saibaba-satcharitra-46-chapter

శ్రీసాయిసచ్చరిత్రము

నలభై ఆరవ అధ్యాయము

సాయి పాదాలను నమ్మిన అది పావనం అవుతుంది. ఆయన దర్శనభాగ్యం చేత పాపాలు తొలిగిపోతాయి. కంటికి కనపడని తీగతో భక్తులను కట్టి వుంచి, వారిని అన్ని వేళలా కాపుకాసే దయగల తండ్రి. బాధలతో, భయాలతో వచ్చేవారిని తల్లిలా కాపాడె శరణాగతివి. బాబా పాదాలకు మనస్సుని అర్పించి ఆయన నామాన్నే జపించిన, భక్తుల కోరికలు నెరవేరుతాయి. కోరికలు లేనివారికి ఆయన బ్రహ్మానందాన్ని ఇస్తాడు. ఈ సాధనలో పాపాలు, రజ, తమో గుణాలు నశిస్తాయి. సాత్వికత, ధార్మికత అలవడుతుంది. జ్ఞానం లభిస్తుంది, కర్మబంధాలనుండి తప్పించే దివ్యమార్గం నీ దర్శనం. నీయందు నమ్మకం ఉంచిన భక్తులు నేటికీ నీ లీలను చూపించే అజరామరుడవు. ఇప్పుడు నీవు ఎక్కడ ఉన్నావో నీ భక్తులకు తెలియదు, కానీ నీవు వారి కోసం సర్వవ్యాప్తమై ఉన్నావని ఎన్నో సార్లు నీ లీలల ద్వారా తెలియజేశావు. బాబా ఏ భక్తుడినైనా ఆమోదించిన ఆ భక్తుడిని రాత్రింబవళ్ళు కాచుకునే వాడివి. అలా ఆ భక్తుడు ఆయన చెంత లేకపోయినా ఎక్కడికి వెళ్ళినా అక్కడకు భక్తుని కంటే ముందే బాబా చేరుకొని ఊహించని రూపంలో దర్శనం ఇస్తారు. అలాంటి ఉదాహరణలు ఎన్నో కలవు. ఇది అందులో ఒకటి.

గయయాత్ర :

బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ళ తరువాత కాకాసాహెబు తన కుమారుడి ఉపనయనం నాగపూర్ లో చేయాలని నిశ్చయించుకున్నాడు. బాబాని ఆ వేడుకకి రమ్మని ఆహ్వానించాడు. అదే సమయంలో నానాసాహెబు ఛాందోర్కర్ తన పెద్ద కుమారుడి వివాహం గ్వాలియర్ లో చేయాలని నిశ్చయించుకున్నాడు. కాకాసాహెబు, నానాసాహెబు ఛాందోర్కర్ ఇద్దరూ షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యాలకు ఆహ్వానించారు. శ్యామాను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళమని బాబా చెప్పారు. బాబాయే స్వయంగా రావాలని బలవంతపెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకొని వెళ్ళవలసింది అని 'కాశీ ప్రయాగ యాత్రలు ముగిసేసరికి నేను శ్యామా కంటే ముందుగానే గయలో కలుస్తా'నని చెప్పారు. ఈ మాటలు గుర్తుంచుకోవాలి. ఎలా అంటే అవి బాబా సర్వవ్యాపియని నిరూపిస్తుంది.

బాబా దగ్గర శెలవు తీసుకుని, శ్యామా నాగపూరు, గ్వాలియరు వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. అక్కడినుండి కాశీ, ప్రయాగ, గయా వెళ్లాలని అనుకున్నారు. అప్పాకోతేని అతని వెంట వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. వారిద్దరూ ముందుగా నాగపూరులో జరిగే ఉపనయనానికి వెళ్ళారు. కాకాసాహెబు దీక్షిత్ శ్యామాకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తం కానుకగా ఇచ్చారు. అక్కడినుండి గ్వాలియర్ పెళ్ళికి వెళ్ళారు. అక్కడ నానాసాహెబు ఛాందోర్కర్ శ్యామాకు 100 రూపాయలను, అతని బంధువు జఠార్ కు 100 రూపాయలు ఇచ్చారు. అక్కడినుండి శ్యామా కాశీకి వెళ్ళాడు. అక్కడ జఠార్ యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారం జరిగింది. అక్కడినుండి శ్యామా అయోధ్యకు వెళ్ళాడు. అక్కడ జఠార్ మేనేజర్ శ్రీరామమందిరంలో ఆహ్వానించి మర్యాద చేశాడు. వాళ్ళు అయోధ్యలో 21 రోజులు ఉన్నారు. కాశీలో రెండు మాసాలు ఉన్నారు. అక్కడి నుండి గయకు వెళ్ళారు. రైలుబండిలో గయలో ప్లేగు వ్యాధి ఉందని విని కొంచెం చికాకుపడ్డారు. రాత్రి గయా స్టేషన్ లో దిగి ధర్మశాలలో బసచేశారు. ఉదయమే గయా పండా వచ్చి ఇలా అన్నాడు 'యాత్రికులందరు బయలుదేరుతున్నారు. మీరు కూడా త్వరపడండి'. అక్కడ ప్లేగు ఉందా? అని శ్యామా ప్రశ్నించాడు. లేదని పండా జవాబు చెప్పాడు. మీరే స్వయంగా వచ్చి చూసుకోండి అని అన్నాడు. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంట్లో దిగారు. ఆ ఇళ్ళు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామా చాలా సంతృప్తి చెందాడు. అక్కడ ఉన్న బాబా యొక్క అందమైన పెద్ద పటం అతనికి అన్నిటికంటే ఎక్కువ సంతోషాన్ని కలగజేసింది. అది ఇంటికి ముందు భాగంలో మధ్యలో అమర్చబడి ఉంది. దీనిని చూసి శ్యామా మైమరిచాడు. ‘కాశీ, ప్రయాగ యాత్రలు ముగిసేసరికి నేను శ్యామా కంటే ముందుగానే గయకు వెళతాను' అన్న బాబా పలుకులను జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. కళ్ళనీరు కమ్ముకుంది, శరీరం గగ్గుర్పొడిచింది, గొంతుకు ఎండిపోయింది. అతడు వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. ఆ పట్టణంలో ప్లేగు జాడ్యం ఉన్నదని భయపడి ఏడుస్తున్నాడేమో అని పండా అనుకున్నాడు. పండాను బాబా పటం ఎక్కడ నుండి తెచ్చావు అని శ్యామా అడిగాడు. పండా తన ప్రతినిధులు రెండు మూడువందల మంది మన్మాడ్ లోను, పుణతాంబేలోను ఉన్నారనీ, వారు గయకు వెళ్ళే యాత్రికుల మంచిచెడ్డలు చూస్తారనీ, వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనం 12 సంవత్సరాల క్రిందట చేసుకున్నానని చెప్పాడు. షిరిడీలో శ్యామా ఇంట్లో వ్రేలాడుతున్న బాబా పటాన్ని చూసి దానిని ఇవ్వమని కోరాననీ బాబా ఆజ్ఞ పొంది శ్యామా దాన్ని తనకు ఇచ్చాడని చెప్పాడు. శ్యామా పూర్వం జరిగినది అంతా జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. పూర్వం తనకు పటం ఇచ్చిన శ్యామాయే ప్రస్తుతం తన ఇంట్లో అతిథిగా ఉండడం గ్రహించి పండా ఎంతగానో ఆనందించాడు. వారిద్దరూ ప్రేమానురాగాలను అనుభవించి ఎంతో ఆనందం పొందారు. శ్యామాకు పండా చక్కని రాజలాంచనాలతో స్వాగతం పలికాడు. పండ ధనవంతుడు, అతడు ఒక పల్లకీలో కూర్చుని, శ్యామాను ఏనుగుపైన కూర్చోపెట్టి ఊరేగించాడు. అతిథికి అన్ని సౌకర్యాలను అమర్చాడు.

ఈ కథవల్ల నేర్చుకోవాల్సిన నీతి :

బాబా మాటలు అక్షరాలా సత్యాలనీ బాబాకు తన భక్తుల పట్ల ఉన్న ప్రేమ ఎంతగానో వుంది అని తెలుస్తుంది. ఇదే కాకుండా వారికి జంతువుల పట్ల కూడా సమాన ప్రేమే ఉండేది. వారు వాటిలో ఒకరిగా భావించేవారు. ఈ క్రింద కథ దీనిని వెల్లడిస్తుంది.

రెండు మేకల కథ :

ఒకనాడు ఉదయం బాబా లెండి తోట నుండి తిరిగివస్తున్నారు. మార్గమధ్యలో ఒక మేకలమందను చూశారు. అందులో రెండు మేకల మీద బాబా దృష్టిపడింది. బాబా వాటి దగ్గరికి వెళ్ళి తాకి లాలించి వాటిని 32 రూపాయలకు కొన్నారు. బాబా వైఖరి చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. బాబా ఎంతో మోసపోయారని అనుకున్నారు. ఎందుకంటే ఒక్కొక్క మేకను 2 కాని, 3 కాని, 4 కాని రూపాలకు కొనవచ్చు. రెండు మేకలకు 8 రూపాయలకు ఎక్కువ అన్నారు, బాబాని నిందించారు. బాబా కాముగా ఊరుకున్నారు. శ్యామా, తాత్యాకోతే బాబాను సమాధానం అడగ్గా బాబా 'నాకు ఇల్లుగాని, కుటుంబంగాని లేకపోవడంతో నేను ధనం నిలువ చేయకూడదు' అన్నారు. మళ్ళీ బాబా తమ ఖర్చుతోనే 4 శేర్ల శనగపప్పును కోని మేకలకు పెట్టమని చెప్పారు. తరువాత ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చేసి వాటి పూర్వవృత్తాంతం ఈ విధంగా చెప్పారు.

‘ఓ శ్యామా! తాత్యా! మీరు ఈ బేరంలో నేను మోసపోయానని అనుకుంటున్నారు. అలా కాదు. వాటి కథ వినండి. గతజన్మలో వారు మానవులు. వారి అదృష్టంకొద్దీ నా జతగాళ్ళుగా ఉండేవారు. వారు ఒకే తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండేది. రానురాను శత్రువులయ్యారు. పెద్దవాడు సోమరి కానీ చిన్నవాడు చురుకైనవాడు. అతడు చాలా ధనాన్ని సంపాదించాడు. పెద్దవాడు అసూయచెంది చిన్నవాడిని చంపి వాడి ధనాన్ని దొంగిలించాలని అనుకున్నాడు. తమ సోదరత్వాన్ని మరిచిపోయి వారిద్దరూ పోట్లాడుకున్నారు. అన్న తమ్ముడిని చంపాలని ఎన్నో ఉపాయాలు పన్నాడు, కాని అవి నిష్ప్రయోజనం అయ్యాయి. ఇద్దరూ బద్ధశత్రువులు అయ్యారు. అన్న ఒకరోజు తన సోదరుడిని బడితెతో కొట్టాడు, చిన్నవాడు అన్నని గొడ్డలితో నరికాడు. ఇద్దరూ అదే స్థలంలో పడి చనిపోయారు. వారి కర్మఫలంతో మేకలుగా పుట్టారు. నా ప్రక్కనుండి వెళుతుండగా వారిని గుర్తుపట్టాను. వారి పూర్వజన్మవృత్తాంతాన్ని జ్ఞాపకానికి తెచ్చుకున్నాను. వారిపట్ల కనికరించి వారికి తిండి పెట్టి, కొంత విశ్రాంతి కలగజేసి ఓదార్చాలని అనుకున్నాను. అందుకే ఇంత డబ్బును ఖర్చుపెట్టాను. అందుకు మీరు నన్ను తిడుతున్నారా? నా బేరం మీకు ఇష్టం లేకపోవడంతో నేను వాడి యజమాని దగ్గరకు తిరిగి పంపించివేశాను'. మేకలపైన కూడా బాబా ప్రేమ ఎటువంటిదో చూడండి.

నలభై ఆరవ అధ్యాయం సంపూర్ణం

0 Comments To "saibaba-satcharitra-46-chapter"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!