదానం విరివిగా చేస్తుండేవారు. భోజన పదార్థాలు, మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంట్లో విస్తారంగా వండబడేవి. అనేకమంది సంపన్నులైన బాబా భక్తులు స్వచ్చందంగా పూనుకుని ఈ సేవలో పాల్గొనేవారు.

ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైనము

ఈ ప్రకారంగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి రోజు వైభవంగా జరుగుతుండేవి. 1912 లో ఈ ఉత్సవానికి సంబంధించి ఒక మార్పు జరిగింది. శ్రీసాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర్ భీష్మ అనే అతను దాదా సాహెబు ఖాపర్డే (అమరావతి)తో కలిసి ఉత్సవానికి వచ్చారు. వారు దీక్షిత్ వాడాలో బసచేశారు. ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షిత్ వాడా వసారాలో పడుకొని ఉన్నారు. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకామహాజని పూజా పరికరాలు పళ్ళెంతో మసీదుకు వెళ్తున్నారు. అతనిని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టింది. వెంటనే కాకామహాజనిని దగ్గరకు పిలిచి అతనితో 'ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమి రోజు చేయమని చెప్పడంలో భగవంతుని ఉద్దేశ్యం ఎదో ఉంది ఉండివచ్చు. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినం. కాబట్టి ఈ రోజున రామజన్మోత్సవం ఎలా జరపకూడదు?' అని అడిగారు. కాకామహాజనికి ఈ ఆలోచన బాగా నచ్చింది. తమ సంకల్పానికి బబా అనుమతి సంపాదించడానికి తీర్మానించుకున్నారు. కానీ, భగవస్సంకీర్తన చేయడానికి అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించడం కష్టం. ఈ సమస్యను కూడా చివరికి భీష్మయే పరిష్కరించారు. ఎలాగంటే,. అతని దగ్గర రామాఖ్యానమనే శ్రీరాముని చరిత్ర సిద్ధంగా ఉండటంతో, అతనే దాన్ని సంకీర్తన చేయడానికి, కాకామహాజని హార్మోనియం వాయించడానికి తీర్మానించారు. చెక్కెరతో కలిపిన శోంఠి గుండ ప్రసాదం రాధాకృష్ణమాయి చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. బాబా అనుమతి పొందడానికి వారు మసీదుకు వెళ్ళారు. సర్వజ్ఞుడైన బాబా 'వాడాలో ఏమి జరుగుతుంది?' అని మహాజనిని ప్రశ్నించారు. బాబా అడిగిన ప్రశ్నలోనే అంతరార్థం మహాజని గ్రహించలేక, ఏమీ జవాబు ఇవ్వలేక మౌనంగా ఉన్నారు. బాబా అదే ప్రశ్న భీష్మని అడిగారు. అతను శ్రీరామనవమి ఉత్సవాన్ని చేయాలి అనే తమ ఆలోచనను బాబాకు వివరించి, అందుకు బాబా అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు. బాబా వెంటనే ఆశీర్వదించారు. అందరూ సంతోషించి శ్రీరామజయంతి ఉత్సవానికి సంసిద్ధులయ్యారు. ఆ మరుసటి రోజు మసీదును అలంకరించారు. రాధాకృష్ణమాయి ఒక ఊయల ఇచ్చింది. దాన్ని బాబా ఆసనం ముందు వ్రేలాడదీయడంతో శ్రీరామజన్మోత్సవం వేడుక ప్రారంభమయ్యింది. భీష్మ కీర్తన చెప్పడానికి లేచాడు. మహాజని హార్మోనియం ముందు కూర్చున్నారు. అప్పుడే లెండీ నుండి మసీదుకు వచ్చిన బాబా అది అంతా చూసి, మహాజనిని పిలిపించారు. రామజన్మోత్సవం జరపడానికి బాబా ఒప్పుకుంటారో లేదో, ఏమి అవుతుందో అనే జంకుతూ అతను బాబా దగ్గరికి వెళ్ళారు. అది అంతా ఏమిటి అని అక్కడ ఊయల ఎందుకు కట్టారని బాబా అతన్ని అడిగారు. శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైందని అందుకే ఊయల కట్టారని మహాజని చెప్పాడు. బాబా మసీదులో వుండే భగవంతుడిని నిర్గుణస్వరూపాన్ని సూచించే 'నింబారు' (గూడు) నుండి రెండు పూలమాలలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి, మరొకటి భీష్మకు పంపించారు. హరికథ ప్రారంభమయ్యింది. రామకథా సంకీర్తనం ముగియగానే, భాజాభజంత్రీల ధ్వనుల మధ్య 'శ్రీరామచంద్రమూర్తికీ జై' అనే జయజయధ్వానాలు చేస్తూ పరమోత్సాహంతో అందరూ ఒకరిపై ఒకరు గులాల్ (ఎర్ర రంగుపొడి) జల్లుకున్నారు. అంతలో ఒక గర్జన వినబడింది. భక్తులు చల్లుకుంటున్న గులాల్ ఎలాగో వెళ్ళి బాబా కంటిలో పడింది. బాబా కోపంతో బిగ్గరగా తిట్టడం ప్రారంభించారు. ఇది చూసి చాలామంది భయంతో పారిపోయారు. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్ల రూపంలో బాబా తమకు ఇచ్చిన ఆశీర్వాదాలు అని గ్రహించి కదలక అక్కడే ఉండిపోయారు. శ్రీరామజయంతి రోజున రావణుడనే అహంకారాలు, అరిషడ్వర్గాలను సంహరించడానికి శ్రీసాయిరూపంలో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించడం సహజమే కదా అని భావించారు. షిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపగించుకోవడం ఒక రివాజు. దీన్ని తెలిసినవారు గమ్మున ఊరుకున్నారు.  తన ఊయలను బాబా విరిచేస్తారేమో అని భయంతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకుని రమ్మని చెప్పింది. మహాజని వెళ్ళి ఊయలను విప్పుతుండగా బాబా అతని దగ్గరికి వచ్చి ఊయలను తీయోద్దని చెప్పారు. కొంతసేపటికి బాబా శాంతించారు. ఆనాటి మహాపూజ హారతి మొదలై ముగిసాయి. సాయంత్రం మహాజని వెళ్ళి ఊయలను విప్పుతుండగా ఇంకా దాని అవసరం ఉందని, కాబట్టి దాన్ని విప్పవద్దని బాబా అతన్ని వారించారు. శరీరామనవమి మరుసటి రోజు జరిగే గోపాల కలోత్సవంతో గాని ఉత్సవం పూర్తికాదనే విషయం అప్పుడు భక్తులకు స్ఫురించింది. మరుసటి రోజు శ్రీకృష్ణజ్ఞానం రోజు పాటించే 'కాలాహండి' అనే ఉత్సవం జరిపారు. కాలాహండి అంటే నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారం కలిపి వ్రేలాడ కడతారు, హరికథ అయిన తరువాత దీన్ని కర్రతో పగలగొడతారు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగానే తన స్నేహితులు అయిన గొల్లబాలురకు పంచి పెడుతుండేవారు. ఆ మరుసటి రోజు ఇవన్నీ పూర్తయిన తరువాత ఊయలను విప్పడానికి బాబా సమ్మతించారు. శ్రీరామనవమి వేడుకలు ఈ విధంగా జరిగిపోతుండగా, పగటి సమయంలో పతాకోత్సవం, రాత్రి పూట చందనోత్సవం కూడా యథావిధిగా జరిగాయి. ఈ విధంగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి ఉత్సవంగా మారింది. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశాలు క్రమంగా పెరిగాయి. చైత్ర పాడ్యమి నుండి రాధాకృష్ణమాయి 'నామసప్తాహం' ప్రారంభిస్తుండేది. భక్తులు అందరూ వంతులవారీగా అందులో పాల్గొంటూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువ ఝామునే భజనలో చేరుతూ ఉండేది. శ్రీరామనవమి ఉత్సవాలు దేశమంతటా జరగటంతో హరికథా కాలక్షేపం చేసే హరిదాసులు దొరకడం దుర్లభంగా ఉండేది. శ్రీరామనవమికి 5, 6 రోజులముందు 'ఆధునిక తుకారాం' అని పిలువబడే బాలాబువ మాలీ అనే సంకీర్తనకారుణ్ణి కాకామహాజని యాదృచ్చికంగా కలవడం జరిగింది. శ్రీరామనవమి రోజు సంకీర్తన చేయడానికి మహాజని అతన్ని షిరిడీకి తీసుకుని వచ్చారు. ఆ మరుసటి సంవత్సవం కూడా అనగా 1914లో,  తన స్వగ్రామం అయిన సతారా జిల్లా బృహద్ సిద్ధకవటె గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండటంచేత బాలబువ సతార్కర్ సంకీర్తన కార్యక్రమాలు లేక ఖాళీగా ఉన్నారు. కాకాసాహెబు దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతను షిరిడీ వచ్చి హరికథా సంకీర్తనం చేశారు. బాబా అతన్ని తగినట్లు సత్కరించి 1914సంవత్సరంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు షిరిడీలో సంకీర్తన చేసే బాధ్యతను శ్రీదాసగుణు మహారాజుకు బాబా అప్పగించడం ద్వారా ఏటేటా ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలిచే సమస్య శాశ్వతంగా పరిష్కరించబడింది.   1912నుండి ఈ ఉత్సవం రానురాను వృద్ధి చెందుతూ ఉండేది. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడీ తేనెతుట్టెలా ప్రజలతో కిటకిటలాడుతూ ఉండేది. అంగళ్ళ సంఖ్యా పెరిగిపోయింది. కుస్తీపోటీలలో అనేకమంది ప్రముఖ మల్లులు  పాల్గొనేవారు, పేదలకు అన్నసంతర్పణ విరివిగా జరుగుతూ ఉండేవి. అనేక రకాల హంగులు, అలంకారాలు పెరిగిపోయాయి. అలంకరించబడిన గుఱ్ఱం, పల్లకి, రథం, పాత్రలు వెండి సామానులు, బాల్టీలు వంటపాత్రలు, పటాలు, నిలువుటద్దాలు మొదలైనవి బహుకరించబడ్డాయి. ఉత్సవానికి ఏనుగులు కూడా వచ్చాయి. ఇవన్నీ ఎంతపెరిగినప్పటికీ సాయిబాబా వీటిని ఏమాత్రం లక్ష్యపెట్టకుండా యథాపూర్వం నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవంలో గమనించవలసిన ముఖ్యవిషయం ఏమిటంటే హిందువులు, మహమ్మదీయులు ఎలాంటి అరమరికలు లేకుండా కలిసిమెలసి ఉత్సవాలలో పాలుపంచుకునేవారు. ఈనాటి వరకు ఎటువంటి మతకలహాలు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5000 నుండి 7000 యాత్రికులు వచ్చారు. క్రమంగా ఈ సంఖ్య 75000కు చేరుకుంది. అంతపెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడినప్పటికీ ఎప్పుడూ ఎటువంటి అంటువ్యాధులు కాని, అల్లర్లు కానీ సంభవించలేదు.

మసీదుకు మరమ్మత్తులు

గోపాలరావుగుండుకి ఇంకొక మంచి ఆలోచన వచ్చింది. ఉరుసు ఉత్సవం ప్రారంభించిన విధంగానే మసీదును తగినట్లు తీర్చిదిద్దాలి అని నిశ్చయించుకున్నారు. మసీదు మరమ్మత్తు చేయడానికి రాళ్ళను తెప్పించి చెక్కించారు. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబు ఛాందొర్కర్ కు ఆ సేవ లభించింది. రాళ్ళు తాపడం చేసే కార్యక్రమాన్ని కాకాసాహెబు దీక్షిత్ కు ఇష్టం లేకపోయింది. కాని భక్తుడైన మహాల్సాపతి కల్పించుకుని, ఎలాగో బాబా అనుమతిని పొందరు. బాబా చావడిలో పడుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్ళతో తాపడం చేయడం ముగించారు. అప్పటినుండి బాబా గొనెగుడ్డపై కూర్చోవడం మానివేసి చిన్న పరుపుమీద కూర్చునేవారు. గొప్ప వ్యయప్రయాసలతో 1911వ సంవత్సరంలో సభా మండపం పూర్తిచేశారు. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది. సౌకర్యంగా వుండేది కాదు. కాకాసాహెబు దీక్షిత్ దాన్ని విశాల పరచి పైకప్పు వేయదలిచారు. ఎంతో డబ్బు పెట్టి ఇనుపస్తంభాలు మొదలైనవి తెప్పించి పని ప్రారంభించారు. రాత్రి అంతా శ్రమపడి స్తంభాలు నాటేవారు. మరునాడు రోజు ప్రాతఃకాలంలోనే బాబా చావడి నుండి వచ్చి అది అంతా చూసి కోపంతో వాటిని పీకేసేవారు. ఒకసారి బాబా అమిత కోపోద్రిక్తుడై నాటిన ఇనుపస్తంభాన్ని ఒక చేతితో పెకిలిస్తూ, రెండవ చేతితో తాత్యాపాటీలు పీకను పట్టుకున్నారు. తాత్యా తలపాగాను బలవంతంగా తీసి, అగ్గిపుల్లతో నిప్పు అంటించి ఒక గోతిలో పారేశారు. బాబా నేత్రాలు నిప్పుకణాలుగా వెలుగుతున్నాయి. ఎవరికీ బాబావైపు చూడడానికి ధైర్యం చాలలేకపోయింది. అందరూ భయకంపితులు అయ్యారు. బాబా తన జేబులో నుండి ఒక రూపాయి తీసి అటువైపు విసిరారు. అది శుభసమయంలో చేసే ఆహుతిలా కనబడింది. తాత్యా కూడా చాలా భయపడ్డాడు. తాత్యాకి  ఏం జరుగుతుందో ఎవరికీ ఏమీ తెలియకుండా పోయింది. మధ్యలో కల్పించుకుని బాబా పట్టునుండి తాత్యాను విడిపించడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. ఇంతలో కుష్టిరోగి బాబా భక్తుడైన భాగోజీ షిండే కొంచెం ధైర్యం కూడగట్టుకుని ముందుకు వెళ్ళగా బాబా అతడిని ఒక పక్కకు త్రోసివేశారు. మాధవరావు సమీపించబోగా బాబా అతినిపై ఇటుకరాయి విరిసారు. ఎంతమంది వారి జోలికి వెళ్ళదలిచారో అందరికీ ఒకే గతి పట్టింది. కానీ కొంతసేపటికి బాబా శాంతించారు. ఒక దుకాణదారుడిని పిలిపించి వాడి దగ్గరనుంచి ఒక నగిషీ జరీపాగాను కోని తాత్యాను ప్రత్యేకంగా సత్కరించడానికా అన్నట్లు దాన్ని స్వయంగా తత్యా తలకు చుట్టారు, బాబా యొక్క ఈ వింతచర్యను చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. అంత త్వరలో బాబాకి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు ఈ విధంగా తాత్యాను శిక్షించారు? వారి కోపం తక్షణమే ఎలా చల్లబడింది? అని అందరూ ఆలోచనలో పడిపోయారు. బాబా ఒక్కొక్కప్పుడు శాంతిమూర్తిలా కూర్చుని అత్యంత ప్రేమానురాగంతో మాట్లాడుతూ ఉండేవారు. అంతలో అకారణంగా కోపగించేవారు. అటువంటి సంఘటనలు అనేకం వున్నాయి. కాని ఏది చెప్పాలి అనే విషయం తేల్చుకోలేకపోతున్నాను. అందుకే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటీ చెపుతాను.

ఆరవ అధ్యాయం సంపూర్ణం   

ఏడవ అధ్యాయం

0 Comments To "Saibaba Satcharitram 6 Adhyayam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!