వార ఫలాలు 28-01-2024 నుండి 03-02-2024 వరకు

వార ఫలాలు 28-01-2024 నుండి 03-02-2024 వరకు

మేషం: వారికి ఈవారం కొంత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వారం ప్రధమార్ధంలో అనుకున్న పనులు, ఆగిన ముఖ్యమైన వ్యవహారాలు వారం ద్వితీయార్ధం పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు యధాతధంగా ఫలితములుంటాయి. కొద్దిపాటి అభివృద్ధి కనవచ్చినప్పటికీ సంతోషము, నమ్మకం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొద్దిపాటి ఒడిదుడుకులు ఉన్నా అనుకూలమైన ఫలితాలుంటాయి. కొంత ఒత్తిడి తగ్గుతుంది. విశ్రాంతి దొరికిన భావన ఏర్పడుతుంది. తలపెట్టిన కార్యాలు సానుకూలంగా, నిదానంగా పూర్తవుతాయి. తద్వారా తొందరపాటు ఎందుకు?  ప్రశాంతంగా ముందుకు సాగుదాం  అనే ధోరణి కి మీ అభిప్రాయాలు వస్తాయి. 

వ్యాపారంలో జాగ్రత్త. ప్రారంభించిన పనుల్ని మధ్యలో ఆపవద్దు. ఒక సంఘటన కనువిప్పు కలిగిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి కుటుంబ సభ్యులతో చర్చించుకున్న విషయములు, వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన ప్రణాళికలు రూపు దిద్దుకుంటాయి. కుటుంబంలో కానీ, కార్యాలయాలలో పెద్ద వారితో ప్రశంసలు అందుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. . కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థిని విద్యార్థులకు నూతన విద్యా విషయాలు మొదలు పెట్టుటకు, అలాగే  ఉద్యోగ ప్రయత్నాలకు మంచి సమయం. ఎదో తెలియని మానసిక ఆనందం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. శారీరకంగా కొంత అలసట ఏర్పడినప్పటికీ మానసిక ప్రశాంతత లభిస్తుంది.


వృషభం: వారికి ఈవారం ఏదైనా వ్యవహారాలు, చేయవలసిన పనులు వంటివి ఉంటె త్వరగతిన పూర్తి చేయడం మంచిది. ఏ విధమైన పనులలో కూడా జాప్యం పనికి రాదు. అనుకున్న పనిని అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి. నిర్లక్ష్యం చేసినట్లైతే పనులు వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. వారం మొదట్లో కొంత సానుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఆఫీసులో కానివ్వండి, కుటుంబంలో కానీ ఎక్కడా కూడా మీ అధికులతో మాట పట్టింపులు, మనస్పర్థలు పెట్టుకోవడం మీ భవిష్యత్తుకి అంత మంచిది కాదు. కొంత సహనం, నిర్లక్ష్య ధోరణిని అదుపులో ఉంచుకోవడం మంచిదని చెప్పదగ్గ సూచన. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సకాలంలో పనిచేస్తే ఇబ్బందులు తొలగుతాయి. ప్రణాళికతో పనిచేస్తే మేలు జరుగుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

మనకు ఎదో ఇబ్బంది కలిగింది కదా అని మనకు సన్నిహితంగా ఉన్నవారిని ఇబ్బంది పెట్టడం, వారిపై కోపాన్ని ప్రదర్శించడం అంత మంచిది కాదు. దీని వలన మీమీద బురద చల్లే  వారితో పాటు మీకు అనుకూలంగా ఉండేవారు కూడా ద్వేషించే అవకాశాలు లేకపోలేదు. గమనించండి. కొంత కోపాన్ని నియంత్రించుకుని, మాట అదుపులో ఉంచుకుని మీ పనులను మీరు చేసుకున్నచో అనుకున్న లాభాలు వస్తాయి. మాటని పొదుపుగా వాడాలి. కుటుంబంలో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి నిరాశ ఎదురవ్వవచ్చు. మానసిక ధైర్యంతో ముందుకు సాగండి. దుర్గామాతని జవాదు కుంకుమతో అర్చన చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. వ్యాపారస్థులకు కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్ధిక పరంగా కొంత చికాకులు ఉండవచ్చు. ఒక ప్లానింగ్ తో ముందుకు సాగండి. నూతన వివాహ ప్రయత్నాలు చేయు వారికి కొంత అనుకూలమైన సమయం, అయితే మీ నిర్లక్ష్య ధోరణి వలన కొంత ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించండి.


మిథునం: వారికి ఈవారం అన్ని విధాల జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు పైఅధికారులతో మాట పట్టింపులు, పని ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి.  కార్యాలయాలలో కానీ, మీరు పని చేసే చోట కానీ మీ మీద నిఘా ఉండే అవకాశాలు ఉంటాయి. కావున బాధ్యతతో, చేసే పని యందు జాగ్రత్త వహించండి. ముఖ్యమైన పనులలో తొందరపాటు పడవద్దు. పరిస్థితులకు తగ్గట్టుగా పనిచేయండి. వ్యాపారస్తులకు కొంత మందకొడిగా సాగుతుందని చెప్పవచ్చు.  అయితే కుటుంబంలో జీవిత భాగస్వామితో కానీ,  ఇతరుల వలన కానీ  మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల విషయాలలో, వ్యవహారాలలో తల దూర్చడం అంత మంచిది కాదు. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. కుటుంబంలోని కొందరి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. 

అయితే మనం  ఇంటా బయటా ఎంత కష్టపడి  పని చేసినప్పటికీ విలువ లేదు అనే ధోరణికి వస్తారు. కొంత కుటుంబ పరంగా కూడా చికాకులు ఉండవచ్చు. తద్వారా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కంగారు పడకండి. మీరు కూడా ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోండి. నిర్లక్ష్యం చేయకండి. వారం ద్వితీయార్ధంలో కొంత సానుకూలత ఏర్పడుతుంది. అయితే ఆర్ధిక పరంగా ఖర్చులు మీరు అనుకున్న దాని కంటే అధికం అవుతాయి. నూతన ప్రణాళికలు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. నిదానమే ప్రధానము అన్నట్టు ఉండండి. కాలం వ్యతిరేకంగా ఉంది. ఆటంకాలు ఎదురవుతాయి. కావునా ఆచితూచి వ్యవహరించాలి. సన్నిహిత, స్నేహ వర్గంతో కూడా జాగ్రత్త వహించండి. ముఖ్యంగా ఆర్ధిక  సంబంధిత సమస్యలు  తలెత్తవచ్చు. కొంత ప్రణాళిక బద్దంగా ఖర్చు చేయడం  మంచిది. ఎవరినీ నమ్మవద్దు. సొంత విషయాలు ఇతరులతో చర్చించవద్దు.


కర్కాటకం: వారు పూర్తిగా మిశ్రమ ఫలితాలను అందుకుంటారనడంలో సందేహం లేదు. లోన్లు, ఋణాలు చేసే విషయంలో కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొంత జాగ్రత్త వహించండి.అలాగే మీరు బకాయిలు చెల్లించవలసిన వారి నుండి ఒత్తిడులు,అలాగే మీకు ఇవ్వాల్సిన వారితో నిరాశ ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనోబలంతో పనులు ప్రారంభించండి. ఆశయం సిద్ధించేవరకు కృషిచేస్తూనే ఉండాలి. ప్రారంభించిన పనులు మధ్యలో ఆపవద్దు.మీరు చేసే స్థిరమైన నిర్ణయాలు, వ్యవహారాలు లాభిస్తాయి.అయితే ఇతరుల మాటలను, చేష్టలను దృష్టిలో ఉంచుకోకుండా మీ కార్యనిర్వహణలో మీరు ముందుకు సాగండి. తప్పకుండా ప్రశాంతత, వృద్ధి లభిస్తుంది. 

ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకోని ఆర్థిక పరమైన నష్టాలు కూడా ఉండచ్చు.జాగ్రత్త వహించండి. ఏదైనా కొత్త పనులు వ్యవహారాలలో, ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోక పోవడం మంచిది. జీవిత భాగస్వామితో కొంత అభిప్రాయభేదాలు ఉండవచ్చు. బంధు వర్గంతో కూడా చిన్నపాటి మనస్పర్థలు ఏర్పడవచ్చు.ఏది ఏమైనప్పటికీ మీ పని మీది అన్నట్టుగా ఉండడం చెప్పదగ్గ సూచన.కుటుంబంలో అధికంగా ఖర్చులు కానవస్తాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అయితే సొంత ఆలోచనలతో మీ భద్రత మీరు చూసుకొంటూ ముందుకు సాగుతారు. ఎవరో ఏవో మాటలు అన్నారని భాధ పడడం, అలాగే కొంత పొగిడారని పొంగిపోయి ఎదో సాయం చేద్దామని అనుకోవడం వంటివి అంత మంచిది కాదు. విద్యార్థిని విద్యార్థులు కొంత శ్రద్ద వహించి, మీ మేధస్సుకి పదును పెట్టి ముందుకు సాగండి. రాబోయే కాలంలో అదే మీకు అక్కరకు వస్తుంది. కొంత ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించండి.


సింహం: వారికి ఉద్యోగ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితములు గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వారికీ కూడా మంచి సమయం అని చెప్పవచ్చు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఆదాయం గతంతో పోలిస్తే మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు ఆర్థికాభివృద్ధి ఉన్నప్పటికీ కొంత పోటీ, శత్రువుల భయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొంత ప్రణాళికా బద్దమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. వారం ప్రధమార్ధం మందకొండిగా సాగినా ద్వితీయార్ధంలో ఊపందుకుంటాయి. రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది.

గతంలో కంటే కొంత ఖర్చులు తగ్గుతాయి.నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి మంచి సమయం అని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నములు చేసే వారికి కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సరైన నిర్ణయాలు తీసుకోండి. ఎక్కువ జాప్యం పనికి రాదు. కుటుంబంలో పెద్దలు, శ్రేయోభిలాషుల సలహాలు సూచనల మేరకు ముందుకు సాగుతారు.తద్వారా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు. విద్యార్థిని విద్యార్థులకు మంచి సమయం అని చెప్పవచ్చు.విదేశాలలో  విద్యకై ప్రయత్నించే వారికి మంచి సమయం అని చెప్పవచ్చు. విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త నిర్ణయములు,కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు,కృషి, పట్టుదలతో ముందుకు సాగితే భవిష్యత్తు బాగుంటుంది. అదే విధంగా ఆరోగ్య పరంగా బాగుంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.


కన్య: వారికి కుటుంబ పరంగా, బంధువుల నుండి మిశ్రమ ఫలితాలు ఎదురవ్వ వచ్చు. విందువినోద కార్యక్రమాలలో, శుభకార్యాలలో కాని మీ సన్నిహితులు, బంధు మిత్రుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వారి వ్యక్తిగత విషయాలలో తలదూర్చడం అంత మంచిది కాదు. మీరు మాట్లాడే మాటల వలన, ప్రవర్తించే తీరు వలన ఒక వర్గం అభినందించి నట్టప్పటికీ, మీ ప్రవర్తనా, వ్యవహార శైలిని ఒకవర్గం నుండి విమర్శలు, మాట పట్టింపులు తెచ్చే అవకాశాలు ఉన్నాయి.కాబట్టి ఆచీతూచీ మాట్లాడడం, అనవసర విషయాలలో జోక్యం చేసుకోక పోవడం మంచిది. మీ ముందు ఒకలాగా, వెనకాల ఒక లాగ చెప్పేవారుంటారు. నీ ముందు నీ మాట, వారి ముందు వారి మాట అంటారు. కాబట్టి మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు జాగ్రత్త వహించండం మంచిది. ఇతరత్రా విషయాల వలన కుటుంబంలో, జీవిత భాగస్వామితో కానీ సంతానంతో కానీ విభేధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. ఉద్యోగ పరంగా  కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుండె అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ సంబంధిత  వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది.

ఈ కన్యారాశి స్త్రీలకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఆప్తులు నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వినోదయాత్రలు, శుభ  కార్యాలలో చురుకుగా పాల్గొనడం వంటివి జరుగుతాయి. బంధువుల కలయిక మానసిక ఉల్లాసం కలిగిస్తుంది. వారితో ఇష్టాగోష్ఠిలలో పాలుపంచుకుంటారు. అయితే మీ మాట తీరును కనుకు అదుపులో ఉంచితే అంతటా కూడా ఆహ్లాదకరంగా, విజయ వంతంగా ముందుకు సాగుతారు. క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. కళా సాంస్కృతిక రంగాల వారికి సన్మాన, సత్కారాలు అందుకుంటారు. రాజకీయ వేత్తలకు ఉహించని సంఘటనలు జరుగుతాయి. దాని వలన సమస్యలు ఎదురవుతాయి. వారు అనుకున్నది జరగదు అనే విధంగా భావన ఏర్పడుతుంది. సంకష్టహర చతుర్ది నాడు వినాయకుడికి అభిషేకం , గరికతో పూజ చేయడం మంచిది. అదేవిధంగా గకారక స్తోత్రం పఠించడం మంచిది. మానసికంగా ఆరోగ్యం బాగునప్పటికీ, చిన్నపాటి కడుపునొప్పి వంటివి ఏమైనా ఇబ్బంది పెట్టవచ్చు.ఆహార విషయాలలో జాగ్రత్త వహించడం మంచిది.


తుల: వారికి ఈ వారం వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ రంగం వారికీ, టెక్నీకల్ రంగం వారికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారంలో శుభఫలితాలు గోచరిస్తున్నాయి. లక్ష్య సాధనలో సమష్టికృషి అవసరం అని గ్రహించండి. ఉద్యోగ పరంగా కొంత లోన్లు, ఋణాల విషయంలో ఆందోళనలు, ఒత్తిడులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పైఅధికారుల వల్ల పనిబారం పెరిగి మానసిక ఒత్తిడి ఆందోళనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మీ వ్యక్తిత్వం, గౌరవం వలన మీ మాట చెలామణి అవుతుంది. మీరు ప్రవర్తించే తీరు మనోధైర్యం మీ మీద పడే ఒత్తిడిని తట్టుకునే విధంగా సహాయ పడుతుంది. సంతాన పరంగా సంతోషకరమైన కార్యక్రమాలు చేస్తారు. ఖర్చుకి వెనుకాడరు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.

స్థిరాస్తి వృద్ధి చేయాలనుకునే వారికి, చాలా కాలం నుండి సొంత గృహం ఏర్పరుచుకోవాలని కలలు కనే వారికి సరి కొత్త నిర్ణయాలు తీసుకునే సమయం అని చెప్పవచ్చు. అయినా కొంత ఆర్ధిక నష్టాలు, ఖర్చులు మాత్రం తప్పవు. మీరు ఆందోళనలు చెందినప్పటికీ అయ్యే ఖర్చులు ఆగవు అనే ధోరణికి వస్తారు. అనుకున్న ఆదాయం సమకూరక కొంత ఇబ్బంది తప్పదు. నిరుద్యోగులకు ఒక విధంగా శుభవార్త అని చెప్పవచ్చు.ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి అనుకున్నంత ఫలితాలు రాకున్నా, ఎదో ఒక అవకాశం వచ్చింది అన్న తృప్తి లభిస్తుంది. విద్యార్థిని విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైన ఫలితాలుంటాయి. స్నేహితులతో వినోద యాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.


వృశ్చికం: వారికి ఈవారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. గతంలో కంటే కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, అయితే కొంత నిదానం, మాటలో సున్నితత్వం ఉంచి మాట్లాడితే అన్నివిధాలా అనుకూల ఫలితాలు ఉంటాయి. మీ యొక్క ఖచ్చితత్వమైన ధోరణిని కొంత తగ్గించుకుంటే వివాదాలు రావు.మీ సహనానికి పరీక్షా సమయంలా ఉంటాయి పరిస్థితులు. కాబట్టి తప్పు అవతల వైపు ఉన్నప్పటికీ మీరు నిదానంగా ఉండడం మంచిదని చెప్పదగ్గ సూచన.ముక్కుసూటి తనం అన్ని వేళలా, అన్నింటా అనువు కాదని గ్రహించి మసులుకోంది. ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి ఉంటుంది. గతంలో వచ్చిన సమస్యలు కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి.ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అనుకోని విధంగా బహుమానాలు పొందే అవకాశాలు ఉన్నాయి. 

వ్యాపారస్తులకు ఆర్థికపరమైన లాభాలు ఉంటాయి. అదనపు రాబడి దక్కి ఉత్సాహంగా గడుపుతారు. ఖర్చులు యధాతధంగా ఉంటాయి. విలాసవంతమైన ఆలోచనలు, అనవసరపు ఖర్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మనస్సును నియంత్రించుకుని ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. శారీరక ఆరోగ్య పరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికి మానసిక ఉల్లాసంతో ముందుకు సాగుతారు. కుటుంబంలో చిన్నపాటి మాట పట్టింపులు ఉన్నప్పటికీ, మీ అభిప్రాయాలు కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. మీ మీద ఉన్న గౌరవాన్ని చాటే విధంగా అన్నట్టు ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితాలు పొందే సమయం అని చెప్పవచ్చు. కాకుంటే శ్రద్దా శక్తులు తగ్గకుండా, ఏకాగ్రతతో చదివితే భవిష్యత్తు బాగుంటుంది. మీ సమర్థత, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. స్నేహితులతో కొంత జాగ్రత్త వహించండి.


ధనస్సు: వారికి ఈ వారం కుటుంబ పరంగా సౌఖ్యం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల కోసం ఖర్చులు అధికంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ సొంత వారితో కొద్దిపాటి చికాకులు, మాటపట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. మాటలో లోపం లేకుండా జాగ్రత్త వహించండి. మిమ్మల్ని మీ ప్రవర్తనను తప్పు పెట్టె వాళ్ళు మిమ్మల్ని నలుగురిలో తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తుంటారు. కాబట్టి కొంత నిదానమును అలవాటు చేసుకోండి. లేకపోతే శత్రువర్గం మరింత వృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు సొంత వారో, ఎవరు పరాయివారో అని కాకుండా ఎవరు మిమ్మల్ని నమ్ముతారు, ఎవరు నమ్మరో చూసుకుని మాట్లాడడం మంచిది. తన మన బేధం చూసుకుంటూ ముందుకు వెళ్ళడం ఉత్తమమం. 

సహోద్యోగులతో, మీ కుటుంబ సభ్యుల దగ్గర మీ యొక్క ఫ్రస్ట్రేషన్ ను బయట పెట్టడం అంత మంచిది కాదు. ఉద్యోగస్తులకు అధికారుల నిరాదరణ ఎదురవ్వవచ్చు. చెప్పుడు మాటలు చెప్పేవారు మీచుట్టూ ఉన్నారని గ్రహించండి. ఇక్కడ మీరు మాట్లాడేది అక్కడ చెప్పేవారుంటారు జాగ్రత్త. వంచనకు, నమ్మక ద్రోహమునకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మీ యొక్క వ్యక్తిత్వం మిమ్మల్ని మంచి అభివృద్ధి లోకి రావడానికి సహాయ పడుతుంది. విద్యార్థిని విద్యార్థులకు పరీక్షల యందు ఒత్తిడి, మానసిక ఆందోళనలు లేకుండా ఉంటె మంచి ఫలితాలు ఏర్పడతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఈ వారం ద్వితీయార్ధంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభ వార్తలు. వాహనయోగంతో పాటు కొన్నిఅనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.


మకరం: వారికి ఈవారం ఉద్యోగ పరంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కొంత సానుకూలత ఉంటుంది. మంచి ఫలితములను పొందగలుగుతారు. అయితే ఏ పని అయినా కొంత మానసిక ఒత్తిడి  తరువాత విజయం లభిస్తుంది. ఉద్యోగ పరంగా కొంత ఇబ్బందులు, పని ఒత్తిడి ఉన్నప్పటికీ. మీ లక్ష్య సాధనలో సమష్టికృషి అవసరం అని తప్పక గ్రహించండి. ఇష్టదైవస్మరణ మేలుచేస్తుంది. కుటుంబ పరమైన శుభకార్యములలో తాత్కాలికమైన సంతోషం లభిస్తుంది. అయితే ఏదైనా ఒక పని అనుకున్నప్పటికీ మీరు ఎంత కష్టపడినా, ప్రయత్నించినప్పటికీ ఫలితాలు ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆందోళన చెందకండి. వ్యాపారస్తులకు కూడా అనేక విధాలుగా ఖర్చులు, వ్యవహార చిక్కులు ఉండే అవకాశాలు ఉన్నాయి.

అయితే అవసరాల మేరకు డబ్బు చేతికి అందడం వలన పనులు పూర్తవుతాయి. కుటుంబం యొక్క అండదండలు ఎప్పుడు ఉంటాయి. అయితే మీమీద లేనిపోని ఆరోపణలు వస్తాయి. మీరు సమాధాన సంజాయిషీలు చెప్పవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. విద్యార్థిని విద్యార్థులకు పట్టుదలతో,బాధ్యతతో మెలగాల్సిన సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులకు మానసిక ఒత్తిడులు పెరుగుతాయి. విద్యా విషయంలో శ్రద్ద తగ్గకుండా జాగ్రత్త వహించండి.ఏకాగ్రత పెంచుకోవడం చాలా అవసరం. నిత్యం శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, మేధా దక్షిణామూర్తి డాలర్ మెడలో ధరించడం మేలు చేకూరే అంశాలు. ఈ వారాంతం అన్ని విధాలుగా కొంత జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు.మీ యొక్క ప్రశాంతత, నిదానం వలన అనుకూలమైన ఫలితాలుంటాయని గ్రహించాలి. మీకు వారం చివరిలో అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీకు దైవబలం తోడుగా ఉంటుందని చెప్పవచ్చు.


కుంభం: వారికి ఈవారం అనుకూలమైన ఫలితాలు పొందే సమయంగా చెప్పవచ్చు. స్థిరాస్తి వృద్ధి చేసుకోవాలనుకునే వారి ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఏదైనా వారసత్వ ఆస్తుల విషయాలు అనుకూలిస్తాయి. కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.అజాగ్రత్త పనికి రాదు.  శుభకార్యాలలో చురుకుగా పాల్గొనడం సంతోషాన్ని కలిగించినప్పటికీ కొంత అలసట, నీరసం వంటివి ఏర్పడతాయి. మీ స్వయంకృతాపరాధము వలన లేని అనారోగ్యాని కొని తెచ్చుకున్న వారు అవుతారు. సంతాన పరంగా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. వారి ప్రతిభాపాటవాలు సంఘంలో ఆదరణ లభిస్తుంది. సంతానం యొక్క పేరు ప్రతిష్టలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీరు అందులో బాగస్వామ్యం అవుతారు. మీకు నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. 

అయితే వ్యవహారాల విషయంలో లేనిపోని ఆతురత, కంగారు, ఆడంబరాలు, హెచ్చులు తగ్గించుకుంటే మంచి ఫలితములతో పాటు ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది. మీరు అనుకున్న పనులు, కార్యక్రమాల విషయంలో తృప్తి అనేది లభిస్తుంది. ఏది ఏమైనా, ఏమి జరిగినా అనుకున్నవి అయ్యాయి అన్న సంతృప్తి, సంతోషం కలుగుతుంది. సంఘంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నామనే భావన ఉంటుంది. ఉద్యోగస్తులకు కొంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆదాయాభివృద్ది ఉంటుంది. ఉద్యోగులకు విధుల్లో అనుకూల వాతావరణం నేలకుంటుంది. విలాసవంతమైన వస్తువుల వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి సమయమని చెప్పవచ్చు. రాజకీయ వేత్తలకు పదవీ యోగం. రాజకీయ కార్యకర్తలు సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు.


మీనం: వారికి ఈ వారం అన్ని విధాల బాగుంటుంది. ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి ఉంటుంది. పైఅధికారులనుండి ప్రశంసలు లభిస్తాయి.గతంలో ఏర్పడిన చిన్నపాటి చిక్కులు తొలగిపోతాయి. ఒక రకంగా ఉద్యోగులకు ఊరట కలిగించే సమాచారం అందుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు  చేసే వారు సఫలీకృతులు అవుతారు. వ్యాపారస్తులకు మంచి లాభములు ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలలో కొంతవరకు చిక్కులు, చికాకులు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొండిగా సాగినా అంతిమంగా పనులు పూర్తి అవుతాయి. ఆర్ధిక పరమైన వ్యవహారాల పట్ల, స్థిరాస్తి వ్యవహారాల పట్ల కొంత నిరాశ, పనుల యందు ఆలస్యము అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. అనుకున్న పనులు కొంత ఆలస్యంగా అవ్వడం, అలాగే అనుకోని పనులు నెరవేరడం పాత, మొండి బకాయిలు వంటివి, ఇంకా రావు అనుకున్నవి బాకీలు తీరడం వంటివి జరగడానికి మంచి సమయం అని చెప్పవచ్చు. 

ఏదైనా అనుకోని లాభాలు, సంఘటనలు తారసపడే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత సాధించే సమయం అని చెప్పవచ్చు.శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. నూతన విద్య విధానాలు ప్రారంభించుటకు, నేర్చుకొనుటకు మంచి సమయం.ముఖ్యంగా  క్రీడలయందు, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. కుటుంబ పరంగా సానుకూలత ఉంటుంది. వారి సంతోషం కొరకు ప్రయాణాలు చేస్తారు. అన్ని విధాల ఖర్చు అధికంగా కనబడుతుంది. అయితే కుటుంబ సభ్యుల సంతోషంతో పోల్చితే ఖర్చు అయిందనే విషయాన్నీ కూడా పట్టించుకోరు. వారి సంతోషం ముందు ఎంత పెద్ద విషయం అయినా పక్కన పెట్టేస్తారు. ఏది ఏమైనా కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాజకీయ, కళాసంస్కృతిక రంగాల వారికీ ఆశించినంత ఫలితాలు అంతగా ఉండవు. అందని ద్రాక్ష వాలే ఊరిస్తుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన. ఏ కార్యమైన సాధన ద్వారానే సిద్ధిస్తుంది. సాధన ద్వారా సాధించలేని కార్యం లేదని గ్రహించి ముందుకు సాగండి. తప్పక విజయం సిద్దిస్తుంది.


                                            


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121

Weekly Rasi Phalalu in Telugu | Jan 28th to Feb 03rd 2024 | వార ఫలాలు | Mulugu Astrology | Horoscope