Akshaya Tritiya

అక్షయ తృతీయ

వైశాఖ శుద్ధ తదియను అక్షయతృతీయ అని అంటారు. అక్షయము అంటే క్షయం లేనిది, లేక్కలేనిది అని అర్థాలు ఉన్నాయి. ఈ రోజునే కృతయుగం ప్రారంభం అయింది అని పురాణాల ద్వారా తెలుస్తుంది. కాబట్టే కృతయుగాదే అక్షయతృతీయగా వ్యవహారంలోకి వచ్చిందని పండితులు చెబుతున్నారు. అక్షయతృతీయ రోజునే శ్రీమన్నారాయణుడి ఆరవతారం పరశురాముడు జన్మించాడు అని పురాణాలు చెబుతున్నాయి. అక్షయతృతీయ రోజున ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో చందనోత్సవం జరుపుతారు. అంటే సంవత్సరంలో ఒకసారి మాత్రమే సింహాచల అప్పన్న నిజరూప దర్శనం కలుగుతుంది. మితిలిన రోజులలో స్వామివారిని చందనంతో అలకరిస్తారు. అక్షయతృతీయ రోజున స్వామివారికి కొత్తగా చందనాన్ని పూస్తారు. శ్రీనృశింహస్వామి తన భక్తుడైన ప్రహ్లాదుడిని అనుగ్రహించింది అక్షయతృతీయ రోజునే అని పురాణాలు వెల్లడిస్తున్నాయి. మత్స్య పురాణంలోని అరవై ఐదవ అధ్యాయం ప్రకారం, ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయతృతీయ వ్రతం గురించి తెలిపాడు. వైశాఖ శుద్ధ తదియ రోజున చేసేటువంటి ఎలాంటి వ్రతమైనా, జపం అయినా, హోమం అయినా, దానాలు ఏవైనా దాని ఫలితం అక్షయం అవుతుంది. అక్షయతృతీయ రోజున తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. ఈ రోజున ఉపవాసం చేసి, ఎటువంటి పుణ్య కార్యం చేసినా దానికి సంబంధించిన ఫలితం అక్షయంగానే లభిస్తుంది. అక్షయతృతీయ తిథి రోజున అక్షయుడైన శ్రీమహావిష్ణువు పూజింపబడతారు. అక్షయతృతీయ రోజున ఆక్షతోదకంతో స్నానం చేసి, అక్షతలను శ్రీమహావిష్ణువు పాదాలపై పెట్టి ఆచరించిన తరువాత ఆ బియ్యాన్ని చక్కగా మరొకసారి ఏరి బ్రాహ్మణులకు దానం ఇచ్చి, మిగిలిన వాటిని దైవ సంబంధిత, బ్రాహ్మణ సంబంధిత ఇష్టంగా తలపోసి వాటిని ప్రసాదంగా స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పకుండా కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. వైశాఖ శుక్ల తదియ రోజున నియమంతో, నిష్ఠతో అక్షయతృతీయ వ్రతాన్ని ఆచరించిన తరువాత పన్నెండు మాసాలలో శుక్ల తృతీయ రోజున ఉపవాసం ఉండి విష్ణువును భక్తిపూర్వకంగా అర్చిస్తే రాజసూయ యాగం చేసిన ఫలితం కలుగి అంత్యంలో శ్రీహరి సన్నిధికి చేరుకుంటారు. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి తప్పకుండా గంగా స్నానం చేయాలి అలా కాని పక్షంలో 'ఓం గంగాయై నమః' అని మనసులో జపిస్తూ స్నానం చేయాలి. అక్షయ తృతీయ రోజున మట్టిని పూజించాలి. ఈ రోజు మట్టిని పూజించడం వలన ధనలక్ష్మీ, దాన్యలక్ష్మీ, వైభవలక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. అక్షయతృతీయ రోజున విత్తనాలు చల్లాలి లేదా ఒక మొక్క నాటాలి అని సంప్రదాయం చెపుతుంది. అక్షయతృతీయ పితృదేవతలకు తర్పణాలు విడిచినట్లయితే వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. అక్షయతృతీయ రోజున విసినకర్రలు, గొడుగు, నీళ్ళు, గోదానం చేయాలి.

ఈ రోజున బంగారం కొనడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ రోజు తప్పకుండా బంగారం కొనాలని అంటారు. బంగారం కొంటే అక్షయం అవుతుందని అంటారు.

 

0 Comments To "Akshaya Tritiya"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!