ఓం నమః శివాయ
పరమేశ్వరుడు సృష్టి లయ కారకుడు. శంభో మహాదేవా అని పిలిస్తే పలికే దైవం.
ఆ ముక్కంటుని పర్వదినం పురస్కరించుకుని శివరాత్రి విశిష్టత తెలుసుకుందాము.
శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. సంవత్యరానికి వచ్చే శివరాత్రులు మొత్తం అయిదు. అవి ఏమిటంటే :
నిత్య శివరాత్రి,
పక్షశివరాత్రి,
మాసశివరాత్రి,
మహాశివరాత్రి,
యోగశివరాత్రి.
వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి. మాఘ బహుళ చతుర్థి, ఆరుద్ర నక్షత్రం నాడు శివుడు లింగోద్భవం జరిగింది. శివునికి అతి ఇష్టమైన తిథి అది.
అందుకే ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట. ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు.
త్రయోదశినాడు ఒంటిపొద్దు ఉండి, చతుర్థశి నాడు ఉపవాసం ఉండాలి.
రూప రహితుడైన శివుడు, జ్యోతిరూపంలో, లింగాకారంగా అవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అంటారు.
ఈ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ముఖ్యమైనది. అర్థరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో చెప్పారు. ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆరోజు నిద్ర పోకుండా మేల్కొని ఉపవాసముండి, మహాలింగ దర్శనం చేయడం అనాతిగా వస్తున్నది.
ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి ఆడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో యిష్టమనీ, సంవత్సర కాలంలో చేసినా చేయకున్నా ఆ ఒక్క రోజు శ్రద్ధా, భక్తితో, శివనామ జపం చేస్తూ ఉపవాసమున్నా తానెంతో సంతిస్టి చెందుతాను అని చెబుతాడు.
ఆయన చెప్పిన దాని ప్రకారం, ఆ రోజు పగలంతా నియమనిష్ఠతో ఉపవాసంతో గడిపి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నేతితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు.
ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసంచేసి, బిల్వ పత్రాలతో శివపూజ చేస్తారో, రాత్రి జాగరణ చేస్తారో వారికి ఆ పరమేశ్వరుని కృపాకటక్షాలు పొందుతారు.