పుత్రసంతానంకోసం“పుత్ర గణపతి వ్రతం ”

పుత్రసంతానంకోసం“పుత్ర గణపతి వ్రతం ”

పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు. వినాయక చవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. మంచి సంతానం కోసం , సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటారు అని పురాణాలు చెబుతున్నాయి.  చతుర్థి నాడు గణపతి కి చేసే పూజ కార్యక్రమాల వలన సంతానం కలుగుతుంది అని నమ్మకం.


‘‘సాక్షాత్‌ రుద్ర ఇవాపరః’’ అన్నట్లుగా జగదాంబ అనుగ్రహముతో జన్మించి రుద్రానుగ్రహముతో సకల విఘ్నములకు అధిపతి అయిన గణపతిని శివుడు శిరస్సు ఖండన చేసి మరలా గజముఖము పెట్టినప్పుడు జగదాంబ పార్వతీ దేవిని ఆనందింప చేయుటకు పరమేశ్వరుడితో సహా దేవతలందరూ పార్వతీ ఒడిలో ఉన్న వినాయకుని స్తుతించిన స్తుతిని విన్న అమ్మ వారు ఎవరైతే ఈస్తుతిని గౌరీ సమేత గణపతిని ఫాల్గుణ శుద్ద చవితి యందు పఠించి నువ్వులు , బెల్లము నివేదన చేసి ప్రసాదముగా స్వీకరిస్తారో అట్టి భక్తులందరికీ నాకే విధముగా అయితే పుత్రశోకము తొలగి పుత్రవృద్ధి కలిగినదో అదేవిధముగా అందరికీ పుత్రోత్పత్తి కలిగి వంశవృద్ధి జరుగునని జగదాంబ పార్వతి వరమిచ్చెను.


అట్టి జగదాంబ సమేత పుత్రగణపతి అనుగ్రహముపొందుటకు ఈ పుత్రగణపతి స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి) పారాయణము చేయడం వలన వంశ దోషములు తొలగి శక్తి యుక్తలు కలిగిన పుత్రులు జన్మించునని వరాహపురాణ వచనము. మొదట ఈస్తోత్రముతో డుంఢి రాజు అను కాశీరాజు పుత్రగణపతిని ఆరాధించి సత్ఫలితములను పొందెను. అత్యంత అధ్భుతమైన ఈ స్తోత్రమును ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 8 సంఖ్యతో పారాయణ చేసిన విశేషమైన ఫలితం.


  ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి , పరిశుభ్రమైన పట్టువస్త్రాలు ధరించాలి. పూజా మందిరంలో కలశస్థాపన చేసి … శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి. పుత్రగణపతి వ్రత కథను చదువుకుని దంపతులు అక్షింతలను తలపై ధరించాలి. గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి.