మాఘమాసం ప్రత్యేకత
చంద్రుడు మాఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. 'మాఘం' అంటే యజ్ఞం అని అర్థం ఉంది. యజ్ఞయాగాది కార్యాలకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. మాఘమాస స్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణంలో పేర్కొనబడింది. మృకుండముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. కళ్యాణ కారకుడైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస హిందువుల సాంప్రదాయంగా వస్తున్నది. మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్యకిరణాలలో ఉండే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాన్ద్రటలలో మార్పులు వస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవి, వేగంగా ప్రవహించే నీళ్ళలో చేసే స్నానాలు శ్రేష్ఠమని అంటున్నారు. మాఘమాస స్నానాలకు అధిష్టాన దైవం సూర్య భగవానుడు. స్నానం చేసిన తరువాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతో అయినా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నానఫలం లభిస్తుంది అంటారు. బావి నీటి స్నానం పన్నెండేళ్ళ పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణి సంగమ స్నానం నదీశతగణ ఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. మాఘస్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశణం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో 'ప్రయాగ'ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. మాఘ పూర్ణిమను 'మహామాఘం' అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నాన, దాన, జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకం అంటారు. అఘము అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం వుంది. మాఘము అంటే పాపాలను నశింపజేసేది అని అర్థం వస్తుంది అని పండితులు అంటున్నారు. మాఘమాసంలో గణపతి, విష్ణువు, శివుడు, సూర్యునారాయణుడు మొదలైన దేవతలకు పూజలు, వ్రతాలు నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటాయి.
Note: HTML is not translated!