శ్రీరాముడు సకల గుణాభిరాముడు

శ్రీరాముడు సకల గుణాభిరాముడు

శ్రీరాముడు సకల గుణాభిరాముడు రాఘవుడు... ఇన్ని నామాంతరాలు ఉన్న ఆ దశరథ రాముడు... ఆ రోజున తెల్లవారుజామునే మేల్కొన్నాడు... సరయూ జలాలలో అభ్యంగన స్నానం ఆచరించాడు... అల్లలాడుతున్న అలకలను సరిచేసుకున్నాడు... సూర్య వంశ చిహ్నంగా నుదుటన రవి తిలకం ధరించాడు రవికులుడు...
చల్లని వెన్నెలలు చిలకరించే రాజీవాక్షాలకు నల్లని కాటుక అలదాడు..

సీతమ్మకు ఆనవాలుగా పంపిన అంగుళీయకాన్ని వేలికి ధరించాడు... తన పట్టాభిషేక సమయానికి సిద్ధం చేయించిన వస్త్రాలు ధరించాడు.. నాడు భరతుడు సింహాసనం మీద ఉంచి పరిపాలన కొనసాగించిన పాదుకలలో పాదాలుంచాడు... బాల్యంలో చందమామ కావాలి అని మారాము చేసినప్పుడు అద్దంలో చందమామను చూపిన ఆ అద్దంలో ఇప్పుడు ఈ రామచంద్రుడు తన ముఖ బింబాన్ని చూసుకుని... చిరునవ్వులు చిందిస్తూ... గడప దాటి బయటకు అడుగు పెట్టబోతున్నాడు... సరిగ్గా అదే సమయానికి... గుమ్మం ముందర కవి సమూహం లోపలకు వస్తూ కనిపించారు.

వారికి వినమ్రపూర్వకంగా నమస్కరించి, లోపలకు ఆహ్వానించి, సముచిత స్థానాలు చూపి, ఆసీనులను చేసి, తాను కూడా గౌరవముద్రలో సింహాసనం అధిరోహించాడు..
అందరూ విశ్రాంతులైన పిదప... ‘వాల్మీకి మహర్షీ! మహానుభావులంతా ఒక్కసారే విచ్చేశారు. కారణం తెలుసుకోవచ్చా’ అని వినమ్రంగా ప్రశ్నించాడు. వాల్మీకి తన గుబురు శ్మశ్రువుల మాటు నుంచి చిన్నగా నవ్వుతూ, ‘ఏమయ్యా! నువ్వు ఇంత తొందరగా ఏదో పని మీద బయలుదేరినట్టున్నావు. విషయం తెలుసుకోవచ్చా’ అన్నాడు ఏమీ ఎరగనట్లు.

మహర్షీ! ఏమీ ఎరగనట్లు ప్రశ్నిస్తున్నారు. మీరే కదా నా కథను లవకుశల ద్వారా గానం చేయించి ప్రపంచానికి పరిచయం చేసింది. నాకు ఎంతటి మంచి లక్షణాలు ఉండాలో కూడా మీరే నిర్దేశించారు కదా. అటువంటి మీకు నేను ఎప్పుడు, ఎక్కడకు వెళ్తానో తెలియదా. నా నోటితో చెప్పించాలనే ఆలోచన కాకపోతేను’ అన్నాడు వాల్మీకి మహర్షితో చనువుగా.

నాకు తెలుసు రామా! నీ వినయం, విధేయత, గౌరవం... అన్నీ. ఈ రోజు ఇక్కడకు వచ్చినవారిని గమనించావా. వీరంతా నీ కథను ఇన్ని వేల సంవత్సరలుగా సజీవంగా ఉంచిన మహానుభావులు. నేను రాసిన కథను యథాతథంగా ఉంచకుండా, వారికి తోచిన కల్పనలు కూడా చేశారు. వీరందరికీ నువ్వంటే ప్రీతి. అందుకే వారి మనసుకి నచ్చిన విధంగా నిన్ను కీర్తించారు.

నిన్ను నెత్తిన పెట్టుకుని నేటికీ ‘రామాయణం’ అనే కావ్యాన్ని ‘రామ’ అనే తారక మంత్రాన్ని ఇంకా పచ్చిగా, లేతగా, తడి ఆరకుండా ఉంచారు... అని వాల్మీకి పారవశ్యంతో పలుకుతుంటే, రాముని శరీరం పులకించిపోయింది. రామా! నీకు ఒక్కొక్కరినీ మరోసారి పరిచయం చేస్తాను. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్లే సంతోషంలో ఉన్నావు. అందువల్ల నేను పరిచయం చేస్తేనే కాని వారిని నువ్వు జ్ఞప్తికి తెచ్చుకోలేవు.... అంటూ పండిత పరిషత్తు వైపునకు తల పరికించాడు.

ఇదిగో మొట్టమొదటగా చెప్పవలసిన వ్యక్తి కాళిదాసు. ఈయన కవికుల గురువు. నీ గొప్పదనాన్ని ‘రఘువంశం’ అనే కావ్యంగా వెలయించాడు. మీ కుటుంబాన్ని ఎంత గొప్పగా ప్రస్తుతించాడో తెలుసా. ఆ కవిత్వమంతా ఇప్పుడు చెప్పనులే. రేఖామాత్రంగానే పరిచయం చేస్తాను. ఇక ఆ పక్కన కూర్చున్న కవి భవభూతి. ఉత్తర రామ చరిత రచించి అందరి కంట నీరు పెట్టించాడు.

ఆ పక్కగా భక్తి వినమ్రలతో నిలబడి వున్న స్త్రీ మూర్తి మొల్ల.. అమే నువ్వే తన ప్రపంచం సర్వస్వం అనుకొని ఎంతో గొప్పగా నీ కథను మొల్ల రామాయణము గా వ్రాసిన వ్యక్తి.. ఆమెకు నీ ఆశీస్సులు అందించు.

ఆ పక్కనే ఉన్న భాసుడు ‘ప్రతిమ’ అనే నాటకాన్ని రచించాడు. ఆయనకు నా రామాయణంలోని కొన్ని విషయాలు నచ్చలేదు. అందుకని ఆయన కొన్ని కల్పనలు చేశాడు.కైకేయి దుర్బుద్ధికాని, లక్ష్మణుడు అవాచ్యకాలు పలకలడం కాని ఇందులో కనపడదు. దశరథ ప్రతిమా కల్పనం, దశరథ శ్రాద్ధ కలనం వంటి కొన్ని అంశాలు ఇందులోని కొత్త విషయాలు. అర్థమైందా ఈ కవి విలక్షణత. ఆయనకు కైకమ్మను నిందించాలనిపించలేదు.

సరే – ఇంక ఆ పక్కన చూడు... మురారి. ఆయనకు నా పేరు కూడా చేరింది. బాల వాల్మీకి అని పిలుస్తారు. ఎన్నో గురుకుల క్లేశాలు అనుభవించి, చివరకు కవికులంలో స్థానం సంపాదించాడు. ఆ మహానుభావుడు.. నీ తండ్రి దశరథుడిని ఎంత గొప్పగా ప్రశంసించాడో తెలుసా. ఆయనట ఏకంగా దిక్పాలకులను తన ఇంటి ముంగిట్లో బంధించేశాడు. అంటే వారికి పని లేకుండా నీ తండ్రి గారే ముల్లోకాలను సుభిక్షంగా పరిపాలించాడట.

అబ్బో ఈ కవి గురించి ఎంత చెప్పినా చాలదు. ఆయన మార్గమే వేరు. నీకు ముందు ముందు ఇటువంటి మార్గంలో వెళ్లిన మరో ఇద్దరిని గురించి చెబుతానులే. ఇక తెలుగు కవులలోకి వస్తే... అబ్బో... బోలెడు మంది.. తెలుగులో ఆది కావ్యం రచించిన నన్నయ మొదలుగా నిన్నమొన్నటి ఉషశ్రీ వరకు ఎంత మంది ఎంత అందంగా నీ కావ్యాన్న రచించారో.

కవిత్రయంలో మొదటివాడైన నన్నయభట్టు మహానుభావుడు భారత ఆంధ్రీకరణేకాకుండా నీ కథను ‘రాఘవాభ్యుదయం’ పేరిట తెలుగువారికి అందించాడు. ఆ కవిత్రయంలో రెండవ వాడైన తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ పేరున తొట్టతొలి ప్రబంధ కావ్యాన్ని, ఒక్క వచనం కూడా లేకుండా పూర్తి పద్యంలో రచించాడు. కవిత్రయంలో మూడవ వాడైన ఎరన్ర కూడా రామాయణం కావ్యాన్ని రచించాడు.

Products related to this article

Ram Parivar Idol

Ram Parivar Idol

Ram Parivar IdolSita Rama Lakshmana and Hanuman idols are made of with white  metal.Height of the Idol7 InchsWidth of the Idol9 InchsWeight 900 Grams Terms and Condtions : 1). The ..

$27.69

Rama maadalu (Copper)

Rama maadalu (Copper)

Rama maadalu (Copper) Rama maadalu is the copper dollar. One side with the images of Lord Rama, sita, Lakshmana and Hanuman and om at another side...

$2.00