Facts About Lord Ayyappa

Facts About Lord Ayyappa

శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప..


శ్రీ భుతనాధ సదానంద సర్వ భూత దయాపర

రక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమః


పద్దెనిమిది మెట్ల సోపానాధిపతయే శరణం అయ్యప్ప..


శ్రీ ధర్మశాస్త్రా అయ్యప్పస్వామి వారి పద్దెనిమిది మెట్లు దాని విశిష్ఠత:


మన హిందూ ధర్మ సంప్రదాయ  ప్రకారము ప్రతీ దేవాలయములలో ముఖ్యమైనది మూలవిరాట్ మాత్రమే, కాని కేరళ రాష్ట్రంలో పరశురామునిచే ప్రతిష్టించబడిన శబరిమలైలో శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో అతిముఖ్యమైనది, అతి పవిత్రమైనది మన స్వామివారి ఆలయమునకు ముందున్న పదునెనిమిది మెట్లు.


అంత పవిత్రమైన, సత్యమైన సాలగ్రామ శిలతో నిర్మితమైన ఆ పద్దెనిమిది మెట్లను ఎక్కాలంటే స్వామివారి దీక్షమాల ధరియించి, మండల కాలము అనగా 41 దినముల పైన నియమనిష్టలతో వ్రతనియమములు ఆచరించి, పవిత్రమైన ఇరుముడిని గురుస్వామి ద్వారా శిరస్సున ధరించిగాని ఎక్కుటకు వీలులేదు.


మన హిందు ధర్మ సంప్రదాయము ప్రకారము ప్రతీ దేవాలయములలో ముందర ఉన్న ధ్వజ స్తంభమును తాకి నమస్కరించిన పిదప దేవతలను దర్శించుకుంటాము.. కాని "శబరిమలై" "శ్రీ అయ్యప్ప స్వామి" దేవాలయములో మాత్రము ముందర ఉన్న స్వామివారి 18 మెట్లకు తాకి నమస్కరించిన పిమ్మట  ధ్వజ స్తంభముని తాకి స్వామివారిని దర్శించుకుంటాము.


అంటే మన శబరిగిరి వాసుడు అయ్యప్ప ఆ పద్దెనిమిది మెట్లకు ఎంత ప్రాముఖ్యత కల్పించాడో ఆ పద్దెనిమిది సంఖ్యకు ఎంత విలువనిచ్చారో, దీనిని బట్టి అర్ధమౌతుంది.


భక్తులు అశేషముగా ఆ స్వామి వారిని దర్శించుటకు నియమాల మాల మెడలో ధరించి నిష్టతో దీక్షబూని గురుస్వామి వారికి పూజలు జరిపి, ఇరుముడిని శిరస్సున ధరించి ఆ పద్దెనిమిది మెట్లను అధిరోహించి స్వామి వారిని దర్శించి తరిస్తూయున్నారు. 


అందుకే మనము మన స్వామి పూజలలో కూడ "పడిపూజ" అంటామే కాని, అయ్యప్ప పూజ, స్వామివారి పూజ అని ఎక్కడా అనకుండా అయ్యప్పస్వామి వారి "పడిపూజ" అంటున్నాము.


పురాణాల ప్రకారం, అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండేందుకు నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అష్టదిగ్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారారు.

అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగేస్తూ తన స్థానాన్ని అధిష్టించారు.


పదునెట్టాంబడి విశిష్టత:


శ్రీ అయ్యప్ప సన్నిధానంలోని "పదునెట్టాంబడి" (పదునెనిమిది మెట్లు) ఎక్కడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. మెట్లను దేవతలకు ప్రతి రూపాలుగా భావిస్తారు.


18 మెట్లకు 18 విశిష్టతలు ఉన్నాయి.


1వ మెట్టు అణిమ

2వ మెట్టు లఘిమ

3వ మెట్టు మహిమ

4వ మెట్టు ఈశత్వ

5వ మెట్టు వశత్వ

6వ మెట్టు ప్రాకామ్య

7వ మెట్టు బుద్ధి

8వ మెట్టు ఇచ్ఛ

9వ మెట్టు ప్రాప్తి

10వ మెట్టు సర్వకామ

11వ మెట్టు సర్వ సంవత్కర

12వ మెట్టు సర్వ ప్రియాకార

13వ మెట్టు సర్వ మంగళాకార

14వ మెట్టు సర్వ దుఃఖ విమోచన

15వ మెట్టు సర్వ మృత్యువశ్యమణ

16వ మెట్టు సత్యవిఘ్న నివారణ

17వ మెట్టు సర్వాంగ సుందర

18వ మెట్టు సర్వ సౌభాగ్యదాయక


ఈ 18 మెట్లలో తొలి పంచమ(ఐదు) మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు. అంటే మన కళ్లు, చెవులు, నాలుక, ముక్కు, స్పర్శలకు సంకేతాలుగా భావిస్తారు.


ఆ తర్వాతి ఎనిమిది మెట్లను అష్ట రాగాలకు సంకేతంగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాస్తర్యం, అసూయ, దంబంను సూచిస్తాయని పండితులు చెబుతారు.


చివరి మూడు మెట్లు సత్వం, తామసం, రాజసంను సూచిస్తాయి. ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని వదిలేయాలట.


ఆ తర్వాతి రెండు మెట్లు అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. మనందం జ్ఞానాన్ని పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతాలను సూచిస్తుంది.


ఇలా 18 మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణులవుతారని చాలా మంది నమ్ముతారు.


ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని విడనాడి, స్వార్థాన్ని వదిలేయాలి. భగవంతుడిని తలచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని సన్మార్గంలో వెళ్లమని సూచించాలి.


18 మెట్లు 18 పురాణాలను సూచిస్తున్నాయని, అవి అయ్యప్ప దుష్టశక్తులను సంహరించడానికి ఉపయోగించిన 18 ఆయుధాలని పేర్కొంటారు.


ఈ మెట్లను పరుశురాముడు నిర్మించాడని చెప్పుకుంటారు. అష్టదిక్పాలకులు ఎనిమిది మంది (ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు), రెండు యోగములు (కర్మయోగం, జ్ఞానయోగం), విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానానికి రూపాలుగా ఈ పద్దెనిమిది మెట్లను ఏర్పరచారు.


సన్నిధానంలో చేరిన భక్తులు 18 మెట్లను ఎక్కే ముందు కొబ్బరి కాయను కొట్టి, నెయ్యితో స్వామివారికి అభిషేకం చేస్తారు.


ఈ 18 మెట్లను ఒకమారు ఎక్కడానికి, మరోమారు దిగడానికి ఉపయోగించాలి. అలాగే 40 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారు.


ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానానికి, 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు.


ఈ ఆలయంలో స్వామి కొలువైన సందర్భంగా 18 వాయిద్యాలను మ్రోగించారట. సన్నిధానంలో "పానవట్టం" పైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు.


ఇంతటి విశిష్టత కలిగిన ఈ పద్దెనిమిది సంఖ్యగల "పదునెట్టాంబడి"ని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి వారు శబరిమలై దేవాలయములోను, ప్రతీ అయ్యప్ప దేవాలయాలలోను మరియు స్వామివారి పడిపూజల లోను ఇంత విలువ కలిగియున్నది.


స్వామి శరణం.