ఈ ఆలయాన్ని శివయ్య స్వయంగా
నిర్మించుకున్నాడట...!!
జంబుకేశ్వర
దేవాలయం
శివుడి పంచభూతలింగ క్షేత్రాల్లో, జలతత్వానికి ప్రతీక జంబుకేశ్వర
క్షేత్రం. ఈ ఆలయ ప్రాకారాన్ని స్వయంగా శివుడే తన భక్తుడి కోసం, వృద్ధశిల్పి రూపంలో
వచ్చి, దేవతలను కట్టడ నిర్మాణ నిపుణులుగా మార్చి, నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు, స్థలపురాణం
ద్వారా తెలుస్తోంది.
దేశంలో లయకారుడు పరమశివుని ఆలయం లేని ప్రదేశం ఉండదు. దేశంలో ప్రసిద్ధిగాంచిన
శైవ క్షేత్రాలు మాత్రమే కాదు.. మారుమూల ప్రాంతాల్లో కూడా శివాలయాలు ఉంటాయి. అయితే తమిళనాడులోని
తిరుచిరాపల్లిలో, ప్రకృతి రమణీయ ప్రదేశంలో ఉన్న జంబుకేశ్వర దేవాలయం, అన్ని ఆలయాలంటే
భిన్నంగా ఉంటుంది. శివుడి పంచభూతలింగ క్షేత్రాల్లో జలతత్వానికి ప్రతీక జంబుకేశ్వర క్షేత్రం.
ఇక్కడ ఆలయం అద్భుతమైన వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందినది. 1800 సంవత్సరాల క్రితం హిందూ చోళ రాజవంశానికి చెందిన
రాజు కోకెంగనన్ నిర్మించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. హిందూ విశ్వాసం ప్రకారం,
ఈ శివాలయం నీటి మూలకాన్ని సూచిస్తుంది. దీంతో ఈ ఆలయ ప్రాంగణంలో ఎల్లప్పుడూ తేమ ఉంటుంది.
ఇక్కడ కావేరీ నదిలో స్నానం చేయడం, జంబుకేశ్వరుడిని పూజించడం, విశిష్ట ఫలదాయకమని క్షేత్రమహత్యం
చెబుతోంది.
జంబుకేశ్వరుని ఆలయ నిర్మాణ శైలి, ద్రవిడ శైలిలో నిర్మించిన జంబుకేశ్వర
దేవాలయం, అత్యంత ప్రాచీన ఆలయాలలో ఒకటిగా పేరొందింది. గర్భగుడి ఆకారం చతురస్రాకారంలో
ఉంటుంది. ఎత్తయిన గోపురాలతో, విశాలమైన ప్రాకారాలతో, వివిధమైన ఉపాలయాలతో, మండపాలతో,
తీర్థాలతో సందర్శకులను ఎంతగానో అలరిస్తుంది. ఈ శివాలయం ప్రత్యేకత ఏమిటంటే, దేవతా విగ్రహాలు
ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. ఆలయాల లోపల ఇలాంటి ఏర్పాటును ఉపదేశ స్థలం అంటారు. ఇక్కడ
శివపార్వతులతో పాటు బ్రహ్మ, విష్ణువు విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆలయ గోడలపై దేవతామూర్తుల
విగ్రహాలు కూడా చెక్కబడ్డాయి. ఈ ఆలయం లోపల, మూలకాలలో నీటి మూలకాన్ని సూచించే ఐదు ప్రాంగణాలు
ఉన్నాయి. ఆలయ ఐదవ సముదాయానికి రక్షణ కోసం భారీ గోడను నిర్మించారు, దీనిని స్థానిక ప్రజలు
విబూది ప్రకాశంగా పిలుస్తారు.
శివుడే స్వయంగా నిరించుకున్న ఆలయం.
ఈ ఆలయం నాలుగవ ప్రాకారం 32 అడుగుల ఎత్తు, వేలాది అడుగుల చుట్టుకొలతతో
చూడముచ్చట గొలుపుతుంటుంది. అత్యద్భుతమైన ఈ ఆలయ ప్రాకారాన్ని స్వయంగా శివుడే తన భక్తుడి
కోసం వృద్ధశిల్పి రూపంలో వచ్చి, దేవతలను కట్టడ నిర్మాణ నిపుణులుగా మార్చి నిర్మాణాన్ని
పూర్తి చేసినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది.
జంబుకేశ్వర దేవాలయం పౌరాణిక కథ:-
ఈ శివాలయానికి సంబంధించిన కథనం ప్రకారం, పార్వతీ దేవి .. ఒకసారి
శివుడిని చూసి నవ్వినప్పుడు.. ఆ మహాదేవుడు ఆమెకు శిక్షగా భూమిపైకి వెళ్లి తపస్సు చేయమని
ఆదేశించాడు. పార్వతి తల్లి, అఖిలాండేశ్వరి రూపంలో జంబూ వనానికి చేరుకుని, చెట్టు కింద
శివలింగాన్ని తయారు చేసి, పూజించడం ప్రారంభించిందని పురాణాల కథనం. మహాదేవుడు .. పార్వతి
తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. జంబుకేశ్వర ఆలయంలో.. శివ పార్వతుల విగ్రహాలు ఒకదానికొకటి
ఎదురుగా ప్రతిష్టించబడ్డాయి. ఈ ఆలయ ప్రాంగణంలో వివాహాలు జరగవు. ఇక్కడి పూజారులు స్త్రీల
వస్త్రాలు ధరించి, జంబుకేశ్వరుడిని పూజిస్తారు.
మరొక కథ:
జంబుకేశ్వరానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి.
జంబూ అంటే తెల్లనేరేడు అని అర్థం. ఇక్కడ తెల్లనేరేడు చెట్లు అధికంగా ఉండటం వల్ల, దీనికి
జంబుకేశ్వరం అనే పేరు వచ్చింది. పూర్వం శంభుడనే రుషి ఉండేవాడు. ఆయన మహా శివభక్తుడు.
శివుని ప్రత్యక్షంగా దర్శించుకుని పూజించాలని, శివుని గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు
మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, ‘‘నేను ఇక్కడ లింగరూపంలో కొలువుదీరుతాను, అని వరం ఇచ్చాడని
స్థల పురాణం.
ఇక్కడ స్వామివారు ఏనుగుల చేత పూజలందుకొన్న క్షేత్రము అని అర్థం.
జంబుకేశ్వరస్వామి దేవేరి అఖిలాండేశ్వరి అమ్మవారు.. చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు.
నాలుగు భుజాలలో పై రెండు చేతులతో కలువలు పట్టుకొన్నట్లు, క్రింది చేతులు అభయ హస్తం,
వరద ముద్రతో భక్తులకు దర్శనం ఇస్తారు.......