శ్రీసాయిసచ్చరిత్ర
ముప్పైవ అధ్యాయం
షిరిడీకి లాగబడిన భక్తులు ...కాకాజీ వైద్య, రహతా కుశాల్ చంద్, పంజాబీ రామలాల్
ఈ అధ్యాయంలో బాబా షిరిడీకి ఈడ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతం చెప్పుకుందాం.
దయామయుడు, భక్తవత్సలుడు అయిన శ్రీసాయికి నమస్కారం. వారు దర్శనంతోనే భవసాగరాన్ని తరింప చేసి మన ఆపదలను తప్పిస్తారు. వారు నిర్గుణస్వరూపులు అయినా భక్తులు కోరటంతో సగుణస్వరూపం వహించారు. భక్తులకు ఆత్మసాక్షాత్కారం కలిగించడమే మహాత్ముల కర్తవ్యం. అది యోగీశ్వరుడు అయిన సాయినాథుడికి ముఖ్యమైనది, తప్పనిసరైనది. వారి పాదాలను ఆశ్రయించినవారి పాపాలు అన్నీ నశిస్తాయి, అటువంటి వారి ప్రగతి నిశ్చయం. వారి పాదాలను స్మరిస్తూ పుణ్యక్షేత్రాలనుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రాలు పారాయణ చేసి, గాయత్రీ మంత్రాన్ని జపిస్తారు. దుర్బలురం, పుణ్యహీనులం కావడంతో భక్తి అంటే ఏమిటో మనకు తెలియదు. మనకి ఇంత మాత్రం తెలుసు, ఇతరులు మనల్ని విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రం మనల్ని వదలరు. వారి కృపకు పాత్రులైనవారు కావలసినంత శక్తి, జ్ఞానం, నిత్యానిత్య వివేకాలను పొందుతారు.
భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాటిని నెరవేరుస్తారు. అందుకే ఎవరికి కావలసినవి వారు పొంది, కృతజ్ఞతతో ఉంటారు. కాని మేము వారికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకుంటాము. మా తప్పులు అన్నీ క్షమించి సాయి మా ఆరాటాలు అన్నీ పోగొట్టుగాక. కష్టాలపాలై సాయిని ఈ విధంగా ప్రార్థించేవారి మనస్సు శాంతించి, బాబా కటాక్షంతో వారు సంతృప్తి పొందుతారు.
దయాసముద్రుడు అయిన సాయి కటాక్షించడంతో హేమాడ్ పంత్ ఈ గ్రంథాన్ని వ్రాయగలిగాను అని చెప్పుకున్నారు. లేకపోతే తనకు గల యోగ్యతా ఎంత? ఎవరు ఇంత కఠినమైన పనికి పూనుకోగలరు? అన్నారు. శ్రీసాయి ఈ భారం అంతా వహించడంతో హేమాడ్ పంత్ కి కష్టంకాని, శ్రమకాని కనపడలేదు. తన వాక్కును, కాలాన్ని కూడా ప్రేరేపించడానికి శక్తివంతమైన జ్ఞానం అనే వెలుతురు ఉండగా అతడు సంశయంగాని, ఆరాటంగాని ఎందుకు పొందాలి? అతను వ్రాసిన ఈ పుస్తకరూపంలో శ్రీసాయి అతని సేవను అందుకున్నారు. ఇది అతని గతజన్మల పుణ్యం ద్వారా ప్రాప్తించింది. కాబట్టి అతను అదృష్టవంతుడు అని, పుణ్యాత్ముడు అని అనుకున్నాడు.
ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్చమైన అమృతం. దీన్ని ఎవరు త్రాగుతారో వారు సాయి మహిమను సర్వాంతర్యామితత్త్వాన్ని తెలుసుకుంటారు. వాదించేవారు, విమర్శించేవారు ఈ కథలను చదవవలసిన పనిలేదు. దీనికి కావలసింది అంతులేని ప్రేమ, భక్తి, వివాదం కాదు. జ్ఞానులు భక్తివిశ్వాసాలు కలవారు లేదా యోగుల సేవకులం అనుకునేవారు ఈ కథలని ఇష్టపడి మెచ్చుకుంటారు. తదితరులు కాకమ్మ కథలు అనుకుంటారు. అదృష్టవంతులు అయిన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావిస్తారు. ఈ సాయి లీలామృతం త్రాగితే అజ్ఞానులకు జన్మరాహిత్యం కలుగుతుంది. గృహస్థులకు సంతృప్తి కలుగుతుంది. ముముక్షువులకు ఇది సాధనంగా ఉపకరిస్తుంది. ఇక ఈ అధ్యయంలోని కథను ప్రారంభిస్తాను.
కాకాజీ వైద్య :
నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య అనేవాడు ఉండేవాడు. అతను అక్కడి సప్తశృంగి దేవతకు పూజారి. అతను అనేక కష్టాలపాలై మనఃశాంతిని పోగొట్టుకొని చంచల మనస్కుడు అయ్యాడు. అలాంటి పరిస్థితిలో ఒకరోజు సాయంకాలం దేవాలయానికి వెళ్ళి తనను ఆందోళన నుండి కాపాడమని హృదయపూర్వకంగా వేడుకున్నాడు. అతని భక్తికి దేవత సంతోషించి ఆనాటి రాత్రి అతనికి కలలో కనిపించి 'బాబా దగ్గరికి వెళ్ళు! నీ మనస్సు శాంతి వహిస్తుంది' అని చెప్పింది. ఈ బాబా ఎవరో దేవిని అడిగి తెలుసుకోవడానికి కాకాజీ ఉత్సాహం చూపించాడు. కానీ అంతలోనే మెలకువ వచ్చింది. ఈ బాబా ఎవరై ఉండవచ్చు అని అతను ఆలోచించాడు. కొంతసేపు ఆలోచించిన తరువాత ఈ బాబా త్ర్యంబకేశ్వరుడు (శివుడు) కావచ్చు అని అతడు పుణ్యస్థలం అయిన త్ర్యంబకం (నాసిక్ జిల్లా) వెళ్ళాడు. అక్కడ పదిరోజులు ఉన్నాడు. అక్కడ ఉన్నంత కాలం వేకువ ఝామున స్నానం చేసి, రుద్రాన్ని జపిస్తూ, అభిషేకం చేస్తూ తదితర పూజలను చేశాడు. అయినప్పటికీ మునపటిలాగానే అశాంత మనస్కుడుగా ఉన్నాడు. తరువాత స్వగ్రామానికి తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకున్నాడు. ఆ రాత్రి ఆమె కలలో కనిపించి ఇలా చెప్పింది 'అనవసరంగా త్ర్యంబకేశ్వరం ఎందుకు వెళ్లావు? బాబా అంటే షిరిడీ సాయిబాబా అని నా అభిప్రాయం.
’’షిరిడీకి ఎలా వెళ్ళాలి? ఎప్పుడు వెళ్ళాలి? బాబాను చూడటం ఎలా?’అని కాకాజీ మనోవ్యాకులత చెందుతూ ఉన్నాడు. ఎవరయినా యోగీశ్వరుడిని చూడాలి అనుకున్నప్పుడు, ఆ యోగే కాకుండా దైవం కూడా అతని కోరికను నెరవేర్చడానికి సహాయపడుతుంది. యథార్థంగా యోగి, భగవంతుడు ఒకరే. వారిలో ఎలాంటి భేదం లేదు. ఎవరైనా తానై వెళ్ళి యోగిని దర్శించుకోవడం అన్నది ఉత్త బూటకం. యోగి సంకల్పం లేనిదే వారిని చూడగలిగేవారు ఎవరు? అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనం కోసం భక్తుడు ఎంత వేదన పడతాడో, ఎంత భక్తివిశ్వాసాలు చూపిస్తాడో, ఎంత త్వరగాను, బలంగానూ అతని కోరిక నెరవేరుతుంది. దర్శనం కోసం ఆహ్వానించేవాడే వచ్చేవాడికి స్వాగత సన్నాహాలు అమర్చుతాడు. కాకాజీ విషయంలో అలాగే జరిగింది.
శ్యామా మ్రొక్కు :
కాకాజీ షిరిడీకి వెళ్ళడానికి ఆలోచిస్తుండగా, ఒక అతిథి అతనిని షిరిడీకి తీసుకుని వెళ్ళడానికి అతని ఇంటికి వచ్చాడు. అతడు ఇంకెవరో కాదు, బాబాకి ముఖ్యభక్తుడు శ్యామాయే. శ్యామా ఆ సమయంలో వణికి ఎలా వచ్చాడో చూద్దాం, శ్యామా బాల్యంలో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవత అయిన వణిలోని సప్తశృంగికి, ‘జబ్బు నయం కాగానే నీ దర్శనం కోసం వచ్చి బిడ్డను నీ పాదాలపై పెడతాన'ని మ్రోక్కుకుంది. కొన్ని సంవత్సరాల తరువాత ఆ తల్లి కుచద్వయంపై తామర లేచి ఆమె ఎంతగానో బాధపడింది. తనకు నయం అయితే రెండు వెండి కుచాలు సమర్పిస్తాను అని అప్పుడు ఇంకొక మ్రొక్కు మ్రొక్కింది. కానీ ఈ రెండు మ్రొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోయేటప్పుడు ఈ సంగతి శ్యామాకి చెప్పి రెండు మ్రొక్కులు చెల్లించే భారాన్ని అతనిపై వేసి ఆమె మరణించింది. శ్యామా కొన్నాళ్ళకు ఆ మ్రోక్కులను పూర్తిగా మరచిపోయాడు. ఇలా 30 సంవత్సరాలు గడిచాయి. అప్పట్లో షిరిడీకి ఒక పేరుపొందిన జ్యోతిష్కుడు వచ్చి నెలరోజులు అక్కడ మకాం వేశాడు. అతను శ్రీమాన్ బూటీ మొదలైన వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరంగా ఉంది. శ్యామా అమ్ముడు బాపాజి జ్యోతిష్య పండితుడిని సంప్రదించగా అతడు తల్లి మ్రొక్కులు చెల్లించక పోవడంతో వారికి ఈ కష్టాలు సప్తశృంగి దేవత కలగజేస్తుందని చెప్పాడు. బాపాజి ఈ సంగతి శ్యామాకి తెలియజేశాడు. అప్పుడు శ్యామాకి అంతా జ్ఞాపకానికి వచ్చింది. ఇంకా ఆలస్యం చేసినట్లు అయితే హానికరం అని తలంచి శ్యామా ఒక కంసాలిని పిలిచి, రెండువెండి కుచాలు చేయించాడు. మసీదుకి వెళ్ళి బాబా పాదాలపై పడి రెండు కుచాలను అక్కడ పెట్టి తన మ్రోక్కులను చెల్లించు అని, బాబాయే తన సప్తశృంగి దేవత అవడంతో వాటిని ఆమోదించమని వేడుకున్నాడు. ‘నీవు స్వయంగా వెళ్ళి సప్తశృంగి దేవతకి మ్రొక్కును చెల్లించు' అని బాబా స్పష్టంగా చెప్పారు. బాబా ఊదీని, ఆశీర్వాదాన్ని పొంది, శ్యామా వణి పట్టణానికి బయలుదేరాడు. పూజారి ఇళ్ళు వెతుక్కుంటూ చివరికి కాకాజీ ఇళ్ళు చేరుకున్నాడు. అప్పుడు కాకాజీ షిరిడీకి వెళ్లాలని కుతూహలంతో ఉన్నాడు. అలాంటి సమయంలో శ్యామా వారి ఇంటికి వెళ్ళాడు. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికో చూడండి!
‘మీరెవరు ఎక్కడినుండి వచ్చారు' అని కాకాజీ అడిగారు. ‘మాది షిరిడీ, నేను సప్తశృంగికి మ్రొక్కు చెల్లించుకోవడానికి ఇక్కడికి వచ్చాను' అని శ్యామా అన్నారు. షిరిడీ నుండి వచ్చారు అని తెలియగానే శ్యామాను కాకాజీ కౌగలించుకుని, ప్రేమతో మైమరచిపోయారు. వారు సాయిలీలల గురించి ముచ్చటించుకున్నారు. శ్యామా మ్రొక్కులు అన్నీ చెల్లించిన తరువాత వారిద్దరూ షిరిడీకి బయలుదేరారు. షిరిడీ చేరగానే కాకాజీ మసీదుకు వెళ్ళి బాబాను చూసి, వారి పాదాలపై పడ్డారు. అతని కళ్ళు కన్నీటితో నిండుకున్నాయి. ఆతని మనస్సు శాంతించింది. సప్తశృంగి దేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనస్సులోని చంచలత్వం అంతా తగ్గిపోయి విశ్రాంతి వహించింది. కాకాజీ తన మనస్సులో ఇలా అనుకున్నారు 'ఏమి ఈ అద్భుతశక్తి! బాబా ఏమీ పలకలేదు. ఉత్తరప్రత్యుత్తరాలు కూడా జరగలేదు. ఆశీర్వచనాలు అయినా పలకలేదు. కేవలం వారి దర్శనమే సంతోషానికి కారణం అయ్యింది. వారి దర్శన మాత్రం చేతనే నా మనస్సు చంచలమై పోయింది. అంతరంగంలో ఆనందం ఉద్భవించింది. ఇదే దర్శనభాగ్యం' అతడు తన దృష్టి సాయినాథుడి పాదాలపై నిలిపారు. అతని నోట మాట బయటకు రాలేకపోయింది. బాబా లీలలు విని అతని సంతోషానికి అంతులేకపోయింది. బాబాను సర్వస్యశరణాగతి వేడుకున్నారు. తన వేదనను, బాధలను మరచిపోయాడు. స్వచ్చమైన ఆనందాన్ని పొందారు. అక్కడ 12 రోజులు సుఖంగా ఉండి చివరికి బాబా దగ్గర శెలవు తీసుకుని వారి ఊదీ ప్రసాదాన్ని, ఆశీర్వాదాన్ని పొంది ఇళ్ళు చేరుకున్నారు.
రహతా కుశాల్ చంద్ :
తెల్లవారు ఝామున వచ్చిన కల నిజం అవుతుంది అని అంటారు. ఇది సత్యమే కావచ్చు. కాని బాబా స్వప్నాలకు కాల నియమం లేదు. ఒక ఉదాహరణ 'ఒకరోజు సాయంకాలం బాబా కాకాసాహెబు దీక్షితును రహతాకు వెళ్ళి చాలా రోజులనుండి చూడకపోవడంతో, కుశాల్ చంద్ ని తీసుకుని రమ్మని చెప్పారు. ఒక టాంగాని తీసుకుని కాకా రహతా వెళ్ళారు. కుశాల్ చంద్ ని కలుసుకుని బాబా చెప్పిన వార్తను అందజేశారు. దీన్ని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడ్డారు. మధ్యాహ్న భోజనం తరువాత నిద్రపోతుండగా తనకు కలలో బాబా కనబడి వెంటనే షిరిడీకి రమ్మని చెప్పినందుకు అతడు షిరిడీ వెళ్ళడానికి ఆతృతతో ఉన్నానని చెప్పారు. తన గుఱ్ఱం అక్కడ లేకపోవడంతో తన కుమారుడిని బాబాకు ఈ సంగతి తెలపడానికి పంపించారు. కుమారుడు ఊరు బయటకు వెళ్ళేసరికి దీక్షిత్ టాంగాని తీసుకుని వచ్చారు. కుశాల్ చంద్ ని తీసుకుని రావలసిందిగా బాబా దీక్షిత్ కి చెప్పడంతో ఇద్దరూ టాంగాలో కూర్చుని షిరిడీ చేరుకున్నారు. కుశాల్ చంద్ బాబాను దర్శించుకున్నారు. అందరూ సంతోషించారు. బాబా ప్రదర్శించిన ఈ లీలను చూసి కుశాల్ చంద్ మనస్సు కరిగింది.
పంజాబీ రామలాల్ (బొంబాయి) :
ఒకరోజు బొంబాయిలో ఉన్న పంజాబీ బ్రాహ్మణుడు రామలాల్ అనేవాడికి స్వప్నంలో బాబా కనబడి షిరిడీకి రమ్మన్నారు. బాబా అతనికి మహంతులా కనబడ్డారు. కానీ అతనికి వారు ఎక్కడ ఉన్నారో తెలియలేదు. వెళ్ళి వారిని చూడాలని మనస్సులో నిశ్చయించుకున్నారు. కాని చిరునామా తెలియకపోవడంతో చేయడానికి ఏమీ తోచలేదు. ఎవరినైనా మనం పిలిస్తే వచ్చేవారి కోసం కావలసినవి అన్నీ మనం సమకూరుస్తాము. ఈ విషయంలో కూడా అలాగే జరిగింది. అతడు ఆ రోజు సాయంకాలం వీథిలో వెళుతుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోని చూశాడు. కలలో చూసిన మహంతు ముఖ లక్షణాలే ఈ పటంలో ఉన్న వారితో సరిపోయింది. కనుక్కుంటే ఆ పటం సాయిబాబాది అని తెలిసింది. అతడు వెంటనే షిరిడీకి వెళ్ళి అక్కడే తన అంత్యకాలం వరకూ ఉన్నారు. ఈ విధంగా బాబా తన భక్తులకు దర్శనం ఇవ్వడానికి షిరిడీకి తీసుకుని వచ్చేవారు. వారి యిహపరాల కోరికలను నెరవేరుస్తూ ఉండేవారు.
ముప్పైవ అధ్యాయం సంపూర్ణం
నాలుగవ రోజు పారాయణ సమాప్తం
Note: HTML is not translated!