మాఘమాసస్నాన పుణ్య ఫలితాలను వివరించే కథ
పూర్వం ఆంధ్రదేశంలోని ఒక పట్టణంలో సుమంతుడు అనే వాడు ఉండేవాడు. అతని భార్యపేరు కుముద. ఆమె ఎంత ధర్మాత్మురాలో సుమంతుడు అంట అధర్మపరుడు. అడ్డదారిలో ధనం సంపాదించడమే కాకుండా ఏనాడూ దానధర్మాలు చేసేవాడు కాదు. సంపాదించినది అంతా లోభగుణంతో దాచిపెడుతూ ఉండేవాడు. ఒక రోజున సుమంతుడు ఎదో పనిమీద గ్రామం వదిలి వెళ్ళాడు. ఆ రోజున బాగా మబ్బులు పట్టి వర్షం కురవడం ప్రారంభించింది. ఆ అర్థరాత్రి సమయంలో వయసుమళ్ళిన ఒక సాధువు వానలో తడుస్తూ సుమంతుడి ఇంటిముందుకు వచ్చాడు. ఆ సమయంలో సుమంతుడి భార్య కుముద ఒక్కతే ఇంట్లో ఉంది. సాధువు ఆమెను బ్రతిమాలి ఆ రాత్రికి ఆ ఇంట్లోనే ఉంటాను అని అన్నాడు. కుముద పెద్దలను, వృద్ధులను గౌరవించటం, అతిథిమర్యాదలు చేయడం తెలిసిన ఉత్తమురాలు కాబట్టి ఆ సాధువును ఇంట్లోకి ఆహ్వానించి సపర్యలు చేసింది. దాంతో ఆ సాధువు వాన, చలి బాధలనుండి తప్పించుకుని హాయిగా నిద్రించాడు. కుముద కూడా వేరొక గదిలో నిడురించింది. సాధువు సూర్యోదయానికి ముందే మేల్కొని హరినామ సంకీర్తన చేయడం ప్రారంభించాడు. సంకీర్తనలు విన్న కుముద నిదుర లేచి చూసే సమయానికి ఆ సాధువు బయటకు వెళ్ళడం చూసి ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళుతున్నారు? అని అడిగింది. దానికి ఆ సాధువు ఇది మాఘమాసం కనుక నేను మాఘమాస స్నానానికి నదికి వెళుతున్నాను అని తెలిపాడు. మాఘమాస స్నాన వ్రతంపై ఆసక్తి కలిగిన కుముద మాఘమాస స్నాన వ్రతానికి సంబంధించిన విశేషాలు తెలుపమని, వాటివల్ల ఫలితాలు ఏమిటి తెలుసుకుని తాను కూడా మాఘమాసస్నాన వ్రతం చేసి పుణ్యఫలం పొందాలని అనుకుని సాధువుతో పాటు తాను కూడా మాఘమాసస్నాన వ్రతం ప్రారంభించింది. ఆ తరువాత కొద్ది రోజులకు ఆమె భర్త తిరిగి వచ్చాడు. ఉదయాన్నే అతడిని కూడా నిదురలేపి మాఘమాసం స్నానానికి రమ్మని కోరింది. దైవద్వేషి అయిన సుమంతుడు భార్య మాటలను లెక్కచేయక హేళన చేసి అవమానించి తాను స్నానానికి వెళ్ళకుండా ఉండటమే కాకుండా భార్యను కూడా వెళ్ళవద్దని అదుపుచేశాడు. దానికి నిరాకరించిన కుముద సద్భక్తి నిండిన మనస్సుతో నదీస్నానానికి బయలుదేరింది. అందుకు కోపోద్రిక్తుడైన సుమంతుడు ఒక కర్రను తీసుకుని ఆమె వంటపడ్డాడు. కానీ అప్పటికే ఆమె నదిలో హరినామ స్మరణతో మునుగుతూ స్నానం చేయసాగింది. భార్యపై కోపంతో సుమంతుడు కూడా నదిలోకి దిగి ఆమెను కొట్టే ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. అది తప్పించుకోవడానికి కుముద కర్రను పట్టుకుని లాగుతూ తప్పించుకునే ప్రయత్నం చేసే సమయంలో సుమంతుడు కూడా నదీనీళ్ళలో మునుగుతూ లేస్తూ ఉండడంతో అతడు కూడా స్నానం చేసినట్లయింది. ఎట్టకేలకు సుమంతుడు భార్యకు పట్టుకుని ఇంటికి లాక్కుని వచ్చాడు. ఆ తరువాత చాలా కాలం గడిచిన తరువాత అంత్యకాలంలో దైవికంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి పరమపదించారు. మాఘమాస స్నాన పుణ్యఫలం, దానధర్మాల ఫలితంగా కుముడను తీసుకుని వెళ్ళడానికి వైకుంఠం నుండి విష్ణు దూతలు రాగా, దైవదూషణ, అధర్మవర్తనలతో కాలం వెళ్ళబుచ్చిన సుమంతుడి కోసం యమదూతలు వచ్చారు. యమలోకంలోని చిత్రగుప్తుడు సుమంతుడి పాపాలను లెక్కగట్టి ఘోరమైన నరక శిక్షను విధించాడు. అయితే తన భార్యను మాఘమాసస్నానం చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో ఆమెను కొడుతూ పెనుగులాడుతున్న సమయంలో అనుకోకుండా అయినా సుమంతుడు నదిలో మునిగాడు కాబట్టి మాఘమాసస్నాన పుణ్యఫలితమే సుమంతుడికీ దక్కడంతో నరకశిక్షను తప్పించుకుని వైకుంఠానికి తీసుకువెళ్ళమని యమదూతలను ఆదేశించాడు చిత్రగుప్తుడు
Note: HTML is not translated!