మహా మృత్యుంజయ మంత్రం అంటే ఏమిటి?
ఆ మంత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ?
అసలు ఈ మంత్రానికి అర్ధం ఏమిటి ? ఈ మంత్రం మరణాన్ని జయిస్తుందా ?
” ఓం త్రయంబకం యజామహే, సుగంధిం పుష్టి వర్ధనం!
*ఉర్వారుకమివ బంధనాన్, మృత్యోర్ ముక్షీయ మామృతాత్!!“*
ప్రతి పదార్ధం:
ఓం = ఓంకారము, శ్లోకమునకు గాని, మంత్రము నాకు గాని ముందు పలికే, ప్రణవ నాదము;
త్రయంబకం = మూడు కన్నులు గలవాడు;
యజామహే = పూజించు చున్నాము;
సుగంధిం = సుగంధ భరితుడు;
పుష్టి = పోషణ నిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తి ;
వర్ధనం = అధికము / పెరుగునట్లు చేయువాడు / పెంపొందించువాడు;
ఉర్వారుకం = దోస పండు;
ఇవ = వలె;
బంధనాత్ = బంధమును తొలగించు;
మృత్యోర్ = మృత్యువు నుండి;
అమృతాత్ = అమృతత్వము కొరకు / అమరత్వము కొరకు;
మాం = నన్ను; ముక్షీయ = విడిపించు.
తాత్పర్యం:
అందరికి శక్తి నొసగే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమ శివుని నేను (మేము) పూజించు చున్నాము.
ఆయన దోస పండును తొడిమ నుండి వేరు చేసినటుల (అంత సునాయాసముగా లేక తేలికగా), నన్ను (మమ్ము)
అమరత్వము కొరకు మృత్యు బంధనము నుండి విడిపించు గాక!
ప్రాశస్త్యము :
మనకు ఉన్న, తెలిసిన మంత్రాలలో గాయత్రీ మంత్రం వలె ఈ “మహా మృత్యుంజయ మంత్రం”
పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది. క్షీర సాగర మథనంలో జనించిన హాలాహలాన్ని, రుద్రుడు
దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. ఈ మంత్రం జపించిన వారు కూడా, ఆ రుద్రుని ఆశీస్సులు
పొంది మృత్యుంజయులగుదురు అని పలువురి నమ్మకం.
త్ర్యంబకం :
భూత, భవిష్యత్, వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి
ఉన్నందున, శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు. త్ర్యంబక మంటే మూడు నేత్రాలని అర్థం.
శివుని భ్రూమధ్యంలో నున్న సూక్ష్మరూప నేత్రం మూడవ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం.
దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని మూడవ నేత్రానికి దాహకశక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి.
ఆ స్వామి తన ప్రసన్నవదనంతో, చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని
త్యంబకం అని కీర్తిస్తున్నాం.
యజామహే :
అంటే ధ్యానిస్తున్నానని అర్థం. అంతేగా మరి. సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని, మనస్ఫూర్తిగా ధ్యానించాలి.
ఒకప్పుడు సముద్ర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహలం పైకి వచ్చింది.
ఆ విష్ఫు ప్రచండ జ్వాలలకు, సమస్తలోకాలు తల్లడిల్లిపోయాయి.
సర్వత్రా ఆర్తనాదాలు…హాహాకారాలు. సమస్తలోకజనం ఆ స్వామిని ధ్యానించగా, ఆ దృశ్యాన్ని చూసి
క్రుంగిపోయిన స్వామి, హాలాహలన్ని తన కంఠంలో నిలుపుకుని, నీలకంఠుడై సమస్తలోకాలను కాపాడాడు.
ఆ స్వామిని ప్రార్థిద్దాం.
సుగంధిం :
సు-మంచిదైన, గంధ – సువాసన ద్రవ్యం. ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం
నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు, మనలను తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు.
ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవికానంత ప్రేమ, వాత్సల్యం, ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే, ఆ స్వామిని
పూజించడానికి మందిరం కావాలని అడగడు.
చెట్టుకింద, గట్టుమీద ఎక్కడైనా ఆయన లింగరూపాన్ని పెట్టుకుని పూజించవచ్చు. ఆయనకు నైవేద్యం కూడా అవసరం
లేదు. ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయ, జలాభిషేకం చేసినా; స్వామి సంతోషించి మన కోరికలను నెరవెరుస్తాడు.
పుష్టివర్థనం :
మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున్న ఆ స్వామి, సర్వత్రా నెలకొని ఉన్నాడు. సృష్టియావత్తు ఆయన ఆధీనంలో ఉంది.
ఆయన మనలను తప్పక కాపాడుతాడు. ఇందుకు గుహుని కథే ఒక ఉదాహరణ. గుహుడనే వేటగాడు ఒకరోజున ఏదైనా
జంతువును వేటాడాలని, వెదికి వెదికి విసిగి పోయాడు. చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడా కనబడలేదు.
ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడించసాగింది. దాని బారి నుంచి తప్పుకోవడానికై వేటగాడు
పరుగులు పెడుతూ, ఒక చెట్టుపైకి ఎక్కాడు. అయినా ఆ పులి అతడిని వదల్లేదు. చెట్టుకిందే ఉన్న పులి గుహుడు
ఎప్పుడు దిగి వస్తాడా అని కాపుకాయసాగింది.
గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు. ఏమీ తోచక, ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరేయసాగాడు.
ఆ దళాలు చెట్టు మొదట్లో నున్న శివలింగంపై పడసాగాయి. ఆరోజు శివరాత్రి కూడా. పులిభయంతో వేటగాడు,
వేటగానిని తినాలన్న కాంక్షతో పులి, జాగరణ చేయడంతో, శంకరుడు రెండు జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు.
అందుకే సర్వ వ్యాపకుడైన ఆ స్వామి మనలను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు.
ఉర్వారుకం –ఇవ – బంధనం :
దోసకాయ పక్వానికి వచ్చినపుడు, దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే, ఆ స్వామి మనలను అన్ని
సమస్యల నుంచి గట్టెక్కించుతాడు.
మృతోర్ముక్షీయ :
అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని, మనలను మృత్యువు నుంచి కూడా, రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం.
మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమేకాదు. ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా,
మృత్యు సమానమే. భక్తి ప్రపత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే. ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక, అంతా
వికారంగా ఉందనుకునే వారికి, అంతా వికారంగానే కనబడుతుంది.
ప్రతి విషయానికి సందేహపడే సదేహప్రాణికి, అంతా అనుమానమయంగానే ఉంటుంది. ఇటువంటివన్నీ చావువంటివే.
ఇలా మనలను అన్నిరకాల మరణాల నుంచి విముక్తులను చేసి, మన జీవితాలను సంతోషమయం చేయమని స్వామిని
ప్రార్థిస్తున్నాం మనం.
అమృతాత్ :
స్వామి అల్ప సంతోషి, సులభప్రసన్నుడు. అందుకే శ్రీనాథమహాకవి ఆయనను ఈ క్రింది విధంగా స్తుతించాడు.
శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత నెవ్వడు పార వైచు
కామధేను వతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు
శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు పత్రిని లింగంపై విసిరేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు
ఇంటి పశువుగా మారుతుంది. కల్ప తరువు, ఆ భక్తుని ఇంట మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు
పరమశివుడు.