saibaba-satcharitra-49-chapter

శ్రీసాయిసచ్చరిత్ర

నలభై తొమ్మిదవ అధ్యాయం

ప్రస్తావన :

వేదాలు, పురాణాలు, బ్రహ్మాన్ని లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అలా అయినప్పుడు మావంటి మూర్ఖులు సద్గురువైన సాయిబాబాను ఎలా వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడకుండా ఊరుకోవడమే మేలు అని తోస్తుంది. మౌనవ్రతాన్ని పాటించడమే సద్గురువుని స్తుతించడానికి సరైన మార్గం అని తోస్తుంది. కాని సాయిబాబా సుగుణాలను చూసినట్లయితే మా వ్రతాన్ని మరచిపోయి మమ్మల్ని మాట్లాడేలా ప్రేరేపిస్తాయి. మన స్నేహితులు గాని, బంధువులు గాని మనతో లేకపోయినట్లయితే మంచి పిండివంటలు కూడా రుచించవు. కాని వారు మనతో ఉన్నట్లయితే ఆ పిండివంటలు మరింత రుచికరంగా ఉంటాయి. సాయిలీలామృతం కూడా అటువంటిదే. దీన్ని మనం ఒంటరిగా తినలేము. స్నేహితులు, బంధువులు కలిసినట్లయితే చాలా బాగుంటుంది.

ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారం మాతో వ్రాయించారు. వారికి సర్వస్య శరణాగతి చేసి వారి పట్లే ధ్యానం నిలపడం మా కర్తవ్యం. తీర్థయాత్ర, వ్రతం, త్యాగం, దానముల కంటే తపస్సు చేయడం గొప్ప. హరిని పూజించడం తపస్సు కంటే మేలు. సద్గురువుని ధ్యానించడం అన్నిటికంటే మేలయినది. కాబట్టి మనం సాయినామాన్ని నోటితో పలుకుతూ వారి పలుకులను మననం చేస్తూ, వారి ఆకారాన్ని మనస్సులో భావించుకోవచ్చు, వారిపై హృదయపూర్వకమైన ప్రేమతో, వారి కోసమే సమస్త కార్యాలను చేస్తూ ఉండాలి. సంసారంబంధం నుండి తప్పించుకోవడం కోసం దీనికి మించిన సాధనం లేదు. పైన వివరించబడిన ప్రకారం మన కర్యవ్యాన్ని మనం చేయగలిగినట్లయితే, సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేస్తాడు. చివరికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇక ఈ అధ్యాయంలోని కథలవైపు తిరుగుదాం.

హరి కోనోబా :

హరి కోనోబా అనే బొంబాయి పెద్దమనిషి ఒకరు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు ఎన్నో విన్నాడు, కాని నమ్మలేదు. కారణం ఏమిటంటే అతనిది అనుమానపు స్వభావం. బాబాను స్వయంగా పరీక్షించాలని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతను షిరిడీకి వచ్చాడు. అతని తలపై జలతారు పాగా ఉంది. అతని పాదాలకు కొత్తచెప్పులు ఉన్నాయి. కొంతదూరం నుండి బాబాను చూసి బాబా దగ్గరికి వెళ్ళిల్లి సాష్టాంగ నమస్కారం చేయాలని అనుకున్నాడు. కొత్త చెప్పులు ఎక్కడ పెట్టాలో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందు ఒక మూలలో పెట్టి బాబా దర్శనం కోసం వెళ్ళాడు. బాబాకి భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఊదీని, ప్రసాదాన్ని బాబా చేతినుండి అందుకుని తిరిగివచ్చాడు. మూలకు వెళ్ళి చూసేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కోసం వెదికాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. చాలా చికాకు పడుతూ బసకు వచ్చాడు.

అతను స్నానం చేసి, పూజ చేసి, నైవేద్యం పెట్టి భోజనానికి కూర్చున్నాడు. కాని తన చెప్పుల గురించే చింతిస్తూ ఉన్నాడు. భోజనం తరువాత, చేతులు కడుక్కోవడానికి బయటకు వచ్చాడు. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు రావడం చూశాడు. ఆ కుర్రవాడి చేతిలో ఒక కర్ర ఉంది. దాని చివరన కొత్త చెప్పుల జత వ్రేలాడుతూ ఉన్నాయి. చేతులు కడుక్కోవడానికి బయటికి వచ్చిన వారితో అతడు బాబా తనను పంపించాడని వీథిలో 'హరీకా బేటా, జరీకా ఫేటా'అని అరవమనీ చెప్పమన్నాడు అని చెప్పాడు. ఎవరయినా ఆ చెప్పులు తమవే అయితే అతని పేరు హరి అనీ, అతడు కానోబా కొడుకు అనీ, అతని తలపై జరీపాగా ఉందా అనే సంగతి పరీక్షించిన తరువాత చెప్పులు ఇచ్చేయాలి అని చెప్పాడు. ఈ కుర్రవాడు ఇలా చెప్పడం విని, హరి కానోబా ఆశ్చర్యానందములు పొందాడు. కుర్రవాడి దగ్గరకి వెళ్ళి చెప్పులు తనవే అని రూడీ చేశాడు. అతడు తన పేరు హరి అని, తాను కానోబా కుమారుడిని అని తన తలపై ధరించే జరీపాగా చూపించాడు. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులను ఇచ్చేశాడు. హరి కానోబా ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు. తన జలతారు పాగా అందరికీ కనిపించవచ్చు కానీ, తన పేరు, తన తండ్రి పేరు బాబాకి ఎలా తెలిసింది? అదే షిరిడీకి మొదటిసారి తను రావడం. అతడు అక్కడికి బాబాను పరీక్షించడానికే వచ్చాడు. ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడు అని గ్రహించాడు. అతనికి కావలసింది బాబాను పరీక్షించడం. అది పూర్తిగా నెరవేరింది. సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయాడు.

సోమదేవస్వామి :

బాబాను పరీక్షించడం కోసం ఇంకొకరు వచ్చారు. వారి కథను వినండి. కాకాసాహెబు దీక్షిత్ తమ్ముడు భాయిజీ బాగాపూర్ లో నివశిస్తూ ఉండేవాడు. 1906వ సంవత్సరంలో హిమాలయాలకు వెళ్ళినప్పుడు సోమదేవస్వామి అనే సాధువుతో అతనికి పరిచయం కలిగింది. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తరకాశీకి చెందినవారు. వారి మఠం హరిద్వారంలో ఉంది. ఇద్దరూ పరస్పరం తమ చిరునామాలు రాసుకున్నారు. 5 సంవత్సరాల తరువాత సొమదేవస్వామి నాగపూర్ కు వచ్చి భాయిజీ ఇంట్లో దిగాడు. బాబా లీలలను విని సంతోషించాడు. షిరిడీకి వెళ్ళి బాబాను చూడాలని అతనికి గట్టి కోరిక కలిగింది. భాయీజీ దగ్గరనుంచి పరిచయపు ఉత్తరం తీసుకుని షిరిడీకి వెళ్ళాడు. మరునాడు, కోపర్ గావ్ దాటిన తరువాత టాంగా చేసుకుని షిరిడీకి వెళుతూ ఉన్నాడు. షిరిడీ దగ్గరికి రావడంతో మసీదుపై రెండు జెండాలు కనిపించాయి. సాధారణంగా యోగులు వేరువేరు వైఖరులతోను, వేరువేరు జీవన పద్ధతులతోను, వేరువేరు బాహ్యాలంకారాలతోను ఉంటారు. కాని యీ పై గుర్తులను బట్టే యోగి యొక్క గొప్పదనాన్ని కనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇది అంతా వేరు పంథాగా తోచింది. రెండు పతాకాలు ఎగరడం చూడగానే తనలో తాను 'ఈ యోగి జెండాల పట్ల ఎందుకింత ఇష్టం చూపించాలి? ఇది యోగికి తగినది కాదు. దీన్ని బట్టి ఈ యోగి కీర్తికోసం పాటు పడుతున్నట్లు తోస్తున్నది' అని అనుకున్నాడు. ఇలా ఆలోచించుకుని, షిరిడీకి వెళ్ళడం మానుకోవాలని నిశ్చయించుకున్నట్లు తనతో పాటు ఉన్న మిగిలిన యాత్రికులకు చెప్పాడు. వారు అతనితో ఇలా అన్నారు 'అలాగయితే ఇంత దూరం ఎందుకు వచ్చావు? జెండాలను చూడటంతో నీ మనస్సు చికాకు పడినట్లయితే షిరిడీలో రథం, పల్లకి, గుఱ్ఱం మొదలైన బాహ్యలంకారాలు చూసినట్లతే మరెంత చికాకు పడతావు?’ సోమదేవస్వామి గాభరా పడి ఇలా అన్నాడు 'గుఱ్ఱాలతోనూ, పల్లకీతోను, జట్కాలతోను ఉన్న సాధువులను నేను ఎక్కడా చూడలేదు. అటువంటి సాధువులను చూడటం కంటే తిరిగి వెళ్ళిపోవడమే మేలు' అన్నాడు. ఇలా అంటూ తిరుగు ప్రయాణానికి సిద్ధపడ్డాడు. మిగిలిన తోటి ప్రయాణీకులు అతన్ని తన ప్రయత్నాన్ని మాని షిరిడీ లోపలికి వెళ్ళమన్నారు. అలాంటి వక్రమైన ఆలోచనలు మానుకోమని చెప్పారు. బాబా యీ జెండాలను కాని మిగిలిన వస్తువులనుగాని, ఆడంబరాలనుగాని, కీర్తినిగాని లక్ష్యపెట్టేవారు కాదు అని చెప్పారు. అవన్నీ అలంకరించినవారు బాబా భక్తులే కాని ఆయనకు ఏమీ అవసరంగాని, సంబంధంగాని లేదు అన్నారు. వారి భక్తిప్రేమల కొద్దీ వారు వాటిని సమకూర్చారని చెప్పారు. చివరికి ప్రయాణం సాగించి షిరిడీకి వెళ్ళి సాయిబాబాను చూసేలా చేశారు.

సోమదేవస్వామి మసీదు కిందనుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగింది. అతని కళ్ళు నీటితో నిండాయి, గొంతుక తడారిపోయింది. అతని కుంటి ఆలోచనలు అన్నీ అడుగంటి పోయాయి. ‘ఎక్కడ మనస్సు శాంతించి ఆనందాన్ని పొంది ఆకర్షించబడునో అదే మనం విశ్రాంతి పొందవలసిన స్థలం' అని తన గురువు చెప్పినదాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. అతడు బాబా పాదధూళిలో దొర్లడానికి తహతహలాడాడు. బాబా దర్శనం కోసం దగ్గరికి వెళ్ళగా 'మా వేషం మా దగ్గరే ఉండనీ, నీ ఇంటికి నువ్వు వెళ్ళు. తిరిగి మసీదుకు రావద్దు, ఎవరైతే మసీదుపై జెండాగా ఎగరవేస్తున్నారో అటువంటి వారి దర్శనం నీకెందుకు? ఇది యోగి లక్షణమా? ఇక్కడ ఒక నిముషం అయినా ఉండవద్దు' అన్నారు. ఆ స్వామి ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు. బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటిస్తున్నారని తెలుసుకున్నాడు. అతడు ఎంత సర్వజ్ఞుడు! తాను తెలివితక్కువ వాడిననీ బాబా మహానుభావుడనీ గ్రహించాడు. బాబా అందరినీ కౌగిలించుకోవడం, కొందరిని ఆశీర్వదించడం, కొందరిని ఓదార్చడం, కొందరివైపు దాక్షిణ్యంతో చూడడం, కొందరివైపు చూసి నవ్వడం, ఊదీ ప్రసాదాన్ని కొందరికి ఇవ్వడం ఇలా అందరినీ ఆనందింపజేసే, సంతృప్తి పరచడం చూసి తనని ఒక్కడినే ఎందుకు అంత కఠినంగా చూస్తున్నారో అతనికి తెలియకుండా పోయింది. తీవ్రంగా ఆలోచించి బాబా చేసేది అంతా తన అంతరంగంలో ఉన్న దానితో సరిగ్గా ఉంది అని గ్రహించాడు. దానివల్ల పాఠం నేర్చుకొని వృద్ధి పొందడానికి ప్రయత్నించాలి అని గ్రహించాడు. బాబా కోపం మారురూపంతో ఉన్నా ఆశీర్వాదమే అనుకున్నాడు. కొన్నాళ్ళ తరువాత బాబాపట్ల అతనికి నమ్మకం బలపడింది. అతడు బాబాకు గొప్ప భక్తుడు అయ్యాడు.

నానాసాహెబు ఛాందోర్కర్ :

ఈ అధ్యాయాన్ని హేమాడ్ పంత్ నానాసాహెబు ఛాందోర్కర్ కథతో ముగించాడు. ఒకరోజు నానాసాహెబు మసీదులో మహాల్సాపతి మొదలైన వారితో కూర్చుని ఉండగా బీజాపూరు నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో సహా బాబాను చూడడానికి వచ్చాడు. అతనితో ఘోషా స్త్రీలు ఉండడంతో నానాసాహెబు అక్కడినుండి లేవాలని అనుకున్నాడు. కాని బాబా అతన్ని వారించారు. స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదాలకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకుంది. నానాసాహెబు ఆమె ముఖసౌందర్యాన్ని చూసి మళ్ళీ చూడాలని అనుకున్నాడు. నానా యొక్క చాంచల్యాన్ని చూసి, స్త్రీలు వెళ్ళిపోయినా తరువాత, బాబా నానాతో ఇలా అన్నారు 'నానా! అనవసరంగా చికాకు పడుతున్నావు ఎందుకు? ఇంద్రియాలను వాటి పనులను చేయనివ్వు. వాటిలో మనం జోక్యం కలుగచేసుకోకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచాన్ని సృష్టించి ఉన్నాడు, కాబట్టి అందరిని చూసి సంతోషించడం మన విధి. క్రమంగాను, మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతిస్తుంది. ముందు ద్వారం తేలిచి ఉండగా వెనుక ద్వారం ద్వారా వెందుకు వెళ్ళాలి? మన హృదయం స్వచ్చంగా ఉన్నంతవరకు ఏమీ దోషం లేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు ఎందుకు భయపడాలి? నేత్రాలు వాటి పని అవి నెరవేర్చుకోవచ్చు. నీవు సిగ్గుపడి బెదరిపోవడం ఎందుకు?’

శ్యామా అక్కడే ఉన్నాడు. కాని బాబా చెప్పినదాన్ని గ్రహించలేకపోయాడు. ఇంటికి వెళ్ళే దారిలో శ్యామా ఈ విషయమై నానాని అడిగాడు. ఆ చక్కని స్త్రీ వైపు చూసి తాను పొందిన ఆ చంచలత్వాన్ని గురించి నానా చెప్పాడు. బాబా దాన్ని గ్రహించి ఎలా సలహా ఇచ్చాడో వివరించాడు. బాబా చెప్పిన దాని భావం నానా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు 'మనస్సు సహజంగా చంచలమైనది. దాన్ని ఉద్రేకపడేలా చేయకూడదు. ఇంద్రియాలు చలించవచ్చు. శరీరం స్వాధీనంలో ఉంచుకోవాలి. దాని ఓర్పు పోయేలా చేయకూడదు. ఇంద్రియాలు విషయాలవైపు పరిగెడతాయి. కాని మనం వాటివెంట వెళ్ళకూడదు. మనం ఆ విషయాలను కోరుకోకూడదు. క్రమంగా, నెమ్మదిగా సాధన చేయడం వలన చంచలత్వాన్ని జయించవచ్చు. ఇంద్రియాలకు మనం లోబడకూడదు. కానీ వాటిని మనం పూర్తిగా స్వాధీనంలో ఉంచుకోలేము. సమయానుకూలంగా వాటిని అణచి సరిగ్గా ఉంచుకొని ఉండాలి. నేత్రాలు అందమైన వాటిని చూడటం కోసమే ఇవ్వబడ్డాయి. విషయంలోని సౌందర్యాన్ని నిర్భయంగా చూడవచ్చు. భయానికిగాని, సిగ్గుకుగాని అవకాశం లేదు. దురాలోచనలు మనస్సులో ఉంచుకోకూడదు. మనస్సులో ఎటువంటి కోరికా లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడలేము. ఈ విధంగా ఇంద్రియాలను సులభంగాను, సహజంగాను స్వాధీనం చేసుకోవచ్చు. విషయాలను ఆభావించడంలో కూడా నీవు భగవంతుణ్ణి గుర్తుంచుకుంటావు. బ్రహ్మేంద్రియాలను మాత్రం స్వాధీనంలో ఉంచుకుని మనస్సును ఇతర విషయాలవైపు పరుగేట్టేలా చేసినట్లయితే, వాటిపై అభిమానం ఉండనిచ్చినట్లయితే చావుపుట్టుకల చక్రం నశించదు. ఇంద్రియ విషయాలు హానికరమైనవి. వివేకం (అంటే నిత్యానిత్యాలకు ఉన్న భేదాన్ని గ్రహించడం) సారథిగా, మనస్సును స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇంద్రియాలను ఇష్టం వచ్చినట్లు సంచరించడం చేయకూడదు. అటువంటి సారథితో విష్ణుపదాన్ని చేరగలం. అదే మన గమ్యస్థానం. అదే మన నిజమైన ఆవాసం. అక్కడి నుండి తిరిగి రావడం ఉండదు'.

నలభై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం

0 Comments To "saibaba-satcharitra-49-chapter"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!