Importance of Somvati Amavasya

 Importance of Somvati Amavasya


 అమావాస్య! సోమవారంతో కలసి వచ్చినది!! బహుపుణ్య మహోదయకాలం!!


 ఈశ్వరార్చన బహుపుణ్యప్రదం! 


 సోమావతి అమావాస్య 


 సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆ రోజును సోమావతి అమావాస్య అని పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.  సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి.సోమవతీ అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసినవి: 


1. సోమావతీ అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేయాలి. ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం.


2. ఈ సోమావతీ వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి.


3. శని మంత్రాన్ని పఠించి, శ్రీమన్నారాయణ మూర్తిని అర్చించాలి.


4. గంగా నది, త్రివేణీ సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతీ అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే, ఐశ్వర్యం కలుగుతుంది, రోగాలు, బాధలు తొలగుతాయి, పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది.


5. వేదవ్యాస మహర్షి చెప్పినదాని ప్రకారం - సోమావతీ అమావాస్య నాడు పేదవారికి గుప్తదానం చేసి, పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి వేయి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. 



 సోమావతి అమావాస్య గురించి ఒక కథకూడా ఉంది. దాని ప్రకారం … 


పూర్వం ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చేవాడు. ఆ వ్యాపారికి వివాహమైన ఏడుగురు కుమారులు, పెళ్లికాని కుమార్తె ఉండేవారు. ఒకరోజు పెళ్ళికాని ఆ కుమార్తెనును ఆ సాధువు చూసి కూడా దీవించకుండా వెళ్ళిపోతాడు. దీనికి వారు చాలా బాధపడి దీని గురుంచి అడగడానికి ఒక పురోహితుడి దగ్గరకి వెళ్లి తమ కుమార్తె జాతకాన్ని చూపిస్తుంది వర్తకుని భార్య. అది చూసి పురోహితుడు ఆమె పెళ్లయిన వెంటనే భర్త చనిపోతాడని చెప్పగా, దానికి వారు చాలా బాధపడి దానికి పరిష్కారమడుగుతారు. అప్పుడు పురోహితుడు సింఘాల్ ప్రాంతానికి వెల్లి అక్కడ చాకలి స్త్రీ కుంకుమ అడిగి నుదుట పెట్టుకుంటే దోషం పోతుందని చెప్తాడు.


 మర్నాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడు, తన తల్లి ఆజ్ఞ మీద తన సోదరితో కలిసి వెళతాడు.వీరు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక నది దాటాల్సివస్తుంది. ఆ నది ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఆ చెట్టుక్రింద విశ్రాంతి తీసుకుంటుంటారు. ఆ చెట్టుపైన ఒక రాబందు గూడు ఉంటుంది. ఆ రాబందుల జంట లేని సమయంలో ఒక పాము వచ్చి రాబందు పిల్లలను తినటం పరిపాటి. ఈ సారి కూడా అలా పాము ప్రయత్నించడం చూసిన ఈ అమ్మాయి ఆ పామును చంపేస్తుంది. దీనికి ఆ రాబందుల జంటతన పిల్లలను కాపాడినందుకు వారికి ఆ నదిని దాటడానికి సహాయ చేస్తుంది. వీరు అక్కడికి వెళ్ళి ఆమెకు కొన్ని నెలలు సేవ చేయగా, ఈ సోమావతి అమావాస్యరోజున ఈ కన్య నుదుటన చాకలి స్త్రీ కుంకుమ దిద్దుతుంది. ఆమె వెంటనే రావిచెట్టు దగ్గరకి వెళ్లి 108 ప్రదక్షిణలు చేస్తుంది. అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోతుంది. ఇది సోమావతీ అమావాస్య కథ.


 అంతేగాకుండా పితృదేవతలకు ఈ రోజున పిండప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని.. తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం. ఈ రోజు సోమావతి అమావాస్య . ఈ రోజున వివాహితులు , అవివాహితులు రావిచెట్టును 108 సార్లు  ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలు తీరతాయి. ఈ రోజు శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుని, పార్వతీపరమేశ్వరులను, పితృదేవతలను పూజించాలి. మంచి పనులు చేయాలి, మౌనం పాటించాలి. 


 అందరం భక్తితో "అరుణాచల శివ" అని స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ అరుణాచలేశ్వరుడు