Narasimha Jayanti

నారసింహ జయంతి

శ్రీ మహావిష్ణువు సాధు పరిరక్షణ, దుష్టశిఖన కోసం యుగయుగాన వివిధ అవతారాలలో అవతరించాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారాలు అని అంటారు. వాటిలో ముఖ్యమైన పది అవతారాలను దశావతారాలు అని అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారమే నారసింహ అవతారము. నరసింహస్వామి వైశాఖ శుద్ధ చతుర్థశి రోజున ఉద్భవించాడు ఈ రోజునే విష్ణు భక్తులు నృశింహ జయంతి, నారసింహ జయంతిగా ఉత్సవాలు జరుపుకుంటారు. స్వామివారు వైశాఖ మాస శుక్ల పక్షంలో పూర్ణిమ ముందు వచ్చే చతుర్థశి రోజు ఉభయ సంధ్యలకు నడుమ అనగా సాయంకాల సంధ్యా సమయంలో ఇటు పగలు గాని అటు రాత్రి కాని వేళలో ఇటు నరుడిగానూ కాక అటు జంతువుగా కాకుండా నారసింహ అవతారంలో ఉద్భవించాడు. స్వామివారు ఈ విధంగా ఉద్భవించడానికి వెనుక గాథ ఉన్నది.

వైకుంఠ ద్వార పాలకులు, విష్ణుసేవా తత్పరులు అయిన జయ విజయులు ఒకసారి సనకసనందనాది మునులు శ్రీమన్నారాయణుని దర్శనార్థమై వైకుంఠానికి వచ్చారు. వారు లోనికి ప్రవేశించు సమయంలో జయవిజయులు ఇది తగిన సమయం కాదని వారిని అడ్డగించారు. దానికి కోపోద్రిక్తులైన విష్ణు లోకానికి దూరం అవ్వండి అని శపించారు. అప్పుడు వారు శ్రీ మహావిష్ణువును జయవిజయులు శరణు కోరుకోగా దయార్థ్ర హ్రుదయుడైన నారాయణుడు మహర్షుల శాపానికి తిరుగులేదు కాబట్టి మీరు నా భక్తులు కనుక మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను. మీరు నా భక్తులుగా ఏడు జన్మలు గానీ, విరోధులుగా మూడు జన్మలు గానీ భూలోకంలో జన్మించిన తరువాత మళ్ళీ వైకుంఠానికి చేరుకుంటారు అని తెలుపగా వారు మీకు దూరంగా ఏడు జన్మలు ఉండలేము, విరోధులుగా మూడు జన్మలు ఎత్తుతామని తెలిపారు. తరువాత జయవిజయులే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకషిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపరయుగంలో శిశిపార దంతవక్త్రులుగా జన్మించారు. కశ్యప ప్రజాపతి భార్య అయిన దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అనే మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షుడు బలగర్వంతో దేవతలను ఓడించి భయభ్రాంతులను చేశాడు. పాతాళాంతరగత అయిన భూదేవిని శ్రీవరాహ అవతారంలో ఉద్ధరిస్తున్న శ్రీమహావిష్ణువును యుద్ధానికి కవ్వించాడు. అప్పుడు జరిగిన భీకరమైన యుద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు. సోదరుడి మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చి మంత్రులకు రాజ్యపాలనా భారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందగిరికి వెళ్ళి ఘోరమైన తపస్సు ఆచరించాడు. అతని ఘోరమైన తపస్సు ఉఓగ్రతకు ముల్లోకాలు కంపించసాగాయి, అతని శరీరం కేవలం ఎముకలగూడు అయింది. హిరణ్యకశిపుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండలంలోని జలప్రోక్షణతో అతని శరీరాన్ని నవయవ్వనంగా చేసి వరం కోరుకోమన్నాడు. హిరణ్య కశిపుడు విధాతకు ప్రణమిల్లి తనకు గాలిలోగాని, ఆకాశంలోగాని, భూమిపైనగాని, నీటిలోగాని, అగ్నిలోగాని, రాత్రిగాని, పగలుగాని, దేవదానవ మనుష్యులచేత కాని, జంతువులచేత కాని, ఆయుధములచేత కానీ, ఇంట్లో కాని, బయట కాని మరణం ఉండకూడదని కోరుకున్నాడు. బ్రహ్మ తథాస్తు అని వరం ప్రసాదించి అంతర్థానమయ్యాడు. తపస్సమాధిలో ఉన్న హిరణ్యకశిపుడి రాజ్యం దేవతలు దండెత్తి క్రూరంగా కొల్లగొట్టారు అంతే కాక గర్భవతి అయిన హిరణ్యకశిపుడి భార్యను ఇంద్రుడు చేరపట్టాడు. ఆ సమయంలో ఇంద్రుడిని మందలించి ఆమెను రక్షించి తన ఆశ్రమానికి తీసుకుని వచ్చాడు నారదుడు. ఆశ్రమంలో నారదుడు ఉపదేశించిన తత్వబోధను గర్భస్థుడైన ప్రహ్లాదుడు గ్రహించాడు. రాజ్యానికి తిరిగి వచ్చిన హిరణ్యకశిపుడికి నారదుడు అతని భార్యను అప్పగించాడు. ప్రహ్లాదుడు పుట్టిన తరువాత హరినామ సంకీర్తన చేయడం ప్రారంభించాడు. ఎల్లవేళలా పరమ భాగవతుడు, అచ్యుతపద శరణాగతుడు. అటువంటి ప్రహ్లాదుడికి విద్యను నేర్పించమని, తమ రాజ ప్రవృత్తికి అనుగుణంగా మలచమని రాక్షసరాజు తమ కులగురువులైన చండామార్కులకు అప్పగించాడు. గురుకులంలో తోటి విద్యార్థులకు కూడా నారాయణుని ఎల్లవేళలా స్మరించమని వారిని కూడా నారాయణ నామ స్మరణ ప్రారంభించారు. ఒకసారి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని పిలిపించి ఏం నేర్చుకున్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రహ్లాదుడు 'సర్వము అతని దివ్యకళామయము అని తలచి విష్ణువు పట్ల హృదయాన్ని లగ్నం చేయుట మేలు' అని బదులిచ్చాడు. రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది? హరి గిరి అని ప్రేలుతున్నావు అని గద్దించాడు. దానికి ప్రహ్లాదుడు తనకు విష్ణు భక్తి దైవయోగం వల్ల సహజంగా సంభవించింది అని జవాబిచ్చాడు.      

గురువులు హిరణ్యకశిపుని క్షమాపణ కోరుకుని ప్రహ్లాదుడికి మంచి విద్యాబుద్ధులు అందిస్తామని చెప్పి తిరిగి గురు కులానికి తీసుకువెళ్ళారు. మళ్ళీ ప్రహ్లాదుడికి తమ విద్యలు నూరిపోసి, రాజు దగ్గరికి తిరిగి తీసుకువచ్చారు. మరలా హిరణ్యకశిపుడు గురుకులంలో ఏమి నేర్చుకున్నావు అని అడిగాడు. దానికి ప్రహ్లాదుడు నారాయణుని కీర్తిచడం ప్రారంభించాడు. సర్వాత్ముడైన హరిని నమ్మి సజ్జనుడై ఉండటం భద్రం, శ్రీహరిని భక్తిలేని బ్రతుకు వ్యర్థము, విష్ణువుని సేవించు దేహము ప్రయోజనకరం, ఆ దేవదేవుని గురించి చెప్పేదే సత్యమైన చదువు, మాధవుని గురించి చెప్పేవాడే సరైన గురువు, హరిణి చేరమని చెప్పేవాడే ఉత్తమమైన తండ్రి అని వివరించాడు.  మండిపడిన హిరణ్యకశిపుడు తన శతృవు అయిన శ్రీమహావిష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుడిని కఠినంగా శిక్షించమని తన భటులను ఆదేశించాడు. ప్రహ్లాదుడిని వారు శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటలలో కాల్చినా, కొండలపై నుండి తోసేసినా హరినామ స్మరణ చేస్తున్న ప్రహ్లాదుడికి ఎటువంటి హాని కలగలేదు. మరొక అవకాశం ఇవ్వమని రాక్షస గురువు ప్రహ్లాదుడిని గురుకులానికి తిరిగి తీసుకువెళ్ళాడు. అయినా ప్రహ్లాదుడు అక్కడ మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్షమార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇది చూసిన రాక్షస గురువు ఇక భరింపశక్యం కాకపోవడంతో మిగిలిన పిల్లలు కూడా ప్రహ్లాదుడిని అనుసరిస్తున్నారని హిరణ్యకశిపుడితో మొరపెట్టుకున్నాడు. కోపంతో రగలిపోయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని పిలిచి నేనంటే సకల భూతాలూ భయపడతాయి, దిక్పాలకులు నా సేవకులు, ఇక నీకు దిక్కు ఎవరు? బలం ఎవరు? అని గద్దించాడు. దానికి సమాధానంగా ప్రహ్లాదుకు చిరునవ్వులు చిందిస్తూ అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కు అన్నాడు. శ్రీమన్నారాయణుడు సకల జీవులలోనూ, ఎందెందు వెతికినా కనిపిస్తాడు అని వాదించడంతో కోపంతో హిరణ్యకశిపుడు అయితే ఈ స్తంభంలో చూపగలవా అని ఒక స్తంభాన్ని చూపించాడు. బ్రహ్మ నుండి గడ్డిపోచ వరకూ విశ్వాత్ముడై ఉండేవాడు ఈ స్తంభంలో ఎందుకు ఉండడు? స్తంభంలోనూ ఉంటాడు, మీకు సందేహం అవసరంలేదు అని బదులిచ్చాడు. క్రోథంతో హిరణ్యకశిపుడు సరే చూద్దాం, ఈ స్తంభంలో విష్ణువు లేకపోతే నీ తల తీయిస్తాను. అప్పుడు హరి వచ్చి నన్ను అడ్డుకుంటాడా? అన్ని హిరణ్యకశిపుడు స్తంభాన్ని గధతో స్తంభంపై చరిచాడు. అంతే స్తంభం బ్రద్దలై అందులో నుండి భయంకర ఆకారుడైన తల సింహం, మొండెం మనిషి ఆకారంలో నృసింహ అవతారంలో బయల్పడి గర్జిస్తూ పగలూ రాత్రి కాని సంధ్యాసమయంలోఇంతా బయటా కాకుండా గుమ్మంలో, భూమిపైనా ఆకాశంలో కాకుండా ఆయుధాలు కాని గోళ్ళతో హిరణ్యకశిపుడిని తన తొడలమీద పడుకోబెట్టి పొట్ట చీల్చి సంహరించాడు. అటు బ్రహ్మ ఇచ్చిన వరం కాని ఇటు ప్రహ్లాదుడు చెప్పిన విశ్వంతర్యామి అనే మాటలో కాని తప్పు లేకుండా హిరణ్యకశిపుడు ముట్టుబెట్టాడు. నృశింహస్వామి వైశాఖ శుద్ధ చతుర్థశినాడు వారి జయంతిని జరుపుకుంటాము. కాబట్టి ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి తలస్నానం చేసి శ్రీనృసింహస్వామివారిని కొబ్బ్బరినీల్లతో, తేనెతో, ఆవుపాలతో, శ్రీ సూక్త, పురుష సూక్త సమన్వితంగా అభిషేకించి శ్రీ నారసింహ సహస్రనామ స్తోత్రం చేయాలి. స్వామివారికి వడపప్పు, పానకం నివేదన చేయాలి. ఈ రోజు ఉపవాసం చేయాలి. ఈ విధంగా నృసింహ జయంతిని జరుపుకోవాలి.  

0 Comments To "Narasimha Jayanti"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!