Shivaratri Puja Procedure

శివరాత్రి పూజా విధానం


ఒకానొకప్పుడు పార్వతీదేవి శివుడి వద్దకు వెళ్ళి శివరాత్రి ప్రాశస్త్యం గురించి వివరించమని అడిగింది. దానికి పరమశివుడు తనకు శివరాత్రి ఉత్సవం ఎంతో ఇష్టమని, ఎప్పుడూ ఏమీ చేయకపోయినా శివరాత్రి రోజున ఉపవాసం ఉన్నా సరే తాను సంతోషిస్తానని తెలిపాడు. శివరాత్రి రోజున పగలు ఉపవాసం ఉండి నియమనిష్టలతో పూజించాలి. రాత్రి నాలుగు ఝాములలో శివలింగాన్ని మొదట ఝామున పాలతో, రెండవ ఝాములో పెరుగుతో, మూడవ ఝాములో నేతితో నాలువవ ఝాములో తేనెతో అభిషేకించినట్లయితే శివుడు ప్రీతి పొందుతాడు. మరుసటి రోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టిన తరువాత తాను కూడా భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. ఈ వ్రతాన్ని మించిన వ్రతం మరొకటి లేదు అని పరమశివుడు పార్వతికి తెలిపాడు. సాధారణంగా ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్థశిని శివరాత్రిగా భావిస్తూ ఉంటారు కానీ ఫాల్గుణ మాసపు చతుర్థశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజున అత్యంత వైభవంగా చేసుకుంటారు. రాత్రి అంటే 'రా అన్నది దానార్థక ధాతు నుండి 'రాత్రి' అయిందంటారు ఋగ్వేద సూక్తం తాలూకు యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ ఈ విధంగా చెప్పబడింది. 'హే రాత్రే! అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక!.


    ఉప మపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్ !
    ఉష ఋణేన యాతయ !!


మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూట జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్థశి రోజు వచ్చిన రాత్రికి ఒక ప్రత్యేకత వుంది. చతుర్థశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో ఆ రాత్రి జాగారం చేస్తారో వారికి మళ్ళీ తల్లిపాలు తాగే అవసరం రాదు (మరుజన్మ ఉండడు)


    శివతంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం !
    మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన !!


గరుడ, పద్మ, స్కంద, అగ్ని మొదలైన పురాణాలలో దీనిని ప్రశంసించడం జరిగింది. మనుషులు ఎవరైతే శివరాత్రి రోజున ఉపవాసం చేసి, బిల్వపత్రాలతో శివపూజ, రాత్రి జాగరణ చేస్తారో వారిని పరమశివుడు నరకాన్నుండి రక్షిస్తాడు, ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసేవారు శివమయంలో లీనమైపోతాడు. దానం, తపం, యజ్ఞం, తీర్థయాత్రలు, వ్రతాలు లాంటివి ఎన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు. శివరాత్రి వ్రతం గురించి వివిధ గ్రంథాలలో విభిన్న అర్థాలు ఉన్నాయి. వైదిక సాహిత్యంలో దీని అర్థం - వేదం బోధితం అని, ఇష్ట ప్రాపకర్మ అని వుంది. దార్శనిక గ్రంథాలలో అభ్యుదయం అని, నిః శ్రేయస్సు' కర్మ అని, అమరకోశంలో వ్రతం అంటే నియమమని వుంటే పురాణాలలో మాత్రం ధర్మానికి పర్యాయవాచిగా ఉపయోగించబడింది. మహాశివరాత్రి వ్రతం రోజున ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. తిథితత్వంలో చెప్పబడింది. ఈ గ్రంథంలో భగవాన్ మహాశివుడు ఇలా చెప్పినట్లు వుంది. 'మీరు స్నానం చేసినా, మంచి వస్త్రాలు ధరించినా, ధూపాలు వెలిగించినా, పూజ చేసినా పుష్పాలు అలంకరించినా వీటన్నిటికంటే కూడా ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే నాకు ఇష్టం' అని.  
ఉపవాసం విశిష్టత ?
దగ్గర వసించడం, నివశించడం, ఉండడం ఉపవాసం అని అంటారు. వ్రతం చేసేవారి ఇష్టదైవం దగ్గర ఉండటమే ఉపవాసం.
        వరాహోపనిషత్తు లో ఈ విధంగా చెప్పబడింది.


    ఉప సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మ నోః
    ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్ః


            భవిష్యపురాణంలో కూడా ఈ విధంగా చెప్పబడింది.


    ఉపావృత్తస్య పాపేభ్యోయస్సు వాసో గుణైః సహా
    ఉపవాసః స విఘ్నేయ సర్వభోగ వివర్జిత్ః


మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము, వ్రతానికి యోగ్యమైన కాలం రాత్రి, ఎందుకంటే రాత్రిపూట భూత, శక్తులు, శివుడు తిరిగే సమయం అన్నమాట. చతుర్థశి రాత్రి ఆయనను పూజించి అభిషేకించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఈ విధంగా స్పష్టంగా చెప్పాడు. 'సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రికాలంలో మేల్కొని తిరుగుతూ ఉంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ, సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి అది.


    యానిశా సర్వ భూతానం తస్యాం జాగర్తి సమ్యమీ
    యస్యాం జాగృతి భూతాని సానిశాపశ్యతో మునే


విషయాసక్తుడు నిద్రలో వుంటే అందులో నిగ్రహస్తుడు ప్రబుద్ధంగా ఉన్నాడు. అందువల్ల శివరాత్రి రోజు జాగరణ ముఖ్యం అన్నమాట. శివునితో ఏకీకరణం కావడమే నిజమియన్ శివ పూజ. ఇంద్రియ అభిరుచుల్ని నిరోధించి పూజించడమే శివవ్రతం. శివరాత్రి ఎలా చేసుకోవాలంటే గరుడ పురాణంలో ఈ విధంగా చెప్పబడింది. త్రయోదశి రోజునే శివ సన్మానం గ్రహించి, వ్రతూ కొన్ని ప్రతిబంధకాలను గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకుని పాటించాలి. భక్తుడు ఈ విధంగా ప్రకటన చేసుకోవాలి - “హే భగవాన్! నేను చతుర్థశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్థ్యాన్ని బట్టి దానం, తపం, హోమం చేయగలను. నేను ఈ రోజు నిరాహారిగా ఉంటాను. రెండవరోజు మాత్రమే తింటాను. ఆనంద, మోక్షాన్ని అనుగ్రహించు శివా!''


వ్రతం పూర్తయిన తరువాత గురువు దద్దరికి వెళ్ళి పంచామృతంతో పాటు పంచగావ్యాలను అయిదు విధములైన గో సంబంధిత వస్తువులతో, ఆవుపేడ, ఆవు పంచకం, ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి శివలింగాన్ని అభిషేకం చేయించాలి. అభిషేకం చేస్తున్న సమయంలో 'ఓం నమః శివాయః' అని స్మరిస్తూ ఉండాలి. చందన లేపంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో పాటు శివపూజ చేయాలి. అగ్నిలో నువ్వులు, బియ్యం, నెయ్యి కలిపినా అన్నం వేయాలి. ఈ హోమం తరువాత పూర్ణాహుతి నిర్వహించాలి. అందమైన శివసంబంధిత కథలు వినాలి. వ్రతం చేసేవారు మరొకసారి రథరాత్రి మూడవ, నాలుగవ ఝాములలో ఆహుతులను సమర్పించాలి. సూర్యోదయం వరకూ మౌనంగా ఉండాలనుకునే వారు 'ఓం నమః శివాయ' అని మనసులో స్మరిస్తూ ఉండాలి. లింగోద్భవమైన అర్థరాత్రి సమయం ప్రతిరోజూ వస్తుంది కాబట్టి ప్రతిరోజూ శివరాత్రే కాబట్టి ప్రతిక్షణం శివస్మరణ యోగ్యమే. అయితే కృష్ణపక్ష చతుర్థశి శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతినెలా వచ్చే ఆ రోజును మాసశివరాత్రి అన్నారు. అందులోనూ మాఘ బహుళ చతుర్థశి మహాశివుడికి అత్యంత ప్రీతి. ఆ రోజు ఉదయం స్నానం చేసిన తరువాత శివాలయాన్ని దర్శించి, అవకాశం లేకపోతె ఇంటి దగ్గరే ఉమామహేశ్వరులను శివప్రీతికరమైన పువ్వులతో, బిల్వదళాలతో అర్చించాలని, శక్తి కొలదీ పాలు, గంగోదకం, పంచామృతాలతో లింగాభిషేకం చేయాలేనీ ఉపవాస జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మరునాడు ఉత్తమ బ్రాహ్మణులకు, శివభాక్తులను భోజనం పెట్టాలని వ్రత విధానాన్ని బోధించారు. శివరాత్రి రోజున లింగోద్భవం జరిగిందని ఆరోజు పరమశివుడు అర్థరాత్రి జ్యోతిర్మయమైన మహాలింగంగా ఆవిర్భవించాడు. పరమశివుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తు అంతా దేదీపమానం చేశాడు కాబట్టి ఆ రోజున నిద్రపోకూడదు అని పండితులు చెబుతున్నారు. శివరాత్రి రోజున పద్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు అన్నీ 'బిల్వ' మూలంలో ఉంటాయని, శివరాత్రి రోజున ఉపవాసం ఉంది ఒక్క బిల్వపత్రాన్ని అయినా శివార్పణ చసి తరించాలని శాస్త్రం చెబుతుంది. శివరాత్రి రోజున సమస్త ప్రాణకోటిలో సూక్ష్మజ్యోతిరూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా అర్చించబడుతుంటాడు. శివరాత్రినాడు ఫలం, తోటకూర కట్ట అయినా సరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం. ఆర్ధికబలం ఉన్నవారు తమ శక్తికొలదీ బంగారు, వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి ఒక పండితుడికి సమర్పిస్తే అజ్ఞానాంధకారం నశిస్తుంది అని పెద్దల వాక్కు. శివరాత్రి రోజున ఉపవాసం చేసి, త్రికరణ శుద్ధిగా శివుడిని ఆరాధిస్తే ఒక సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుంది అని సాక్షాత్తు పరమశివుడే బ్రహ్మదేవుడికి ఉపదేశించినట్లు పండితులు చెబుతున్నారు.

0 Comments To "Shivaratri Puja Procedure"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!