కార్తీక పురాణము - నాలుగవ రోజు పారాయణము
ఏడవ అధ్యాయం
'ఓ జనక రాజేంద్రా! కల్మష అగ్ని అయిన కార్తీకమాసంలో పుష్ప అర్చన, దీపవిధానాలు చెబుతాను విను.
పుష్పార్చన ఫలదాన దీపవిధి విశేషాలు
ఈ కార్తీకమాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలతో పూజించడం వలన కమలంలో కూర్చునే లక్ష్మీదేవి ఆ భక్తుల ఇళ్ళలో స్థిరవాసం ఏర్పరచుకుంటుంది. తులసీదళాలతోకానీ, జాజిపువ్వులతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకమాసంలో భక్తితో పండ్లు దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్లలా చెదిరిపోతాయి. ఉసిరిచెట్టు క్రింద విష్ణువును ఉసిరికాయలతో పూజించేవారిని తిరిగి చూడడానికి యముడికి కూడా శక్తి చాలదు. కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీదళాలతో పూజిస్తారో, వారినిమించిన ధన్యులు ఎవరూ ఉండరు అనడం అతిశయోక్తి కాదు. బ్రాహ్మణసమేతుడై, ఉసిరిచెట్టు ఉన్న తోటలో వనభోజనం చేసేవారి మహాపాతకాలు సైతం మట్టికలిసిపోతాయి. బ్రాహ్మణసమేతులై ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామ పూజ చేసేవాళ్ళు వైకుంఠాన్ని పొంది, విష్ణువులా ఆనందిస్తారు. ఎవరైతే కార్తీకమాసంలో నిష్ణువు ఆలయంలో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతో కానీ, అరటి స్తంభాలతో కానీ మండపం కట్టినవాళ్ళు వైకుంఠంలో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండప్రణామం చేసినవాళ్ళు అశ్వమేథ పుణ్యం లబ్దిపొందే వారు అవుతారు. విష్ణువుకి ఎదురుగా జప, హోమ, దేవతార్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. స్నానం చేసి తడిబట్టతో ఉన్నవాడికి వస్త్రదానం చేసినవాడు పదివేల ఆశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరంపై ధ్వజారోహణం చేసిన వారి పాపాలు గాలికి ఎగిరిపోతాయి. నల్లని, లేదా తెల్లని అవిసెపూలతో హరిపూజ చేసినవారికి పదివేల యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీకమాసంలో ఏ స్త్రీ అయితే బృందావనంలో గోమయంతో (ఆవుపేడ) అలికి, పంచరంగులతోనూ, శంఖ, పద్మ-స్వస్తిక్ వంటి రంగవల్లులను తీరుస్తుందో ఆమె విష్ణువుకి ప్రియురాలు అవుతుంది. విష్ణుసన్నిధిలో నందాదీపాన్ని అర్పించడం వల్ల కలిగే పుణ్యాన్ని వేయినోళ్ళ ఆదిశేషుడైనా పొగడలేడు. ఈ కార్తీకమాసంలో శివుణ్ణి జిల్లెడుపూలతో పూజించినవాడు దీర్ఘాయుష్మంతుడై చివరికి మోక్షాన్ని పొందుతాడు. విష్ణు ఆలయమండపాన్ని అలంకరించినవాడు హరిమందిరంలో స్థాయి అవుతారు. హరిని మల్లెపూలతో పూజించినవారి పాపాలు సర్వనాశనమై పోతాయి. తులసీ, గంధంతో సాలగ్రామ పూజ చేసినవాడు వైకుంఠాన్ని పొందుతాడు. విష్ణుసన్నిధిలో నాట్యం చేసినవారి యొక్క పూర్వసంచిత పాపలు అన్నీ పూజ్యం అయిపోతాయి. భక్తితో అన్నదానం చేసేవాడి పాపాలు గాలికి మబ్బుతునకలా ఎగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీకమాసంలో నువ్వులదానం, మహానదీ స్నానం, బ్రహ్మపత్ర భోజనం, అన్నదానం ఈ నాలుగూ ఆచరించడం ధర్మంగా చెప్పబడుతూ వుంది. స్నాన, దానాలు ఆచరించనివాడూ, పిసినారి అయి యథాశక్తిగా చేయనివాడూ నూరుజన్మలు కుక్కగా పొట్టి చివరికి ఛండాల యోనిలో జన్మిస్తాడు. కార్తీక వ్రత శూన్యులు మరుజన్మలో గాడిదగా పుట్టి, తరువాత వంద పుట్టుకలూ శునకయోనిలో జన్మిస్తారు. కార్తీకమాసంలో శ్రీహరిని కదంబపుష్పాలతో పూజించినవాడు సూర్యమండలాన్ని ఛేదించుకుని స్వర్గానికి వెడతాడు. పద్మాలతో పూజించినవాడు చిరకాలం సూర్యమండలంలోనే నివసిస్తాడు. ఓ జనక మహారాజా! కార్తీకమాసంలో ఎవడైతే అవిసెపువ్వుల మాలను తాను ధరించి తరువాత అవిసెపువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తాడో వాడు స్వర్గాధిపతి అవుతాడు. మల్యాలతో, తులసీదళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక్క సూక్ష్మాన్ని చెబుతాను విను - ఆశక్తులు అయినవాళ్ళు -
శ్లో కార్తీక భానువరేతు స్నానకర్మ నమాచరేత్ !
మాసస్నా నేన యత్పుణ్యం తత్పుణ్యం లభతేనృప !!
శ్లో ఆద్యే తిమే మధ్య మే చ దినే యః స్నానమాచరేత్ !
మాసస్నాన ఫలం తేన లభతే నాత్ర సంశయః !!
'కార్తీకమాసం'లో ఆదివారంనాడుగాని లేదా శుక్ల పాడ్యమినాడుగని, పూర్ణిమనాడుగాని, అమావాస్యనాడుగాని సంకల్ప సహితంగా ప్రాతఃస్నాన మాచరించడం వలన ఆ మాసం అంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది' ఆపాటి శక్తి కూడా లేనివాళ్ళు కార్తీకమాసం నెలరోజులూ ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా, విన్నా కూడా స్నానఫలాన్ని పొందుతారు. ఇది కేవలం ఆశక్తులకే సుమా! మహీశా! కార్తీకమాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించెవాడి పాపాలు నశించిపోతాయి, కారీకమాసంలో విష్ణుపూజ కోసం ఇతరులకు సహకరించేవాడు స్వర్గాన్ని పొందుతాడు. తాము స్వయంగా సంకల్ప పూర్వకంగా విష్ణువును పూజించేవాళ్ళు అవ్యయపదాన్ని పొందుతారు. కార్తీకమాసం సాయంకాలాలలో దేవాలయాలలో శివ-విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలం స్వర్గలోకంలో వుండి తరువాత ధృవలోకాన్ని పొందుతారు. ఇలా ఈ కార్తీకమాసంలో ఎవడైతే హరిహరులను స్మరించకుండా ఉంటాడో వాడు ఏడు జన్మలపాటు నక్కగా పుడతాడు అనడంలో ఏమీ సందేహం లేదు.
ఏడవ అధ్యాయం సమాప్తం
ఎనిమిదవ అధ్యాయం
వశిష్టుడు చెప్పినది అంతా విని జనకుడు ఇలా అడుగుతున్నాడు ... 'మహర్షీ! మీరు చెప్పినవి అన్నీ విన్న తరువాత నాకు ఒక సందేహం కలుగుతోంది. వర్ణసంకరం మొదలైన మహాపాపాలను చేసిన దుర్మార్గులు పవిత్రమైన వేదాలలో ప్రాయశ్చిత్తాలు చేసుకోకుండానే పరిశుద్ధులు కారు' అని సమస్త ధర్మశాస్త్రాలూ ఘోషిస్తుండగా, కేవలం కార్తీక వ్రతం ఆచరణతోనే సమస్త పాపాలూ హరించుకుపోయి వైకుంఠాన్ని పొందుతున్నారని చెప్పడంలోని మర్మం ఏమిటి? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్యంతోనే గొప్పగొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డళ్ళతో కూడా కూలనటువంటి సాధ్యంకాని మహాపర్వతాన్ని కేవలం కొనవ్రేలి గోటితో కూల్చడం సాధ్యం అవుతుందా? అగ్నిలో దగ్ధం అవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంటల మీద కొద్దిపాటి నీళ్ళు చల్లినంత మాత్రాన, అగ్నిప్రమాదం తొలగిపోతుందా? ఏ మహానదీ ప్రవాహంలోనో కొట్టుకునిపోయే వారిని, ఓపాటి గడ్డిపరక గట్టుకు చేర్చగలుగుతుందా? తనకు తానై కొండమీద నుంచి క్రిందికి దూకి పడేవాడు - కొండచరియలలోని ఏ లతనో పట్టుకున్నంత మాత్రం చేతనే పాతవేగాన్నుంచి సంరక్షించబడతాడా? వశిష్టా ఈ విధమైన సంఘటనల రీత్యా మహాపాపులైనవాళ్ళు సహితం అతి స్వల్ప కార్యమైనా కార్తీకవ్రతం ఆచరించడం వలన పాపరహితులు, పుణ్యాత్ములూ ఎలా అవుతారు? వీటికి నీ సమాధానం ఏమిటి?
జనకుడి ప్రశ్నకు జ్ఞానహాసం చేస్తూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు వశిష్టుడు.
జనకుడి ప్రశ్నలకు వశిష్టుడి జవాబు
వశిష్ట ఉవాచ: మంచి విమర్శే చేశావు మహారాజా! చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలేగాని, స్థూలరూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అదీకాక, వేదశాస్త్ర పురాణాలు అన్నీ కూడా అనేక ధర్మసూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని సందర్భాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను, స్వల్పపుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి. ధర్మాలు అన్నీ గుణత్రయంతో కూడుకుని స్వల్పా, స్వల్పాలను సిద్ధింప చేసుకుంటాయి. మూల ప్రకృతి అయిన 'మహామాయ' కారణంగానే సత్వరజస్తమస్సులనే మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో సత్వ గుణ ప్రధానమైనవి ధర్మసూక్ష్మాలు. కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తం అన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడ్డాయి. తర్కం దైవం ఇతర చింతనతో సాగించే దైవసంబంధ పద్ధతులు, ఆచరించే దానధర్మాలు, ఇవి అన్నీ కూడా ధర్మం యొక్క స్థూలస్వరూపాలు. ఇవి తమోగుణం వలన ఏర్పడతాయి. వీటిల్లో సత్వగుణం ప్రధానంగా ఆచరించే ధర్మాలు స్వల్పంగా తోచినప్పటికీ దేశకాలయోగ్యాదులు వలన విశేష ఫలాలను ఇస్తాయి. దేశం అంటే పుణ్యక్షేత్రం, కాలం అంటే పుణ్యకాలం, యోగ్యమంటే పాత్రత బ్రహ్మజ్ఞత కలవాళ్ళు. ఈ మూడింటినీ చింతించకుండా చేసే సర్వధర్మాలూ, తామసాలు - వీటివలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు. వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలు అని వేరే చెప్పక్కరలేదు కదా! జనకరాజా! అన్నిటికీ కర్మమే మూలం. ఎవరి కర్మలను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ మనిషికి జ్ఞానం అనేది ఉండడం వలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకుని ప్రయత్నపూర్వకంగా అయినా ఆచరించాలి. ఆ విధంగా మూడూ కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మం అక్షయఫలితాన్ని ఇస్తుంది. రాజా! పర్వతం అంత ఎత్తు కట్టెలను పేర్చి, వాటిమధ్య గురివింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణం ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపం ఆ యింటి చీకట్లను ఎలా తొలగిస్తుందో, గుండిగెడు మురికినీళ్ళను ఒక్క ఇండుపగింజ ఎలా శుభ్రపరుస్తుందో అదే విధంగా, తెలిసిగాని, తెలియకగాని పుణ్యకాలంలో, పుణ్యక్షేత్రంలో, పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మం అనంతపాపాలనూ దగ్ధం చేసి, మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను.
అజామీశ పాఖ్యానము
బహుకాలం పూర్వం కన్యాకుబ్జక్షేత్ర వాసి, సార్థక నామధేయుడు అయిన సత్వనిష్టుడు అనే బ్రాహ్మణుడికి అజామిళుడు అనే కుమారుడు ఉండేవాడు వాడు పరమ దురాచారుడు, దాసీ సాంగత్యపరుడు, హింసాప్రియుడుగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహంలోని ఒకానొక దాసితో సాంగత్యం పెట్టుకుని తల్లిదండ్రులను వదిలి ఆ దాసీదానితోనే భోజనం, పడక అన్నింటినీ చేస్తూ, కామాంధుడై, వైదికకర్మలు అన్నింటినీ విడిచిపెట్టి, కేవలం కామంపై ఆసక్తికలవాడై ప్రవర్తించసాగాడు. దీనివల్ల బంధువులు అంతా అతన్ని వదిలివేశారు. కులంవాళ్ళు వెలివేశారు. అందుకని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చిన అజామిళుడు ఛండాలపు వాడలోని ఒకానొక దాసిదానితో కాపురం పెట్టి, కుక్కలనూ, మృగాలనూ ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బ్రతికే జనాలలో లీనమై, మధుమాంసాలు తినడం అలవాటు చేసుకుని కాలం గడపసాగాడు. ఇలా ఉండగా ఒక రోజు అతని ప్రియురాలు అయిన దాసిది కల్లు త్రాగడానికి తాడిచెట్టు ఎక్కి, కొమ్మ విరగడం వలన క్రిందపడి మరణించింది. అజామిళుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసీదానికి యవ్వనవతి అయిన కూతురు వుంది. మహాపాపాత్ముడూ, మహా కామాంధుడూ అయిన అజామిళుడు, తనకి కూతురువరస అని కూడా తలచుకోకుండా ఆ పిల్లనే వరించి, ఆమెతోనే కామభోగాలను అనుభవించసాగాడు. కాముకుడు అయిన అజామిళుడు, తన కూతురుతోనే అనేకమంది బిడ్డలను కన్నాడు. కానీ వాళ్ళందరూ కూడా పసికందలుగా ఉన్నప్పుడే మరణించగా, చివరగా పుట్టి మిగిలిన బిడ్డకు 'నారాయణ' అని నామకరణం చేసి అత్యంత ప్రేమగా పెంచుకోసాగాడు. తాను తింటున్నా, నిద్రపోతున్నా ఏం చేస్తున్నా సరే ఎప్పుడూ అతన్నే స్మరించుకుంటూ 'నారాయణా - నారాయణా' అని పిలుచుకుంటూ తన్మయుడు అవుతూ ఉండేవాడు. కాలం గడిచి అజామిళుడు కాలం చేసే సమయం ఆసన్నమైంది. అతడిలోని జీవుడిని తీసుకొని పోవడానికిగాను ఎర్రని గడ్డాలు, మీసాలు కలిగి, చేతిలో దండపాశాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామిళుడు, ప్రాణం పోయే సమయంలో కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక, ఎక్కడో దూరంగా స్నేహితులతో ఆటలలో మునిగి ఉన్న కుమారుడి కోసం 'నారాయణా ! ఓ నారాయణా! తండ్రీ నారాయణా!' అని పలుమార్లు పిలవసాగాడు. ఆ పిలుపు అతని కొడుకుకు వినబడలేదు. అతనూ రాలేదు. కాని, దగ్గరికి వచ్చిన యమదూతలు ఆ 'నారాయణ' నామస్మరణను విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ప్రత్యక్షం అయిన విష్ణుదూతలు 'ఓ యమదూతలారా! అడ్డుతొలగండి. యితడు మాచే తీసుకొని వెళ్ళడానికి తగినవాడే కానీ మీరు తీసుకుని వెళ్ళదగినవాడు కాదు' అని హెచ్చరించారు. వికసించిన పద్మాలలాగా విశాలమైన నేత్రాలు కలవాళ్ళూ, పద్మమాలలు ధరించినవారు, కిరీట కుండలాలు ధరించినవారు, వివిధ ఆభరణాలు ధరించినవారు, పీతాంబర వస్త్రాలు ధరించిన పవిత్ర విష్ణుదూతలను చూసి, విభ్రాంతి చెందిన యమదూతలు 'అయ్యా! మీరెవరు? యక్ష, గాంధర్వ, సిద్ధచారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు చెందినవారు? మా ప్రభువు అయిన యమధర్మరాజు మాకు విధించిన ధర్మం రీత్యా తీసుకొని వెళ్లనున్న ఈ జీవిని మీరెందుకు తీసుకుని వెళుతున్నారు? అని అడగడంతో, విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు.
నాలుగవ రోజు పారాయణ సమాప్తం
Note: HTML is not translated!