కార్తీక పురాణము - మూడవరోజు పారాయణము
పంచమ అధ్యాయం
'ఓ శివధనుస్సంపన్నా! జనకరాజా! శ్రద్ధగా విను. మనం చేసిన పాపాలు అన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీకమాస వ్రతానికి మాత్రమే వుంది. కార్తీకమాసంలో విష్ణు సన్నిధిలో ఎవరయితే భగవద్గీతా పారాయణం చేస్తారో వారి పాపాలు అన్నీ కూడా పాము కుబుసంలాగా తొలగిపోతాయి. అన్డునీ పదీ-పదకొండూ అధ్యాయాలను పారాయణ చేసేవాడు వైకుంఠానికి క్షేత్రపాలకుడు అవుతాడు. ఎవరైతే కార్తీకమాసంలో తులసీ దళాలతో కాని, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కాని విష్ణుపూజ చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి, విష్ణుసమభోగాలను అనుభవిస్తాడు. ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవరి సన్నిధి అయినా, ఏ పురాణం అయినా సరే చదివేవాడు సర్వకర్మబంధు విముక్తులు అవుతారు.
కార్తీక వనభోజనం
శ్లో యం: కార్తీకే: సీతే వనభోజన మాచరేత్ !
సయాటి వైష్ణవం ధామం సర్వపాపై: ప్రముచ్యతే !!
కార్తీకమాస శుక్లపక్షంలో వనభోజనం చేసినవారు, పాపవిముక్తులు అయి విష్ణుదామాన్ని పొందుతారు. జప, హోమ, పూజా, భోజన, తర్పణ కాలాలలో పాపీ క్షుద్ర ఛండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచిపెట్టుకు పోతుంది. కాబట్టి, మహారాజా! కార్తీకమాస శుక్లపక్షం అన్ని రకాల వృక్షాలతో బాటుగా ఉసిరిచెట్టు కూడా వున్న తోటలోనే వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామం నుంచి, గంధం, పుష్పాలు, అక్షతలు పూజించి, యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి. ఇలా కార్తీకమాసంలో వనభోజనాన్ని ఎవరయితే నిర్వహిస్తారో, వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వపాపాల నుంచీ తెములుకుని, విష్ణులోకాన్ని పొందుతారు. జనకపతీ ! ఈ కార్తీక మహత్యాన్ని భక్తిశ్రద్ధలతో విన్న బ్రాహ్మణ కుమారుడు దుర్యోనీ సంకటం నుంచి రక్షింపబడ్డాడు. ఆ కథ చెబుతాను విను ...
దేవదాత్తోపాఖ్యానము
పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్భ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక దుర్మార్గుడు అయిన కుమారుడు కలిగాడు, అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి, అతగాడిని పాపవిముక్తుడిని చేయాలని సంకల్పం చేసుకుని 'నాయనా! రోజూ కార్తీక ప్రాతఃస్నానాన్ని ఆచరించు. సాయంత్రం హరిసన్నిధిలో దీపారాధానం చేస్తూ వుండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివి ఆవు' అని చెప్పాడు. కాని, దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణపుత్రుడు తాను అటువంటి కట్టుకథలను నమ్మను అనీ, కార్తీక వ్రతాన్ని ఆచరించను అనీ తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు విసిగిన దేవశర్మ తన కుమారిడిని 'అడవిలోని చెట్టుతొర్రలో ఎలుకవై పడివుండు' అని శపించాడు. శాపానికి భయపడిన ఆ బ్రాహ్మణకుమారుడు తండ్రి పాదాలపై పడి, తనకు తరోణోపాయం చెప్పమని కోరగా, ఆ తండ్రి 'నాయనా! నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా విన్తావో అప్పుడే నీ ఎలుకరూపం తొలగిపోతుంది' అని శాపవిముక్తిని అనుగ్రహించాడు.
దేవదాత్తుడి శాపవిముక్తి
తండ్రి శాపం కారణంగా అప్పటికప్పుడే ఎలుక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు, దట్టమైన అరణ్యంలో ఫలవంతం అయింది. అనేక జంతువులకు ఆధారమైన ఒక మహా వృక్షం తొర్రలో నివశిస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత, ఒకనొక సమయంలో మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీకస్నానం ఆచరించడానికి వచ్చి, ఆ ఎలుక వున్న చెట్టు మొదలు కూర్చుని తన శిష్యులకు పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడూ, పాపాల పుట్టా, అడవిజీవాలను హింసించి పొట్టపోసుకునే వాడూ అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనం వలన ఉపకారమే కానీ, అపకారం ఏనాడూ జరుగదు. అదే విధంగా విశ్వామిత్రుడు వంటి తపోదనుల దర్శనంతోనే రవ్వంత పశ్చాత్తాపంతోనూ, జ్ఞానీ అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి 'అయ్యా! మీరు చెప్పుకుంటున్న కథలు ఏమిటి? అవి వింటూ ఉంటే నాకు ఈ కిరాతక జీవితం మెడ చిరాకు పుడుతోంది. దయచేసి ఈ రహస్యం ఏమిటో చెప్పండి' అని అనగానే, అతనిలోని వివేకం విచ్చుకుంటున్న వైనం గమనించిన విశ్వామిత్రుడు 'నాయనా! మేం కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీకమాసంలో ఎవరైనా సరే తెలిసిగాని, తెలియకగాని స్నాన, దాన, జప, తప పురాణ శ్రవణాలు చేసినట్లయితే వారు వారి సర్వపాపాలనుండి విముక్తులు అవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జ్వీవన్ముక్తులు అవుతారు.' అని తెలిపాడు. ఈ విధంగా కిరతకుడికి చెపుతున్న కార్తీక మహత్యాన్ని విన్న వెంటనే తొర్రలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలేసి, పూర్వ బ్రాహ్మణ యువకుడి రూపాన్ని పొంది, విశ్వామిత్రుడికి అతని శిష్య బృందానికి ప్రమాణం చేసి తన పూర్వ కథను వినిపించి, ఆ ఋషులనుండి శలవు తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. తరువాత ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుడు, శిష్యబృందం ద్వారా కార్తీక మహత్యాన్ని పూర్తిగా తెలుసుకోవడం వలన జీవితంలో కిరాతడుడు అయి కూడా, తరువాత ఉత్తమగతులను పొందాడు. కాబట్టి ఓ జనకరాజా! ఉత్తమగతులను కోరుకునేవారు ప్రయత్నాపూర్వకంగా అయినా సరే కార్తీక వ్రతం ఆచరించాలి లేదా కనీసం కార్తీకమాస మహత్యాన్ని అయినా శ్రద్ధతో వినాలి.
పంచమ అధ్యాయం సమాప్తం
ఆరవ అధ్యాయం
శ్రీ వశిష్టుడు తిరిగి చెపుతున్నాడు ... రాజర్షీ, జనకా! ఈ కార్తీక మాసం ముప్పై రోజులు కూడా ఎవరైతే శ్రీమహావిష్ణువును కస్తూరీ, గంధాలతోనూ, పంచామృతం తోనూ అభిషేకిస్తే వారికి పదివేల అశ్వమేథాలు చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీకమాసం సంధ్యా సమయంలో విష్ణుసన్నిధిలో దీపారాధానం చేసినా, దీపదానం చేసినా వారు విష్ణులోకాన్ని పొందుతారు. పత్తిని శుభ్రపరచి, దానితో వత్తినిచేసి, బియ్యం పిండి లేదా గోధుమపిండితో ప్రమిదను చేసి, ఆవునేతిని పోసి, ఆ పత్తివత్తిని తడిపి వెలిగించి ఒక సద్బ్రాహ్మణుడిని ఆహ్వానించి, అతనికి దానం ఇవ్వాలి. నెల పొడుగునా ఈ విధంగా చేసి, చివరిరోజున వెండి ప్రమిదను, భమిడి వత్తినీ చేయించి, వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి పూజా నివేదనలు పూర్తిచేసి, బ్రాహ్మణులకు భోజనం పెట్టి, తరువాత తాము స్వయంగా ...
దీపదాన మంత్రం
మంత్రం: సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంప చ్చు భావాహం !
దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ !!
'జ్ఞానమునూ, సంపదలనూ, శుభాములనూ కలిగించేది ఏదైనా దీపదానాన్ని చేస్తున్నాను. దీనివలన నాకు నిరంతరమూ శాంతి - సుఖం ఏర్పడుగాక' అని చెబుతూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి. అలా చేసినవారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానం వలన విద్య, జ్ఞానం, ఆయువు వృద్ధి, తరువాత స్వర్గభోగాలూ కలుగుతాయి. మ్కనోవాక్కాయ కృత పాపాలు అన్నీ సమసిపోతాయి. నిదర్శనం కోసం ఒక కథను వినిపిస్తాను విను.
లుబ్థవితంతు మోక్షం పొందుట
పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాధ వితంతువు ఉండేది. ఆమె రోజూ భిక్షాటన చేసి వచ్చినదాంట్లో మంచి అన్నమూ, కూరలు విక్రయించి తానూ మిగిలిన అన్నంతో తృప్తి పడుతూ డబ్బును వెనకేయసాగింది. ఇతరుల ఇళ్ళలో వంటపనులు, కుట్టుపనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలంగా వారి దగ్గర కొంత డబ్బు తీసుకుంటూ ఉండేది. అదిగాక భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్యం ధనం ఆర్జించడంపైనే మనసుపడిన ఆ వితంతువు, డబ్బు సంపాదించడమే తప్ప ఏరోజూ హరినామ స్మరణ చేయడం కాని, హరికథనో, పురాణాలు వినడం కానీ, పుణ్య తీర్థాలు దర్శించడం కానీ, ఏకాదశీ ఉపవాసం కానీ చేసి ఎరుగదు. ఇటువంటి ఈ వితంతువు ఇంటికి దైవవశాన శ్రీరంగ యాత్రీకుడు అయిన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదు అని గుర్తించి, జాలిపడి ఆమెను మంచిదారిలో పెట్టాలనుకుని 'ఓ అమాయకురాలా! నేను చెప్పేది శ్రద్ధగా విని, ఆలోచించుకో. కేవలం చీమూ - నెత్తురూ, మాంసం - ఎముకలతో కూడుకుని సుఃఖదుఃఖాల లంపటం అయి ఉన్నదే తప్ప ఈ తోలుశరీరం వత్తి అశాశ్వతం అని తెలుసుకో. నెల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే పంచభూతాత్మకం అయినదే ఈ శరీరం, ఈ దేహం నశించగానే ఆ పంచభూతాలు కూడా ఇంటికొప్పుమీద కురిసి నలుదిక్కులకూ చెదరిపోయే వాన నీళ్ళలా చెదరిపోతాయి. నీటిమీద నురుగులాంటి నీ తనువూ నిత్యం కాదు. ఇది శాశ్వతం అని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతలా మసి కావడమే తప్ప మేలు అనేది లేదు. మొహాన్నేమే భ్రమలనూ వదిలిపెట్టు. దైవం ఒక్కడే శాశ్వతుడు అనీ, సర్వ భూతదయాకరుడు అనీ గుర్తించు. నిత్యమూ హరిచరణాలనే స్మరించు. కామం అంటే కోరిక, కోపం అంటే దురాగ్రహం, భయం అంటే ఆత్మానాత్మీయ భంగత, లోభం అంటే ధనవ్యయ చింత. మోహం అంటే మమతానురాగాలు ఇటువంటి ఏ ఆరింటినీ వదిలిపెట్టు. నా మాట విని, ఇకనుంచి అయినా కార్తీకమాసంలో ప్రాతఃస్నానాన్ని ఆచరించు. విష్ణుప్రీతి కోసం భగవంతునికి అర్పణంగా దీపదానం చెయ్యి. దానిద్వారా అనేక పాపాలనుండి రక్షించబడతావు. అని హితవు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు.
అతని మాటల మహిమ వలన ఆమెకు జ్ఞానోదయం అయింది. తను చేసిన పాపాలకోసం చింతించింది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించింది. అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసంలో వ్రత ఆచరణ ప్రారంభించింది. సూర్యోదయ వేళకల్లా చన్నీటి స్నానం, హరిపూజా, దీపదానం, తరువాత పురాణ శ్రవణం ఈ విధంగా కార్తీకమాసం నెలరోజులూ ఆచరించి, చివరిరోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై, చనిపోయి, విమానాన్ని అధిరోహించి, శాశ్వత సర్వభోగ సౌఖ్యాలను పొందింది. కాబట్టి, రాజా! కార్తీకమాసంలో అన్నింటికంటే ప్రధానమైనది దీపదానం. తెలిసిగాని, తెలియకగాని ఎవరైతే దీపదానం చేస్తున్నారో వారు తమ పాపాలను నశింప చేసుకున్నవారే అవుతున్నారు. దీన్ని వన్నా, చదివినా జన్మ సంసారబంధ విముక్తులై విష్ణుభక్తి పరాయణులు అవుతారు.
ఆరవ అధ్యామ సమాప్తం
మూడవరోజు పారాయణము సమాప్తం
Note: HTML is not translated!