భీష్మ ఏకాదశి విశిష్టత ?
పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం ఈ మూడు కాంతి మార్గాలు అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ తెలిపాడు. మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైన రోజు. భీష్మ పితామహుడు నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కాబట్టి ఈ రోజును భీష్మ ఏకాదశి అని తన పేరిట బహుమానంగా పొందిన పురాణ పురుషుడు. భీష్మ పితామహుడు తన తండ్రి శంతన ద్వారా స్వచ్చంద మరణం వరాన్ని పొందాడు. నలభై రోజుల పాటు అంపశయ్యపై వుండి మాఘమాస అష్టమినాడు తన ప్రాణాలను విడిచాడు. భీష్ముడు అన్ని రోజులు అంపశయ్య మీద ఎందుకున్నాడు అంటే ... ఆయనకు తాను చేసిన దోషం ఒకటి జ్ఞాపకం ఉంది, చేసిన ప్రతి దోషం శరీరంపై రాసి ఉంటుందట, అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఆ దోషం ఏమిటంటే ... ద్రౌపదికి నిండు కురుసభలో జరిగిన వస్త్రాపహరణం. వస్త్రాపహరణం జరుగుతున్నా భీష్మాచార్యుడు అడ్డుకోలేదు. అంపశయ్యపై ఉన్న భీష్ముడు వర్ణాశ్రమ ధర్మాలు, రాజ ధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్షధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, స్త్రీ ధర్మాలు, దాన ధర్మాలు ధర్మరాజుకు తెలిపాడు. శ్రీ కృష్ణ పరమాత్మ ఎదుటే ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలను ఉపదేశించాడు. భీష్మ పితామహుడు ధర్మరాజు సందేహాలను తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ 'తాతా ఆనాడు నాకు అవమానం జరుగుతూ వుంటే అప్పుడు ఏమయ్యాయి ఈ ధర్మాలు?' అని ప్రశ్నించిందట. దానికి బీష్మపితామహుడు ... నా దేహం దుర్యోదనుడి ఉప్పు తిన్నది, అది నా ఆధీనంలో లేదు. నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేశాను కాబట్టే ఈ పాప ప్రక్షాళన కోసం ఇనాళ్ళూ ఈ అంపశయ్యపై పడి ఉన్నాను' అని బదులు చెప్పాడట. కేవలం తండ్రికి ఇచ్చిన మాట కోసం కట్టుబడి మౌనంగా ఉండిపోయాడు. భీష్ముడు ద్రౌపదితో ఇలా అన్నాడు. కృష్ణ భక్తిలో ఎటువంటి కల్మషం లేదు. కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను. అందుకు ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చు అని పలికాడు. ఆ నామాలు నేటికీ ఎంతో ప్రాచుర్యం పొందింది. భీష్మ పితామహుడు ఇలా భక్తి, జ్ఞాన వంటివాటిలో గొప్ప కృషి చేసినందువల్లనే ఈ నాటికీ అందరికీ ఆయన మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు. భీష్మ పితామహుడికి పిల్లలు లేరు కానీ అపుత్రుకుడిగా మరణించినప్పటికీ సంప్రదాయాన్ని పాటించే వారంతా తమ పితృదేవతలకు పితృతర్పణాలు ఇచ్చే సమయంలో భీష్మపితామహుడికి కూడా తర్పణాలు అర్పిస్తుంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన తిథులలో ఏకాదశి ముఖ్యమైనది. అందుకే దీనికి 'హరివాసరము' అని కూడా అంటారు. ఏకాదశి తిథిన ఉపవాసం వుండి భగవన్నామ స్మరణం, జపాలు, పారాయణలతో, విష్ణునామ పఠనం తో భగవంతుడికి స్మరిస్తూ ఉంటారు.
Note: HTML is not translated!