పూరి జగన్నాథుడు

పూరి జగన్నాథుడు

పూరి జగన్నాథుడు

ఈ క్షేత్రానికి సంబంధించిన కథను

 పూరీలో నీలమాధవుని (= విష్ణువు) మందిరం నిర్మించాలని ఇంద్రద్యుమ్నుడనే రాజు అనుకొన్నాడు. ఎన్నో అడ్డంకులు వచ్చాయి. తన సంకల్పం నెరవేరాలన్న పట్టుదలతో సముద్రపు తీరములో ప్రాయోపవేశము (= పస్తులతో ప్రాణమును విడిచిపెట్టడమనే వ్రతము) చేసాడు. అతని దీక్షకు సంతసించి నీలమాధవుడు అశ్వమేధ యాగం చేయమని సందేశము ఇచ్చాడు. ఆ యాగపు పూర్ణాహుతి వేళ సముద్రం నుంచి ఒడ్డుకు ఒక దారువు (కొయ్య దుంగ) చేరుతుందని చెప్పాడు. ఆ దారువుతో విగ్రహాన్ని చేయమని చెబుతాడు. అలా ఏర్పడిందే జగన్నాథుని కొయ్య బొమ్మ.

జగన్నాథుడు వెలిసిన ప్రదేశం కాబట్టి మొదట ఇది జగన్నాథపురిగా పేరు వచ్చింది. క్రమంగా పూరీ జగన్నాథమయింది.

 

ప్రతి సంవత్సరము ఒక కొత్త రథం జగన్నాథునికి నిర్మిస్తారు. 'వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథ చక్రాలు' వస్తున్నాయి. అంటూ శ్రీ శ్రీ ఉన్నతమైన జగన్నాథుని రథాన్ని, రథ చక్రాలను మనస్సుల్లో గిరగిరా తిప్పాడు. పూరీ జగన్నాథుని రథయాత్ర ఆషాఢ శుద్ధ విదియనాడు జరుగుతుంది.

పూరీ జగన్నాథస్వామి, సుభద్ర, బలభద్రుల మూలమూర్తులకు రథయాత్ర నిర్వహించిన తరువాత మహాప్రసాదాన్ని  ఒకే పళ్లెంలో అందరు భక్తులకు జాతి, కుల ప్రస్తావన లేకుండా ఒకే పంక్తిలో కూర్చోబెట్టి పెడతారు. ఇలా అందరూ ఒక చోట చేరి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ క్షేత్రంలో అన్నంచేతికి తగిలితే అంటు దోషము లేదట. కాబట్టి 'సర్వం జగన్నాథం' అని సామెత వచ్చిందట.

జంతుఘట కార కరణ (= శరీరాలను కుండలను నిర్మించువాడా!)

జగన్నాథుని సంబోధిస్తూ అన్నమయ్య వ్రాసిన ఈ కీర్తనలో కొన్ని మాములు పదాలున్నా జంతుఘట కార కరణ వంటి విలక్షణ సంబోధనలు కూడా ఉన్నాయి. భగవంతుడు ఈ శరీరాలను కుండలను నిర్మిస్తున్నాడు.

జీవితం అనేది ఒక నీటికుండ. చివరలో చేసే సంస్కారంలో చేసేవాడి భుజం మీద నీటి కుండ పెడతారు. మొదటి ప్రదక్షిణలో ఒక రంధ్రం నుంచి బాల్యమనే నీరు కారిపోతుంది. రెండవ ప్రదక్షిణలో కుండకు చేసే రంధ్రంలో కారిపొయే నీరు యవ్వనానికి సంకేతము. మూడవ ప్రదక్షిణలో కారిపొయే నీరు ముసలితనానికి గుర్తు. కుండను నేలకు కొట్టి వెనక్కు చూడకుండా వెళ్లమంటారు. ముక్కలైన కుండ అన్ని దశలను దాటి చనిపోయిన వాడికి గుర్తు.

 

వెనక్కి చూడకుండా - అంటే చనిపోయిన వాడి సంగతి ఆలోచించకుండా- నీ దోవన నువ్వు వెళ్లిపో అని సంబంధీకులకు ఒక ఉపదేశము. ఎవడి బతుకు వాడిదే. ఎవడి చావు వాడిదే. ఎవడి ఉద్ధరణ వాడిదే.

ఘటము జలములందు గగనంబు కనఁబడు

ఘటము జలము లేమి గగనమేది

ఘటములోన జ్యోతిఁ గ్రమమునఁ దెలియుఁడీ

విశ్వదాభిరామ వినర వేమ!

అని వేమన్న అన్నమయ్య ఘటకారకరణ పద ప్రయోగములోని ఆంతర్యాన్ని వివరించాడు. ఈ శరీరమనే కుండలోని జ్యోతిని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తుండాలి.