శ్రీసాయిసచ్చరిత్ర
ముప్పైఆరవ అధ్యాయము
ఇద్దరు గోవా పెద్దమనుషులు, షోలాపూరు నివాసియగు ఔరంగాబాద్ కర్ భార్య - వింత కథలు
ఇద్దరు పెద్దమనుషులు
ఒకరోజు గోవానుండి యిద్దరు పెద్దమనుషులు బాబా దర్శనార్థం వచ్చి, బాబా పాదాలకు సాష్టాంగ నమస్కరించారు. ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒకరిని 15 రూపాయలు దక్షిణ ఇవ్వమని అన్నారు. ఇంకొకరు అడగకుండానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలిగేలా నిరాకరించారు. అక్కడ ఉన్న శ్యామా బాబాని ఇలా అడిగారు 'ఇది ఏమిటి? ఇద్దరూ కలిసి వచ్చారు. ఒకరి దక్షిణ ఆమోదించావు, రెండవాడు ఇవ్వగా నిరాకరించావు. ఎందుకీ భేదభావం?’ బాబా ఇలా సమాధానం చెప్పారు 'శ్యామా! ఎందుకో నీకు ఏమీ తెలియదు. నేను ఎవరి దగ్గరా ఏమీ తీసుకొను. మసీదుమాయి బాకీని కోరను, బాకీ ఉన్నవాడు చెల్లించి, ఋణవిమోచనం పొందుతారు. నాకు ఇల్లుగాని, అస్తిగాని, కుటుంబం కాని ఉన్నాయా? నాకేమీ అక్కరలేదు. నేను ఎప్పుడూ స్వతంత్రుడిని. ఋణం, శత్రుత్వం, హత్య చేసిన దోషం చెల్లించే తీరాలి. దాన్ని తప్పించుకునే మార్గం లేదు.’ తరువాత బాబా తన విశిష్ట ధోరణిలో ఇలా అన్నారు 'ప్రప్రథమంగా అతడు పేదవాడు. ఉద్యోగం దొరికినట్లయితే మొదటినెల జీతం ఇస్తానని తన ఇష్టదైవానికి మొక్కుకున్నాడు. అతనికి నెలకు 15 రూపాయల ఉద్యోగం దొరికింది. క్రమంగా జీతం పెరిగి 15 రూపాయల నుండి 30, 60, 100, 200లకు చివరికి 700లకు పెరిగింది. అతడు ఐశ్వర్యాన్ని అనుభవించే కాలంలో తన మ్రొక్కును మరిచిపోయాడు. అతని కర్మఫలమే అతన్ని ఇక్కడికి ఈడ్చుకుని వచ్చింది. ఆ మెత్తాన్నే (15 రూపాయలు) నేను దక్షిణ రూపంగా అడిగాను.’
ఇంకొక కథ
సముద్రతీరంలో తిరుగుతుండగా ఒక పెద్ద భవంతి దగ్గరికి వచ్చి, దాని వసారాపై కూర్చున్నాను. యజమాని నన్ను బాగా ఆదరించి చక్కని భోజనం పెట్టారు. బీరువా పక్కన శుభ్రమైన స్థలం చూపించి అక్కడ పడుకోమని చెప్పారు. నేను అక్కడ నిద్రపోయాను. నేను గాఢమైన నిద్రలో ఉండగా ఆ మనిషి ఒక రాతిపలకను లాగి గోడకి కన్నం చేసి లోపలికి నా జేబులో ఉన్న ద్రవ్యాన్ని అంతా దొంగిలించాడు. నేను లేచి చూసుకోగా 30,000 రూపాయలు పోయాయి. నేను ఎంతో బాధపడ్డాను, ఏడుస్తూ కూర్చున్నాను. ధనం అంతా నోట్ల రూపంలో ఉండింది. ఆ బ్రాహ్మణుడే దాన్ని దొంగిలిచాడని అనుకున్నాను. భోజనం, నీరు రుచించడం లేదు. వసారాపై ఒక పక్షకాలం కూర్చుని నాకు కలిగిన నష్టానికి ఏడుస్తున్నాను. తరువాత ఒక ఫకీరు దారి వెంట వెళుతూ నేను ఏడవడం చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. నేను జరిగిన వృత్తాంతం అంతా చెప్పాను. వారు ఇలా అన్నారు 'నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరకుతుంది. ఒక ఫకీరు దగ్గరకు వెళ్ళు, వారి చిరునామా నేను ఇస్తాను. వారి శరణు వేడుకో, వారు నీ పైకం నీకు తిరిగి తెప్పిస్తారు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారం ఏదో ఒకదాన్ని నీ దవ్యం దొరికేవరకూ విసర్జించు.’ నేను ఫకీరు చెప్పినట్లు నడుచుకున్నాను, నా పైకం నాకు చిక్కింది. నేను వాడాను విడిచి సముద్రపు ఒడ్డుకు వెళ్ళాను. అక్కడ ఒక స్టీమర్ ఉంది. దానిలో జనాలు ఎక్కువగా ఉండటంతో లోపల ప్రవేశించలేకపోయాను. ఒక మంచి నౌకరు నాకు సహాయం చేయడంతో నేను లోపలికి వెళ్ళగలిగాను. అది ఇంకొక ఒడ్డుకు తీసుకుని వెళ్ళింది. అక్కడ రైలుబండి ఎక్కి ఈ మసీదుకు వచ్చాను.
కథ పూర్తవగానే బాబా ఆ అతిథులను భోజనం కోసం తీసుకొని వెళ్ళమనగా శ్యామా అలాగే చేశారు. శ్యామా వారిని ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టారు. భోజన సమయంలో శ్యామా బాబా చెప్పిన కథ చిత్రంగా ఉంది అన్నారు. బాబా ఎప్పుడూ సముద్ర తీరానికి వెళ్ళలేదు. వారి దగ్గర 30,000 రూపాయలు ఎప్పుడూ లేవు, ఎన్నడూ ప్రయాణం చేయలేదు. ద్రవ్యం ఎప్పుడూ పోవడంగాని, రావడంగాని జరగలేదు. కాబట్టి దాని భావం తమకేమైనా తెలిసిందా? అని వారిని అడిగారు. అతిథుల మనస్సులు కరిగాయి, వారు కంటతడిపెట్టుకున్నారు. ఏడుస్తూ 'బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మస్వరూపుడే' అని అన్నారు. ‘బాబా చెప్పిన కథ మాగురించే, వారు చెప్పింది అంతా మా విషయమే. వారికి ఎలా తెలిసిందో అనేదే గొప్ప చిత్రం. భోజనం అయిన తరువాత పూర్తి వివరాలను చెపుతాము' అని అన్నారు.
భోజనం అయిన తరువాత తాంబూలం వేసుకుంటూ అతిథులు వారి కథలను చెప్పడం మొదలుపెట్టారు. అందులో ఒకరు ఇలా చెప్పారు 'లోయలో ఉన్న ఊరు స్వగ్రామం. జీవనోపాధి కోసం నేను ఉద్యోగం సంపాదించి గోవా వెళ్ళాను. నాకు ఉద్యోగం లభించినట్లయితే నా మొదటి నెల జీతం ఇస్తానని దత్తదేవుడికి మ్రోక్కుకున్నను. వారి దయవల్ల నాకు 15 రూపాయల ఉద్యోగం దొరికింది. నాకు క్రమంగా జీతం బాబా చెప్పిన ప్రకారం 700 రూపాయల వరకు పెరిగింది. నా మ్రొక్కును నేను మరిచిపోయాను. దాన్ని బాబా ఈ విధంగా జ్ఞాపకానికి తెచ్చి నా దగ్గర 15రూపాయలు తీసుకున్నాడు. అది దక్షిణ కాదు, అది పాత బాకీ, తీర్చుకోవడం మరిచిన మ్రొక్కును చెల్లించడం.’
నీతి : బాబా ఎప్పుడూ డబ్బు భిక్షమెత్తుకోలేదు సరికదా తమ భక్తులు కూడా భిక్షం ఎత్తుకోవడానికి ఒప్పుకోలేదు. వారు ధనాన్ని ప్రమాదకరమైనదిగానూ, పరాన్ని సాధించడానికి అడ్డుగానూ భావించారు. భక్తులు ధనం చేతులలో చిక్కుకోకుండా కాపాడేవారు. ఈ విషయం భక్త మహాల్సాపతి ఒక నిదర్శనం. ఆయన అత్యంత పేదవాడు, అతనికి భోజనం కూడా ఉండేదికాదు. అయినా అతడు ద్రవ్యాన్ని సంపాదించడానికి బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీ ఇవ్వలేదు. ఒకరోజు ఉదార వర్తకుడు అయిన హంసరాజు అనే బాబా భక్తుడు ఒకతను ఎక్కువ ద్రవ్యాన్ని బాబా సుముఖంలో మహాల్సాపతికి యిచ్చాడు. కాని బాబా దాన్ని తీసుకోవడానికి అనుమతించలేదు.
తరువాత రెండవ అతిథి తన కథ ఇలా ప్రారంభించాడు. నా బ్రాహ్మణ వంటమనిషి నా దగ్గర 35 సంవత్సరాల నుండీ పని చేస్తున్నాడు. దురదృష్టవశాత్తు వాడు చెడుమార్గంలో పడ్డాడు. వాడి మనస్సు మారిపోయింది, వాడు నా డబ్బులు అన్నీ దొంగిలించాడు. రాతిపలకను తొలగించి, ధనం చాచిన భోషాణం ఉన్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వస్వం అంటే 30,000 వేల రూపాయల డబ్బు దొంగిలించి పారిపోయాడు. బాబా సరిగ్గా ఆ మెత్తన్నే ఎలా చెప్పగాలిగారో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడుస్తూ కూర్చున్నాను. నా ప్రయత్నాలు అన్నీ విఫలం అయ్యాయి. ఒక పక్షం వరకు చాలా ఆరాటపడ్డాను. విచారగ్రస్తుడనై దుఃఖంతో అరుగుమీద కూర్చుని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని చూసి కనిపెట్టి కారణాన్ని తెలుసుకున్నారు. నేను వివరాలు అన్నీ తెలియజేశాను. అతడు 'షిరిడీ సాయి అనే ఔలియా ఉన్నారు, వారిని మ్రోక్కుకో, నీకు ప్రియమైన ఆహారాన్ని విడిచిపెట్టు. నీ మనస్సులో వారి దర్శనం అయ్యేవరకు నీకు ప్రియమైన ఆహారాన్ని తినను అని మ్రోక్కుకో' అన్నారు. నేను అలాగే 'బాబా! నా ద్రవ్యం దొరికిన తరువాత, మీ దర్శనం చేసిన తరువాత నేను అన్నం తింటాను' అని మ్రోక్కుకున్నాను. దీని తరువాత 15 రోజులు గడిచాయి. బ్రాహ్మణుడు తనంతట తానే ఆ డబ్బును నాకు ఇచ్చాడు, శరణు వేడుకున్నాడు. వాడు నాతొ ఇలా అన్నాడు 'నేను పిచ్చి ఎక్కి ఇలా చేశాను. నా శిరస్సు నీ పాదములపై పెట్టాను, దయచేసి క్షమించు. ఈ విధంగా కథ సుఖాంతమైంది. నాకు కనిపించి సహాయపడిన ఫకీరు తిరిగి కనబడలేదు. ఫకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూడడానికి ఎంతో గాఢమైన కోరిక కలిగింది. మా యింటికి అంత దూరం వచ్చినవారు షిరిడీ సాయిబాబాయే అని నా నమ్మకం ఎవరయితే నాకు కనబడి నా ద్రవ్యాన్ని తిరిగి తెప్పిస్తారో అలాంటివారు 35 రూపాయలకు పేరాశ చూపెడతారా? దీనికి వ్యతిరేకంగా మా దగ్గరనుంచి ఏమీ ఆశించక, ఎల్లప్పుడూ తమ చేతనయినంత వరకు బాబా మమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తారు. దొంగలించిన నా ధనం దొరికిన వెంటనే సంతోషించి, మైమరచి నా మ్రొక్కును మరచిపోయాను. ఒకరోజు రాత్రి నేను కొలాబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నంలో చూశాను. షిరిడీకి వెళ్ళాలి అనే సంగతి అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. నేను గోవా వెళ్ళాను. అక్కడనుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటునుండి షిరిడీకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. నేను హార్బర్ దగ్గరకి వెళ్ళగా స్టీమరులో చోటు లేదు. కెప్టెన్ ఒప్పుకోలేదు. కానీ, నాకు పరిచయం లేని నౌకరు ఒకడు చెప్పగా ఒప్పుకుని నన్ను స్టీమర్ లో బొంబాయికి తీసుకుని వెళ్ళారు. అక్కడినుండి ఇక్కడకు రైలులో వచ్చాను. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేమెక్కడ? మా యిల్లెక్కడ? మా అదృష్టం ఏమని చెప్పాలి? బాబా మా ద్రవ్యాన్ని తిరిగి రాబట్టారు. ఇక్కడికి లాక్కువచ్చారు. షిరిడీ జనులారా! మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఎందుకంటే బాబా మీతో ఆడి, నవ్వి, మాట్లాడి ఎన్నో సంవత్సరాలు మీతో నివశించారు. మీ పుణ్యం అనంతం, ఎందుకంటే అది బాబాను షిరిడీకి లాగింది. సాయియే మా దత్తుడు. వారే మ్రోక్కుకోమని నన్ను ఆజ్ఞాపించారు. స్టీమర్ లో చోటు ఇప్పించారు. నన్ను ఇక్కడికి తీసుకునివచ్చారు. ఇలా వారి సర్వజ్ఞత్వం సర్వశక్తిత్వాన్ని నిరూపించారు.
ఔరంగాబాదుకర్ భార్య :
షోలాపూర్ నివాసి అయిన సఖారామ్ ఔరంగాబాద్ కర్ భార్యకు 27 సంవత్సరాలైనా సంతానం కలగలేదు. ఆమె అనేక దేవతలకు మ్రొక్కులు మ్రోక్కుకుంది. కాని ప్రయోజనం లేకపోయింది. చివరికి నిరాశ చెందింది. ఈ విషయమై చివర ప్రయత్నం చేయాలని నిశ్చయించుకుని తన సవతి కొడుకు అయిన విశ్వనాథుడితో షిరిడీకి వచ్చింది. అక్కడ బాబా సేవ చేస్తూ రెండు నెలలు గడిపింది. ఆమె ఎప్పుడు మసీదుకు వెళ్ళినా అది భక్తులతో నిండిపోయి ఉండేది. బాబా చుట్టూ భక్తమండలి మూగి ఉండేవారు. బాబాని ఒంటరిగా చూసి, వారి పాదాలపై పడి తన మనస్సును విప్పి చెప్పి, తనకు సంతానం కావాలని కోరుకోవడం కోసం తగిన అవకాశం కోసం ఆమె కనిపెట్టుకుని ఉండేది. చివరికి శ్యామాకి ఈ సంగతి చెప్పి, బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యం కలగచేసుకోమని చెప్పింది. శ్యామా, బాబా దర్బారు ఎప్పుడూ తెరిచే ఉంటుందనీ, అయినా ఆమె గురించి ప్రయత్నిస్తాను అని సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చు అని చెప్పారు. బాబా భోజన సమయంలో మసీదు వాకిలిలో కొబ్బరికాయ, అగరవత్తులతో సిద్ధంగా ఉండమని తను సైగ చేయగానే మసీదుపైకి రావాలని చెప్పారు. ఒకరోజు శ్యామా మధ్యాహ్న భోజనం తరువాత బాబా చేతులు తువ్వాలుతో తుడుస్తూ ఉండగా బాబా శ్యామా బుగ్గను గిల్లారు. శ్యామా కోపంగా 'దేవా! నా బుగ్గను గిల్లటం నీకు తగునా? మా బుగ్గలు గిల్లటం వంటి పెంకి దేవుడు మాకు అక్కర్లేదు. మేము నీపై ఆధారపడి ఉన్నామా? ఇదేనా మన సాన్నిహిత్య ఫలితం?’ అన్నాడు. బాబా ఇలా అన్నారు 'శ్యామా! 72జన్మలనుండి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్ళకు గిల్లితే నీకు కోపం వస్తున్నది'. శ్యామా ఇలా అన్నాడు 'ఎల్లప్పుడూ ముద్దులు, మిఠాయిలు ఇచ్చే దైవం మాకు కావాలని మీనుండి మాకు గౌరవం కాని, స్వర్గం కాని, విమానం కాని అవసరం లేదు. మీ పాదాల పట్ల నమ్మకం మాకెప్పుడూ ఉండుగాక.’ బాబా ఇలా అన్నారు. ‘అవును నేను వచ్చింది అందుకే ఇవాళ నుంచి మీకు భోజనం పెట్టి పోషిస్తున్నాను. నీ యందు నాకు ప్రేమానురాగాలు ఉన్నాయి.’
అలా అంటూ బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చున్నారు. శ్యామా ఆమెకు సైగచేసి రమ్మన్నారు. ఆమె మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి, కొబ్బరికాయ, అగరవత్తులు ఇచ్చింది. బాబా ఆ టెంకాయను ఆడించారు. అది ఎండిపోయింది. కాబట్టి లోపల కుడుక ఆడుతూ శబ్దం వస్తూ ఉంది.
బాబా : శ్యామా! ఇది గుండ్రంగా లోపల తిరుగుతుంది. అది ఏమంటుందో విను!’
శ్యామా : ఆమె తన గర్భంలో ఒక బిడ్డ అలాగే ఆడాలి అని వేడుకుంటుంది. కాబట్టి టెంకాయను నీ ఆశీర్వాదంతో ఇవ్వు.
బాబా : టెంకాయ బిడ్డను ప్రసాదిస్తుందా? అలా అనుకోవడానికి ప్రజలు ఎంత అమాయకులు?
శ్యామా : నీ మాటల మహిమ, ఆశీర్వాద ప్రభావం నాకు తెలుసు. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డలా పరంపరను ప్రసాదిస్తుంది. నీవు మాటలతో కాలయాపన చేస్తూ ఆశీర్వాదం ఇవ్వకుండా ఉన్నావు.
ఆ సంవాదం కొంతసేపు జరిగింది. బాబా పదేపదే టెంకాయను కొట్టమని అంటున్నారు. శ్యామా టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వమని వేడుకుంటున్నాడు. చివరికి బాబా లొంగి 'ఆమెకు సంతానం కలుగుతుంది' అని అన్నారు. ఎప్పుడు అని శ్యామా అడిగారు. 12 మాసాలలో అని బాబా జవాబు ఇచ్చారు. టెంకాయను పగలకొట్టారు. ఒక చిప్పను ఇద్దరూ తిన్నారు. రెండవ చిప్పను ఆమెకి ఇచ్చారు. అప్పుడు శ్యామా ఆ స్త్రీ వైపు తిరిగి 'అమ్మా! నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసాలలో సంతానం కలగకపోతే, ఈ దేవుని తలపై ఒక టెంకాయను కొట్టి ఈ మసీదునుండి తరిమేస్తాను. ఇందుకు తప్పితే నేను మాధవుడిని కాను, మీరు దీన్ని చూచెదరు గాక!’ అన్నారు.
ఆమె ఒక సంవత్సరంలో కొడుకును ప్రసవించింది. 5వ మాసంలో కొడుకును మసీదుకు తీసుకుని వచ్చి భార్యాభర్తలు బాబా పాదాలపై పడ్డారు. కృతజ్ఞుడైన తండ్రి 500 రూపాయలు ఇచ్చారు. బాబా గుఱ్ఱము 'శ్యామాకర్ణ' కి ఈ డబ్బులతో ఒక శాల కట్టించారు.
ముప్పై ఆరవ అధ్యాయం సంపూర్ణం
Note: HTML is not translated!