జానకి జయంతి శుభాకాంక్షలు

జానకి జయంతి శుభాకాంక్షలు

 వైశాఖ శుద్ధ నవమినాడు ఆ జగదంబను చండీ నామంతో అర్చించటం లేదా స్మరించటం. శ్రీ చండీ మంత్రానుష్ఠానం గల వారు విశేషంగా చండీమంత్ర జపం, చండీనవావరణార్చన, శ్రీ చండీసప్తశతి పారాయణ,హోమం మొదలగునవి చేసినా చేయించిన వారికి త్రిమూర్త్యాత్మక  శ్రీమహాత్రిపురసుందరి శ్రీచండీ పరదేవతానుగ్రహం క్షిప్రముగా లభిస్తుందని విశ్వాసం.


నేటి మరో విశేషం శ్రీసీతామాత అవతరించిన మహాపర్వం.

 జానకీ జయంతి శుభ సందర్భంగా అమ్మవారి గురించిన సద్విషయాలను సద్విమర్శతో సదుపయోగంగా సకాలములో స్మరించుకుందాం.


సీతమ్మ మాయమ్మ - శ్రీరాము డు మా తండ్రి... అంటూ శ్రీరామ భక్తులు శ్రీసీతారాములను ఎంతగా ఆరాధిస్తారో అంతకంటే కాస్త ఎక్కువ మమకారం అమ్మవారి వైపే "మాజానకి చెట్ట బట్టఁగ మహరాజవైతివంటూ"

 శ్రీ త్యాగరాజాది మహాభక్తులు  శ్రీ సీతాదేవినే ప్రస్తుతిస్తారు.

అందుకే శ్రీ భక్త రామదాసు గారు కూడా "నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి" అంటూ కీర్తించి తన భౌతిక కష్టాలకడగళ్ళను దాటారు.

రామ అన్న పేరులాగానే సీత అన్న పేరులో కూడా రెండక్షరాలే! తిరగేసి వల్లెవేస్తే అదే పేరు పదేపదే వినిపిస్తుంది.

సీతారాములు అభిన్న తత్వాలని, వారిద్దరూ ఒకే దివ్యజ్యోతికున్న వేర్వేరు అభివ్యక్తులని తులసీ రామాయణం చెబుతుంది. సీత ప్రధాన స్వరూపమని, అక్షర బ్రహ్మమని, ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తుల సమైక్య రూపమని నిర్ణయ సింధు వ్యక్తపరచింది. సీత ఆదిశక్తి, సృష్టి స్థితి లయకారిణి అని చాటింది రామతాపనీయోపనిషత్తు. సీత ముక్తిదాయని అని ఆధ్యాత్మిక రామాయణం అభివర్ణించింది. స్త్రీ ఆదిశక్తి అని శౌననీయ తంత్రం ప్రస్తుతించింది. వ్యవసాయానికి అధిష్టాత్రి అని రుగ్వేదం కీర్తించింది. అధర్వ వేదానికి చెందిన సీతోపనిషత్తు సీతను శాశ్వత శక్తికి మూలబిందువుగా అభివర్ణించింది. ‘యోగమాయ’ అని శ్లాఘించింది. సీత జగన్మాత అని ప్రశంసించింది పద్మపురాణం. సాధక సాధ్యమైన దేవిగా ఋషులు తాపసులు కీర్తించారు.

https://bit.ly/3VeIPMu

మిధిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగము చేయుచూ భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది. నాగటి చాలులో లభించినందున ఆమెకు 'సీత' అని నామకరణము చేసి జనకమహారాజు, ఆయన భార్య సునయన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకొన్నారు. కనుక సీత భూదేవి కుమార్తె అని అంటారు, శ్రీ సీతమ్మ జన్మనక్షత్రము ఆశ్లేష నక్షత్రము . సీత గర్భమున జన్మించలేదు గనుక అయోనిజ అని అంటారు.


వైదేహీ శబ్దము విదేహ రాజ కన్యక అని కాక దేహమునకు అతీతమైన జ్ఞానమూర్తి అని సూచన ఉన్నది. ఉత్తరకాండలో వేదవతి వృత్తాంతము వస్తుంది. ఈ వేదవతి సీత పూర్వజన్మ, ఆమె సాక్షాత్తు వేద స్వరూపురాలు. ఆమె సతీదేవి వలె తనను తాను దహించుకొని సీతాదేవిగా యజ్ఞధాత్రిలో జనకుడు దున్నుచుండగా పెట్టెలో లభించింది. వైదేహి శబ్దంలో వేద స్వరూపురాలనే అర్థము స్ఫురిస్తుంది. రామాయణమంతా సీతాదేవి యొక్క చరిత్రమని వాల్మీకి చెప్పడం గమనించాలి.


సీతమ్మ నాగేటి చాలు లో లభించిన వూరు సీతమర్హి. ఇది ప్రస్తుతం మన దేశంలో బీహార్ రాష్ట్రంలో వుంది.


సీత + మహి సీతామాఢి అయింది. నాగలి చివరిభాగాన్ని సంస్కృతంలో సీత అంటారు. నాగలి చాలులో దొరికింది గనక ఆమె సీత అయింది.


నేషనల్ హైవేలో ముజుఫర్ పూర్ కు ఉత్తరంగా సీతమర్హి. వుంది. ఇక్కడికి ఒక కిలోమీటర్ దూరంలో పునౌరా అనే స్థలం వుంది. సీతాదేవి పసిపాపగా దొరికిన స్థలం ఇదే.

సీత పుట్టిన ఊరిలో

 జానకీ దేవి తల్లిదండ్రులైన సునయన, జనకుడు.  శతానందుడు మున్నగు పురోహితుల విగ్రహాలు గల ఆలయాలు వున్నాయి.

జనకపురి


ఆ పాపను జనకుడు తన శిబిరంలో ఆరు రోజులుంచి తర్వాత జనకపురికి తీసుకువెళ్ళాడని అక్కడి వారు తెలుపుతున్నారు.


సీతమర్హి

సీతమర్హి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో వున్న జనకపురికి ఇప్పుడు నేపాల్ లో వుంది.

రంగభూమి


రాముడు శివధనుర్భాగం చేసిన స్థలాన్ని రంగభూమి అంటారు. ఇప్పుడిది ఒక పెద్ద మైదానం.


రత్నసాగర మందిరం

సీతారాముల వివాహం రత్నసాగర మందిరం ఆలయం దగ్గరలోనే వుంది.

విశేషమేమిటంటే సీతమర్హిలో "సీతా" అన్న పేరే అధికంగా వినిపిస్తే, జనకపురిలో "జానకి" అనే పేరే వినిపిస్తుంది. ఇక్కడ శ్రీరామనవమి సీతా నవమి ఉత్సవాలను ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున చేస్తారు.


మిథిలా శృంగాటంముల

బృథులంబగు విషయమట్లు వినఃబడియెడు

శ్రీ మధురాకృతి సీత ధరకు

మధుసూదనురాణి వచ్చి మన్నించినటుల్

మధురాకృతి మా రాముడు

మధుసూదనుడౌనొకాదో మధుసూదనునం

శధురాఖ్యాతుని భార్గవు

నధరీకృతతేజుజేయుటది యద్భుతమే


సీతాదేవిని గురించి శ్రీ మధురాకృతి అనడంలో ఆమె శ్రీ విద్యాధిష్ఠాత్రియైన పరాశక్తియని సూచన ఉన్నది. రాముడు కూడా మధురాకృతియనడం అతని చరిత్రలోనే మాధుర్యాన్ని ధర్మతత్పరతను తెలియజేస్తుంది. ఇక్కడ మధుకైటభ సంహారవృత్తాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ ఘట్టంలో మహా విష్ణువు విష్ణు మాయకు లోబడి నిద్రలో ఉండగా దేవతలు అతన్ని స్తుతించి మేల్కొల్పి మధుకైటభ వధకు దోహదం చేస్తారు. శ్రీరాముడు సీతా కళ్యాణం తర్వాత అయోధ్యలో సుఖవశుడై, యౌవరాజ్య పట్టాభిషేకానికి సిద్ధుడైయుండగా అతనిని అవతార కార్యం నిర్వహించవలసిందిగా దేవతలు ప్రార్థించి అతన్ని లోకముఖం నుండి దివ్యత్వ ముఖం వైపు మళ్ళించినట్లుగా కల్పవృక్షం చెబుతున్నది. మధుకైటభ వధ సందర్భంలో ఆధారభూతమైన శక్తి మహాకాళి. ఈమె తమః స్వరూపిణి. దశమహావిద్యల్లో మహాకాళి సంహారకారిణి.


సీతాదేవి అసామాన్యురాలు. ఆమె మూలప్రకృతి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రకృతి అంటే సీతాదేవే. అంతేకాదు.. ప్రణవనాదమైన ఓంకారంలో ఉంది కూడా ఆ తల్లే. సీత సత్వరజస్తమో గుణాత్మకమైంది. ఆమె మాయా స్వరూపిణి. సకార, ఇకార, తకారాల సంగమం సీత. స కారం ఆత్మతత్త్వానికి సంకేతం. త కారాన్ని తారా అని అంటారు. తరింపజేసేది అని దీనికి అర్థం. అంటే ఆత్మదర్శనం కలిగించి మనిషిని తరింపజేసేది ఆ మహాశక్తే అని బ్రహ్మ వివరించారు. సీతాదేవి మొదటి రూపం మహామాయ. దీన్నే శబ్దబ్రహ్మమయీ రూపం అని కూడా అంటారు. వేదాధ్యయనం చేసే చోట ఈ తల్లి ప్రసన్న రూపంతో ఉండి అత్యున్నత, అలౌకిక భావాలను కలగజేస్తుంది. రెండో రూపం జనకుడు భూమి దున్నుతున్నప్పుడు బయటపడిన రూపం. ఆమెను భూమిజ అని కూడా అంటారు. సీతమ్మ మూడో రూపం అవ్యక్తరూపం. ఇది జగత్తంతా నిండి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జగదానందకారిణి సీతమ్మ. ఇచ్ఛ, క్రియ, సాక్షాత్‌ అనే మూడు శక్తుల రూపంగా ఈమెను సాధకులు దర్శించవచ్చని అని బ్రహ్మదేవుడు తన దగ్గరకు వచ్చిన దేవతలందరికీ తెలియజెప్పాడు.


మూల ప్రకృతి రూపత్వాత్‌


సా సీతా ‘ప్రకృతిః‘ స్మృతా!


ప్రణవ ప్రకృతి రూపత్వాత్‌


సా సీతా ‘ప్రకృతిః’ ఉచ్యతే!


‘సీతా’ ఇతి త్రివర్ణత్మా


సాక్షాత్‌ ‘మాయామయి’ భవేత్‌!

సీతోపనిషత్తు అధర్వణ వేదంలో ఉంది. బ్రహ్మదేవుడు తన దగ్గరకు వచ్చిన దేవతలకు వివరించిన విషయాలు ఉపనిషత్తుగా మారాయి. అది సీతాదేవి మహత్వాన్ని వివరిస్తోంది.

క్షమ..దయ...ధైర్యం...వివేకం...ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర ‘సీత'. సతీ లేనిదే రామాయణం లేదు. సీత లేకుండా రాముని జీవితాన్ని అసలు ఊహించలేము. కాబట్టే రామాయణ ఇతిహాసంలో ఆమె పాత్రపై ఎందరో మహానుభావాలైన మేథావులు  పలు విధాలుగా శ్లాఘించారు. సీతలోని సుగుణాలు నేటి మగువలకు ఎంతో ఆదర్శం. ఆమె చరితం ఓ స్ఫూర్తిదాయకమైన కథాసాగరం. రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా సీత గుణగుణాలు ప్రతి ఒక్కరికీ ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తాయి...

శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రమూర్తికి జనక మహారాజు తన పుత్రిక సీతాదేవినిచ్చి వైభవంగా వివాహం చేసి పంపాడు. జానకి ఆదర్శ వనిత. ఆమెలోని మేధాశక్తి, సహనం, విచక్షణ, ధర్మాచరణ, తపస్సు, ఆత్మ సంయమనం, భర్త పట్ల గల అచంచల భక్తి, ప్రేమ మొదలైన ఆదర్శవంతమైన లక్షణాలు ఎప్పటికీ అనుసరణీయమైనవే. భర్త వెంట అడవులకు వెళ్ళి నిరాడంబరంగా జీవితం గడిపింది. భర్తకు తోడుగా నీడగా అడవినే అయోధ్యగా భావించింది. కష్టాలను ఇష్టాలుగా చేసుకొంది. అవసరమైనప్పుడు తర్కం చేస్తుంది, చర్చ చేస్తుంది. సలహాలిస్తుంది. అసురులను అంతం చేస్తానని భర్త అక్కడి రుషులకు వాగ్దానం చేసినప్పుడు అందులోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తుంది. ఆమె లేని రాముడు లేడు. రాముడు లేక సీత లేదు. అంతటి అపురూప దాంపత్యం వారిది.


ధర్మమూర్తి: సీత ఒక ఇల్లాలిగా తన భర్త బాధ్యతలో, కర్తవ్య దీక్షలో తను కూడా పాలుపంచుకొని ఆదర్శ గృహిణిగా మారిన మహాసాధ్వి ‘సీతాదేవీ'. రాముడు తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి అరణ్యవాసానికి వెళ్లినప్పడు తన భర్త అడుగుజాడల్లో తనూ నడిచి, అతని కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి సిద్దమైన ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది.

వివేకవంతురాలు: రావణాసురుడు తనను అపహరించి తీసుకెళ్లిపోతున్నప్పుడు, రాముడికి తన ఆనవాళ్లు చిక్కడం కోసం బంగారునగలను నేల మీద జారవిడిచిన వివేకవంతురాలు సీత.


ప్రేమమూర్తి: సీతకు రామునిపై ఎంతటి ప్రేమానురాగాలంటే..ఆ ప్రేమలో తనను తానే మైమరిచిపోయేది. రావణుడి చెరలో బందీగా ఉండి కూడా నిత్యం శ్రీరామనామస్మరణ చేస్తూ అనుక్షణం పతి క్షేమాన్ని కోరేది.


చైతన్యశీలి: సీత ఎంత చైతన్యశీలి అంటే అపాయంలో కూడా భయంతో ఆమె శత్రువులకు లొంగలేదు. రావణడు సీతను బెదిరించి, తన వశం కావాలని ఆదేశించినప్పుడు, ఒక గడ్డిపరకను అడ్డంగా పెట్టుకొని నువ్వు నాకు దీనితో సమానం అని చెప్పకనే చెప్పి అతని ధర్మహీనతను ప్రశ్నించిన ప్రజ్ఝావంతురాలామె.


క్షమాగుణం: రాక్షస సంహారం తర్వాత సీతను అవోకవనం నుంచి విడిపించి తీసుకువెళ్తున్న సమయంలో, తను బందీగా ఉన్నప్పుడు ఆ వనంలో తనను మాటలతో హింసించిన రాక్షసులకు ఏ కీడు తలపెట్టవద్దని, వారు స్వామిభక్తితో తమ బాధ్యతను మాత్రమే నిర్వర్తించారని ఆనతిచ్చిన పరమకారుణ్యమూర్తి.


రావణ వధ తరవాత భర్త ఆజ్ఞ మేరకు అగ్నిలో చేరి తన పాతివ్రత్యం నిరూపించుకుంది. భర్త చేత పరిత్యక్త అయిన భార్యకు అది అవమానం కాదని, ఆత్మవిశ్వాసంతో కాలానికి ఎదురీదాలని సందేశమిచ్చింది. వాల్మీకి ఆశ్రమంలో తలదాచుకుని యోధాగ్రేసరులైన లవకుశలను కని భర్తకప్పగించి తన తల్లి భూదేవి ఒడిలోకి చేరిపోయింది.


హిందూ సమాజంలో స్త్రీ ప్రవర్తనకు, ఆలోచనకు సీతా చరిత్ర మార్గదర్శకంగా నిలిచిపోయింది. సీత దేవి ఎంతో గొప్పగ జీవించి సమాజానికి ఒక మార్గదర్శిగా నిలిచి ఆమె చరిత్రను రాసిన శ్రీ వాల్మీకి మహాముని సీతాయాశ్చరితం మహత్ అని కీర్తించారు.

అందుకే శ్రీమద్వాల్మీకి రామాయణం మనందరికీ నిత్య పారాయణ గ్రంథమై విరాజిల్లుతోంది.


సీతాదేవి ఆవిర్భవించిన ఈ రోజున ఉదయాన్నే తల స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజా మందిరాలలో సీతారాములకు పూజాభిషేకాలు నిర్వహించాలి. ఆలయాలలో గల సీతమ్మ వారికి నూతన వస్త్రాలను సమర్పించాలి. ఈ రోజున రామాయణాన్ని పఠించడంతో పాటు, దానధర్మాలు చేయాలి. ఈ విధంగా చేయడం వలన సీతారాముల ఆశీస్సులు లభిస్తాయనీ ... సకల శుభాలు కలుగుతాయని  ఆర్యోక్తి.