Vijaya Ekadashi 2023 : విజయ ఏకాదశి

Vijaya Ekadashi 2023 : విజయ ఏకాదశి


ఫిబ్రవరి 16వ తేదీ గురువారం విజయ ఏకాదశి సందర్భంగా...

విజయం తథ్యం

మాఘ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని "విజయ ఏకాదశి" అంటారు. ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారిని విజయం వరిస్తుంది, పాపాలు తొలగి పునీతులవుతారని శ్రీకృష్ణుడు యుధిష్టిర మహారాజుకు చెప్పాడని పురాణ వచనం. అలాగే విజయ ఏకాదశి విశిష్టత గురించి తెలపమని నారదుడు కోరగా బ్రహ్మ దేవుడు వివరించినట్టు కూడా పురాణాలు చెబుతున్నాయి.


సీతాదేవిని రావణుడు అపహరించుకు పోయిన తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక శ్రీరాముడు దిగులు పడ్డాడు. ఒక ఋషి దగ్గరికి వెళ్లి ఈ పరిస్థితిలో తన కర్తవ్యం ఏమిటీ అని అడిగాడు. అప్పుడా ఋషి ఈ విధంగా వివరించాడు.


ఏకాదశి ముందు రోజు అనగా దశమి రోజున ఒక వెండి.. ఇత్తడి లేదా బంగారం ఏది లేకపోతే మట్టి కుండ ఒకటి తీసుకుని అందులో నీరు పోసి నవధాన్యాలు, పసుపు కుంకుమ వేసి కుండకి తోరణాలు కట్టాలి. దానిని శ్రీమన్నారాయణుడి దగ్గర పెట్టాలి. మరునాడు ఏకాదశి ఉదయమే స్నానం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుడికి పూజ చేసి ఆ కుండకు పసుపు కుంకుమ, గంధం, అక్షింతలు వేసి నమస్కరించి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. రాత్రి జాగరణ చేయాలి. మరునాడు ద్వాదశి తిథి రాగానే మరల ఆ కుండకు పూజ చేసి ఏదైనా ఒక నదిలో కలిపేయాలి. తరువాత ఎవరికైనా భోజనం పెట్టి వ్రతం చేసేవారు భోజనం చేయాలి. ఈ విధంగా చేస్తే తప్పకుండ విజయం లభిస్తుంది.


శ్రీరామచంద్రుడు ఋషి చెప్పినట్టుగానే వ్రతం పాటించి లంక మీద విజయం సాదించాడు. ఈ వ్రతం ఎవరు అయితే ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఏకాదశి వ్రతం నమ్మకంతో భక్తీ శ్రద్ధలతో ఆచరించిన వారికి అతి ఘోరమైన పాపాలు కూడా హరించిపోతాయి. అంతేకాకుండా ఎవరు ఈ ఉపవాస దీక్ష చేస్తారో, ఈ కధ వింటారో వారికీ అశ్వమేధ యాగం చేసిన ఫలితం కూడ లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. విజయ ఏకాదశి విశిష్టత గురించి స్కాంద పురాణంలో, రామాయణంలో ప్రస్తావన ఉంది.


జై శ్రీమన్నారాయణ