రేపటి నుండి ధనుస్సంక్రమణం ప్రారంభం

రేపటి నుండి ధనుస్సంక్రమణం ప్రారంభం


కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన , సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు రాశిలోకి ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు . ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు . ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు….అదే విధముగా కర్కాటక రాశిలో సూర్యుడు సంచరిచే కాలము కర్కాటకమాసము అంటారు.


సూర్యుడు ధనస్సురాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం. కాగా ధనస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు. మానవులకు ఒక సంవత్సరం దేవతలకు ఒకరోజు కింద లెక్క అంటారు. ఈలెక్కన ఉత్తరాయణం రాత్రి , దక్షిణాయనం పగలుగా భావించబడుతోంది. సూర్యుడు కర్కాటకరాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు . అక్కడనుండి దక్షిణాయనం ప్రారంభం. అనగా….ఇది రాత్రి కాలం…మకరరాశిలో ప్రవేశించు సమయం మకర సంక్రమణం ఇక్కడినుండి ఉత్తరాయణం. అనగా…..పగలుగా భావన. ఇలా భావించినప్పుడు… దక్షిణాయనమునకు చివరిది…ఉత్తరాయణమునకు ముందుది ఐన ధనుర్మాసం ప్రాతఃకాలమువలె పవిత్రమైనది.

Shop Now For Sankranthi Special Kondapalli Toys :  https://bit.ly/3FQZ8Jg

సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది. కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈనెలలో ఆరాధిస్తారు. ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించినదే. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని ‘పండుగ నెలపట్టడం’ అనికూడా అంటారు. ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది. కానీ మనం (తెలుగు వారం) చాంద్రమాన అనుయాయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు.


కార్తీక మాసం , మాఘమాసం , శ్రావణ మాసం.. ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలా మంది భావిస్తారు. కానీ.. ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలా మందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసమంతా.. ఉదయం , సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి.. దీపారాధన చేయడం వల్ల మహాలక్షి కరుణా , కటాక్షాలు సిద్ధిస్తాయి.


ధనుర్మాసం విష్ణువికి చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు.. సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మకర , కర్కాటక సంక్రాంతులలో స్నాన , దాన , హోమ , వ్రత పూజలు చేయడం చాలా మంచిది.


ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత ?


ధనుర్మాసం వచ్చిందంటే.. ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి , స్వామిని కీర్తించింది. సూర్యాలయాలు , వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో ఆండాళమ్మ పూజ , తిరుప్పావై పఠనం , గోదాకళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు , సుప్రభాతం బదులు తిరుప్పావై గానం , సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు.


ధనుర్మాసంలో ఉదయం , సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు , దరిద్రం దూరమవుతుంది. ఈ నెలలో ప్రతి రోజు బ్రహ్మీ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీతి. ఆ భూదేవి , అవతారమైన అండాళ్‌ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో తిరు అంటే పవిత్రమైన , పావై అంటే వ్రతం అని అర్థం.

ధనుర్మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి , మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి.


పెళ్లికాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు , గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు , నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ , ఆదిత్య పురాణాల్లో , భాగవతంలో , నారాయణ సంహితలో కనిపిస్తాయి.


ఈ వ్రతం ఆచరించాలనుకునే వాళ్లు తమ స్థోమతను బట్టి విష్ణు ప్రతిమని చేయించి పూజించాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తిచేయాలి. పంచామృతాలతో మహావిష్ణువును అభిషేకించి.. తర్వాత తులసీ దళాలు , పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. నెలరోజులూ చేయలేని వాళ్లు 15 రోజులు , 8 రోజులు లేదా ఒక్క రోజైనా చేయవచ్చు.


ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు , పరలోక మోక్షం పొందుతారు. ఆత్మపరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు.