Karthika Masam Day 18 Parayanam

కార్తీక పురాణము - పద్దెనిమిదవ రోజు పారాయణం


                    ఐదవ అధ్యాయం 
నారదుడు చెప్పినది అంతా విని పృథువు 'ఓ దేవర్షీ! కార్తీక మాసం ఉత్కృష్టతను వివరించి చెప్పి నన్ను ధన్యుడిని చేశావు. అదే విధంగా స్నానం మొదలిన విధులు, ఉద్యాపన విధిని కూడా 
యధావిధిగా తెలియజేయవలసింద'ని కోరగా నారదుడు ఇలా చప్పడం మొదలుపెట్టాడు.


                    కార్తీక వ్రత విధి విధానాలు - శౌచం


శ్లో     ఆశ్విన్యస్యతు మాఎస్య యా శుక్లైకాదశ భవేత్!
    కార్తికస్య వ్రతారంభం తస్యాం కుర్యా దంతంద్రితః!!
మహారాజా! ఈ కార్తీక వ్రతాన్ని నిరాలసుడూ, జాగారూకుడూ అయి ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశీ నాడే ప్రారంభించాలి. వ్రతస్థుడు అయినవాడు తెల్లవారుఝామునే లేచి, చెంబుతో నీళ్ళు తీసుకుని, 
తూర్పుదిశగాగాని, ఉత్తరదిశగాగాని ఊరి బయటకు వెళ్ళి, యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకుని తలకు గుడ్డ చుట్టుకుని, ముఖాన్ని నియమించి, ఉమ్మివేయడం మొదలయినవి చేయకుండా మూత్ర 
పురీశాలను విసర్జించాలి. పగలుగాని, సంధ్యలోగాని యీ ఉత్తరాభిముఖంగా, రాత్రిపూట అయితే దక్షిణాభిముఖంగాను ఈ అవశిష్టాన్ని పూర్తిచేసుకోవాలి. తరువాత మూవ్రయాన్ని చేతబట్టుకుని 
మట్టితోటి, నీళ్ళతోటి  శుభ్రం చేసుకుని, లింగంలో ఒకసారి, గుదలో మూడుసార్లు నీళ్ళతోనూ, రెండుసార్లు మట్టితోను శరీరం అంతా ఐదుసార్లు, లింగంలో పదిసార్లు నీళ్ళతోనూ, రెండింటిలోను మట్టితో 
ఏడుసార్లు ఈ విధంగా గృహస్థులకు శౌచవిధి చెప్పబడి వుంది. ఈ శౌచం బ్రహ్మచారికి దీనికంటే రెండు రెట్లు, వానప్రస్థులకు మూడురెట్లు, యతులకు నాలుగురెట్లుగా నిర్ణయించబడింది. ఇది పగలుజరిపే 
శౌచం, ఏ ఆశ్రమం వాళ్ళు అయినా సరే రాత్రిపూట యిందులో సగం ఆచరిస్తే చాలు. ఆతృతాపరులు అయినవాళ్ళు అందులో సగం, ప్రయాణాలలోనో, మార్గమధ్యంలోనో వున్నవాళ్ళు అందులో సగాన్ని 
పాటించాలి. ఈ విధంగా శౌచకర్మ చేసుకోనివాళ్ళు ఆచరించే కర్మలేవీ కూడా తత్ఫలాలు ఇవ్వవు. 
                    దంతధావనం 
ముఖమార్జనం చేయనివాళ్ళకు మంత్రాలు పట్టు ఇవ్వవు. కాబట్టి దంతాలనూ, జిహ్వానూ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. 
మంత్రం    ఆయుర్బలం యశోవర్చః ప్రజాః పశపమాని చ!
    బ్రహ్మ ప్రజ్ఞాం చ మేథాం చ త్వన్నో దేహివసస్పతే !!
అనే మంత్రం పఠిస్తూ ఫాలవృక్షం యొక్క పన్నెండు అంగుళాల శాఖతో దంతదావనం చేసుకోవాలి. క్షయతిథులలోనూ, ఉపవాస దినాలలోనూ, పాడ్యమి, అమావాస్య, నవమి, షష్ఠి, సప్తమి, సూరచంద్ర 
గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. ముళ్ళచెట్లు, ప్రత్తి, వావిలి, మోదుగ, మర్రి, ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు. 
దంతధావనం తరువాత, భక్తీ-నిర్మలబుద్ధీ కలవాడై, గంధపుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికిగాని, విష్ణువు ఆలయానికిగాని వెళ్ళి అక్కడి దైవతాలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాల నాచరించి, 
స్తోత్ర నమస్కారాలు సమర్పించి, నృత్య, గీత, వాయిద్య మొదలైన సేవలను చేయాలి. దేవాలయాలలోని గాయకులూ, నర్తకులు, తాళమృదంగం మొదలైన వాద్య విశేష విద్వాంసులు వీరందరినీ 
విష్ణుస్వరూపులుగా భావించి, పుష్పతాంబూలాలతో అర్పించాలి, కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపరంలో దానం భగవంతుడి ప్రతీకారాలు కాగా, ఈ కలియుగంలో భక్తియుతమైన 
సంకీర్తనం ఒక్కటే ఆ భగవంతుడికి సంతోషాన్ని కలిగిస్తుంది. నాయనా! పృథురాజా! ఒకానొకకసారి నేను శ్రీహరిని దర్శించి 'తాతా! నీయొక్క నిజమైన నివాసస్థానం ఎదో చెప్పు' అని కోరాను.  అందుకు 
ఆయన చిన్మయమయిన చిరునవ్వు నవ్వుతూ 'నారదా! నేను వైకుంఠంలోగాని, యోగుల హృదయాలలోగాని ఉండను. కేవలం నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రమే 
వుంటాను. నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను. నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను. నన్ను షోడశోపచారాలా పూజించినా నాకు అంత 
సంతోషం కలగదు. ఎవరైతే నా పురాణగాథలను, నా భక్తుల కీర్తనలను విని నిందిస్తారో వారే నాకు శత్రువులు అవుతున్నారు' అని చెప్పాడు. 
                    హరిహర దుర్గాగణేశ సూర్యారాధనలకు 
                    ఉపయోగించకూడని పువ్వులు 
ఓ రాజా! దిరిశెన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి బూరుగ, జిల్లేడు, కొండగోగు వీటి పుష్పాలుగాని, తెల్లటి అక్షతనుగాని విష్ణువును పూజించుటకు పనికిరావు. అదే విధంగా జపాకుసుమాలు, మొల్ల 
పుష్పాలు, దిరిశెన పూవులు, బండి గురువింద, మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుడిని పూజించేందుకు తగవు. ఎవడైతే సిరిసంపదలు కావాలని కోరుకుంటున్నాడో అటువంటివాడు తులసీ దళాలతో 
వినాయకుడినీ, గరికతో దుర్గాదేవినీ, అవిసెపువ్వులతో సూర్యుడినీ పూజించకూడదు. ఏయే దేవతలుకు ఏ పువ్వులు శ్రేష్ఠమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా -


శ్లో     మం త్రాహీనం క్రియహీవం భక్తిహీనం సురేశ్వర !
    యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే !!


ఓ దేవా! మంత్ర క్రియాదిక లోపభూయిష్టమైన నప్పంటికినీ, నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైన దగుగాక' అని క్షమాపణ కోరుకోవాలి. ఆ తరువాత దైవానికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి, 
పునః క్షమాపణలు చెప్పుకొని, నృత్య, గాన మొదలైన ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి. ఎవరైతే కార్తీకమాసంలో ప్రతిదినం రాత్రి శివపూజగాని, విష్ణుపూజగాని ఆచరిస్తారో వారు సమస్త 
పాపాలనుండి విడివడి వైకుంఠాన్ని పొంది తీరుతారు. 


                    ఐదవ అధ్యాయం సమాప్తం 
                    ఆరవ అధ్యాయం


నారదుడు చెబుతున్నాడు: రాజా! మరింత వివరంగా చెబుతాను విను. వ్రతస్థుడు మరో రెండు ఘడియలలో తెల్లవారుతుంది అనగా నిద్రలేచి, శుచిర్భూతుడై, నువ్వులు, దర్భలు, అక్షతలు, 
పువ్వులు, గంధం తీసుకుని నదిదగ్గరకి వెళ్ళాలి. చెరువులలో గాని, దైవనిర్మిత జలాశయాల్లోగాని, నదులలోగాని, సాగరాలలో గాని, స్నానం చేస్తే ఒకదాని కంటే ఒకటి పదిరెట్లు పుణ్యాన్ని ఇస్తుంది. ఏ 
పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పదిరెట్లు ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువును స్మరించి, స్నానసంకల్పం చేసి, దేవతలకు అర్ఘ్యాలు ఇవ్వాలి.


శ్లో     నమః కమలనాభాయ నమస్తే జలశాయినే 
    నమస్తేస్తు హృషికేష గృహాణార్ఘ్యం నమోస్తుతే !!


పైవిధంగా అర్ఘ్యాదులు ఇచ్చి, దైవధ్యాన నమస్కారాలు చేసి ...
ఓ దామోదరా! ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నించుచున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపాలన్నీ నశించిపోవునుగాక! హే రాధారమణా! విష్ణూ! కార్తీక వ్రతస్నాతుడు అవుతున్న నా 
అర్ఘ్యాన్ని స్వీకరించును.


                    స్నానవిధి


ఇలా వ్రతస్థుడు గంగ, విష్ణు, శివ, సూర్యులను స్మరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి, యధావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిగ పప్పు, నువ్వులచూర్ణంతోనూ - యతులు తులసి మొదలి 
మన్నుతోనూ స్నానం చేయాలి. విదియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ ఆరు తిథులలోనూ - నువ్వులతోనూ, ఉసిరిపండ్లతోనూ స్నానం చేయకూడదు. ముందుగా శరీర శుద్ధికి స్నానం 
చేసి, అ తరువాతనే మంత్రస్నానం చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి. 
'భక్తిగమ్యుడై ఎవడు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో, సర్వపాపహరుడైన ఆ విష్ణువు నన్ను ఈ స్నానంతో పవిత్రున్ని చేయుగాక! విష్ణ్వాజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను 
పవిత్రున్ని చేయుదురుగాక. రహో యజ్ఞమంత్ర బీజ సంయుతాలైన వేదాలు, వశిష్టకశ్యప మొదలైన మునివరిష్టులు నన్ను పవిత్రం చేయుదురుగాక. గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారలు, 
నదులు, సప్తసాగరాలు, హ్రదాలు నన్ను పవిత్రున్ని చేయుగాక. ముల్లోకాలలోనూగల అదిజ్యాది ప్రతి వ్రతామతల్లులు, యక్ష, సిద్ధగరుడాదులు, ఓషధులు, పర్వతములు నన్ను పవిత్రం చేయుగాక'
పై మంత్రయుక్తంగా స్నానం చేసి, చేతిలో పవిత్రాన్ని ధరించి దేవ, ఋషి, పితృ తర్పణాలను విధిగా చేయాలి. కార్తీకమాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులు అయితే విడువబడుతున్నాయో 
అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు. ఆ తర్పణ తరువాత నీటిలోంచి తీరానికి చేరి, ప్రాతః కాలానుష్టానం (సంధ్యావందనాది) నెరవేర్చుకుని, విష్ణుపూజను చేయాలి. 
తరువాత ...


అర్ఘ్య మంత్రం :


శ్లో     వ్రతినః కార్తీకమాసి స్నాతస్య విధివాన్మమ 
    గృహాణార్ఘ్యం మయాదత్తం రాధయాసహితో హరే!!


అనే మంత్రంతో గంధపుష్ప ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని, క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి. తరువాత వేదపారణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాలు ఇచ్చి పూజించి 
నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు ...


శ్లో     తీర్థాని దక్షిణే పాదౌ వేదా స్తన్ముఖమాశ్రితాః 
    సర్వాంగేష్వా శ్రితాః దేవాఃపూజితోస్మితదర్ర్పయా!!


కుదిపాదమందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేదములు, అవయవములందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణపూజ వలన నేను పూజితుడినవుతున్నాను' అని అనుకోవాలి. దాని 
తరువాత వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణ చేసి, దేవతలచే నిర్మించబడి, మునులచే పూజింపబడిన విష్ణు ప్రేయసి అయిన ఓ తులసీ! నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనం 
చేయుగాక' అనుకోని నమస్కరించుకోవాలి. తరువాత స్థిరబుద్ధి కలవాడై హరికథ, పురాణశ్రవణంలో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్లుగా ఏ భక్తులైన ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా 
దైవనాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహారాకము పావమారకము, సద్భుద్దీదాయకమూ పుత్రపౌత్ర ధనప్రదమూ ముక్తీ కారకమూ, విష్ణు ప్రీతికరమూ అయిన ఈ కార్తీక వ్రతాన్ని మించింది 
కలియుగంలో మరొకటి లేదు.


                    ఐదు ఆరు అధ్యాయాలు సమాప్తం


                 పద్దెనిమిదవ (బహుళ తదియ)నాటి పారాయణ సమాప్తం 

 

Products related to this article

Cow With Calf (German Silver)

Cow With Calf (German Silver)

Cow With Calf (German Silver)..

$27.69

Ashtadala Padmam Vattulu

Ashtadala Padmam Vattulu

Ashtadala Padmam Vattulu..

$1.00 $1.50

0 Comments To "Karthika Masam Day 18 Parayanam "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!