Saibaba Satcharitra 20 Adhyayam

శ్రీసాయిసచ్చరిత్ర

ఇరవయవ అధ్యాయం

కాకా యొక్క పనిపిల్ల : విశిష్టమైన బోధనా విధానం

ఈ అధ్యాయంలో దాసగుణుకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబు ఇంట్లో పనిపిల్ల ఎలా పరిష్కరించిందో హేమాడ్ పంత్ చెప్పారు.

మౌళికంగా సాయి నిరాకారుడు. భక్తుల కోసం ఆ ఆకారాన్ని ధరించారు. ఈ మహాజగన్నాటకంలో మాయ నటి సాయంతో వారు నటుడి పత్ర ధరించారు. సాయిని స్మరించి, ధ్యానించుదాం. షిరిడీకి వెళ్ళిపోయి అక్కడి మధ్యాహ్న హారతి తరువాత జరిగే కార్యక్రమాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. హారతి అయిపోయిన తరువాత సాయి మసీదు బయటకు వచ్చి, గోడ ప్రక్కన నిలబడి ప్రేమతోను, దయతోను భక్తులకు ఊదీ ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉండేవారు. భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షంలో నిలబడి వారి పాదాలకు నమస్కరించి, వారి వైపు చూస్తూ ఊదీ ప్రసాదపు జల్లులను అనుభవిస్తూ ఉండేవారు. బాబా భక్తుల చేతులలో పిడికిళ్ళకొద్దీ ఊదీ పోస్తూ, వారి నుదిటిపై తమ చేతులతో ఊదీ బొట్టు పెడుతూ ఉండేవారు. వారి హృదయంలో భక్తుల పట్ల అమితమైన ప్రేమ. బాబా భక్తులను ఈ క్రింది విధంగా పలకరిస్తూ ఉండేవారు. ‘అన్నా, మధ్యాహ్న భోజనానికి వెళ్ళు, బాబా నీ బసకి వెళ్ళు, బాపూ! భోజనం చెయ్యి' ఈ విధంగా ప్రతిభక్తుడిని పలుకరించి యింటికి సాగనంపుతూ ఉండేవారు. ఇప్పటికి అది అంతా ఊహించుకుంటే ఆ దృశ్యాలను తిరిగి చూసినంత ఆనందం కలుగుతుంది. మనోఫలకంపై సాయిని నిలిపి, వారిని ఆపాదమస్తకం ధ్యానిద్దాం. వారి పాదాలపై పడి సగౌరవంగా ప్రేమతో వినయంగా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ అధ్యయంలోని కథను చెపుతాను.

          ఈశావాస్యోపనిషత్తు

ఒకప్పుడు దాసగుణు ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య రాయడం మొదలుపెట్టారు. ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తంగా చెపుతాను.

వేదసంహితలోని మంత్రాలూ ఉండడం చేత దీన్ని మంత్రోపనిషత్తు అని కూడా అంటారు. ఇందులో యజుర్వేదంలోని 40వ అధ్యయనం అయిన వాజసనేయ సంహిత ఉండటంతో దీనిని వాజసనేయ సంహితోపనిషత్తు అని కూడా పేరు. వైదిక సంహితలు ఉండడంతో దీనిని తర ఉపనిషత్తులకన్నా శ్రేష్ఠమైనది అని భావిస్తుంటారు. దీనికి ఒక ఉదాహరణ. ఉపనిషత్తులు అన్నింటిలో పెద్దదైన బృహదారణ్య కోపనిషత్తు ఈ ఈశావాస్యోపనిషత్తు పై వ్యాఖ్య అని పండితుడైన సాత్వలేకర్ గారు భావిస్తున్నారు. ప్రొఫెసర్ రానడేగారు ఇలా అంటున్నారు 'ఈశావాస్యోపనిషత్తు అత్యంత చిన్నది అయినప్పటికీ దాంట్లో అంతర్ దృష్టిని కలిగించే అనేక అంశాలు ఉన్నాయి. 18 శ్లోకాలలో ఆత్మ గురించి విలువైన, అపురూపమైన వర్ణన, అనేక ఆకర్షణలకు, దుఃఖాలను తట్టుకొనే స్థైర్యం గల ఆదర్శయోగీశ్వరుని వర్ణనలు ఇందులో ఉన్నాయి. తరువాతి కాలంలో సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతాల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు చివరికి జ్ఞానానికి కర్మలకు సమన్వయంగా ఉన్న సంగతులు చెప్పబడ్డాయి. జ్ఞానమార్గంలో కర్మయోగాన్ని సమన్వయం చేసి చెప్పడం ఈ ఉపనిషత్తులోని సారాంశం.’ ఇంకొక చోట వారు ఇలా అన్నారు 'ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వం నీతి, నిగూఢతత్త్వం, వేదాంతాల మిశ్రమం' పై వర్ణనను బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీలోకి అనువాదం చేయడం ఎంత కష్టమో ఊహించవచ్చు. దాసగుణు దీన్ని మరాఠీ ఓవీ ఛందంలో వ్రాశారు. దానిలోని సారాంశాన్ని గ్రహించలేక పోవడంతో తాను వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగారు. వారితో చర్చించారు. కానీ వారు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. కాబట్టి దాసగుణు కొంతవరకు వికల మనస్కుడు అయ్యాడు.

సద్గురువే బోధించుటకు యోగ్యత, సమర్థత గలవారు

ఈ ఉపనిషత్తు వేదాల యొక్క సారాంశం. ఇది ఆత్మసాక్షాత్కారానికి సంబంధించిన శాస్త్రం. ఇది జననమరణాలు అనే బంధాలను తెగ్గొట్టే ఆయుధం లేదా కత్తి. ఇది మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఎవరయితే ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నారో అలాంటివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతను భావించాడు. ఎవరూ దీనికి తగిన సమాధానం ఇవ్వనప్పుడు దాసగుణు సాయిబాబా సలహా పొందాలని నిశ్చయించుకున్నారు. అవకాశం దొరకగానే షిరిడీకి వెళ్ళి సాయిబాబాను దర్శించి, వారి పాదాలకు నమస్కరించి ఈశావోస్యపనిషత్తును అర్థం చేసుకోవడంలో తన కష్టాలు చెప్పి, సరైన అర్థాన్ని బోధించమని వేడుకున్నారు. సాయిబాబా ఆశీర్వదించి ఇలా అన్నారు 'తొందర పడవద్దు. ఈ విషయంలో ఎలాంటి కష్టం లేదు. తిరుగు ప్రయాణంలో విలేపార్లెలోని కాకాసాహెబు దీక్షితుని పనిపిల్ల నీ సందేహం తీరుస్తుంది' అప్పుడు అక్కడ వున్నవారు ఈ మాటలు విని, బాబా తమాషా చేస్తున్నారని అనుకున్నారు. భాషా జ్ఞానం లేని పనిపిల్ల ఈ విషయాన్ని ఎలా చెప్పగలదు అని అన్నారు. కాని దాసగుణు అలా అనుకోలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులు అనుకున్నారు.

కాకా యొక్క పనిపిల్ల

బాబా మాటలలో పూర్తి విశ్వాసం ఉంచి, దాసగుణు షిరిడీ విడిచి విలేపార్లె చేరి, కాకాసాహెబు దీక్షితు ఇంట్లో బసచేశారు. ఆ మరునాడు ఉదయాన దాసగుణు నిద్రనుంచి లేవగానే, ఒక బీదపిల్ల చక్కని పాటను అత్యంత మనోహరంగా పాడుతూ ఉంది. ఆ పాటలోని విషయం ఎర్రచీర వర్ణన, అది చాలా బాగున్నదని, దాని కుట్టుపని చక్కగా ఉన్నదని, దాని అంచుల చివరలు చాలా సుందరంగా ఉన్నాయని ఆమె పాడుతూ ఉంది. ఆ పాట నచ్చడంతో దాసగుణు బయటకు వచ్చి విన్నారు. అది కాకా పనిమనిషి నామ్యా చెల్లెలు పాడుతూ ఉంది. ఆమె చిన్న పిల్ల. ఆమె చింకి గుడ్డ కట్టుకుని పాత్రలు తోముతూ ఉంది. ఆమె పేదరికం, ఆమె సంతోష భావాన్ని చూసి, దాసగుణు ఆమెపై జాలిపడ్డాడు. ఆ మరుసటి రోజు రావుబహద్దూర్ యమ్. వి. ప్రాధాన్ తనకు ధోవతుల చాపు ఇవ్వగా, ఆ పేదపిల్లకు చిన్న చీరని ఇవ్వమని చెప్పారు. రావుబహద్దూర్ దగ్గర ఒక మంచి చిన్న చీరని కొని ఆమెకు బహుకరించారు. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందుభోజనం దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలు అయింది. ఆ మరుసటి రోజు ఆమె ఆ కొత్త చీరను ధరించింది. అమితోత్సాహంతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుతూ నాట్యం చేసింది. అందరికంటే తానే బాగా ఆడిపాడింది. మరుసటి రోజు చీరను పెట్టెలో దాచుకుని మామూలు చింకి బట్ట కట్టుకొని పనిచేయడానికి వచ్చింది. కాని ఆమె ఆనందానికి లోటు లేకపోయింది. ఇదంతా చూసి దాసగుణుకి జాలి భావం మెచ్చుకోలుగా మారింది. పిల్ల నిరుపేద కాబట్టి చింకి బట్టలు కట్టుకుంది. ఇప్పుడు ఆమెకి కొత్త చీర ఉంది. కాని దాన్ని పెట్టెలో దాచుకుంది. అయినప్పటికీ విచారం అనేది గాని, నిరాశ అనేది గాని లేక ఆడుతూ పాడుతూ ఉంది. కాబట్టి కష్టసుఖాలనే భావాలు మన మనోవైఖరిపై ఆధారపడి ఉంటాయని అతను గ్రహించాడు. ఈ విషయం గురించి దీర్ఘాలోచన చేసాడు, భగవంతుడు ఇచ్చిన దాంతో మనం సంతోషించాలి. భగవంతుడు మనలని అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసింది ఇస్తూ ఉంటాడు. కాబట్టి భగవంతుడు ప్రసాదించినది అంతా మన మేలుకోసమే అని గ్రహించాడు. ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికం, ఆమె చినిగిన చీర, కొత్తచీర, దాన్ని ఇచ్చిన దాత, దాన్ని పుచ్చుకున్న గ్రహీత, దానభావం ఇవి అన్నీ భగవంతుని అంశలే. భగవంతుడు ఈ అన్నిటిలోనూ వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ దాసగుణు ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతృప్తి చెందడం, ఏది మనకు సంభవిస్తూ వుందో అది అంతా భగవంతుని ఆజ్ఞచే జరుగుతున్నదని, చివరికి అది మన మేలు కోసమే అని గ్రహించాడు.

విశిష్టమైన బోధనా విధానము

పై కథను బట్టి బాబా మార్గం  అత్యంత విశిష్టమైనది అని, అపూర్వమైనది అని పాఠకులు గ్రహించే ఉంటారు. బాబా శిరిడీని వదలనప్పటికీ, కొందరిని మచ్చీంద్రగడ్ కి, కొందరికి కొల్హాపూర్ కి గాని, షోలాపూర్ కి గాని సాధన నిమిత్తం పంపుతూ ఉండేవారు. కొందరికి సాధారణ రూపంలోనో, కొందరికి స్వప్నావస్థలోనూ, అది రాత్రిగాని, పగలుగాని కనిపించి కోరికలు నెరవేరుస్తూ ఉండేవారు. భక్తులు బాబా బోధించే మార్గాలు వర్ణించలేనటువంటివి. ఈ ప్రస్తుత విషయంలో దాసగుణును విలేపార్లె పంపి, పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించారు. కాని విలేపార్లె పంపించకుండా షిరిడీలోనే బాబా బోధించ కూడదా అని కొందరు అనవచ్చు. కానీ బాబా అవలంభించిందే సరైన మార్గం. కాకపొతే పేద పనిపిల్ల, ఆమె చీర కూడా భగవంతుడి సంకల్ప రూపాలే అని దాసగుణు ఎలా నేర్చుకుని ఉండేవాడు?

ఈశావాస్యోపనిషత్తులోని నీతి :

ఈశావాస్యోపనిషత్తులో ఉన్న ముఖ్యవిషయం అది బోధించే నీతిమార్గమే. ఈ ఉపనిషత్తులో ఉన్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయాలపై ఆధారపడి ఉంది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యాలే భగవంతుడు సర్వాంతర్యామి అని చెబుతున్నాయి. దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏమిటంటే మానవుడు భగవంతుడు ఇచ్చిన దానితో సంతృప్తి చెందాలని. ఎలాగంటే భగవంతుడు అన్నింటిలోనూ ఉన్నాడు. కాబట్టి భగవంతుడు ఏది యిస్తాడో అది అంతా తన మేలు కోసమే అని గ్రహించాలి. దీన్ని బట్టి యితరుల సొత్తు కోసం ఆశించరాదు అనీ, ఉన్నదాంతో సంతృప్తి చెందాలనీ, భగవంతుడు మన మేలుకోసమే దాన్ని ఇచ్చాడు కాబట్టి అది మనకు మేలు కలగ చేసేదని గ్రహించాలి. దీనిలోని ఇంకొక నీతి ఏమిటంటే మనుష్యుడు ఎల్లప్పుడూ ఎదో తనకు విధింపబడిన కర్మను చేస్తూనే ఉండాలి. శాస్త్రాలలో చెప్పిన కర్మలు నెరవేర్చాలి. భగవంతుడి ఆజ్ఞానుసారం నెరవేర్చడం  మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారం కర్మ చేయకుండా ఉండటం ఆత్మనాశనానికి కారణం. మానవుడు శాస్త్రాలలో విధింపబడిన కర్మలు నెరవేర్చటంతో నైష్కర్మ్యాదర్శం పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్నలో చూస్తాడో, ఆత్మ అన్నింటిలో ఉన్నట్లు చూస్తాడో, వేయేల సమస్త జీవరాశినీ, సకల వస్తువులు ఆత్మగా భావిస్తాడో, అలాంటివాడు ఎందుకు మొహాన్ని పొందుతాడు? వాడెందు కోసం విచారిస్తాడు. అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవడంతో మనకి మోహం, అసహ్యం, విచారం కలుగుతున్నాయి. ఎవరైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావిస్తాడో, ఎవరికయితే సమస్తం ఆత్మ అవుతుందో, అతడు మానవులు పడే సామాన్య బాధలకు, దుఃఖ, వికారాలకు లోను కాడు.

ఇరవయవ అధ్యాయం సంపూర్ణం

ఇరవై ఒకటవ అధ్యాయం

 

0 Comments To "Saibaba Satcharitra 20 Adhyayam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!