మాఘమాస స్నానానికి సంబంధించిన కథను గురించి తెలుసుకుందాము ...
మాఘమాసంలోని ముప్పై రోజులలో ప్రతిరోజూ నియమనిష్టలతో స్నానాలు, వ్రతాలు, పూజలు, పురాణ పఠనం, శ్రవణం చేయడం శ్రేష్ఠం అని అంటున్నారు పండితులు. పూర్వం రఘువంశంలోని సుప్రసిద్ధ మహారాజైన దిలీపుడు ఒక రోజున వేటకై హిమాలయ పర్వత శ్రేణులకు వెళ్ళి అక్కడ వున్న ఒక సరస్సు సమీపానికి వెళ్ళాడు. అక్కడ ఒక అపరిచితుడైన ముని దిలీపుడికి ఎదురయ్యాడు. ఆయన రాజును చూసి మాఘమాసం ప్రారంభమైంది. నీవు మాఘస్నానం చేసినట్లు లేదు, త్వరగా మాఘస్నానం చెయ్యి అని చెప్పి, మాఘస్నాన ఫలితాన్ని గురించి రాజగురువు అయిన వశిష్టుడిని అడిగితె ఇంకా వివరంగా తెలుపుతాడు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. దిలీపుడు ముని చెప్పినట్లే స్నానం చేసి రాజ్యానికి తిరిగి వెళ్ళాక వశిష్ఠ మహర్షిని మాఘమాసస్నాన ఫలితం వివరించమని వేడుకున్నాడు. దానికి వశిష్ఠుడు ఈ విధంగా తెలిపాడు. మాఘంలో ఒకసారి ఉషోదయ స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం. ఇక మాఘమాసం అంతా చేస్తే ప్రాప్తించే ఫలం అంతా ఇంతా కాదు అని తెలిపి ... 'పూర్వం ఒక గంధర్వుడు ఒక్కసారి మాఘస్నానం చేస్తేనే ఆయన మనస్తాపం అంతా సమసిపోయింది. గంధర్వుడి శరీరం అంతా బాగున్నా ముఖం మాత్రం పూర్వజన్మ కర్మ వల్ల వికారంగా ఉండేది. ఆ గంధర్వుడు భృగుమహర్షి వద్దకు వెళ్ళి తన బాధ అంతా చెప్పుకున్నాడు. తనకు ఎన్నో సంపదలు, శక్తులు ఉన్నా ముఖం మాత్రం పులి ముఖాన్ని తలపించేలా వికారంగా ఉందని, ఏం చేసినా అది పోవటం లేదా అని తెలిపాడు. గంధర్వుడి వ్యథను అర్థం చేసుకున్న భృగుమహర్షి అది మాఘమాసం అయినందువల్ల వెంటనే వెళ్ళి గంగానదిలో స్నానం చేయమని, పాపాలు, వాటివల్ల సంక్రమించే వ్యథలు నశిస్తాయని అన్నాడు. వెంటనే గంధర్వుడు సతీసమేతంగా వెళ్ళి మాఘస్నానం చేశాడు. భృగుమహర్షి తెలిపిన విధంగానే గంధర్వుడి పూర్వజన్మకు సంబంధించిన పాపాలు నశించిపోయి ముఖం అందంగా మారిపోయింది.
Note: HTML is not translated!