తెనాలిలో ముద్దపప్పు సప్తాహములు

తెనాలిలో ముద్దపప్పు సప్తాహములు

పూర్వం మన తెనాలి రామలింగేశ్వర పేటలో, మణెమ్మ గారి మఠం లో ప్రతి ఏడాదీ, మాఘ మాసంలో 'వార్షిక ముద్దపప్పు సప్తాహం' ఘనం గా జరిగేది! 

తెనాలి చుట్టుపక్కల గల ఆరు అగ్రహారాలనుండి వేద పండితులే కాక, ముద్దపప్పు ప్రియులు అయిన ఇతర  కులాలూ, వర్ణాల వారూ కూడా,   వేంచేసి, ఆ ముద్దపప్పు సప్తాహపు ఏడు రోజులూ, ముద్దపప్పు భోజనం, మఠం నిద్రా కావించి తిరిగి వెళ్ళేవారు!మాఘ శుద్ధ పాడ్యమి నాడు, చెయ్యి తిరిగిన నరసరావుపేట వంట వారు కొల్లూరు గ్రామపు పొలాలలో పండిన ఏడాది వయసుగల కందిపప్పు వాడి, బాగుగా గజ భగోణీలలో గోధుమ రంగు బారే వరకూ వేయించి, అటు పిదప బాగుగా ఉడకపెట్టి, ఉప్పూ, పసుపూ వేసి దివ్యమైన ముద్ద పప్పు వండేవారు!


 ఆ ముద్ద పప్పుకు అనుపానములుగా అంగలకుదురు పుల్ల దోసకాయలు వాడి, అనకాపల్లి ఆవపిండీ, చినరావూరు గానుగ నువ్వులనూనే, బుడంపాడు ఎర్ర మిరపకాయలు కొట్టిన కారమూ, వేటపాలెం రాళ్ళ ఉప్పూ తగు పాళ్ళలో వేసి, దేవతా దోసావకాయ తయారు చేసేవారు! అంతే కాక, వలివేరు మెట్టపొలాలలో కాసిన ఎర్ర గుమ్మడి కాయలూ, ముదురు బెండకాయలూ యొక్క ముక్కలు బాగా తగిలించి, ప్రసస్తమైన  ఇంగువ తిరగమాత పడవేసి, గొప్ప గుమ్మడి ముక్కల పులుసు చేసేవారు! తెనాలి పక్కన గల అనంతారం లో పండిన వడ్ల దంపుడు బియ్యం తో, మెత్తగా వేడన్నము వండేవారు! 


ఇకపోతే, వేజెండ్ల గ్రామపు నల్లటి గోకు తేలుతున్న బర్రె నెయ్యి సిద్ధం చేశేవారు! సంగం జాగర్లమూడి బర్రెలు బకింగ్ హాం కాలువ తీరాన గడ్డి మేసి ఇచ్చిన చిక్కటి పాల జిడ్డు గడ్డ పెరుగు పదిహేను కుండలలో తోడు  పెట్టి సిద్ధం చేసేవారు! ఇంగువ మినప వడియాలూ, పెసర ఎర్ర అప్పడాలూ వేయించి ఉంచేవారు!మధ్యాహ్న భోజన వడ్డనకి ముందు, తెనాలి పట్టణ వాస్తవ్యులైన, ప్రముఖ హరికథా భాగవతారు శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి గారి హరికాధా కాలక్షేపం ఏర్పాటు చేశేవారు, ఒక గంట పాటు!


అటు పిమ్మట, పచ్చల తాడిపర్రు అరిటాకులు పరచి, పంక్తులు గా వడ్డన చేయగా, అందరూ ఆ ముద్దపప్పు భోజనం కావించి తాదాత్మ్యం చెందేవారు!

ఇదే విధంగా, మాఘ శుద్ధ విదియా, తదియా, చవితీ, పంచమీ, షష్టీ, సప్తమీ దినాలలో కూడా, అదే ముద్ద పప్పూ, కానీ వేరు రకముల అనుపానాలూ, ఇతర హరికధా, బుర్రకధా, పురాణ పఠనా కాలక్షేపాలూ జరిగేవి!


ఆ 'ముద్దపప్పు సప్తాహములు ' మరల తిరిగి రావు! ఆ రోజులే రోజులు