శ్రీ హనుమాన్ జయంతి
'కలౌ కపి వినాయకౌ' అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు, హనుమంతుడు అని అర్థం. శ్రీ రామచంద్రుని పరమభక్తుడైన శ్రీ హనుమంతుడు వైశాఖ బహుళ దశమి శనివారం రోజు పూర్వాభాద్రా నక్షత్రంలో, నైరుతి యోగాన మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నంలో కౌండిన్యస గోత్రంలో జన్మించాడు అని శ్రీ హనుమత్కధకు పరాశర సంహిత ప్రామాణిక గ్రంథంలో పేర్కొనబడింది.
వైశాఖేమాసి కృష్ణాయాం దశమీ మందసంయుతా
పూర్వప్రోష్టపదాయుక్తా తదా వైద్రుతి సంయుతా
తస్యాం మధ్యాహ్న వేళయామ్ జనయా మాసవైసుతమ్
మహాబలం మహాసత్వం విష్ణు భక్తి పారాయణమ్
లోకానుగ్రహ కాంక్షతో, రాక్షస సంహారార్థం రామ కార్య నిర్వహణకు హనుమంతుడు ఉదయించాడు. హనుమంతుడు అంజనాకేసరుల కుమారుడు. పుంజికస్థల అనే అప్సరస అంజనాదేవిగా జన్మించింది. శివుడి అష్టమూర్తి అయిన వాయువు ద్వారా రుద్రాంశ ఆమెలోని హితమై హనుమంతుడు అవతరించాడు.
లోకానుగ్రహకాంక్షతో, రాక్షస సంహారార్థం రామ కార్య నిర్వహణకు హనుమంతుడు ఉదయించాడు. హనుమ అంజనాకేసరుల కుమారుడు. ఏకాదశ (11) రుద్రులలో ఒకరు శ్రీ ఆంజనేయస్వామి. పరమశివుడి అంశతో జన్మించిన సప్త చిరంజీవులలో ఒకరు.
హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః
రామేష్ఠః ఫాల్గుణసఖః పింగాక్షోః అమిత విక్రమః
ఉదధిల్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్
భావం … హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు, వాయుదేవుని ఔరస పుత్రుడు, మహాబలుడు, శ్రీరామ దాసుడు, అర్జునుని సఖుడు, ఎఱ్ఱని కన్నులుగల వానరుడు, అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడు, లంకలో బంధీ అయిన సీతమ్మతల్లి శోకాన్ని హరించినవాడు, ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుకు వచ్చి యుద్ధమున వివశుడైన లక్ష్మణుని ప్రాణములు నిలిపినవాడు, దశకంఠుడైన రావణాసురుని గర్వాన్ని అణచినవాడు, హనుమంతుని ఈ నామములు నిదురించుటకు ముందు, ప్రయాణమునకు ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్ర విజయం లభిస్తుంది.
యాత్ర యాత్ర రఘునాథ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తాకాంజిలిమ్ !
భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్ !!
అర్థం : ఎక్కడెక్కడ శ్రీరామ సంకీర్తనం జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందభాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును.
యత్రాస్తి భోగో సహి మోక్షః యత్రాస్తి మొక్షోనమి తత్ర భోగః
శ్రీ మారుతీస్సేవనం తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థఏవ
అర్థం : కేవలం భోగాలలోనే ఉంటే మోక్షం రాదు. ఇక ముముక్షువులకయితే భోగాల ప్రసక్రి లేదు. కొందరు దేవతలు కేవలం భోగాలను మాత్రమే ఇస్తారు. మరికొందరు మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఈ 'ఆంజనేయస్వామి' వారు అటు భోగాన్ని, ఇటు మోక్షాన్ని రెండింటినీ ఇవ్వగల కల్పవృక్షం, కామధేనువు, చింతామణిగా చెప్పుకోవచ్చు.
ఏకోదేవ స్సర్వద శ్రీ హనుమా నేకోమంత్ర శ్రీహనిమత్ప్రకాశః !
ఎకోమూర్తి శ్రీహనుమత్స్యరూపా చైకం కర్మ శ్రీహనుమత్సపర్యా !!
సత్య పదార్థమైన బ్రహ్మము ఒక్కడే,ఆయనే హనుమంతుడు. ఒక్కటే మంత్రం ఉంది అది శ్రీహనుమంతుడి మంత్రమే. ఒక్కటే మూర్తి ఉంది ఆయనే హనుమంతుడు. ఇక మనం చేయవలసింది ఒక్కటే,అది హనుమంతుని సేవా, పూజ అని పరాశరుడు మైత్రేయుడికి బోధించినట్లు తెలుస్తుంది.
హనుమంతుడిని ఆంజనేయుడు, హనుమాన్, భజరంగభళి వంటి పేర్లతో ఆరాధిస్తారు. హనుమంతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. హనుమంతుడికి ఐదు ప్రదక్షిణాలు, ఐదు అరటిపళ్ళు, ఐదు మామిడిపళ్ళు అంటే మరింత ప్రీతికరం. చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి వరకు అంటే మండలం (40 రోజులు) ప్రతిరోజూ 1, 3, 5, 11. 41 ఎవరికి వీలైనన్ని సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. హనుమత్ జయంతి రోజున శ్రీ స్వామివారికి అష్టోత్తరంతో విశేష పూజలు, శ్రీరామ భజనలు, సుందరకాండ పఠనం, హనుమాన్ చాలీసా వంటివి పారాయణ చేయాలి. హనుమాన్ జయంతి సందర్భంగా పంచముఖ ఆంజనేయ, పాదరస ఆంజనేయ తదితర విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. హనుమాన్ జయంతి సంవత్సరంలో మూడుసార్లు వస్తుంది. ఒక్కొక్క ప్రాంతవాసులు ఒక్కొక్కసారి జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమిరోజున హనుమాన్ జయంతి చేసుకుంటారు, మరికొందరు వైశాఖ మాసంలోని దశమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. తమిళులు, కేరళీయులు మార్గశిర మాసంలో హనుమాన్ జయంతి జరుపుకుంటారు. హనుమంతుడు శ్రీరాముడికి ఎంతటి భక్తుడంటే తన మనసునే మందిరంగా చేసి ఆరాధించాడు. హనుమంతుడి గుండెలు చీల్చి చూపించగా సీతారాములే దర్శనం ఇచ్చారు. హనుమంతుడి కృపకు తొందరగా పాత్రులు కావాలనుకునే వారు అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేలా అలంకారం చేసి అప్పుడు హనుమాన్ జయంతిని నిర్వహించాలి. అరటి తోటలోకి వెళ్ళి హనుమాన్ యంత్రం కానీ హనుమంతుడి బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు ఉపాసన చేసినట్లయితే స్వామి ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. హనుమాన్ తొందరగా ప్రీతి చెందేది అరటిపళ్ళ ద్వారా. కదళిపూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి చేస్తే ఎదో ఒక రూపంలో మీ కంటికి కనబడే రూపంతో రాకపోకాచ్చు కానీ ఎదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకుని వెళ్ళితీరుతారు. వానరరూపంలో వస్తారు. కాబట్టి హనుమాన్ జయంతిని భక్తులు మరింత భక్తిశ్రద్ధలతో హనుమంతుడిని పూజలు, అర్చనలు, నైవేద్యాలు నివేదించాలి.
Note: HTML is not translated!