Why did Paramashiva as Dakshinamurthi become Dakshinabhimukhu..!

Why did Paramashiva as Dakshinamurthi become Dakshinabhimukhu..!

 

పరమశివుడు దక్షిణామూర్తిగా దక్షిణాభిముఖుడే ఎందుకయ్యాడు..!

పరమశివుడు మహర్షులకు జ్ఞానాన్ని బోధించదలచి దక్షిణాభిముఖుడై వటవృక్షం క్రింద కూర్చున్నాడు. అయితే,  దక్షిణాభిముఖుడే ఎందుకయ్యాడు...? ఉత్తరాభిముఖులైన జిజ్ఞాసాపరులకు జ్ఞానాన్ని బోధించేందుకే. మరి వారెందుకు ఉత్తరాభిముఖులే అయి ఉంటున్నారు?  అసలు ఉత్తర దక్షిణాలు – తూర్పు పడమరలు సూర్యగమనం వల్ల ఏర్పడే దిక్కులేనా? కాదు.  వీటికి అంతర్యంగా గొప్ప అర్దం ఉంది.


 ప్రతి మానవుడు బుద్ధిని కలిగి ఉన్నాడు.  అయితే,  ఆ బుద్దిలోని తెలివి అందరిది ఒకే రకంగా ఉండదు.  కనుకనే... వారి ప్రవర్తన కూడా ఒకే రకంగా ఉండదు. ఎవరి బుద్దిలో ఎటువంటి లక్ష్యం ఉంటుందో  వారి నడక ప్రయాణం కూడా ఆ లక్ష్యం వైపుగానే ఉంటుంది. వారి వారి నడతలను బట్టి మానవులను  నాలుగు విధాలుగా విభజించవచ్చు.


 1. కొందరు మానవులు తమ తమ పుట్టు పూర్వోత్తరాలను, తమ వంశ చరిత్రను, పూర్వీకుల గొప్పతనాన్ని, జరిగిపోయిన విషయాలను తలచుకుంటూ మురిసిపోతూ ఉంటారు.  వీరే పూర్వభిముఖులు.  అంటే తూర్పు దిక్కుకు తిరిగినవారు అని అర్థం. (పూర్వ=తూర్పు)


 2. మరి కొందరు మానవులు తమ భవిష్యత్తును గురించి ఊహించుకుంటూ,  రాబోయే వాటికోసం ఎదురు తెన్నులు చూస్తూ, ఎప్పుడూ జరగబోయే వాటి గురించే ఆలోచిస్తారు.  వీరు పశ్చిమాభిముఖులు. అంటే,  పడమర దిక్కున తిరిగినవారు అని అర్థం. (పశ్చిమ=పడమర)


 3. చాలా మంది మానవులు ప్రపంచ ప్రమేయాలతో ఇరుక్కుపోయేవారు. 

జీవితం-ప్రపంచం-సుఖాలు-భోగాలు-సంపాదన-అనుభవించటం అంటూ ఇందులోనే కూరుకుపోయేవారు. వీరే దక్షిణాభిముఖులు.  అంటే,  దక్షిణ దిక్కున తిరిగిన వారు అని అర్దం


 4. ఇక చాలా కొద్ది మంది మాత్రం - పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కారణంగా, 

పెద్దల యొక్క మహాత్ముల యొక్క సేవ చేసిన కారణంగా ఈ ప్రపంచ పరిమితులను దాటిపోయి 

సంసార జనన మరణ దుఃఖాల నుండి తరించి ముక్తులు కావాలని కోరుకునే వారు.  వీరే ఉత్తరాభిముఖులు.

(ఉత్+తర =తరించి పైకి పోవాలనుకునేవారు).


ఇలా నాలుగు రకాలైన మార్గాలలో ప్రయాణించే మానవుల యొక్క స్థితిని తెలియచేసేవియే నాలుగు దిక్కులు. ప్రపంచం నుండి తరించి బయట పడాలనుకునే ముముక్షువులే ఉత్తరాభిముఖులు. కనుక, సనకసనందాది మునులు జ్ఞానపిపాసులు కనుక  వారు ఉత్తరాభిముఖులు అని చెప్పటం జరిగింది. ఉత్తరాభిముఖులైన మహర్షులకు జ్ఞాన భోద చేయాలి కనుక పరమేశ్వరుడు దక్షిణాభిముఖుడు అయ్యాడు.