వార ఫలాలు 14-01-2024 నుండి 20-01-2024 వరకు

వార ఫలాలు 14-01-2024 నుండి 20-01-2024 వరకు

మేషం: వారికి ఈవారం కొంత  మానసికంగా, శారీరకంగా శ్రమ ఉన్నప్పటికీ వారం చివరిలో అభివృద్ధి అనుకూలమైన ఫలితాలుంటాయి. గతంలో మీరు పట్టిన  ఓర్పుకు ఫలితములు తప్పక వస్తాయి. అనుకున్న పనులు కొంత కొలిక్కి వస్తాయి. అభివృద్ధి ఒకేసారి  అందకపోయినా ఫలితం  వస్తుంది  అన్న నమ్మకం ఏర్పడుతుంది. క్రమక్రమాభివృద్ది ఏర్పడుతుంది. ఉద్యోగ పరంగా గతంలో మిమ్మల్ని  ఇబ్బంది పెట్టిన సమస్యలు కొంత సానుకూలపడతాయి.  కొంత విశ్రాంతి    ఏర్పడుతుంది. కుటుంబ పరంగా సంతోషం లభిస్తుంది.  సమయం సరదాగా గడుపుతారు.

అయితే  మీరు సరదాగా ఉన్నప్పుడైనా ఎదుటి వారిని  ఇబ్బంది  పెట్టె విధంగా, కష్ట  పెట్టె విధంగా మాట్లాడకండి, ఆలోచించి ప్రశాంతముగా మాట్లాడడం మంచిది. వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా ఉంటుంది. అయితే  కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా చేయకండి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు చేయండి. లేనిపోని ఆందోళనలు పెట్టుకోకండి.  ప్రయాణముల వలన ఖర్చులు అధికంగా కనబడతాయి. కొంత శారీరక అలసట ఉంటుంది.  మనోవాంఛలు సిద్ధిస్తాయి. అనుకున్న సమయానికి డబ్బు రావడంతో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు.


వృషభం: వారికి ఈవారం  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి, అయితే మీకు జరిగే మంచి కానివ్వండి,  చెడు  కానివ్వండి  ఏ విషయంలో అయినా మీ స్వయంకృతాపరాధములే  ఎక్కువ ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయములు, చేసే పనులు విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అంటే ఉద్యోగస్తులకు అధికారులతో కానీ, సహా ఉద్యోగస్థులతో కానీ చిన్న పాటి తగాదాలు వచ్చే అవకాశములు ఉంటాయి, వాటిని మీ తెలివితేటలతో అధిగమించాల్సి వస్తుంది. వ్యాపారస్తులకు అధిక పెట్టుబడులు, ఖర్చులు ఎదురవుతాయి, ధైర్యాన్ని కోల్పోకండి. మిమ్మల్ని, మీ ఎదుగుదలకు కాస్త అడ్డుపడేవారిని, ఇబ్బంది పెట్టేవారికి కోపంతో కాకుండా కొంత లౌక్యంతో సమాధానం చెప్పి తప్పించుకోవడం మంచిది. 

ఒకవిధంగా మీ బుద్ధిబలానికి పరీక్షా సమయం అని చెప్పవచ్చు. ఎవరో చెప్పిన విధంగా కాకుండా మంచిచెడులు మీ వ్యక్తిగతంగా ఆలోచించి నిర్ణయములు, సలహాలు తీసుకోవడం మంచిది. కుటుంబ పరంగా కూడా పెద్దవారితో కానీ, స్త్రీలతో కానీ స్వల్ప చికాకులు ఏర్పడవచ్చు. అది మీ మనో విచారమునకు కారణమవ్వవచ్చు. అయితే ఎంత కాదనుకున్న ఖర్చులు  ఎక్కువ అవుతాయి. ఏమనుకున్నా జరిగేవి జరుగుతాయి అనే ధోరణిలో ఉంటారు. కుటుంబంలో అనారోగ్య పరిస్థితులు  విషయంలో కొంత జాగ్రత్త వహించండి. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసేవారికి కొంత నిరాశ ఏర్పడవచ్చు. అధైర్య పడకండి. ప్రయత్నములు ఆపకండి. కష్టేఫలి అన్నట్టుగా ముందుకు సాగండి, విజయం వరిస్తుంది.


మిథునం: వారికీ ఈవారం అంత అనుకూలమైన ఫలితములు ఉండకపోవచ్చు, కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. ఋణములు, లోన్లు వంటి వాటి విషయంలో తగాదాలు, చికాకులు ఉండే అవకాశములు ఉన్నాయి. ఆదాయం ఎలా ఉన్నప్పటికీ, మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశములు ఉన్నాయి. ఎం చేయాలో తోచని పరిస్థితులుగా గోచరిస్తాయి. అయితే వారం చివరకు అనుకున్న పనులు పూర్తిగా నెరవేరకపోయినా కొంత ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల వలన భయం, ప్రైవేట్ ఉద్యోగస్తులకు అయితే ఉద్యోగ విషయంలో కొంత  భయాందోళనలు ఉండే అవకాశములు ఉన్నాయి.  

సహా ఉద్యోగస్థులతో కానీ, పైఅధికారులతో కానీ జాగ్రత్త గా ఉండండి.  తగాదాలకు, కోపములకు మంచి సమయం కాదు. కుటుంబ పరంగా  జీవిత భాగస్వామితో  ఆర్ధిక పరమైన మాట పట్టింపులు ఉండే అవకాశములు ఉన్నాయి. కుటుంబంలో వారి ఖర్చులు, కోరికలు మీకు వృధాగా  కనిపిస్తాయి, ఎదో ఒకరకంగా స్వల్ప తగాదాలు అయ్యే అవకాశములు ఉంటాయి, మీరు కొంత ఓర్పుతో మీ పరిస్థితి అర్ధం అయ్యేటట్టు చెప్పి ఖర్చులు నివారించుకొనుటకు ప్రయత్నించడం మంచిది. అంతే కానీ కోపమునకు, ఉద్రేకమునకు లోనవ్వడం మంచిది కాదు. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. శారీరక ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించండి.


కర్కాటకం: వారికి ఈవారం చాలా వరకు అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. వ్యవహారములు పట్ల, కార్యానుకూలత ఉంటుంది. ఏదైనా అనుకున్న పనులు, చాలాకాలం నుండి పెండింగ్ లో ఉన్న స్థిరాస్తి వ్యవహారములు ఓకే కొలిక్కి  వస్తాయి, ప్రయత్న లోపం లేకుండా చేయండి. మీరు అనుకున్న విజయములు పొందగలుగుతారు. కుటుంబంలో, పెద్దలు అలాగే మిత్రుల నుండి సహాయ సహకారములు లభిస్తాయి. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి కొంత నిరాశ ఏర్పడవచ్చు.  ఉద్యోగ విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశాలున్నాయి. మీ లోపం ఏమి ఉండదు కానీ రెకమండేషన్స్ వలన రావాల్సిన వుద్యోగం రాదు.  కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ఆలోచించి ముందుకు సాగండి. కొంత పట్టుదలతో ఉంటె వారం చివరలో కొంత సానుకూలత ఏర్పడుతుంది. 

వ్యాపారస్తులకు మంచి ఆర్థికాభివృద్ధి ఉంటుంది. లాభములు ఉంటాయి. ప్రజాదరణ పొందుతారు. ఖర్చు పెట్టిన దానికి ప్రతిఫలం ఏర్పడింది అనే సంతోషం కలుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే మీ జయాపజయాలు రెండింటికీ మీ యొక్క మాటతీరు కారణమవుతుంది. కాబట్టి  వ్యవహారములు, విషయములు మాట్లాడేటప్పుడు  కొంత జాగ్రత్త వహించండి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. వివాహ ప్రయత్నములు చేసే వారు, చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడినప్పటికీ ప్రయత్నములు ఆపడం మంచిది కాదు. ఫలితములు నిదానంగా  లభిస్తాయి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుంది.


సింహం: వారికి ఈవారం ఉద్యోగస్తులకు, కులవృత్తులు చేసే వారికి, వ్యవసాయదారులకు మంచి అనుకూలమైన ఫలితములు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు వంటివాటికి మంచి అనుకూలమైన సమయం. నూతన ఉద్యోగ ప్రయత్నములు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఆర్ధికంగా అభివృద్ధి కనబడుతుంది. కొత్త ప్రాజెక్టులు వస్తాయి. టీం వర్క్ తో ముందుకు సాగండి. వ్యాపారస్తులకు కొంత వ్యాపార  నష్టం ఏర్పడే అవకాశములు ఉన్నాయి. అనవసరమైన శ్రమ ఉండవచ్చు, నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి, పెట్టుబడులు ఈ వారం చేయడం మంచిది. విలాసములకు కొంత ఖర్చులు అయ్యే అవకాశములు ఉన్నాయి. కుటుంబంతో సంతోషంగా గడపాలని మీరు అనుకున్నప్పటికీ జీవిత భాగస్వామితో కానీ, సంతానంతో కానీ చిన్న పాటి విభేధములు వచ్చే వకాశములు ఉన్నాయి. 

శత్రువర్గం నుండి లేనిపోని నిందలు మాటలు పడవలసి రావచ్చు. అంతర్గత విమర్శలు ఎక్కువ అవుతాయి.  పాత స్నేహితులను  కలిసే అవకాశములు ఉన్నాయి. దానితో సర్వ దుఃఖములు మరచిపోయినంత ఆనందం లభిస్తుంది. వివాహ పరంగా ప్రయత్నములు చేసే వారికి కొంత మంచి ఫలితాలు అని చెప్పవచ్చు, ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈవారం బాగుంది అని చెప్పవచ్చు.  రాథమిక విద్యా  విద్యార్థులకు మంచి ఫలితాలు, విజయములుంటాయి.  ఇంజనీరింగ్, ఎంబీఏ  వంటి విద్యార్థులకు కొంత టెన్సన్స్ ఉండే అవకాశములు ఉన్నాయి. పట్టుదలతో ముందుకు సాగితే విజయములు తప్పక వరిస్తాయి. కొంత బద్దకములు విడిచిపెట్టి ఉత్సాహంతో ముందుకు సాగడం మంచిది.


కన్య: వారికి ఈవారం మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నాయి.   కుటుంబ పరముగా ఆనందకరమైన వాతావరణం ఉంటుంది.  బంధువర్గం తో కలయిక, కుటుంబంలో  గౌరవం వలన సంతోషం లభిస్తుంది. స్నేహ వర్గంతో కూడా సాన్నిహిత్యం, ఆదరణ  బాగుంటుంది. బంధువర్గంతో, స్నేహితులతో  అందరితో కలయిక  ఉన్నప్పటికీ సరదాగా గడపడం మంచిదే కానీ మీయొక్క కష్టసుఖముల గురించి చెప్పడం అంత మంచిది కాదు. వ్యాపారస్తులకు కూడా బయట నలుగురిలో మాట చెలామణీ అవ్వడం వంటివి ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికాభివృద్ది బాగుంటుంది. అయితే శత్రువర్గం ఉన్నట్లైతే విమర్శలు వచ్చే అవకాశములు లేకపోలేవు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలను కానీ, ఆర్థికాభివృద్ధిని కానీ తట్టుకోలేని   వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. 

మీ ఆర్థికాభివృద్ధిని ఏమి చేయలేకపోయినప్పటికీ మీ యొక్క కీర్తి ప్రతిష్టలపై బురద చల్లే ప్రయత్నములు జరుగుతాయి. కాబట్టి  కొంత జాగ్రత్త వహించండి. తగాదాలకు, వివాదాలకు దూరంగా ఉండడం చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఫలితములుంటాయి. పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. అయితే సంతాన పరంగా కానీ, బంధువుల నుండి చేడు వార్తలు వినడం వంటివి కానీ కొంత ఆందోళనకు గురి చేస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితములుంటాయి. నూతన విద్యా విధానములు కొరకు ప్రయత్నించే వారికి మంచి సలహాలు అందుతాయి. వివాహ ప్రయత్నములు చేసే వారికి మంచి ఫలితాలుండే అవకాశములు ఉన్నాయి.  ఆరోగ్య పరంగా కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు.


తుల: వారికి ఈవారం ఆర్థికపరమైన అభివృద్ధి సంతోషాన్ని కలుగ చేస్తుంది. అనుకోని విధంగా ధనం  చేతికి అందుతుంది. కుటుంబ పరంగా సుఖ, సౌఖ్యములు కలుగుతాయి. సంతాన పరంగా  అనుకూలమైన వార్తలు వింటారు. ఆరోగ్య పరంగా గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినట్లయితే అవి ఇప్పుడు ఇబ్బంది పెడతాయి. దీర్ఘ కాలిక  వ్యాధుల విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. ఉద్యోగస్తులకు అధికారులతో  , శత్రువర్గంతో కొంత భయపడే  సమయం అని చెప్పవచ్చు. ఎన్ని లాభములు ఉన్నప్పటికీ పాత అప్పులు, లోన్లు వంటి వాటిని తీర్చే విషయంలో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. 

సంసారంలో అశాంతి, ఋణ దాతల నుండి ఒత్తిడి వంటివి  ఏర్పడే అవకాశములు ఉన్నాయి.  కుటుంబానికి  ఎంత ప్రయారిటీ ఇచ్చినప్పటికీ వారు సరిగా అర్ధం చేసుకోవట్లేదు అనే ధోరణి లో ఉంటారు. ప్రయాణములకు అంత అనుకూలం కాదు, విఘ్నములు ఎదురయ్యే అవకాశములు ఉన్నాయి.  ఖర్చులు అధికంగాను, అనవసరంగాను అనిపిస్తాయి. సంతానం కోసం ఎదురు చూసే వారికి శుభవార్తలు వార్తలు వినే అవకాశములు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికాభివృద్ధి కంటే స్థిరాస్థులు  వృద్ధి  చెందుతుంది. అన్ని విధముల ఖర్చులు ఎక్కువగా ఉన్నట్టు  అనిపిస్తుంది. విలాస వంతమైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేయడం జరుగుతుంది 

విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలు ఉంటాయి.


వృశ్చికం: వారికి ఈవారం అన్ని విధముల లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అన్ని విధముల బాగున్నప్పటికీ మీ యొక్క మాట తీరు, ప్రవర్తన వలన అనవసరమైన మాటలు పడే అవకాశములు ఉన్నాయి.  మీ అభివృద్ధి కానీ, మానసిక సంతృప్తి  కానీ అనుకూలంగా, ఆనందంగా  ఉంటాయి. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోయినట్టు అనిపిస్తాయి. అయితే మీరు సంతోషంగా ఉన్నారని ఎదుటివారి మనస్తత్వం తెలియకుండా, వారి అంతర్గత విషయములు తెలుసుకోకుండా సరదాకి అయినా నోరు జారవద్దు. ఉద్యోగ పరంగా గతంలో ఇబ్బందులు పడిన వారికి  ఈవారం బాగుంటుంది . అధికారులతో భయం, పని ఒత్తిడి ఉన్నప్పటికీ అభివృద్ధి మీకు సంతోషాన్ని కలుగ చేస్తుంది. నూతన వస్తువులు కొనుగోళ్లు చేస్తారు.     

వ్యాపారస్తులకు  ఆర్ధిక స్థిరత్వం బాగుంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహిస్తారు. గతంలో కంటే ఈవారం వ్యాపారం లాభసాటి కనిపిస్తుంది.  కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. నూతన వస్తువులు, గృహోపకరణ వస్తువులు  కొనుగోలు చేస్తారు. సర్వం అనుకూలంగా ఉన్నట్టుగా సంతోషం కలుగుతుంది. విద్యార్థులకు కూడా మంచి ఫలితములుంటాయి. విద్యపై శ్రద్దాసక్తులు, నమ్మకం పెరుగుతాయి. పట్టుదలతో ముందుకు సాగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. చిన్న చిన్న మనస్పర్థలు వలన కోపమునకు గురి అయ్యే అవకాశములు ఉన్నాయి. ప్రశాంతముగా ఉండడం మంచిది ఈవారం.


ధనస్సు: వారికి ఈవారం కొంత జాగ్రత్త వహించ వలసిన సమయం గా చెప్పవచ్చు. అన్ని విధముల అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది, మీరు అనుకున్న పనులు అవుతున్నట్టు ఉంటాయి, కానీ ఎదో తెలియని ఆందోళన నిరాశ వంటివి మనసులో ఏర్పడతాయి. ఆర్ధిక సమస్యలు,  ఖర్చులు మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి. ప్రతీ పనికి అనుకున్న దాని కంటే ఖర్చులు, మీరు అనుకున్న దాని కంటే ఎక్కువ అవడం వలన వృధా ప్రయాసకు గురి అయ్యే అవకాశములు ఉన్నాయి. కాబట్టి ఖర్చులు విషయంలో ఆలోచించి నిర్ణయములు తీసుకోవడం మంచిది.  ప్రయాణముల విషయంలో కానీ, చిన్న చిన్న  వ్యవహారములు విషయంలో కానీ మీరు తీసుకునే నిర్ణయముల వలన బంధువర్గంలో విభేధములు, సొంత వారితో విరోధములు ఏర్పడే అవకాశములు ఉన్నాయి. 

చంచలత్వం గా ఆలోచించకండి. స్థిరమైన ఆలోచనలు చేయండి, లేదా జీవిత భాగస్వామి, సంతానం యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. స్నేహితుల సలహాలు  అంతగా కలసిరాకపోవచ్చు.  అనుకున్న పనులలో అడ్డంకులు, విఘ్నములు వంటివి ఉంటాయి. పనులు కొంత జాప్యంగా జరుగుతాయి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితములు ఉంటాయి. ఎదో ఒక గందరగోళం తప్పదు అన్నట్టు ఆందోళనకరంగా పనులు నెరవేరుతాయి. కొంత మౌనంగా  ఉండడం,  ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచుకోవడం మంచిది.  నూతన ప్రణాళికలకు ఇది అంత అనుకూలమైన సమయం కాదు.  మంచికైనా, చెడుకైనా బలమైన నిర్ణయములు తొందరపడి తీసుకోవద్డు.


మకరం: వారికి ఈవారం ప్రతికూలమైన ఫలితాలుండే అవకాశములు ఉన్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు సానుకూల ఫలితములు యధాతధంగా  గోచరిస్తున్నాయి. ఆర్ధిక పరంగా పెద్దగా మార్పులు  ఉండకపోవచ్చు. కష్టానికి తగ్గ ఫలితం తక్కువగా ఉంటుంది.  అయితే కుటుంబ పరంగా కానీ, వ్యవహారముల విషయంలో కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు, ఆదాయమునకు మించిన ఖర్చులు ఎదురవుతాయి. కార్యాలయములలో కానీ, కుటుంబంలో కానీ స్త్రీల వలన సమస్యలు, మాట పట్టింపులు ఉండే అవకాశములు ఉన్నాయి. మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఎదుటి వారు అన్న పది మాటల కంటే  మీరు చెప్పే  ఒక్క సమాధానం వలన మిమ్మల్ని తప్పుగా చిత్రీకరించడం, భాధ పెట్టడం లాంటివి జరుగవచ్చు. 

ఉద్రేక పడడం అంత మంచిది కాదు. జీవిత భాగస్వామి సలహాలు సానుకూల పరుస్తాయి.  బంధువులతో కలయిక ఉంటుంది.  ఎవరో ఒకరిపై నిర్ణయాలు ఉంచి  మీరు తటస్థంగా ఉండడం అనేది చెప్పదగ్గ సూచన. కొత్త ఆలోచనలకు, నిర్ణయములకు ఇది అంత అనుకూలమైన సమయం కాదు. అలా అని విపరీతమైన భాధలు ఉండవు, సాధారణంగా చిన్నచిన్న తగాదాలు ఏర్పడవచ్చు. అనుకున్న పనులలో జాప్యం జరుగుతుంది, కంగారు పడవద్దు. ఆరోగ్య పరంగా స్వల్ప ఇబ్బందులు, ఒళ్లునొప్పులు, మోకాళ్ళ నొప్పులు, జ్వరం వంటివి ఉండవచ్చు. జాగ్రత్త వహించండి.


కుంభం: వారికి ఈవారం కొంత అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి.  గతంలో ఏర్పడిన ఇబ్బందులు, స్థిరాస్తి వ్యవహారములలో చిక్కులు ఉన్నవారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇప్పుడు మీరు చేసే ప్రయత్నములు శుభ ఫలితములను ఇస్తాయి. ఉద్యోగస్తులకు ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. అయితే స్నేహితులను, సహా ఉద్యోగస్తులను నమ్మి అంతర్గత విషయములు చర్చించడం అంత మంచిది కాదు. కుటుంబంతో  సంతోషముగా గడుపుతారు. సంతాన పరంగా అభివృద్ధి గౌరవం లభిస్తాయి. అయితే యువత  వ్యసనముల  విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఇప్పుడు విలాసాలకు, వ్యసనాలకు మీరు ఖర్చు చేసే సమయం కానీ, డబ్బు  గురించి కానీ  భవిష్యతులో  చాల ఇబ్బంది  పడవలసి ఉంటుంది. వ్యాపారస్తులకు  కొంత లాభసాటిగా ఉంటుంది. గతంలో ఆర్ధిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి.  వ్యాపార పరంగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు, అయితే  వ్యాపారంలో ఎక్కడో ఎదో తప్పు చేశామే అన్న భాద మిమ్మల్ని వెంటాడుతుంది. 

ఎవరో చెప్పిన మాటలు నమ్మి అత్యంత సన్నిహితులని, ముఖ్యులని వదులుకుంటారు. దాని వలన కొంత ఇబ్బంది వాతావరణం నెలకొంటుంది, వ్యాపారాన్ని, కుటుంబాన్ని ఎప్పుడును కలిపి చూడకండి.  ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులేర్పడవచు. రియల్ ఎస్టేట్ రంగం వారికి,  సాఫ్ట్ వేర్ రంగం వారికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.  ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఏది ఏమైనా బాధ్యతలు నెరవేరుస్తారు. ఇప్పుడు చేసే పనులు, తీసుకునే నిర్ణయములు కంగారు పడకుండా నిదానంగా తీసుకోండి, ఆలస్యం అయినప్పటికీ అనుకూల ఫలితాలుంటాయి. తొందరగా వచ్చే ఫలితాలు, అభివృద్ధి వాటి గురించి ఆలోచించకండి. నిదానంగా వచ్చినా స్థిరమైన అభివృద్ధి ఆలోచనలు చేయండి. అదృష్టం కంటే కష్టానికి  ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. భవిషత్తు బాగుంటుంది.


మీనం: వారికి ఈవారం అన్ని విధముల అనుకూలమైన ఫలితములుంటాయి. అయితే మీరు చేసే పనులు, తీసుకునే నిర్ణయముల పట్ల జాప్యం లేకుండా ఖచ్చితమైన నిర్ణయంతో ముందుకు సాగండి. ఉద్యోగస్తులకు మంచి  ఆర్ధికంగా అభివృద్ధి కనబడుతుంది.  అయితే ఉద్యోగం మార్పు, ప్రమోషన్ల కోసం   ప్రయత్నించే వారు తొందర పడడం మంచిదే. మీరు అనుకున్న మార్పులు జరిగినప్పటికీ కొంత పని ఒత్తిడి తప్పదు. కంగారు పడకండి. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికికూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు అనుకున్న లాభములు ఉంటాయి. లాభములతో పాటు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. గతంలో ఏర్పడిన మానసిక వేదనలు తగ్గుతాయి. ఆత్మ స్థైర్యం పెరుగుతుంది. మీమీద మీకు నమ్మకం పెరుగుతుంది. 

మీరు ఎంత కష్టపడితే అంత లాభం అని గ్రహించండి. కష్టంతో చేసిన పనులు లాభిస్తాయి. శుభకార్యములలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నములు చేసే వారికి అనుకూలమైన ఫలితములుంటాయి. వివాహ విషయంలో కొంత మొండి పట్టుదలకు పోకుండా నిర్ణయములు తీసుకోవడం మంచిది. ప్రస్తుతము ఆర్ధిక పరంగా, ఆరోగ్య పరంగా అన్ని విధముల బాగుంది నాకేం తక్కువ అనే ఆలోచనను పక్కకు పెట్టండి. వివాహ విషయములు స్థిరమైనవి, పరిస్థితులు ఎలా ఉన్న  ముందుకు సాగుతాయి. ఇప్పుడు అశ్రద్ధ చేసినట్లైతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతము ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ గురు గ్రహ అనుకూలత వలన కొన్ని సానుకూల ఫలితములు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నములు ముమ్మరం చేసుకోండి, తప్పక శుభ ఫలితములుంటాయి. గ్రహ గతుల వలన కొంత మానసిక సంఘర్షణ ఉండవచ్చు, అయితే పెద్దల, శ్రేయోభిలాషుల  సలహాలతో నిర్ణయం  తీసుకోవడం మంచిది.


                                            


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121