Saibaba Saccharitra 51 Adhyaayam

శ్రీసాయిసచ్చరిత్ర

యాభై ఒకటవ అధ్యాయం

శ్రీసాయిసచ్చరిత్రలోని 52,53 అధ్యాయాలను ఇందులో 51వ అధ్యాయంగా పరిగణించాలి. ఇదే చివరి అధ్యాయం. ఇందులో హేమాడ్ పంత్ ఉపసంహార వాక్యాలు రాశారు. పీఠికతో విషయసూచిక ఇచ్చినట్లు వాగ్దానం చేసారు కాని అది హేమాడ్ పంత్ కాగితములలో దొరకలేదు. కాబట్టి దాన్ని బాబా యొక్క గొప్ప భక్తుడైన బి.వి.దేవుఉ (ఠాణావాసి, ఉద్యోగాన్ని విరమించిన మామలతదారు) కూర్చున్నారు. ప్రతి అధ్యాయం ప్రారంభంలో దానిలోని అంశాలను ఇవ్వడమే విషయ సూచిక అనవసరం. కాబట్టి దీనినే తుది పలుకుగా భావించుదాం. ఈ అధ్యాయాన్ని సవరించడానికి, ప్రచురించడానికి పంపేసరికి దేవుగారికి ఇది పూర్తిగా రాసి ఉన్నట్లు కనబడలేదు. అక్కడక్కడ చేతివ్రాతను పోల్చుకోవడం కూడా కష్టంగా ఉండేది. కాని అదంతా ఉన్నదున్నట్లుగా ప్రచురించవలసి వచ్చింది. అందులో చెప్పిన ముఖ్య విషయాలు ఈ క్రింద క్లుప్తంగా చెప్పబడ్డాయి.

సద్గురు సాయి యొక్క గొప్పదనము :

శ్రీసాయి సముపార్జనకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశ్రయాన్ని పొందుదాము వారు జీవజంతువులలోను, జీవంలేని వస్తువులలోనూ వ్యాపించి ఉన్నారు. వారు స్తంభం మొదలు పరబ్రహ్మస్వరూపం వరకు కొండలు, ఇళ్ళు, మేడలు, ఆకాశము మొదలైన వాటి అన్నింటిలోను వ్యాపించి ఉన్నారు. జీవరాశులలోని అన్నింటిలోను కూడా వ్యాపించి ఉన్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానవమానాలు లేవు. వారికి ఇష్టమైనవి, అయిష్టమైనవి లేవు. వారినే జ్ఞాపకంలో ఉంచుకుని వారి శరణు పొందినట్లయితే వారు మన కోరికలన్నిటిని నెరవేర్చి మనం జీవిత పరమావధిని పొందేలా చేస్తారు.

ఈ సంసారం అనే మహాసముద్రాన్ని దాటడం మహా కష్టం. విషయ సుఖాలు అనే కెరటాలలో దురాలోచనలనే ఒడ్డును తాకుతూ ధైర్యం అనే చెట్లను కూడా విరగగొడుతున్నాయి . అహంకారం అనే గాలి తీవ్రంగా వీచి మహాసముద్రాన్ని అల్లోకల్లోల పరుస్తాయి. కోపం, అసూయలు అనే మొసళ్ళు నిర్భయంగా సంచరిస్తాయి. అక్కడ నేను, నాది అనే సుడిగుండాలను, ఇతర సంశయాలు గిర్రున తిరుగుతూ ఉంటాయి. పరనింద, అసూయ, ఓర్వలేనితనం అనే చేపలు అక్కడ ఆడుతూ ఉంటాయి. ఈ మహాసముద్రం భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటివారు (అంటే నాశనం చేసేవారు). సాయి భక్తులకు దానివల్ల భయం ఏమీ ఉండడు. ఈ మహాసముద్రాన్ని దాటడానికి మన సద్గురువు నావ వంటివారు. వారు మనల్ని సురక్షితంగా దాటిస్తారు.

ప్రార్థన :

మనం ఇప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదాలను పట్టుకొని సర్వజనుల కోసం ఈ క్రింది ప్రార్థన చేద్దాము, మా మనస్సు అటు ఇటూ సంచరించకుండా ఉండుగాక. నీవు తప్ప మరేమీ కోరుకోకుండా ఉండుగాక. ఈ సచ్చరిత్రము ప్రతి గృహంలో ఉండుగాక. దీన్ని ప్రతినిత్యం పారాయణ చేసెదము గాక. ఎవరైతే దీన్ని నిత్యం పారాయణ చేస్తాడో వారి ఆపదలు తొలగిపోవుగాక !

ఫలశృతి :

ఈ గ్రందాన్ని పారాయణ చేసినట్లయితే కలిగే ఫలితాలను గురించి కొంచెం వివరిస్తాం. పవిత్ర గోదావరిలో స్నానం చేసి, షిరిడీలో సమాధిని దర్శించుకుని, సాయిసచ్చరిత్ర పారాయణ చేయడం ప్రారంభించండి. నీవు అలా చేసినట్లయితే నీకు ఉండే అన్ని కష్టాలు తొలగిపోతాయి. శ్రీసాయి కథలను అలవోకగా విన్నా ఆధ్యాత్మిక జీవితంలో శ్రద్ధ కలుగుతుంది. ఇంకా ఈ చరిత్రను ప్రేమతో పారాయణ చేస్తున్నట్లయితే నీ పాపాలు అన్నీ నశిస్తాయి. జననమరణాలనే చక్రం నుండి తప్పించు కోవాలంటే సాయిలీలలను చదవండి. వాటిని ఎల్లప్పుడూ జ్ఞాపకానికి ఉంచుకోండి. వారి పాదాలనే ఆశ్రయించండి. వారినే భక్తితో పూజించండి. సాయిలీలలనే సముద్రంలో మునిగి వాటిని ఇతరులకు చెప్పినట్లయితే అందులో కొత్త సంగతులు గ్రహించగలవు. అవి వినేవారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీసాయి సగుణ స్వరూపాన్నే ధ్యానించినట్లయితే క్రమంగా అది నిష్క్రమించి ఆత్మసాక్షాత్కారానికి దారి చూపిస్తుంది. ఆత్మసాక్షాత్కారం పొందడం చాలా కష్టం. కాని నీవు సాయి సగుణస్వరూపం ద్వారా వెళ్ళినట్లయితే నీ ప్రగతి సులభం అవుతుంది. భక్తుడు వారిని సర్వస్య శరణాగతి వేడుకున్నట్లయితే అతడు 'తను' అనేదాన్ని పోగొట్టుకుని అది సముద్రంలో కలిసేలా భగవంతునిలో ఐక్యం అవుతుంది. మూడింటిలో అనగా జాగ్రత్, స్వప్న, సుషుప్త్యవస్థలలో ఏదయినా ఒక అవస్థలో వారిలో లీనమయినట్లయితే సంసార బంధంనుండి తప్పుకుంటావు. స్నానం చేసిన తరువాత ఎవరు దీన్ని భక్తిప్రేమలతో, పూర్తి నమ్మకంతో పారాయణ చేసి వారం రోజులలో ముగిస్తారో, వారి ఆపదలన్నీ నశించిపోతాయి. వర్తకుల వ్యాపారం వృద్ధి చెందుతుంది. వారి వారి భక్తి నమ్మకములపై ఫలం ఆధారపడి వుంది. ఈ రెండూ లేనట్లయితే ఎటువంటి అనుభవమూ కలగదు. దీన్ని శ్రద్ధతో పారాయణ చేసినట్లయితే శ్రీసాయి ప్రీతి చెందుతారు. నీ అజ్ఞానం అనే పేదరికాన్ని నిర్మూలించి నీకు జ్ఞానం, ధనం, ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజూ ఒక అధ్యాయాన్ని పారాయణ చేసినట్లయితే అది అపరిమిత ఆనందాన్ని కలగజేస్తుంది. ఎవరు హృదయంలో తమ శ్రేయస్సును కోరుకుంటారో వారు జాగ్రత్తగా పారాయణ చేయాలి. అప్పుడు అతను శ్రీ సాయిని కృతజ్ఞతతో, సంతోషంతో జన్మజన్మాల వరకు మదిలో ఉంచుకుంటాడు. ఈ గ్రంథాన్ని గురుపౌర్ణమి రోజు (అంటే ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజు) గోకులాష్టమి రోజు, శ్రీరామనవమి రోజు, విజయదశమి రోజు (అంటే, బాబా పుణ్య తిథి రోజు) ఇంటి దగ్గర తప్పకుండా పారాయణ చేయాలి. ఈ గ్రంధాన్ని జాగ్రత్తగా పారాయణ చేసినట్లయితే వారి కోరికలు అన్నీ నెరవేరుతాయి. నీ హృదయంలో శ్రీ సాయి చరణానాలనే నమ్మినట్లయితే భవసాగరాన్ని సులభంగా దాటగలవు. దీన్ని పారాయణ చేసినట్లయితే రోగులు ఆరోగ్యవంతులు అవుతారు. పేదవారు ధనవంతులు అవుతారు. కటిక పేదవారు ఐశ్వర్యాన్ని పొందుతారు. వారి మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ పోయి చివరికి దానికి స్థిరత్వాన్ని పొందుతారు.

ఓ ప్రియమైన భక్తులారా! పాఠకులారా! శ్రోతలారా!

మీకు కూడా మేము నమస్కరించి మీకు ఒక మనవి చేస్తున్నాము. ఎవరి లీలలను ప్రతిరోజూ, ప్రతినెల మీరు పారాయణ చేశారో వారిని మరవకండి. ఈ లీలలు ఎంత తీవ్రంగా చదువుతారో, వింటారో అంత తీవ్రంగా మీకు ధైర్యం, ప్రోత్సాహం సాయిబాబా కలగజేసి మీతో సేవ చేయించి మీకు ఉపయోగకరంగా ఉండేలా చేస్తారు. ఈ కార్యంలో రచయితా, చదివేవారు సహకరించాలి. అందరూ సహాయం చేసుకొని సుఖపడాలి.

ఈ గ్రంథాన్ని సర్వశక్తిమయుడైన భవగవంతుని ప్రార్థనతో ముగిస్తాము. కారుణ్యాన్ని చూపమని వారిని వేడుకుందాము. ఈ గ్రంథాన్ని చదివే భక్తులు హృదయపూర్వకంగా సంపూర్ణ భక్తి శ్రీ సాయి నేత్రాలలో నిలిచిపోవును గాక!సాయి సగుణ స్వరూపం వారి నేత్రాలలో నిలిచిపోవుగాక! వారు శ్రీసాయిని సర్వజీవులలో చూచెదరు గాక ! తథాస్తు!

శ్రీ సాయిసచ్చరిత్రము సర్వం సంపూర్ణం

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

0 Comments To "Saibaba Saccharitra 51 Adhyaayam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!