Kartik Month Monday Importance

కార్తీక సోమవారం విశిష్టత?

కార్తీకమాసంలో శ్రీమహాశివుడికి అత్యంత ప్రీతికరమైనది కార్తీక సోమవార వ్రతం. కార్తీకంలో వచ్చే ఏ సోమవారం రోజునైనా స్నాన, దానాలు, జపాలు ఆచరించేవారికి వెయ్యి అశ్వమేథ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారు. ఈ సోమవార వ్రతవిధి ఆరురకాలుగా ఉంది.

 

1 ఉపవాసం: ఉపవాసం చేయగలిగిన వారు కార్తీకసోమవారం రోజున పగలు అంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శివుడికి అభిషేకం చేసి, నక్షత్ర దర్శనం తరువాత తులసీతీర్థం మాత్రమే స్వీకరించాలి.

 

2 ఏకభుక్తం: రోజంతా ఉపవాసం ఉండలేనివారు ఉదయం యథావిధిగా స్నానం, జపం ముగించుకుని, మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో, తులసీతీర్థమో స్వీకరించాలి.

 

3 నక్తం : సోమవారం రోజున పగలు అంతా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం కానీ, ఉపాహారం కానీ స్వీకరించాలి.

 

4 అయాచితం : భోజనం కోసం తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారంతట వారే భోజనానికి ఆహ్వానిస్తే, భోజనం మాత్రమే చేయాలి. దీన్నే అయాచితం అని అంటారు.

 

5 స్నానం : పైన పేర్కొనబడిన వాటిల్లో వేటినీ చేసే శక్తిలేనివారు నమంత్రక స్నానం, జపం చేస్తే సరిపోతుంది.

 

6 తిలాపాపం : మంత్రం, జపం విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీకసోమవారం రోజున నువ్వులను దానం చేసినా సరిపోతుంది.

 

పైన చెప్పిన ఆరు పద్ధతులలో ఏ ఒక్కటి ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ, తెలిసి కూడా ఏ ఒక్క పద్ధతినీ ఆచరించనివాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంబీపాక రౌరవాది నరకాలని పొందుతారు అని ఆర్షవాక్యం. ఈ సోమవార వ్రతాన్ని ఆచరించడం వలన అనాథలు, స్త్రీలు కూడా విష్ణు సాయుజ్యాన్ని పొందుతారు. కార్తీకమాసంలో అన్ని సోమవారాలు ఉదయం అంతా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజు అంతా భగవంతుడిని ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పకుండా శివసాయుజ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవారు నమక చమక శివాభిషేకం చేయడం ప్రధానం అని తెలుసుకోవాలి. కార్తీకసోమవారం రోజున శివాలయాలలో నేతితో దీపం వెలిగించేవారికి అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. సోమవారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఆలయాలలో పంచముఖ దివ్వెలతో దీపాలను వెలిగించడం ద్వారా శుభఫలితాలను పొందగలరు. కార్తీకసోమవారం బ్రాహ్మీముహూర్తంలో స్నానం చేసి 'హరహరశంభో' అంటూ శివుణ్ణి స్తుతిస్తే సర్వపాపాల నుండి విముక్తి లభించడంతో పాటు అష్టైశ్వర్యాలను పొందుతారు.

 

0 Comments To "Kartik Month Monday Importance "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!