శ్రీసాయిసచ్చరిత్ర
మూడవరోజు పారాయణ (శనివారం)
పదహారు - పదిహేడవ అధ్యాయాలు
బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మా సాక్షాత్కారమునకు యోగ్యత : బాబా వారి వైశిష్ట్యము
బ్రహ్మజ్ఞానం : గత అధ్యాయంలో చోల్కరు తన మ్రోక్కుని ఎలా చెల్లించుకున్నాడో బాబా దాన్ని ఎలా ఆమోదించారో చెప్పాను. ఏ కొంచెం అయినా భక్తి ప్రేమలతో ఇచ్చిన దాన్ని ఆమోదిస్తాననీ, గర్వంతో, అహంకారంతోను ఇచ్చిన దాన్ని తిరస్కరిస్తాననీ బాబా ఆ కథలో నిరూపించారు. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడు కావడం వల్ల కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టే వారు కాదు. ఎవరైనా భక్తిప్రేమలతో ఏదైనా సమర్పించినా అత్యంత సంతోషంగా, ఆత్రంగా దాన్నిపుచ్చుకునేవారు. నిజంగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు, దయార్థ్ర హృదయులు లేరు. కోరికలు నెరవేర్చే చింతామణి, కల్పతరువు వారికి సమానం కావు. మనం కోరినవన్నీ ఇచ్చే కామధేనువు కూడా బాబాతో సమానం కాదు. ఎలా అంటే అవి మనం కోరినవి మాత్రమే ఇస్తాయి. కాని సద్గురువు అచింత్యం, లభ్యంకాని ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదిస్తారు. ఒకరోజు ధనికుడు సాయిబాబా దగ్గరికి వచ్చి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించమని బ్రతిమిలాడాడు. ఆ కథ ఇక్కడ చెపుతాను.
సకల ఐశ్వర్యాలు అనుభవిస్తున్న ఒక ధనికుడు ఉండేవాడు. అతడు ఇళ్ళు, ధనం, పొలాలను, తోటలను సంపాదించాడు. వాడికి అనేకమంది సేవకులు ఉండేవారు. బాబా కీర్తి వాడి చెవిలో పడగానే షిరిడీకి వెళ్ళి బాబా పాదాలపై పడి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించమని బాబాను వేడుకుంటానని అతని స్నేహితుడితో చెప్పాడు. తనకు వేరే ఇంకా ఏమీ వద్దని, బ్రహ్మజ్ఞానాన్ని పొందినట్లయితే తనకు మిక్కిలి సంతోషం కలుగుతుంది అని చెప్పాడు. ఆ స్నేహితుడి ఇలా అన్నాడు 'బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడం అంత సులభమైన పని కాదు. ముఖ్యంగా నీవంటి దురాశ ఉన్నవాడికి అది అత్యంత దుర్లభం, ధనం, భార్యాబిడ్డలతో విలసిల్లుతున్న నీవంటివాడికి బ్రహ్మజ్ఞానం ఎవరు ఇస్తారు? నీవు ఒక పైసా దానం చేయనివాడివే! నీ బ్రహ్మజ్ఞానం కోసం వెదుకుతున్నప్పుడు నీ కోరిక నెరవేర్చేవారు ఎవరు?.’
తన స్నేహితుడి సలహాను లక్ష్యపెట్టకుండా, రానుపోను టాంగాను బాడుగకు కట్టించుకుని అతను షిరిడీ వచ్చాడు. మసీదుకు వెళ్ళి, బాబాను చూసి వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు 'బాబా! ఇక్కడికి వచ్చిన వారికి ఆలస్యం చేయకుండా బ్రహ్మాన్ని చూపెడతారని విని నేను ఇంత దూరం వచ్చాను. ప్రయాణం వల్ల నేను అలసిపోయాను. మీరు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించినట్లయితే నేను పడిన శ్రమకు ఫలితం లభిస్తుంది. బాబా ఇలా బదులు చెప్పారు 'నా ప్రియమైన స్నేహితుడా! ఆతృత పడొద్దు. త్వరలో నీకు బ్రహ్మాన్ని చూపిస్తాను. నాది నగదు బేరమే కాని అరువు బేరం కాదు. అనేకమంది నా దగ్గరకి వచ్చి ధనం, ఆరోగ్యం, పలుకుబడి, గౌరవం, ఉద్యోగం, రోగనివారణ మొదలైన ప్రాపంచిక విషయాలనే అడుగుతారు. నా దగ్గరికి వచ్చి బ్రహ్మజ్ఞానం ఇవ్వమని అడిగేవారు చాలా తక్కువ. ప్రపంచ విషయాలు కావాలి అని అడిగేవారికి లోటు లేనే లేదు. పారమార్థిక విషయమై ఆలోచించేవారు మిక్కిలి అరుదు. కాబట్టి నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానం కావాలని అడిగే సమయం శుభమైనది, శ్రేయోదాయకమైనది. కాబట్టి సంతోషంతో నీకు బ్రహ్మజ్ఞానాన్ని దానికి సంబంధించిన వాటన్నింటినీ చూపిస్తాను.’
ఇలా అని బాబా వాడికి బ్రహ్మాన్ని చూపించడం మొదలుపెట్టారు. వాడిని అక్కడ కూర్చోమని ఎదో సంభాషణలోకి దించారు. అప్పటికి అతడు తన ప్రశ్న తానే మరిచిపోయేలా చేశారు. ఒక బాలుడిని పిలిచి నందు మార్వాడి దగ్గరికి వెళ్ళి 5 రూపాయలు చేబదులు తీసుకుని రమ్మన్నారు. బాలుడు వెళ్ళి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి దగ్గర లేడనీ వాడి యింటికి తాళం వేసి ఉందనీ చెప్పాడు. కిరాణా దుకాణదారుడి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకుని రమ్మని బాబా అన్నారు. ఈసారి కూడా బాలుడు వట్టి చేతులతో తిరిగి వచ్చాడు. ఇంకా ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళగా ఫలితం లేకపోయింది.
సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమే అని మనకు తెలుసు. అయినా 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరం ఏమిటి? వారికి అంత చిన్న మొత్తంతో ఏం పని అని ఎవరైనా అడగ వచ్చు. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాలా యింటి దగ్గర లేరని వారికి తెలిసే ఉంటుంది. ఇది అంతా బ్రహ్మజ్ఞానం కోసం వచ్చినవాడి కోసం జరిపించి ఉంటారు. ఆ పెద్దమనిషి దగ్గర నోట్ల కట్ట వుంది. అతనికి నిజంగా బాబా దగ్గర నుంచి బ్రహ్మజ్ఞానం కావలసినట్లయితే, బాబా అంత ప్రయాస పడుతున్నప్పుడు అతడు ఊరికే కూర్చున్నాడు. బాబా ఆ పైకాన్ని తిరిగి యిచ్చి వేస్తాడని కూడా వాడికి తెలుసు. అంత చిన్న మొత్తం అయినప్పటికీ వాడు తెగించి యివ్వలేకపోయాడు. అలాంటి వాడికి బాబా దగ్గర బ్రహ్మజ్ఞానం కావాలట! నిజంగా బాబా పట్ల భక్తి ప్రేమలు కలవాడు ఎవరైనా వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చేవారే కాని ఊరికే ప్రేక్షకుడిలా కూర్చుని ఉండేవారు కాదు. ఈ పెద్దమనిషి వైఖరి శుద్ధ విరుద్ధంగా ఉండింది. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వమని తొందర పెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు 'ఓ మిత్రుడా! నేను నడుపుతున్నది అంతటినీ గ్రహించలేకపోయావా ఏమి? ఇక్కడ కూర్చుని నువ్వు బ్రహ్మాన్ని చూడటం కోసం ఇదంతా జరిపిస్తున్నాను. సూక్ష్మంగా విషయం ఇది, బ్రహ్మాన్ని చూడడానికి 5 వస్తువులు సమర్పించాలి. అవి ఏవంటే 1 పంచప్రాణాలు 2 పంచేంద్రియాలు 3 మనస్సు 4 బుద్ధి 5 అహంకారం, బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మసాక్షాత్కారనికి వెళ్ళే దారి చాలా కఠినమైనది. అది కత్తిలా మిక్కిలి పదునైనది.’
అలా అంటూ బాబా ఈ విషయానికి సంబంధించిన సంగతులు అన్నీ చెప్పారు. వాటిని క్లుప్తంగా ఈ క్రింద పొందుపరిచాము.
బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మసాక్షాత్కారానికి యోగ్యత :
అందరూ తమ జీవితంలో బ్రహ్మాన్ని చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరం.
1. మముక్షుత లేదా స్వేచ్చ పొందాలనే తీవ్రమైన కోరిక:
ఎవడు అయితే తాను బద్ధుడు అని గ్రహించి బంధనాల నుండి విడిపోవడానికి కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖాలను లక్ష్యపెట్టకుండా దాన్ని పొందడం కోసం ప్రయత్నిసాడో వాడు ఆధ్యాత్మిక జీవితానికి అర్హుడు.
2. విరక్తి లేదా ఇహపర సౌఖ్యాల పట్ల విసుగు చెందడం :
ఇహపర లోకాల పట్ల ఉన్న గౌరవాలకు, విషయాలకు విసుగు చెందిన కానీ పారమార్థిక రంగంలో ప్రవేశించడానికి అర్హత లేదు.
3. అంతర్ముఖత (లోపలికి చూడటం):
మన ఇంద్రియాలు బాహ్యాన్ని చూడటానికే భగవంతుడు సృజించాడు. కాబట్టి మనుష్యలు ఎప్పుడు కూడా బయట ఉన్నవాటిని చూస్తారు. కాని ఆత్మసాక్షాత్కారం లేదా మోక్షాన్ని కోరుకునేవాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోపల వున్న ఆత్మనే ధ్యానంతో చూడాలి.
4. పాపవిమోచన పొందుట:
మనుష్యులు దుర్మర్గామార్గం నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పులు చేయడం మాననప్పుడు, మనస్సు చలించకుండా నిలబెట్టలేక పోయినప్పుడు జ్ఞానం ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేరు.
5. సరైన నడవడిక:
ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకుతూ, తపస్సు చేస్తూ, లోపల చూస్తూ బ్రహ్మచారిగా ఉన్నాగాని ఆత్మసాక్షాత్కారం లభించదు.
6. ప్రియమైన వాడి కంటే శ్రేయస్కరమైన వాడిని కోరుకోవడం:
లోకంలో రెండు విధాలైన వస్తువులు ఉన్నాయి. ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. మొదటిది వేదాంత విషయాలకు సంబంధించినది. రెండవది ప్రాపంచిక విషయాలకు సంబంధించినది. ఈ రెండూ మానవులకు చేరుతాయి. వీటిలో ఒకదాన్నే అతడు ఎంచుకోవాలి. తెలివిగలవాడు మొదటిదాన్ని అంటే శుభమైన దాన్ని కోరుకుంటాడు. బుద్ధి తక్కువవాడు రెండవ దాన్ని కోరుకుంటాడు.
7. మనస్సును ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోవడం:
శరీరం రథం, ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రధాన్ని నడిపే సారథి, మనస్సు కళ్ళెం, ఇంద్రియాలు గుఱ్ఱాలు, ఇంద్రియ విషయాలు వాటి మార్గాలు. ఎవరి ఇంద్రియాలు స్వాధీనంలో ఉండవో (బండి తోలేవాడి దుర్మార్గపు గుఱ్ఱాలలా) వాడు గమ్యస్థానం చేరుకోలేడు. చావుపుట్టుకల చక్రంలో పడిపోతాడు. ఎవరికి గ్రహించే శక్తి వుంటుందో, ఎవరి మనస్సు స్వాధీనంలో వుందో, ఎవరి ఇంద్రియాలు స్వాధీనంలో ఉంటాయో (బండి తోలేవాడి మంచి గుఱ్ఱాలలా) ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గంతో లాగి పట్టుకోగలడో వాడు తన గమ్యస్థానాన్ని చేరుకుంటాడు. విష్ణుపదాన్ని చేరగలడు.
8. మనస్సును పావనం చేయడం:
మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా, ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించకపోతే అతని మనస్సు పావనం కాదు. మనస్సు పావనం కాకుండా అతడు ఆత్మసాక్షాత్కారం పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకం (అనగా సత్యమైన దాన్ని అసత్యమైన దాన్ని కనిపెట్టడం) వైరాగ్యం (అసత్యమైన దాని పట్ల అభిమానం లేకపోవడం) మొలకలెత్తి క్రమంగా ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తుంది. అహంకారం రాలిపోనిదే, పిసినారితనం నశించనిదే మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే, ఆత్మసాక్షాత్కారానికి అవకాశం లేదు. దేహమే 'నేను' అనుకోవడం గొప్ప భ్రమ. ఈ అభిప్రాయం పట్ల అభిమానం ఉండడమే బంధానికి కారణం. నీవు ఆత్మసాక్షాత్కారం కోరుకున్నవాడివి అయితే ఈ అభిమానాన్ని విడిచిపెట్టాలి.
9. గురువు యొక్క ఆవశ్యకత:
ఆత్మజ్ఞానం అత్యంత సూక్ష్మం, నిగూఢమైనది, ఎవ్వరైనా తమ స్వశక్తితో దాన్ని పొందడానికి ఆశించరు. కాబట్టి ఆత్మసాక్షాత్కారం పొందిన ఇంకొకరి (గురువు) సహాయం అత్యంత అవసరం. గొప్ప కృషి చేసి, శ్రమించి ఇతరులు ఇవ్వలేని దాన్ని అతి సులభంగా గురువు నుండి పొందవచ్చును. వారు ఆ మార్గంలో నడిచి ఉన్నారు కాబట్టి శిష్యుడిని సులభంగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమంగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పైమెట్టుకు తీసుకుని వెళ్ళగలరు.
10. భగవంతుడి కటాక్షం:
ఇది అన్నిటికంటే అత్యంత అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకాన్ని, వైరాగ్యాన్ని కలగజేసి సురక్షితంగా భవసాగరం నుండి తరింప చేయగలడు. ‘వేదాలను అభ్యసించడం వల్ల గాని మేథాశక్తి వల్ల గాని పుస్తక జ్ఞానం వల్ల గాని ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరిస్తుందో వారే దాన్ని పొందగలరు. అలాంటి వారికే ఆత్మ తన స్వరూపాన్ని తెలియచేస్తుంది' అని కఠోపనిషత్తు చెపుతుంది.
ఈ ప్రసంగం ముగిసిన తరువాత బాబా ఆ పెద్దమనిషి వైపు తిరిగి 'అయ్యా! నీ జేబులో బ్రహ్మం యాభై ఇంతలు 10 రూపాయల నోట్ల రూపంలో (250) వుంది. దయచేసి దాన్ని బయటికి తీయి' అన్నారు. ఆ పెద్దమనిషి తన జేబులోనుండి నోట్లకట్టను బయటకు తీశాడు. లెక్కపెట్టగా సరిగ్గా 25 పదిరూపాయల నోట్లు ఉన్నాయి. అందరు ఎంతో ఆశ్చర్యపడ్డారు. బాబా సర్వజ్ఞతను చూసి వాడి మనస్సు కరిగింది. బాబా పాదాలపై పడి వారి ఆశీర్వాదం కోసం వేడుకున్నాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు 'నీ బ్రహ్మపు నోట్ల కట్టను చుట్టిపెట్టు, నీ పేరాశను, లోభాన్ని పూర్తిగా వదలనంతవరకు నీవు నిజమైన బ్రహ్మాన్ని చూడలేవు. ఎవరి మనస్సు ధనం పట్ల, సంతానం పట్ల, ఐశ్వర్యం పట్ల లగ్నమై ఉంటుందో వాడు ఆ అభిమానాన్ని పోగొట్టుకోనంత వరకు బ్రహ్మాన్ని ఎలా పొందగలడు? అభిమానం అనే భ్రమ, ధనం పట్ల తృష్ణ, దుఃఖం అనే సుడిగుండం వంటిది. అది అసూయ అహంభావం అనే మొసళ్ళతో నిండి వుంది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మత్రమే ఈ సుడిగుండాన్ని దాటగలడు. పేరాశా, బ్రహ్మజ్ఞానం ఉత్తర దక్షిణ ధృవాలవంటివి. అవి శాశ్వతంగా ఒకటికొకటి బద్ధ వైరం కలవి.’
ఎక్కడ పేరాశ ఉంటుందో అక్కడ బ్రహ్మం గురించి ఆలోచించడానికి గాని, దాని ధ్యానానికి గాని తావులేదు. అలా అయినట్లయితే పేరాశగలవాడు విరక్తిని, మోక్షాన్ని ఎలా సంపాదించగలడు? లోభికి భ్రాంతిగాని, సంతృప్తిగాని, దృఢనిశ్చయంగాని ఉండవు. మనస్సులో మాత్రమే పేరాశ వున్న సాధనాలు అన్నీ (ఆధ్యాత్మిక ప్రయత్నాలు) నిష్ప్రయోజనాలు.
ఎవడు ఫలాపేక్ష రహితుకాడో, ఎవరు ఫలాపేక్ష కాంక్షను విడిచిపెట్టడో, ఎవడికి వాటిపట్ల విరక్తి లేదో అలాంటి వాడు చదువుకున్నవాడు అయినప్పటికీ వాడి జ్ఞానం ఎందుకూ పనికిరాదు. ఆత్మసాక్షాత్కారం పొందడానికి వాడికి సహాయపడదు. ఎవరు ఆహంకారపూరితులో, ఎవరు ఇంద్రియ విషయాల గురించి ఎల్లప్పుడూ చింతిస్తారో, వారికి గురుబోధలు నిష్ప్రయోజనాలు. మనస్సును పవిత్రం చేసుకోవడం తప్పనిసరి అవసరం. అది లేనట్లయితే మన ఆధ్యాత్మిక ప్రయత్నాలు అన్నీ ఆడంబరం డాంభికం కోసం చేసినట్లు అవుతుంది. కాబట్టి దేన్నీ జీర్ణించుకోగలడో దేన్నీ శరీరానికి పట్టించుకోగలడో దాన్నే వాడు తీసుకోవాలి. నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికి ఏది కావలసినా దాన్ని వారికి ఇవ్వగలను. కానీ వాడికి పుచ్చుకునే యోగ్యతా వుందా లేదా? అని నేను మొదట పరీక్షించాలి. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విన్నట్లయితే నీవు తప్పక మేలు పొందుతావు. ఈ మసీదులో కూర్చుని నేను ఎప్పుడూ అసత్యాలు పలకను!’
ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంట్లోనివారు, అక్కడ ఉన్నవారు, స్నేహితులు, బంధువులతో, అతిథితో పాటు విందులో పాల్గొంటారు. కాబట్టి అప్పుడు మసీదులో ఉన్నవారందరూ బాబా ఆ పెద్దమనిషికి చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొన్నారు. బాబా ఆశీర్వాదాలను పొందిన తరువాత అక్కడ ఉన్నవారందరూ ఆ పెద్దమనిషితో సహా, సంతోషంతో సంతృప్తి చెందినవారై వెళ్ళిపోయారు.
బాబావారి వైశిష్ట్యము
అనేకమంది సన్యాసులు ఇళ్ళు విడచి అడవులలోని గుహలలోను, ఆశ్రమంలోను, వొంటరిగా వుండి జన్మరాహిత్యాన్నిగాని, మోక్షాన్నిగాని సంపాదించడానికి ప్రయత్నిస్తుంటారు. వారు మిగతా వారి గురించి ఆలోచించకుండా ఆత్మనుసంధానంలోనే మునిగి ఉంటారు. సాయిబాబా అలాంటి వారు కాదు. బాబాకు ఇల్లుగాని, భార్యగాని, సంతానంగాని, బంధువులుగాని లేరు. అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండేవారు. బాబా నాలుగైదు ఇళ్ళ నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేపచెట్టు క్రిందనే కూర్చుని ఉండేవారు. లౌకిక విషయాలపట్ల నిమగ్నులైన జనాలకి, ఈ ప్రపంచంలో ఎలా ప్రవర్తించాలో బోధించేవారు. ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత కూడా ప్రజల క్షేమం కోసం పాటుపడే సాధువులు, యోగులు మిక్కిలి అరుదు. అలాంటి వారిలో శ్రీసాయిబాబా ప్రథమ గణ్యులు.
కాబట్టి హేమాడ్ పంత్ ఇలా చెప్పారు 'ఏ దేశంలో సాయిబాబా అనే ఈ అపూర్వం, అమూల్యం అయిన పవిత్ర రత్నం పుట్టిందో ఆ దేశం ధన్యం! ఏ కుటుంబంలో వీరు పుట్టారో అది కూడా ధన్యం! ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టారో వారు కూడా ధన్యులు!’
పదహారు - పదహేడవ అధ్యాయాలు సంపూర్ణం
పద్దెనిమిది - పందొమ్మిదవ అధ్యాయాలు
Note: HTML is not translated!