పుష్యమాసం ప్రారంభం

పుష్యమాసం ప్రారంభం

1-1-2025 నుండి పుష్యమాసం ప్రారంభం

చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య” అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం.

ఆధ్యాత్మికంగా జపతపాదులు , ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి, అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్య పౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు , మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది. 

విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీయుజం. శివునకు కార్తీకం. అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల, శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. 

ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి, నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు , బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే, ఈ రెండు పదార్ధాలు మనిషి ఓంట్లో వేడిని పెంచి, చలి నుంచి రక్షిస్తాయి. 

శని ధర్మదర్శి.  న్యాయం , సత్యం , ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వప్రాణుల సమస్త విశ్వ ప్రేమను , పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే . మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి , నియమ నిష్ఠులు పాటించినట్లు అయితే, శని అనుగ్రహం పొందవచ్చు.

అంతే గాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో, అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే కారణం అని మనం గ్రహించాలి.  

పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీ హరిని తులసీదళాలతో పూజిస్తే, సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం.


అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ, ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్ల పక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్ఠి ( సుబ్రహ్మణ్య షష్ఠి ) ఎలాగో, వారికి ఈ రోజు అంత పవిత్రమైనది.  

ఇక శుక్ల పక్షంలో వచ్చే అష్టమిరోజు  పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే, పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే, ఈ నియమం వెనుక సదుద్దేశం. 

పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి. చీకటితోనే లేచి, చలి మంటలతో చీకట్లను పారద్రోలుతారు. దక్షిణాయనానికీ , ధనుర్మాసానికీ ఆఖరు రోజు ఇది. భోగినాడు వైష్ణవాలయాల్లో గోదారంగనాథుల కల్యాణాన్ని, కన్నుల పండువగా జరుపుతారు. మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే, మకర సంక్రాంతి.

ఆ రోజు నుండి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని, పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి నాడు శివుడ్ని ఆవునేతితోనూ , నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి సకల భోగభాగ్యాలూ కలుగుతాయని ప్రతీతి. 

సంక్రాంతి మరుసటి రోజు, కనుమ పండుగ చేస్తారు. ఈ రోజు ధాన్యరాశులనూ, వ్యవసాయంలో సహకరించే పశువులనూ లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. పుష్య బహుళ ఏకాదశిని విమలైకాదశి , సఫలైకాదశి, షట్తిలైకాదశి , కల్యాణైకాదశి అని పిలుస్తారు.

ఈ మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను, చొల్లంగి అమావాస్య అంటారు. ఈ రోజు నదీ స్నానాదులు చేసుకుని, దైవదర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి , పితృ తర్పణాలు , ఆబ్దికాదులు ఉంటే వారి పేరుతో అన్న దానాలు పేదవారికి చేస్తే, విశేషించి పుణ్యఫలంతో పాటు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది.

పుష్యమాసములో సూర్యోదయ సమయమున ప్రసరించు సూర్య కాంతి, అద్భుతమగు యోగచైతన్యమును ప్రసాదింపగలదు. పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రము. చెప్పలేనంత కాంతిని దర్శనము చేయించే మాసము పుష్యమాసము. ఉత్తరాయణ పుణ్యకాలములో  సూర్యుడు దక్షిణము నుండి, ఉత్తరదిశగా పయనము సాగిస్తాడు. అనగా ఊర్ద్వముఖముగా ప్రయాణము.

మనలోని ప్రాణశక్తి బలమును కూర్చుకొను సమయము. సూర్యకిరణముల యందు ఒక ప్రత్యేకమైన హిరణ్మయమైన కాంతి ఉండును. ఇది మన బుద్ధిని ప్రచోదనము గావించును. మనస్సును అంటిపెట్టుకున్న స్వభావము నందలి, అశుభములను ఆ కాంతి హరింపగలదు. బుద్ధిబలము , ప్రాణబలము పుష్టిగా లభించు మాసము పుష్యమాసము.


Products related to this article

Sree Lalitha Sahasranam Stotram (Pocket Book)

Sree Lalitha Sahasranam Stotram (Pocket Book)

Sree Lalitha Sahasranam Stotram (Pocket Book)..

$1.00

Pure Silver Ammavari Face

Pure Silver Ammavari Face

Pure Silver Ammavari Face Handmade crafted pure silver Ammavari Face is used for sravanamasam special decoration for Varalakshmi ammavari decoration,lakshmidevi and Durgadevi .Product Description..

$349.00