మేషం: ఈ సంవత్సరం బాగుంది. ఆర్ధిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వివాహాది శుభకార్యాలు ఓ కొలిక్కి వస్తాయి. గురువు, శని గ్రహం అనుకూల ప్రభావం చేత సమాజంలో స్థాయి, పరపతి పెరుగుతుంది. విద్య, ఉద్యోగ విషయాలలో అభివృద్ధికానవస్తుంది. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. మంచి నూతన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి-ఉద్యోగాలలో సంతృప్తికరంగా(జాబ్ సాటిఫికేషణ్) ఉంటుంది. వ్యవసాయ రంగాల రంగం సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయ సంబంధమైన నల్ల నువ్వులు, పత్తి, ఆవాలు, అపరాల వ్యాపారాలు ఈ రాశి వారికి ఈ సంవత్సరం లాభిస్తాయి.
రాజకీయ పరమైన నిర్ణయాలు లాభిస్తాయి. కొంత మంది రాజకీయ నాయకులతో విభేదాలు ఏర్పడినా మీదే పై చేయి అవుతుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు(ప్రమోషన్) వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కళా సంస్కృతిక, క్రీడారంగాలలో మీ ప్రతిభా పాటవాలు గుర్తింపుకు నోచుకుంటాయి. నూనె, ఖనిజ సంబంధమైన వృతి-వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నూతన గృహాలు, వాహన యోగ్యత ఈ సంవత్సరం ముడిపడతాయి. విలువైన వస్తువులను, స్థిరచర ఆస్తులను అమ్మడం, కొనుగోలులలో జాగ్రత్త వహించాలి. టెండర్ల విషయంలో అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. క్రీడలు, రాజకీయలపై మీ అంచనాలు నిజమవుతాయి. మీ నైపుణ్యానికి, ప్రతిభకి, మంచి గుర్తింపు లభిస్తుంది.
వృషభం: ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి . ఆర్ధిక విషయాలు లాభిస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. మొత్తం మీద శ్రమకి తగిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ సంతానం వలన పురోగాభివృద్ధి, మానసిక సంతోషం లభిస్తుంది. విద్య, ఉద్యోగ, పోటీ పరీక్షలు, విదేశాలలో అభ్యసించడానికి, విదేశీ యానం వంటి వాటికీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదే విధంగా గ్రీన్ కార్డ్ కోసం చేసే ప్రయత్నాలు, పరిశోధనా రంగంలో ఉన్న వారికీ సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
గురువు ద్వాదశ రాశి సంచారం, తదుపరి జన్మరాశి సంచారం. శని దశమ స్థాన చలనం, కేతువు పంచమ స్థాన చలనం, రాహువు లాభాస్థాన మందు, సూర్య, చంద్ర గ్రహణాలు, గురు, శుక్ర మౌడ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి.
మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు, వ్యాపారాలకు, ఉన్నతాధికారులకు సంవత్సర ప్రధమార్ధంలో కొంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన, చేస్తున్నా, పెట్టుబడులు జీవితంలో పురోగాభివృద్ధిని కలిగిస్తాయి. కోర్టు పరంగా, కుటుంబ పరంగా వచ్చే వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి.
ఆదర్శవంతమైన జీవితంలో, సక్రమంగా నడుస్తున్నా, బంధువర్గం నుండి విమర్శలు ఎదుర్కొంటారు. దీనికి కారణం మీ క్రమశిక్షణ, ప్రవర్తన వలన అని గ్రహిస్తారు. సంతాన పురోగతి కోసం కొంత గట్టిగా ప్రయత్నించాలసి వస్తుంది. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి దేవుని దయ తప్పక కావలసిందే. పిల్లల ప్రవర్తన మిమ్మల్ని కొంత వరకు బాధ పెట్టవచ్చు.
కుటుంబ పెద్దల ఆరోగ్య పరంగా జాగ్రత్తలు అవసరం. సంతాన పురోగతికై అధిక మొత్తంలో ధనం ఖర్చుచేయవలసి వచ్చును. సంతానం కోసం ప్రయత్నించే వారికి ప్రస్తుతం అనుకూల కాలం కాదు. మాతృమూర్తి నుండి కొంత వరకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి స్పెక్యులేషన్ అనుకూలం. ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండుట మంచిది.
రాజకీయ పరంగా అనుకూలంగా ఉంది. రాజకీయనాయకులకి కలిసొచ్చే కాలం అని చెప్పవచ్చును. క్రింది స్థాయి నుండి వచ్చే వారికీ రాజకీయ పరంగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ ఎదుగుదల సంతృప్తికరంగా ఉంటుంది.
కార్మిక వర్గానికి అనుకూలంగా ఉంటుంది. గతంలో కొనుగోళ్ళు చేసిన స్థిరాస్తుల విలువ పెరిగినా వాటిని అమ్మడానికి వీలులేని పరిస్థితి ఏర్పడుతుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆరోగ్య పరంగా కొంత జాగ్రత్తలు అవసరం. మోకాళ్ళు, వెన్ను నొప్పులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ రాశి వారికి ఈ సంవత్సరం పోటీపరీక్షలు బాగా కలసి వస్తాయి. మీ శక్తి సామర్ధ్యాలకు గుర్తింపు, ప్రఖ్యాతి లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఉన్నత పదవులు వంటివి వరిస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగాలు రావడానికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు.
లాయర్లకి, డాక్టర్లకి, ఫార్మసీ రంగాలవారకి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చును. అదే విధంగా మద్యం, మాంసం, నూనె, పెట్రోలియం రంగాల వారికీ కూడా కలిసొచ్చే కాలం. భాగస్వాముల వ్యాపారాలకు అంత అనుకూల కాలం కాదు. జాగ్రత్త వహించండి.
ఆర్ధిక లావాదేవీలలో మీ భాగస్వాముల వ్యాపారాలను సరైన పద్దతిలో చూసుకోవాల్సిన బాధ్యత మిపైన ఉన్నది. చేజారిపోయిన మీ స్థిరాస్తులు తిరిగి మీకు అందుతాయి. సినీ పరిశ్రమ, పత్రికారంగం, వారికీ కొంతవరకు అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును.
విద్యార్ధిని, విద్యార్ధులు చదువు మీద శ్రద్ధ చాలా అవసరం. ఉన్నత విద్య అభ్యసించే వారు, కాలేజీలకి క్రమం తప్పకుండా వెళ్ళి, చదువు మీద దృష్టి పెడితేగాని ఫలితాలను పొందలేని పరిస్థితి ఉన్నది. ఏకాగ్రత కోసం ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ద్వాదశ రాశులలో గురు గ్రహ సంచారం కొంత ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. మీరు అభిమానించే వ్యక్తులు, ఆప్తులు ఒకానొక సమయంలో దూరంగా ఉండడం సంభవిస్తుంది. దీనికి కారణం తెలియక మీలో మీకు మానసిక ప్రశాంతత లోపిస్తుంది.
ఎవరి అండదండలు అందడంలేదని మీలో పట్టుదల పెరిగి మనోవాంచ నెరవేరడానికి ఎవరి సహకారం లేకుండానే మీకు మీరుగా స్వయంకృషితో ఎదుగుతారు. దైవానుగ్రహం ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. కాకుంటే ఏ చిన్న పొరపాటు చేసినా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోండి. సమాజంలో వృత్తిపరంగా చేసే కార్యక్రమాలు మిమ్మల్ని సరైన బాటలో నడిపిస్తాయి.
మిథునం: ప్రతిష్టాత్మకమైన అవార్డులు, రివార్డులు లభిస్తాయి. ఆరోగ్య పరంగా కొంత జాగ్రత్తలు అవసరం. విదేశీయాన శుభ ఫలితాలు యోగిస్తున్నాయి. ప్రజా సంబంధాలు వృద్ధి చెందుతాయి. రాజకీయ పదవి లభిస్తుంది. వృత్తి-ఉద్యోగాల పరంగా స్థిరత్వం పొందడం అవసరం. స్థానచలనం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి.
వైరివర్గాన్ని అధిగమించి పబ్లిక్ లో మంచి ఖ్యాతిని పొందుతారు. భార్యాభర్తల మధ్య అధికారం కొరకు విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సోదరీ, సోదర భావనతో చేసే వారి సహాయ-సహకారాలను స్వీకరించడం కొంత వరకు మీకు మంచిది. దీనివలన ఆర్ధికంగా లాభపడతారు.
ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. అధికారుల మన్ననలు పొందుతారు. ధైర్యం చేసి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అవి కొంత వరకు మీకు లాభాలు తెచ్చిపెడతాయి. వ్యాపారాన్ని బహు విధాలుగా విస్తరింప చేస్తారు. పోటీ లేకుండా మీకు మీరే అనే విధంగా మీ ఆలోచన సరళి ఉంటుంది. అనుకున్న స్థాయిలో ధనం పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను సాధిస్తారు.
వైద్య విద్యలను అభ్యసించాలనే వారికీ అనుకూలమైన కాలం. మీ కోరిక నెరవేరుతుంది. ఫార్మా, పాల ఉత్పత్తులు. పరిస్థితులకు తగిన అమ్మకాలు చేసేవారికి అనుకులకాలం. పరిశోధన రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కందులు, ధాన్యం, చిరుధాన్యాల పంట వేసే రైతులకు మంచి అభివృద్ధిఉంటుంది.
వృత్తిపరంగా మీ ఆలోచనలతో చేసే కార్యక్రమాలు అభివృద్ధిని కలిగిస్తాయి. జీవితంలో నేరవేరవు అనుకున్న ముఖ్య కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మితిమీరిన ఆత్మ విశ్వాసం అన్ని వేళలా మంచిది కాదని గ్రహించండి. విదేశీ సంబందిత విషయాలు లాభిస్తాయి.
పబ్లిక్ సర్వీసు లలో ఉన్నవారికి, అలంకరణ సామగ్రి, బ్యూటిపార్లర్ నడిపే వారికి, సినీ పరిశ్రమ, విలేఖరులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ (గవర్నమెంట్ )పరంగా కాంట్రాక్టులు లాభిస్తాయి. పోలీసు, మిలటరీ, నావికా, వైమానిక దళాలలో ఉన్న వారికి ప్రమోషన్ లు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి.
డాక్టర్లకు మంచి ఆర్ధిక లాభాలు, వృత్తిలో పదోన్నతులు లభిస్తాయి. చిన్న చిన్న వ్యాపారస్తులకు శని గ్రహ ప్రభావం వలన అనుకులమైన కాలం.
ఆరోగ్య పరంగా జాగ్రత్తలు అవసరం. చర్మ, కాలేయ, గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి.
ఏదీఏమైనా ఈ సంవత్సరంలో వృత్తి-వ్యాపారాలలో శని, రాహు గ్రహ అనుగ్రహం వలన మీరు కొత్త బాద్యతలను స్వీకరించి ఆర్ధిక అభివృద్ధిని సాధించి, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను తెచ్చుకోవడానికి అనువైన కాలంగా చెప్పవచ్చును.
శుభకార్యాల విషయంలో ఆర్ధిక పరంగా కొంత భయపడతారు. సంతానానికి ఎలాంటి సంబంధం వస్తుందోనని కొంత దిగులు పడతారు. మీ మనోధైర్యమే మిమ్మల్ని అనుకూలమైన వాతావరణంలొకి మలుచుకోవడంలో విజయం సాధిస్తారు.
కర్కాటకం: కొంత అనుకూలమైన ప్రతికూల కాలం అని చెప్పవచ్చు. మీరు ఈ సంవత్సరంలో చేపట్టబడే ఆర్ధిక పరమైన విషయాలలో అనుకూలతను సాధిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, గృహ సంబందమైన విషయాలు, విదేశీ సంబందమైన విషయాలు సానుకూల పడతాయి. మీ యొక్క శత్రు వర్గం బలం పుంజుకొని ఇబ్బందికరంగా మారతారు.
భాగస్వాముల వ్యాపారంలో జాగ్రత్త వహించడం అవసరం. ఉన్నత స్థానాలలో ఉన్నవారు, స్నేహితులు, అత్తింటివారు, దగ్గర బంధువుల నుండి కొంత నమ్మక ద్రోహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో అంచనా వేసుకోవడం కష్టతరం అవుతుంది. దీనికి కారణం అష్టమంలో ఉన్న శని భగవానుడు.
ఈ రాసి వారికీ అష్టమ శని నడుస్తున్నందు వలన అఘోర పాశుపత హోమం అలాగే 8 శని వారలు శని కి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. నల్ల నువ్వులు దానం ఇవ్వండి.
సాంకేతిక పరమైన విషయాలలో జాగ్రత్త తీసుకోవడం అవసరం. దీనికి కారణం లేకపోలేదు. కేతుగ్రహ సంచారం వలన తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఉన్నత విద్యను అభ్యసించే వారికీ, Phd చేసేవారికి అనుకూల కాలం అని చెప్పవచ్చు. గురువు దశమ లాభ స్థానాలలో సంచారం, శని అష్టమ స్థాన సంచారం, రాహు-కేతు తృతీయ, భాగ్య స్థానాలలో సంచారం, కుజ గ్రహ సంచారం, సూర్య, చంద్ర గ్రహణాలు, గురు, శుక్ర మౌడ్యములు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తాయి.
విదేశాలలో చదువుకునే వారికి అనుకూల కాలం. ఈ రాశికి చెందిన భార్యాభర్తల మధ్య ఓర్పు, సహనం చాలా అవసరం. భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించి తెగతెంపులు చేసేవారు ఉన్నప్పటికీ దైవానుగ్రహం వలన కొంత వరకు ఇబ్బందులు నుండి బయట పడతారు. గృహ సంబంధ, అలంకర సంబంధ, బంగారం, నగల వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి.
గురు గ్రహ అనుగ్రహం వలన ఆర్ధిక పరమైన అంచనాలు మీరు ఊహించని దానికన్నా రెట్టింపు అవుతాయి. ఎంత అదుపులో ఉంచాలనుకున్నా కొన్ని సదర్భాలలో అనారోగ్యం కొరకు కొంత ఖర్చు పెట్టె పరిస్థితులు ఏర్పడుతున్నాయి. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీరు ఎంతగానో వేచి చూస్తున్న భూముల విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి.
లాయర్లకు, మతాధికారులకు, టీచర్లకు వృత్తి పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. పాడి పరిశ్రమలో వచ్చే లాభాలు సంతృప్తికరంగా ఉంటుంది. విద్యా, సాంస్కృతిక విషయాల్లో కొన్ని మార్పులు వస్తాయి.
బ్యాంక్, చిట్స్ వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించాలి. అధికారుల వలన ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. రహస్యంగా పెట్టిన కొన్ని పెట్టుబడులు వలన కొన్ని విషయ వ్యవహారాలలో న్యాయపరమైన చిక్కుల్లో పడతారు. రాజకీయ పరంగా కొందరి ఓటమికి మీరే కారణం అని నిందలుపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీనికి కారణం మీ అంతరాత్మకు మాత్రమే తెలుస్తుంది.
రాహు-కేతు ప్రభావం వలన మంత్రానుష్టానం బలం లాభిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సనాతన ధర్మం పట్ల ఆకర్షితులు అవుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం మీకు నూతన ఉత్యాహాన్ని అందిస్తుంది.
అనేక సంబంధాలు చూసి చాలా కాలంగా వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఆకస్మికంగా వివాహం కుదురుతుంది. కాకపోతే కనిపించే ఆడంబరాలను చూసి మోసపోకుండా, కుటుంబ నేపధ్యం (చరిత్ర), జాతకం చూసి వివాహం చేసుకోండి. అదే విధంగా అన్ని రకాల విషయాలు లోతుగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. దీనికి కారణం బుధ, గురు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం.
గురు దృష్టి అనుకూలత వలన శత్రువర్గంపై విజయం సాధిస్తారు. పెద్దల ద్వారా పూర్వికుల ఆస్తి లభిస్తుంది. వ్యవసాయం చేసేవారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముక్ష్యంగా టమోటో, నిమ్మ, దానిమ్మ, అల్లం, సుగంధ ద్రవ్యాలు, శెనగలు మొదలైన అపరాల పంటలు వేసే రైతులకు అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. కష్టానికి తగిన ఫలితం మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకే అంటారు మన పెద్దలు కష్టే ఫలి అని..!
సింహం: మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్ధిక పరిస్థితి అంత సానుకూలంగా లేదు. అంతంత మాత్రంగానే గోచరిస్తున్నది. సంవత్సరం ప్రధమార్ధం కన్నా ద్వితీయార్ధం ‘మే’ తదుపరి ఆర్ధిక పరమైన విషయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో చిక్కుకుపోయిన ధనం చేతికి అందుతుంది. వృతి-ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు అందుకుంటారు.
వృతి-ఉద్యోగాల పరంగా మార్పులకు సంబందించి విషయాలలో దూరదృష్టితో అలోచించి మారడం మంచిదని చెప్పదగిన ముఖ్యసూచన. చేసే పనిలో అలసత్వం, సోమరితన ఆవరిస్తుంది జాగురత వహించండి.
గురువు భాగ్యంలో దశమస్థాన సంచారం వలన ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతుంది. మీ అధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు, ట్రస్టులు గట్టి పోటీని ఎదుర్కోనవలసిన పరిస్థితి వస్తుంది.
మీయొక్క కృషి వలన ధర్మ సిద్దాంతాల వలన సమాజంలో మీ స్థాయిని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. జీవితాశాయన్ని సాధించుకోవడానికి ఎంతో కొంత ఆర్ధిక లబ్ధి పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంత వరకు మంచి ఫలితాలను అందుకుంటారు.
సంసారంలో ఒడిదుడుకులు గోచరిస్తున్నాయి. కుటుంబ జీవితంలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే అంశాలు తలెత్తే పరిస్థితులు ఏర్పడతాయి. ఒకరినొకరు అపోహలకు, అపార్ధాలకు పోకుండా సఖ్యతతో ఉండటం మేలైన విషయం. కుటుంబ సంబంద విషయాల్లో వైషమ్యం రాకుండా చూసుకోండి.
సంతాన సౌఫల్య కేంద్రాలకు కొంత అనుకూల కాలం అని చెప్పవచ్చు. సంతానానికి సంబందించిన విషయాలలో కొన్ని కఠినమైన నిర్ణయాలు అవసరమవుతాయి. అవివాహితులకు వివాహ సంబంధాలు కుదరడంలో జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంద వ్యవహారరాలకు దూరంగా ఉండటం ఉత్తమమం.
వ్యక్తిగత వ్యాపార , భాగస్వామ్య ఆర్ధిక సంబంధ విషయాలలో ఎంత కట్టుదిట్టంగా ఉంటే అంతా మంచిది. అంత మేలు జరుగుతుంది.
విదేశీయానం, ఆస్పత్రులు, ఫార్మసీ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. సాంకేతిక విద్య, సైకాలజిస్ట్ లు, గోప్యతతో కూడిన విద్యలను అభ్యసించే వారికి కొంతవరకు అనుకూలమైన కాలం. ఛార్టెడ్ అకౌంట్స్, క్రీడాకారులకు అనువైన కాలం.
విద్యార్ధులు నూతన విద్యను అభ్యసించడానికి, దరఖాస్తు(అప్లికేషన్స్) పెట్టుకోవడానికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చును.
రాజకీయపరమైన విషయాలలో మీ ఆలోచనలు తలక్రిందులు అవుతాయి. రాజకీయ సంకట స్థితి ఏర్పడుతుంది. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందుతారు. నమ్మించి మోసం చేసే వారు చుట్టూ ఉంటారు. జాగ్రత్త వహించండి. గెలుపోటములు వలన రాజకీయ నిశ్శబ్దత అలముకుంటుంది.
మీ ఆహారపు అలవాట్లులో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. చర్మ సంబంధ రుగ్మతలు, రక్త హీనత, నీరు చేరుట, చెవి సంబదిత, మోకాళ్ళ నొప్పులు, అస్తమా, మనఃస్థిమితం లేకపోవడం, మొదలైన అనారోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్త వహించండి.
నిర్మాణ సంబంధమైన విషయాలు నత్తనడకన సాగుతాయి. మీరు తక్కువగా అంచనా వేసిన వారు ముందు పధంలో సాగుతారు.
తృణధాన్యాలు, పండ్లు, చింత, పెసలు, అపరాలు పండించే రైతులకు అనువైన కాలం. అదే విధంగా ఇత్తడి, కంచు, ఇనుము, లోహపు వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది.
కన్య: ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. పనులు నిదానంగా అవుతాయి. ప్రతి ముఖ్యమైన పనులు, కార్యక్రమాలు చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు చూసుకుంటూ చేస్తే కానీ సఫలీకృతం కావు. సరైన గురువులను ఆశ్రయించి, సలహాలు, సంప్రదింపులు చేయడం ద్వారా సత్త్ఫలితాలు పొందగలుగుతారు.
ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ ఆకర్షితులు అవుతారు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సరియైన సమయం అని చెప్పవచ్చును. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళినప్పటికీ ఇంకా ముందుకు వెళ్ళాలనే మీ కోరిక బలపడుతుంది.
విహారయాత్రలు, తీర్ధ యాత్రలు మానసిక ఆనందానికి, సంతోషానికి కారణమవుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడచడానికి మీ శక్తి వంచన లేకుండా ఆధ్యాత్మికమైన భావనలు కలిగించి ప్రశాంతతను నెలకొల్పుతారు.
రాను రాను సనాతన ధర్మం పట్ల ఆకర్షితులు అవుతారు. వాటిని అవలంబిస్తారు. సంఘంలో ఉన్నత స్థాయిలో ఉన్న గురువులను, ఆధ్యాత్మికవేత్తలతో కలసి పని చేస్తారు.
నూతన వృత్తులు, మద్యం, మాంసం వ్యాపారాలు చేసేవారు భాగస్వాముల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం, దగ్గరుండి చూసుకోవడం అవసరం. ఇతరులపై ఆధారపడి ఉండకూడదు.
రచన, పత్రిక, మీడియా, కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి అనుకూల కాలం. భాగస్వాములు మోసాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ముందుగా మేల్కొని తప్పులు జరగకుండా చూసుకోండి.
ఆర్ధిక పరంగా అంతంత మాత్రంగానే ఉంటుంది. ధనం ఎంత వచ్చినప్పటికీ అవసరానికి అవసరాలకు మాత్రమే ఉంటుంది. అంతకు మించి అదా చేయలేరు. ఏ విధంగా వచ్చినా వచ్చింది వచ్చినట్లు నీళ్ళ ప్రాయంగా ఖర్చైపోతుంది. ఆందోళన అవసరం లేదు కొంతవరకు మంచి విషయాలకు ధనం వెచ్చిస్తారు. పది రూపాయల సంపాదన ఉంటే 20 రూపాయలు దానధర్మాలకు, కుటుంబ పురోగాభివృద్ధికి ఖర్చు చేస్తారు.
శుభకార్యాలకు మీరు ఊహించని దానికన్నా రెట్టింపు ఖర్చవుతుంది. ఆకస్మికంగా ధన నష్టం వాటిల్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి.
దైవానుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యం అని మరొకసారి రుజువు అవుతుంది. ఋణ గ్రస్తులకి, ఋణాలు తీసుకొనే వారికి కొంత అనుకూల ఫలితాలుంటాయి.
కుటుంబంలో పిల్లల ప్రవర్తన, క్రమశిక్షణ మీకు సంతృప్తిని ఇవ్వదు. కొంత ఆందోళన కలిగిస్తుంది. పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్ధులు ముఖ్యంగా 10వ తరగతి చదివే వారు కష్టేఫలి అన్నట్టు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలుగుతారు.
ప్రస్తుత సమాజంలో నెలకున్న దురలవాట్లకు బానిస అయ్యే అవకాశాలు ఉన్నాయి. యవత దుర వ్యసనాలకు ఆకర్షితులు అవ్వకుండా గమనించుకుంటూ ఉండాలి.
ఈ రాశికి చెందిన భార్యాభర్తల మధ్య ఓర్పు, సహనం చాలా అవసరం. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పరస్పరం ఒకరినొకరు అర్ధం చేసుకునే పరిస్థితి నెలకొల్పుకోవాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించి తెగతెంపులు చేసేవారు ఉంటారు. అలంటి వారితో జాగ్రత్త వహించండి. భార్యాభర్తల ఇరువురి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించండి.
ముఖ్యంగా ఈ సంవత్సరం మీ జన్మ రాశిలో కేతు సంచారం, సప్తమంలో రాహు గ్రహ సంచారం, కుంభంలో శని గ్రహ సంచారం, అష్టమ భాగ్యంలో గురు గ్రహ సంచారం వలన ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి.
అవివాహితులకు ఈ సంవత్సరం వివాహం కుదురుతుంది. కొంత ఆలస్యమైనా మంచి సంబంధం వచ్చింది అని సంతోషం వ్యక్త పరుస్తారు. వివాహ విషయంలో పూర్తిగా కుటుంబ పరంగా అన్ని విషయాలు తెలుసుకున్న తరువాతనే ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం.
ప్రజా సంబంధాలు పెంచుకుంటారు, మితిమీరిన నమ్మకం మీకు హానిని కలుగచేస్తుంది. కళాత్మక రంగం, ఆర్కెటర్చలకు మీరు చేసిన కృషికి గాను గుర్తింపు లభిస్తుంది. యోగ, మెడిటేషన్, దైవ చింతన పట్ల ఆకర్షితులవుతారు. వాటి వలన ప్రయోజనాన్ని పొందుతారు.
స్నేహితుల కోసం, బంధువుల కోసం, సన్నిహితుల కొరకు మీ పరపతిని, ధనాన్ని ఉపయోగిస్తారు. విదేశాలకు వెళ్ళే వారికి అనుకూలమైన కాలం.
షష్ఠమ శని వలన దీర్ఘకాలిక వ్యాదులు ఇబ్బంది పెట్టె అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకండి. పట్టుదల, దైవానుగ్రహం తోడు ఉంటే ఏదైనా సాధ్యం అని గ్రహిస్తారు.
ఉద్యోగంలో కొన్ని మార్పులు వస్తాయి. మీ మీద బురద జల్లేవారు వున్నారు. ప్రమోషన్స్ కి అడ్డంకి రావచ్చు. కానీ మీ కష్టం పట్టుదల ప్రమోషన్స్ సాదించాలి. చంచలత్వం పనికిరాదు. నేను ఒక్కడినే బాగుండాలి అనకుండా అందరం బాగుండాలి అందులో నేను ఉండాలి అని వెళ్ళండి మేలు జరుగుతుంది.
తుల: ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారు ఎటువంటి అనుమానాలకు తావులేకుండా ఆధ్యాత్మికంగా వెళ్లడానికి సరైన మార్గాలను ఎంపిక చేసుకోవాలి, అన్ని విషయాలలో భ్రమ లేకుండా పని చేయడం మంచిది.
విదేశాలకు వెళ్లే వారికి అనుకూలం. విదేశాలలో విద్యార్థులు చదువుకోడానికి వెళ్లేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని వెళ్ళడం మంచిది. దీనికి కారణం జ్ఞానాన్ని ప్రసాదించే గురువు ఇంట్లో రాహువు ఉండడం.
ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం ఆహారపు అలవాట్లు నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవడం అవసరం. ఆహార రంగంలో మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి.
హోటల్ వ్యాపారం, తినుబండారాల వ్యాపారాలలో కల్తీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అధికారుల నుండి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈ.ఎన్.టి కి సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయి. మానసికంగా స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం ఆరోగ్యానికి మంచిది.
ప్రాథమిక స్థాయిలో ఉన్న విద్యార్థులు అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఉన్నత స్థాయి విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం ఆశించినంతగా ఉండదు. సమాజంలో ఉన్న విషయాలు లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా గోచరిస్తున్నాయి. మీ ఒక్క ప్రవర్తనతో కుటుంబంలోని వారు కొంత వరకు ఇబ్బంది పడవలసి ఉంది.
ఎంతో కాలంగా చేస్తున్న వృత్తిలో కానీ, వ్యాపారంలో గాని పనివేళలో మార్పులు కనిపిస్తాయి. మీ యొక్క పని వేళలో మార్పులు కారణంగా స్నేహితులు, బంధు వర్గానికి కొంత దూరంగా ఏకాంతంగా గడుపుతున్నామన్న భావన కలుగుతుంది. వృత్తి పరంగా స్థాన చలనాలు ఉన్నప్పటికీ మారకుండా ఉండడం మంచిది.
సరైన సమయంలో అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నలోపం లేకుండా ఉంటే తప్పకుండా సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
తక్కువ వ్యవధిలో ఎక్కువ ఆలోచన చేయకుండా ముఖ్యమైన విషయాలు మీద మాత్రమే దృష్టి పెట్టడం వలన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మీరు వీలైనంత వరకు ఎవరికి సలహాలు సూచనలు ఇవ్వకుండా ఉండడం మంచిది.
మే నెల వరకు ఆర్థిక పరంగా కొంత వరకు సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఋణ సంబంధమైన విషయాలలో అప్పులు చేయకుండా ఉండడం మంచిది.
అందరి కన్నా ఎక్కువగా ఈ రాశి వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సరైన సమయం. మంత్రసిద్ది లభించడానికి సరైనకాలం. అన్నదానాలు సేవా కార్యక్రమాలలో విరివిగా పనిచేస్తున్న వారికి అనుకూల కాలం.
కెమెరాలు ముందు వెనుక పని చేస్తున్న వారికి సరైన కాలం అని చెప్పవచ్చును. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. ఏదైనా ఒక బుధవారం గోశాలలో దానంగా బియ్యం, గడ్డి దానం చేయడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో సేవ చేయడం, పాల్గొనడం కూడా మంచిది.
మెడికల్ రంగంలో ఉన్నవారు కూడా కొంత వరకు మీరు చేసే వృత్తులో, అందరూ చేసే సమయాల కన్నా హార్డ్ వర్క్, హార్డ్ అవర్స్ లో పనిచేసే సందర్భాలు రావచ్చు. దీనికి కారణం రాహువు 6వ స్థానంలో ఉండటం.
వ్యవసాయ సంబంధ విషయాలు బాగుంటాయి. విద్యా సంస్థలు నడుపుతున్న వారికి పని చేస్తున్న వారికి కొంత వరకు అపనిందలు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పరిశోధన రంగంలో ఉన్నవారికి అంతరిక్ష రంగంలో పనిచేసే వారికి అకౌంటెంట్లకు, జ్యోతిష్కులకు అనుకూల కాలం.
నూతన గృహం తీసుకునే వారికి అనుకూల కాలం కుటుంబ విషయాలలో ధనం అధికంగా ఖర్చు పెట్టవలసి వచ్చును. ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం.
వృశ్చికం: ఈ సంవత్సరం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వస్తు, వాహనాలు గృహాలు కొనుగోళ్లు చేస్తారు ఇంటి కోసం చేసే లోన్ ప్రయత్నం ఫలిస్తుంది, క్రెడిట్ కార్డు విషయంలో కాస్త జాగ్రత్త అవసరం, అప్పు త్వరగా తీర్చడానికి ప్రయత్నం చేయండి గృహంలో శుభకార్యాలు జరగడానికి సరైన కాలం.
ఈ రాశి వారికి అర్ధాష్టమి నడుస్తున్నప్పటికీ షష్ట, సప్తమ, గురు సంచారం, పంచమ రాహు సంచారం లాభ స్థానంలో కేతు సంచారం అభివృద్ధిని సూచిస్తుంది. ఆర్థికపరమైన సమస్యల నుండి బయటకు రావడానికి మీరు చేసిన కృషి ఫలిస్తుంది. మీ సంపాదనలో కొంత భాగం మీ సంతాన అభివృద్ధికే ఖర్చు పెడతారు. కుటుంబంలో ఒకటి సంపాదన మీకు ఆనందాన్ని ఇస్తుంది.
భాగస్వాముల వ్యాపారం ప్రధమార్ధంలో కన్నా ద్వితీయార్థంలో లాభిస్తాయి.
సమాజంలోని బంధువుల్లోనూ ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది గృహ నిర్మాణం చేస్తారు లాటరీలు, జూదాలు, బెట్టింగులకు దూరంగా ఉండడం మంచిది.
విద్యా సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మంచి అభివృద్ధి పథంలో ఉన్నవారికి సన్నిహితులు అవుతారు.
అన్యభాషలను నేర్చుకోవడంలో మీ సృజనాత్మకతను ఉపయోగించడం వలన వృత్తి వ్యాపారాలలో లాభసాటిగా ఉండును. స్పెక్యులేషన్ లాభిస్తాయి. విదేశాల్లో వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. శాస్త్ర సాంప్రదాయాలలో ఉన్నవారికి ఆశాజనకంగా ఉంటుంది.
వృత్తిలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి ఇంక్రిమెంట్లు పొందడానికి అనువైన కాలం. విదేశీయానం అనుకూలంగా ఉంటుంది. టెక్నాలజీ డెవలప్మెంట్ అనేవి బాగుంటుంది. దానికి బానిస కాకుండా మనం డెవలప్మెంట్ అవ్వడానికి మాత్రమే ఉపయోగిచుకోవాలి. సినీ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా వుంది.
మీ యొక్క సంపాదన కారణంగా కుటుంబం స్నేహితులకు కొంత దూరంగా ఉంటున్నామని ఆలోచన మీ మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. ఒంటరి తనం కొంత బాధ పెడుతుంది. దీనికి కారణం మీ ధన సంపాదన బాగుండడం ముఖ్య కారణం. కోర్టు వ్యవహారాలు భూమి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి.
మీకు వచ్చిన సంపాదనలో కొంత దాన ధర్మాలకు వృద్ధాశ్రమాలకు అన్న సమారాధనలకు ఖర్చు పెట్టడం వలన కేతు గ్రహ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. దూర ప్రాంతాల ప్రయాణం చేసే వారికి తీర్థయాత్రలు చేసే వారికి మీ సంపాదనలో కొంత ఖర్చు పెట్టడం మంచిది.
సంతానం కోసం ప్రయత్నించేవారు ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అనారోగ్య సమస్యలు కొన్ని సమయాలలో మీకు ఆటంకాలను కలిగిస్తాయి. సంతాన సాఫల్య కేంద్రాలకు అనుకూల కాలం.
గణిత వేత్తలకు అకౌంటెంట్, సినిమా పరిశ్రమలో ఉన్న యాక్టర్స్ కి, న్యాయవాదులకు అనుకూల కాలం.
మీ భావాలను కరెక్ట్ గా ఎక్స్ ప్రెస్ చేయడం అనేది చాలా అవసరం. స్త్రీ సంబందిత అనారోగ్య సమస్యలు, మధుమేహం, కాలేయ సంబంధిత ఇబ్బందులు, చర్మ సంబంధ సమస్యల విషయాలలో జాగ్రత్త వహించండి.
ఈ సంవత్సరం ఈ రాసి వారు అఘోర పాశుపత హోమం, ప్రతి శనివారాలు వెంకటేశ్వరా స్వామికి అర్చన చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు.
ధనస్సు: అనుకూలమైన గురు గ్రహ ప్రభావం చేత చాలా విషయాలలో విజయం సాధిస్తారు. జీవిత సాధనకు సంబంధించి గురు గ్రహ అనుగ్రహం చేత మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది.
గురువు పంచమ, షష్ఠమ స్థాన సంచారం. రాహువు చతుర్థ స్థానం చలనం, కేతువు దశమ స్థాన చలనం, శని తృతీయ స్థాన చలనం, శుక్ర మౌడ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి.
విద్యా సంబంధ విషయాలు, వాహన కొనుగోలు, నూతన గృహములకు ప్రయత్నించే వారికి అనుకూల కాలం. కుటుంబంలో శుభకార్యాలకు ధనంను విరివిగా హెచ్చిస్తారు. మీరు ధనం వ్యయంలో చేసే ప్రణాళికలు రాబోయే భవిష్యత్తు(ఫ్యూచర్)లో ఉత్తమ ఫలితాలను అందిస్తాయి.
పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. యోగ, మెడిటేషన్, ప్రకృతి వైద్యం, వైద్య వృత్తులు, ఆధ్యాత్మిక విద్యను బోధించే వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి.
వృత్తి-వ్యాపారాలు దూరప్రాంతాలలో పనిచేసే వారికి అనుకూల కాలం. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారితో సంబంధాలు ఏర్పడతాయి తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు చేసే వారు, మార్పుకోసం చేసే ప్రయత్నాలు చేసే వారికి అనుకులమైన వాతావరణం నెలకుంటుంది.
మీరు పని చేసే విద్యా సంస్థలు, కార్యాలయాలలో మోసాలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్లు ఉంటాయి కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్ధిక పరంగా అనుకూలమైన పరిస్తితులు ఏర్పడతాయి. గతంలో ఇచ్చిన రుణాలు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. లాయర్లకు, టీచర్లకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. సాంకేతిక లోపాలు రాకుండా చూసుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
సోదర సహోదరి వర్గానికి చెందిన వారు అభివృద్ధిలోకి వస్తారు .శత్రు వర్గంపై విజయాన్ని సాధిస్తారు. అవివాహితులకు వివాహ కాలం. వివాహ విషయంలో జాతక పరిశీలన చేసుకొని, ఒకటికి రెండు సార్లు అన్ని విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్ళండి.
సంతాన పరంగా ఎదురు చూసే వారికి మంచి సమయం. సానుకూల ఫలితాలు అందుకుంటారు. పూల తోటలు, పండ్ల తోటలు, అపరాల పంటలు వేసే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. అదే విధంగా అలంకరణ సామాగ్రి, బ్యూటీ పార్లర్, ఫ్యాషన్ డిజైనింగ్ వారికి అనుకూల కాలం.
సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఉన్నవారు, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు జాగ్రత్త వహించండి. రక్త హీనతకు సంబందించిన సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది.
మకరం: ఈ సంవత్సరం కొంత వరకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపార రంగంలో ఉన్న వారికి కొంతవరకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సహోదర, సహోదరీల మధ్య చిన్నపాటి ఆత్మీయ బంధాలు పెరగడానికి ఆస్కారాలు ఉన్నాయి. దాని ద్వారా మీరు లాభ పడతారు. నూతన అభివృద్ధి కొరకు ప్రయత్నించే వారికి అనుకూలమైన కాలం.
విదేశీ ప్రయాణాలు చేయడానికి మంచి సమయం. కుటుంబ పెద్దలను సంతోష పెట్టడంలో కొంత కష్టపడవలసి వచ్చును. దైవానుగ్రహం మీ మీద ఎప్పుడూ ఉంటుంది.
ప్రేమ వివాహాలు విషయంలో కొంత అనుకూలత ఉంటుంది. సంతాన విషయంలో కొంత వరకు సంతృప్తి పొందుతారు. సంవత్సర ప్రధమార్ధంలో కుటుంబంలో అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
జీవనాధారమైన వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. మీ ఆర్థిక మూలాలను ప్రకలించి మిమ్మల్ని దెబ్బతీయాలని చేసే ప్రయత్నం, మిమ్మల్ని కొంత వరకు ఇబ్బంది పెడుతుంది. అన్ని విషయాలను జాగర్తగా చూసుకోవడం మంచిది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగా రాణిస్తాయి.
గృహంలో చేసే శుభకార్యాలు అనుకూలిస్తాయి. మీ సొంత నిర్ణయాలు అమలు చేసేటప్పుడు, మీ యొక్క ధైర్య సాహసాలు కొంత వరకు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీ నిర్ణయాలు, ఆలోచనలు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది.
ప్రభుత్వ సంబంధమైన పనులకు కన్నా, ప్రైవేటీకరణ సంబంధమైన పనులు ప్రాధాన్యత ఇస్తారు. వృత్తి ఉద్యోగాలలో స్థాన చలనం ఉన్నది. స్పెక్యులేషన్ లాభిస్తుంది.
సుగంధ వ్యాపారాలు, వస్త్ర వ్యాపారం, సౌందర్య సామాగ్రి, వైద్య పరికరాలు అమ్మేవారు, చిన్నపాటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం వృత్తి పరంగా అనుకూలంగా ఉంది.
మీ ఆధ్వర్యంలో ఉన్న ఆధ్యాత్మిక సంస్థలు మంచి పురోగతి, అభివృద్ధిని సాధిస్తాయి. తీర్థయాత్ర చేయడం ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం కొంత వరకు మీకు మానసిక శాంతిని ఇస్తుంది.
అన్నిటికీ దేవుడే దిక్కు అనే మీ మానసిక ఆలోచన మీకు ప్రశాంతతను ఇస్తుంది. ఈ సమాజంలో నీతి నిజాయితీ మంచితనం కన్నా ధనమే మిన్న, ధనం ముఖ్య పాత్ర వహించడం మీ మానసిక వేదనకు కారణమవుతుంది. దానివాలనే వేదనకు గురి అవుతారు.
ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో పాల్గొని నీ జీవిత గమ్యం, సత్యం ఏంటో మీరు తెలుసుకోవడానికి మంచి అనుకూలమైన సమయం.
మీ కుటుంబ సభ్యులలో కొంత వరకు అభద్రతాభావం ఏర్పదుతుంది. ఆరోగ్యపరంగా కొంత వరకు జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మనోవేదనకు గురికాకుండా ఉండడం అవసరం. చర్మ సంబంధ వ్యాధులు హిమాగ్లోబిన్, రక్త సంబంధం వ్యాధులతో జాగ్రత్తలు అవసరం.
కేతు గ్రహ సంచారం జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చినప్పటికీ అవి తాత్కాలికంగా మాత్రమే ఉండును. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త అవసరం. మితిమీరిన ఆత్మవిశ్వాసం వలన స్వయంకృత అపరాదాల వలన నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కావున రాహు గ్రహ శాంతికై రాహు కాల దీపం లేదా రాహు జపం చేయడం అవసరం.
రాజకీయ వ్యక్తులకు అనుకూలంమైన కాలం. భవిష్యత్తు కార్యాచరణను మును ముందుకు తీసుకెళ్ళడానికి రచనలు చేస్తారు. క్రింది స్థాయి వర్గం నుండి సహాయ సహకారాలు అందుతాయి.
కుంభం: ఈ సంవత్సరం తృతీయ చతుర్ధ రాశులలో గురు గ్రహ సంచారం జన్మరాశిలో శని గ్రహ సంచారం, గురు శుక్ర మౌడ్యయాలు, ద్వితీయంలో రాహు సంచారం, అష్టమంలో కేతు గ్రహ సంచారం ప్రధాన ఫలితాలు నిర్ణయించుతున్నాయి.
ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. కొత్త సంపాదన మార్గాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహు కేతు సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి.
వివాహ విషయంలో అన్ని విషయాలను పరిశీలించుకుని ముందుకు వెళ్లడం మంచిది. ఒకటికి నాలుగు సార్లు పరిశీలించుకుని, ఇరువురి జాతకం చూపించుకొని వివాహ పరంగా నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం.
నూతన ఆహారపు అలవాట్లు అలవాటు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క కుటుంబ పరంగా అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక పరమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధ విషయాలు, స్థిరాస్తులు ఏర్పరచుకోవడం జరుగుతాయి.
విద్యా సంబంధ విషయాలు అన్ని రంగాల విద్యార్దిని విద్యార్ధులకు, ఉద్యోగస్తులకి బాగున్నాయి. పి.హెచ్ డి చేసే వారికి, విదేశాలకు వెళ్లే వారికి అనుకూల కాలం. షేర్ మార్కెట్ వారికి అనుకూలం. అయితే కొంత మందికే వర్తిస్తుంది షేర్ మార్కెట్.
బ్యాంకుల ద్వారా రుణం పొంది నూతన గృహాలు వాహనాలు తీసుకునే వారికి అనుకూల కాలం. ప్రొమసరీ నోట్ల విషయాలలో, బాండ్ పేపర్ల విషయాలలో జాగ్రత్త అవసరం. మీరు నడిపే విద్యా సంస్థలలో, ధార్మిక సంస్థలలో అవకతవకలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు వహించడం ద్వారా ఆర్థిక పురోగాభివృద్ధి పొందుతారు.
సంతానం కోసం చూసేవారికి అనుకూలాగా ఉంటుది. కుటుంబంలో ఆకస్మిక మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఎటువంటి మానసిక ఒత్తిడికి ఎటువంటి అపోహాలు తావు లేకుండా ఉండడం మంచిది.
జీవిత భాగస్వామిల మధ్య వేరొకరి ప్రమేయం లేకుండా ఉండుట మంచిది. మరొకరి హస్తం ఉంటే మీ మధ్యన మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వామి ద్వారా లాభాన్ని పొందుతారు. విడాకుల విషయంలో ఆలస్యం అవుతుంది.
ఫార్మా, డాక్టర్లకు లాయర్స్ కు, ఎగుమతి దిగుమతి వ్యాపారులకు అనుకూల కాలం. ఇతరులు ఇచ్చే చెక్ బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వచించండి.
వృత్తి-వ్యాపార పరంగా ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఫిక్స్ డిపాజిట్ ల ద్వారా భవిష్యత్తులో లబ్ధి పొందుతారు. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి ఇంటెలిజెన్సీ లో ఉన్నవారికి, సి.ఐ.డి, మీడియా రంగాలలోని వారికి అనుకూల కాలం.
రాజకీయ వేత్తలకు, రైతులకు జాగ్రత్తలు అవసరం. రాజకీయ పరంగా మోసపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. నమ్మించి మోసం చేసేవారు అధికంగా ఉన్నారు. గమనించుకుంటూ ఉండాలి. లేదంటే భస్మాసుర హస్తం అనే నానుడి ఫలితమే ఉంటుంది.
ఆరోగ్య పరంగా మెళకువ అవసరం. మోకాళ్ళ నొప్పులు దీర్ఘకాలిక రోగాలు, నేత్ర సంబంధిత వ్యాధులు విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఈ సంవత్సరం శని, గురు సంబంధ కార్యక్రమాలు జపాలు చేయడం వలన గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు పొందటానికి అవకాశాలు ఉంటాయి.
మీనం: ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త విషయాలు ఆలోచించడంలో ఏది మంచో, ఏది చెడు నిర్ణయించుకుని నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా జన్మరాశిలో రాహు గ్రహ సంచారం, ద్వితీయ, తృతీయాలలో గురు గ్రహ సంచారం, సప్తమంలో కేతు, వ్యయంలో శని గ్రహ సంచారం ప్రధాన ఫలితాలు నిర్ణయిస్తున్నాయి.
వ్యాపారంలో చేసే మార్పులు ఆలోచించి చేయడం మంచిది. జీవిత భాగస్వామి నిర్ణయాలు తీసుకుని చేయడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీ యొక్క ఆలోచనా విధానాలు కొంత తప్పు దోవ పట్టే అవకాశాలు ఉన్నాయి.
దాని వలన మీరు ప్రయోజనాలు ఎంతవరకు పొందగలరో నిర్ణయించుకొని ముందుకు వెళ్లడం మంచిది. నూతన భాగస్వాముల వ్యాపారంలో ధనం పెట్టుబడిగా పెట్టకపోవడం మంచిది.
ఉద్యోగ, వ్యాపారంలో బాధ్యతలు అధికమవుతాయి. సమాజంలోని కొంత మంది చేసిన రాజకీయాల వలన అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కొన్నాళ్లు వృత్తిలో అసంతృప్తి ఏర్పడుతుంది. మీ ప్రయత్నలోపం వలన కావచ్చు వేరే కారణాలు కావచ్చు చేసే పనిలో కొంత జాప్యం జరిగే విధంగా గోచరిస్తున్నది.
సొంతంగా మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మేలు చేస్తాయి. అయితే ప్రతి పని ఒక్కటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. టీం వర్క్ బగుంటుంది. మీ సంస్థలో పని చేసే ఉద్యోగస్తులు సంస్థ కోసం కష్టపడతారు, వారు అన్నివేళలా మీకు అండగా వుంటారు దాని వలన సంస్థ ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడతారు. అందరు బాగుండాలి అనే మీ ధోరణి ముందుకు నడిపిస్తుంది. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది.
వృధా ప్రయాణాలు అధికమవుతాయి. ఒక్కో సంధర్బంలో వృధా ప్రయాసమవుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చినప్పటికీ సర్దుకుపోవడం మంచిది. ఇతరుల జ్యోక్యం అనవసరం. దాని వలన దూరం పెరిగే ఆస్కారాలకి తావు ఇచ్చినవారు అవుతారు.
చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆందోళన కలిగించే అంత ఇబ్బందులు ఉండవు. అయినా కూడా తగిన జాగ్రత్తలు అవసరం.
షుగర్, జీర్ణవ్యవస్థ, మోకాళ్ళ నొప్పులు, ఇ.ఎన్.టి, నరాల బలహీనత, అలర్జీ వ్యాధులను ముందుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
అన్నదమ్ములు అక్క చెల్లెలు మధ్య సంబందబాంధవ్యాలు అనుకూలిస్తాయి. అయినవారికి కొంత కాలం దూరంగా ఉంటారు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోయినప్పటికీ అనుకున్న సమయానికి ఋణం ద్వారా డబ్బులు సంపాదిస్తారు. అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంతాన విషయంలో కొంత కష్టపడతారు. యువత దురవ్యసనాలకు దూరంగా ఉండటం, కుటుంబానికి, సమాజానికి మంచిది.
పి.హెచ్.డి చేసేవారికి అనుకూలంగా ఉన్నది. ఆర్ధికంగా అనుకూలంగా ఉన్నట్టు ఉంటుంది. కాని ఆదాయం కంటికి కనిపించదు. ఎంత ఉన్నా లేదనే భావన ఉంటుంది. వృధా ఖర్చులకి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ధనం ఖర్చయినప్పటికీ అది కొంత వరకు శుభకార్యాలకే ఖర్చు పెడతారు.
రాజకీయ పరంగా అభివృద్ధి ఉంటుంది. ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్త అవసరం. కుటుంబ వరంగా తీర్థయాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొనడం, గురువుల బోధనలు, ఆధ్యాత్మిక వాతావరణంలో గడపడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. మెడిటేషన్, యోగా వంటి విషయాలలో ఆసక్తి చూపుతారు.
ఉన్నత స్థాయిలో ఉన్నవారికి పరీక్షాకాలం. కోర్టు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకోని సంఘటనలు ఎదురైనా ధృఢ సంకల్పంతో ముందుకు సాగి విజయాలు అందుకుంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులను అర్ధం చేసుకుంటూ అనుగుణంగా నడుచుకోవం వలన సత్ఫలితాలను పొందుతారు.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121