Interesting Facts About Lord Krishna

Interesting Facts About Lord Krishna

శ్రీమద్భాగవతం లో చాలా క్లుప్తంగా వివరింపబడిన రాధామాధవుల గురించి ఏ ఏ పురాణాలు ఇతిహాసాలు వర్ణించాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం....

1.
దేవీభాగవతం : నవమ స్కంధంలో గోలోకం గురించి ఎలాగైతే రాధాకృష్ణులు ఏకశక్తికి ప్రకృతి పురుషుల రూపంగా ఉన్నారో వివరిస్తుంది. రాధాదేవి శ్రీకృష్ణ ప్రాణాధిక, అలాగే శ్రీకృష్ణుడు లేని రాధ లేదు. వారినుండే బ్రహ్మాండాలు ఉద్భవించినట్టు, ద్విభుజ కృష్ణుని నుండి చతుర్భుజ నారాయణుడు ఎలా ఉద్భావించాడో వారినుండి వివిధ బ్రహ్మాండాలు ఎలా విస్తరించాయో, లక్ష్మీ, గంగా, సరస్వతీ, తులసీ ఉద్భవం వంటి వివిధ రోమాంచక ఘట్టాలన్నీ నవమస్కంధం వివరిస్తుంది. శ్రీకృష్ణుని శక్తి రాధగా నిలుస్తుంది. రాధాకృష్ణులు వేరు వేరు అని అనుకోవడం వారి మాయకు లోను కావడం. ఆవిడ శ్రీకృష్ణ నిత్యానుపాయిని.

2.
బ్రహ్మవైవర్తన పురాణం: ఈ పురాణం సంపూర్ణంగా రాధాకృష్ణుల గురించి చెబుతుంది. బ్రహ్మ, ప్రకృతి, గణేశ, కృష్ణ ఖండాలుగా ఉన్న ఈ పురాణంలో సగభాగం కృష్ణ ఖండం. ఈ పురాణం అంతా రాధాదేవి తత్త్వం గురించి, రాధామాధవులను అర్ధనారీశ్వర తత్త్వంలో వివరిస్తుంది. ఈ పురాణం ప్రకారం శ్రీకృష్ణుడే పరబ్రహ్మ, రాధమ్మే పరబ్రహ్మమహిషి. దుర్గ, లక్ష్మి, సరస్వతి ఇత్యాది ప్రకృతి రూపాలన్నీ కూడా రాధ నుండి ఉద్భవించినవే. స్త్రీతత్త్వాన్ని ఎవరైనా అవమానిస్తే రాధను అవమానించినట్టు అని చెబుతుంది ఈ పురాణం. చైతన్యమహాప్రభు ఇత్యాది భక్తి రస వేదాంతులకు పరమ ఉత్కృష్టమైనది ఈ బ్రహ్మవైవర్తన పురాణం. శ్రీకృష్ణ లీలలు, రాధాకృష్ణుల రాసలీలలు, వ్రజభూమి లో వారి ఆటపాటలు వంటి ఎన్నో శ్రీకృష్ణ మానవావతార ప్రధాన ఘట్టాలన్నీ విపులంగా వివరింపబడ్డాయి. అమ్మవారి చైతన్య తత్త్వం గురించి ప్రకృతి ఖండం విస్తారంగా చెబుతుంది.

3.
బ్రహ్మాండ పురాణం: ఉపోద్ఘాతపర్వంలో పరశురాముడు గజాననుని దంతం తన పరశువుతో ఖండించినప్పుడు పార్వతి దేవిని శాంతపరచడానికి రాధాసహిత కృష్ణుడు ప్రత్యక్షమై తన సహోదరిని ఊరడింప చేస్తాడు. అప్పుడు పార్వతీ అమ్మవారు వారిని చేసిన స్తోత్రం గృహేరాధే వనే రాధే జగత్ప్రసిద్ధం

4.
స్కాందపురాణం: వైష్ణవఖండంలో భాగవతమహాత్మ్యం వర్ణనలోను, వాసుదేవ మహాత్మ్యంలోను శ్రీకృష్ణుని ఆత్మ గా రాధమ్మను కీర్తిస్తారు. దీనిలోనే గోలోక ప్రాశస్త్యం, నారదునికి రాధాకృష్ణుల దర్శనభాగ్యం వంటి ఎన్నో ఘట్టాలు వివరింపబడి ఉన్నాయి.

5.
నారదపురాణం: నారదుడు యుగళ సహస్రనామం చేసినప్పుడు మొదటి 500 నామాలు కృష్ణుని కీర్తిస్తే తదుపరి ఐదు వందల నామాలు రాధా కీర్తన. అమ్మవారి తత్త్వం అర్ధం చేసుకోవడం కోసం నారదుడు బృందావనంలో ఒక గోపికగా అవతరించి రాధమ్మ పార్శదునిగా ఆత్మానందం అనుభవిస్తాడు.

6.
పద్మపురాణం: భూమిఖండంలో రాధాష్టమి, రాధాదామోదర వ్రతం విశేషాలు విస్తారంగా వివరింపబడి ఉంటాయి. పాతాళఖండంలో రాధామాధవుల రాసలీల, వారి పరబ్రహ్మ నిరూపణ, గోలోకంలో వారి లీలలు, నందవ్రజంలో వారు చేసిన అధ్బుత విన్యాసాలు, అర్జునుని అభ్యర్ధన మేరకు అర్జునుని అర్జుని అని పేరు గల గోపికగా మార్చి పరబ్రహ్మ ప్రకృతీ పురుషుల దర్శనం ఇవ్వడం వంటి విషయాలు చెప్పబడి ఉన్నాయి.

7.
విష్ణుపురాణం : 13వ సర్గలో రాసలీల వివరణ రాధ యొక్క గొప్పదనం వంటి విషయాలు చెప్పబడి ఉన్నాయి.

8.
గర్గ సంహిత: దీనిలో రాధాకృష్ణుల రాసలీలలు, వారి దివ్యప్రబోధాలు, బృందావనంలో వారి ఆటపాటలు, అటుపై రాధ విరహవేదన, మరల సిద్ద్దాశ్రమంలో వారి కలయిక వంటి అద్భుత లీలలు వర్ణింపబడి ఉన్నాయి.

ఇవి కాక మత్స్యపురాణం లో బృందావనంలో రాధ ఉన్న అమ్మవారికి నమస్సులు అని స్తోత్రం, ఋగ్వేదంలో రాధాసంహితలోను, అథర్వణ వేదంలో రాధాతపనీయ ఉపనిషత్తులో రాధా స్తోత్రాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు.

ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప రాధాకృష్ణుల తత్త్వం తెలుసుకునే భాగ్యం కలగదని అప్పటికి కానీ వారికి ఆ లీలలు అనుభవించి శ్యామసముద్రంలో (అంటే కృష్ణునిలో అంటే మోక్షం ) కలిసే అవకాశం ఉండదని పురాణం చెబుతుంది. అటువంటి ఎంతో ఉత్కృష్టమైన తత్త్వం రాధ తత్త్వం. వారి పాపరాశిని దగ్ధం చేసే అవకాశం వీరి చరితం తెలుసుకోవడం. అదే వారి పాపరాశి పోగుచేసుకునేవాళ్ళు వీరి మీద అనవసరపు పైత్యాన్ని ప్రకటించుకుంటూ తమను తాము అధఃపాతాళానికి తీసుకుపోతూ ఉంటారు.

Products related to this article

Laddu Bal Gopal  with Beautiful Poshak

Laddu Bal Gopal with Beautiful Poshak

Laddu Bal Gopal  with Beautiful Poshak ..

$6.00