ఫాల్గుణ శుద్ధ 'ఆమలకీ' ఏకాదశి

ఫాల్గుణ శుద్ధ 'ఆమలకీ' ఏకాదశి

గోవింద మాసము


ఫాల్గుణ శుద్ధ 'ఆమలకీ' ఏకాదశి

బ్రహ్మాండ పురాణంలోని వశిష్ఠ మాంధాత సంవాదము :


ఫాల్గుణ మాస శుద్ధ ఏకాదశీ వ్రతమునకు గల వేరొక నామము. దానికి గల నియమములను, మాహాత్మ్యమును గురించి మహారాజు మాంధాత వశిష్ఠ మహర్షిని అడిగెను. అప్పుడు మహర్షి ఇట్లు చెప్పెను. 'ఓ రాజా! శుభప్రదాయిని అయిన ఈ ఫాల్గుణ శుద్ధ ఏకాదశీ పేరు 'ఆమలకి ఏకాదశీ' ఈ వ్రత విషయమై ఒక కథ గలదు.


పూర్వకాలమున 'వైదిక' అను ఒక సుందర నగరము కలదు. ఆ నగరమున ప్రతి నిత్యము బ్రాహ్మణులు వేదమంత్రములు పఠించు చుండెడివారు. చంద్ర వంశమున పుట్టిన మహాధార్మిక ప్రవరుడును, సత్యాగ్రహి, శౌర్య, వీర్య, ఐశ్వర్యవంతుడు, శాస్త్రతత్త్వవేత్త ఆ రాజ్యమునకు రాజుగానుండెను. ఇతని రాజ్యమున ఎప్పుడూ దుర్ఘటన, విపత్తులు, దొంగతనములు వంటి దుష్కర్మములు జరిగెడివి కావు. ప్రజలు కూడా విష్ణుభక్తితో ప్రతి సంవత్సరము ఏకాదశీ వ్రతమును పాటించెడివారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశీ తిథి వచ్చిన సమయమున ముందుగా ఆబాల వృద్ధులందరును ఈ 'ఆమలకి ఏకాదశీ' తప్పక ఉపవాసము ఉండి భావదాశీర్వాదము పొందవలెను. ప్రాతః స్నాన మాచరించి దేవాలయములలో స్తోత్రము - ధూప - దీప - చందన - గంధము పూలమాలతోను నైవేద్యముల నర్పించి భగవత్పూజ చేయవలెను. రాత్రి - సమయమున సాధువుల ద్వారా భగవత్కథా శ్రవణము చేసి జాగరణముతో ఉండవలెను. రాజు స్వయముగా ఇట్లు చేయుచుండగా ఆ ఏకాదశీ రాత్రి ఒక బోయవాడు శ్రీమందిర ప్రాంగణములకు వచ్చెను. ప్రతి దినము ఎన్నో పశుపక్ష్యాదులను వధించి జీవించువాడు, ఆ దినము ఒక్క జంతువునైనను లభించకపోవటం వలన మిక్కిలి కష్టముతో రాత్రి నిద్రాహారములు లేక రాజుగారు ప్రజాభక్తులతో ఉపవాసము ఉండి శ్రీకృష్ణ కీర్తనము చేయు ఆమందిరమున, బోయవాడు ఆ వ్రతమును తిలకించి మరునాడు గృహమునకు వచ్చెను. కొంత కాలము తరువాత అతనికి మృత్యువు సంభవించెను.


అట్లు మరణానంతరము జయంతీనగర రాజైన 'విదురథు'నికి 'వసురథు' యను పేరుతో పుత్రునిగా జన్మించెను. పూర్వసుకృతి వలన ఎన్నో సద్గుణముతో వసురధుడు సత్యనిష్టాపరాయణుడును, విష్ణుభక్తుడై యుండెను. ధర్మపరాయణుడు, సద్గుణ స్వరూపుడైన రాజపుత్రుడు వసురథుడు మృగయా వేటకై వనమునకు వెళ్లి అంధకూపములో పడి దేనిలో గల వృక్షశాఖముపై నిద్రించుచుండెను. అది చూచి మ్లేచ్ఛ రాజొకడు బహుసైన్యముతో ఆ అంధకూపమును ఆక్రమించి ఆయుధములతోను కర్రలతోను కొట్టసాగిరి. అయినను వసురథుడు చలించక ఆ చెట్టు కొమ్మపైనే ఉండి భగవత్స్మరణ చేయుచూ నిద్రించుచుండెను. కొంతసేపటికి మ్లేచ్ఛ రాజు వాని సైన్యములు శక్తిని కోల్పోయి యుండిరి. అప్పుడు రాజు వసురథుని శరీరము నుండి దివ్యరూప ధారాణియైన ఒక నారీమూర్తి బహు అలంకరసమన్వితయై మిక్కిలి కోపదృక్కులతో మ్లేచ్ఛ రాజును వాని సైన్యమును సంహరించి అదృశ్యమయ్యెను.


ఈ విషయమంతయు ఎరుగని వసురథుని హఠాత్తుగా నిద్రనుండి మేల్కొని భగవంతుని అనుగ్రహముచే ఆ కూపము నుండి బయల్వెడలి, ఈ దుష్టమ్లేచ్చులను ఎవరు చంపిరి? నన్ను రక్షించిన వారెవరు? దయచేసి నాకు దర్శనమీయగలరు! అని పలుకగా అప్పుడు ఆకాశము నుండి అశరీరవాణి 'కేశవ భగవానుడు తప్ప శరణాగత జనులను రక్షించు వారింకెవరు?' ఈ విధంగా అశరీర వాణి మాటలకు సంతోషించి గృహమునకు వచ్చెను. ఆనాటి నుండి అత్యంత భక్తిశ్రద్ధలతో భగవద్భజన చేసి తన మనుష్య జన్మను సార్ధకం చేసికొనెను. అని వశిష్ఠ మహర్షి మాంధాత మహారాజుకు 'ఓ రాజా ! ఈ ఆమలకీ ఏకాదశీ వ్రతమును పాటించిన వారు విష్ణు లోకమునకు వెళ్ళగలరు. ఇది భగవద్కృపను పొందుటకు అతి సులభమైన మార్గమని వివరించిరి.


జై శ్రీమన్నారాయణ