Karthika Masam Day 20 Parayanam

కార్తీక పురాణము -  ఇరవైవ రోజు పారాయణ 

                    తొమ్మిదవ అధ్యాయం


పృథుచక్రవర్తి అడుగుతున్నాడు : మహర్షీ! తులసిని స్థాపించి, ఆ మండపంలోనే ముందుగా విష్ణుపూజ చేయాలని శలవిచ్చావు. పైగా తులసిని 'హరిప్రియా - విష్ణువల్లభా' లాంటి పేర్లతో సంబోధించావు. శ్రీహరికి అంతటి ప్రియమైన ఆ తులసి మహత్యాన్ని వినిపించు'
నారదుడు చెబుతున్నాడు: శ్రద్ధగా విను. పూర్వం ఒకసారి, ఇంద్రుడు సమస్త దేవత, అప్సర సమేతుడై శివదర్శనం కోసం కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయానికి శివుడు వేతాళరూపి అయి ఉన్నాడు. భీతవహ దంష్ట్రానేత్రాలతో మృత్యుభయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివుడిగా గుర్తించలేక 'ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు?' అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు.  కాని, ఆ పురుషోత్తముడు జవాబు ఇవ్వకపోవడంతో కోపం తెచ్చుకున్న ఇంద్రుడు 'నా పశ్నలకు జవాబు ఇవ్వని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను. ఎవడు రక్షిస్తాడో చూస్తాను' అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టాడు. ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం కమిలి నల్లగా అయింది కాని, ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది. అంతటితో ఆ భీషణమూర్తినుండి వచ్చే తేజస్సు దేవేంద్రుడిని కూడా దగ్ధం చేసేలా తోచడంతో, దేవగురువు అయిన బృహస్పతి ఆ వేతాళ స్వరూపం శివుడే అని గ్రహించి - ఇంద్రుని చేత అతనికి మ్రొక్కించి, తాను ఈ విధంగా శాంతి స్తోత్రం చేశాడు


                    బృహస్పతి కృత వేతాళ శాంతి స్తోత్రము


శ్లో      నమో దేవదిదేవాయ త్ర్యంబకాయ కపర్థినే
    త్రిపురఘ్నాయ శర్వాయ నమో ధ నిఘాదినే 
శ్లో     నిరూప యదిరూపాయ బ్రహ్మరూపాయ శంభవే 
    యజ్ఞవిధ్వంసక యజ్ఞానాం ఫలదాయినే 
శ్లో     కాలంత కాలకాలాయ కాలభోగి ధరాయచ 
    నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మణ్యయ నమో నమః 
బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు - ముల్లోకదాయకమైన తన త్రినేత్రాగ్నిని ఉపసంహరించడానికి నిశ్చయించుకుని 'బృహస్పతీ! నా కోపం నుంచి   ఇంద్రుణ్ణి బ్రతికించినందుకుగాను ఇక నుంచీ నువ్వు 'జీవ' అనే పేరుతొ ప్రఖ్యాతి పొందుతావు. నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఏదైనా వరం కోరుకో' అన్నాడు. 
ఆ మాట మీద బృహస్పతి 'హే శివా! నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను. త్రిదేవేశుణ్ణి, త్రిలోకాలను కూడా నీ మూడోకంటి మంటనుంచి రక్షించు. నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింపజెయ్యి - ఇదే నా కోరిక' అన్నాడు.
సంతసించిన సాంబశివుడు 'వాచస్పతీ! నా ముక్కంట వెలువరించబడిన అగ్ని వెనక్కి తీసుకోదగింది కాదని తెలుసుకో. అయినా, నీ ప్రార్థనను మన్నించి ఆ అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకుగాను సముద్రంలోకి చిమ్మేస్తున్నాను' అని చెప్పాడు. చెప్పినట్లే చేశాడు శివుడు. ఆ అగ్ని గంగాసాగర సంగమంలో పడి అగ్ని బాలకరూపాన్ని ధరించింది. పుడుతూనే ఏడ్చిన వాడి ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది. ఆ రోదన వినిన బ్రహ్మ పరుగుపరుగున సముద్రుడివద్దకు వచ్చి - 'ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడు?' అని అడిగాడు. అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి 'గంగా సంగమంలో జన్మించాడు గనుక, ఇతను నా కుమారుడే. దయచేసి వీడికి జాతకర్మాది సంస్కారాలను చేయమని కోరుకున్నాడు. ఈ మాటలు జరిగే లోపలేఆ కుర్రాడు బ్రహ్మ గడ్డాన్ని పట్టుకుని ఊగులాడసాగాడు. వాడిపట్టునుంచి తన గెడ్డం వదిలించుకోవడానికి బ్రహ్మకు కళ్ళనీళ్ళ పర్యంతం అయింది. అందువల్ల విధాత 'ఓ సముద్రుడా! నా కళ్ళనుండి చిందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడు అనే పేరు ప్రఖ్యాతుడు అవుతాడు.' అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ జాలంధరుడికి కాలనేమి కూతురైన బృందను ఇచ్చి పెళ్లి చేశారు. రూప, వయో, జలవిలాసుడైన జలంధరుడు బృందను భార్యగా గ్రహించి, దానావాచార్యుడు అయిన శుక్రుడి సహాయంతో సముద్రంనుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు.


                    తొమ్మిదవ అధ్యాయం సమాప్తం 
                    పదవ అధ్యాయం


నారదుడు చెబుతున్నాడు: పూర్వం దేవతలచే హతమారి పాతాళాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరున్ని ఆశ్రయించి, నిర్భయంగా తిరగసాగారు. ఆ జలంధరుడు ఒకరోజు, శిరోవిహీనుడైన (శిరస్సు లేని) రాహువుని చూసి 'వీడికి తల లేదు ఏమిటి?' అని ప్రశ్నించిన మీదట శుక్రుడు, గతంలో జరిగిన క్షీరసాగర మథనం, అమృతపు పంపకం, ఆ సందర్భంగా విష్ణు అతని తల తెగవేయడం - మొదలైన ఇతిహాసం అంతా చెప్పాడు. అంతా విన్న సముద్ర తనయుడు అయిన జలంధరుడు మండిపడ్డాడు. తన తండ్రి అయిన సముద్రున్ని మధించడం పట్ల చాలా మధనపడ్డాడు. ఘస్మరుడు అనే వాణ్ని దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు. వాడు ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి 'నేను రాక్షస ప్రభువైన జలంధరుడి దూతను. ఆయన పంపిన శ్రీముఖాన్ని విను 'దేవేంద్రా! నా తండ్రి అయిన సముద్రున్ని పర్వతంతో మదించి అపహరించిన రత్నాలు అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు' అది విన్న అమరేంద్రుడు 'ఓ రాక్షస దూతా! గతంలో నాకు భయపడిన లోకకంటకాలయిన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. అందువల్లనే సముద్ర మథనం చేయాల్సి వచ్చింది. ఇప్పటి మీ రాజులాగానే, గతంలో శంఖుడు అనే సముద్ర నందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుడిచేత వధించబడ్డాడు. కాబట్టి సముద్ర మధన కారణాన్ని, దైవతగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్నీ కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు. ఘస్మరుడు, జలంధరుడి దగ్గరకు వెళ్ళి, దేవేంద్రుడు చెప్పిన మాటలను వినిపించాడు. మండిపడ్డ జలంధరుడు - మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు. శుంభ-నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలాపై దండెత్తాడు. ఉభయ సైన్యాలవారూ మునల పరిషు బాణ గదాద్యాయుదాలతో పరస్పరం ప్రహరించుకున్నారు. రథ, గజ, తురగాశ్వాదిక శవాలతోనూ, రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది. రాక్షసగురువైన శుక్రుడు మరణించిన రాక్షసులను అందరినీ 'మృతసంజీవనీ' విద్యతో బ్రతికించేస్తుండగా = దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను, ద్రోణగిరిమీద దివ్యౌషథాలతో చైతన్యవంతం చేయసాగాడు. ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు. 
ఎప్పుడయితే ద్రోణపర్వతం అదృశ్యమయ్యిందో - అప్పుడు బృహస్పతి దేవతలను చూసి 'ఓ దేవతలారా! ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు గాబట్టి, మనకు జయింప శక్యంగాకుండా వున్నాడు. అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు పారిపోండి' అని హెచ్చరించాడు. అది వినగానే భీతావహులైన దేవతలు అందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరుపర్వత గుహాంతరాళలను ఆశ్రయించారు. అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు - ఇంద్రపదవిలో తాను పట్టాభిషిక్తుడై, శంబు-నిశంబాదులను తన వ్రతవిధులుగా నిర్ణయించి, పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరుపర్వతాన్ని సమీపించాడు.


                    తొమ్మిది, పదవ అధ్యాయాలు సమాప్తం 
                    ఇరువైవ (బహుళ పంచమి) అధ్యాయం పారాయణం సమాప్తం

 

Products related to this article

Lava Bracelet

Lava Bracelet

Lava Braceletit is used for calming the emotions. Note : For this bracelet pour 2 drops of essential oil on this bracelet leave it for overnight and then use it...

$14.60

Jandhyam (Vodikinavi)

Jandhyam (Vodikinavi)

Jandhyam(Vodikinavi)Yagnopaveetham paramam pavithramPrajapatheryasahajam purasthadAayushyamagryam prathimuncha shubramYagnopaveetham balamasthu thejahYagnopaveetham is a triple stranded sacrificial fi..

$4.00

0 Comments To "Karthika Masam Day 20 Parayanam "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!