Karthika Masam Day 13 Parayanam

 కార్తీక పురాణము - పదమూడవ రోజు పారాయణము


                    ఇరవై ఏడవ అధ్యాయము


విష్ణు ఉవాచ: "దూర్వాసా! బ్రాహ్మణుడవైన నీపట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై, ప్రాయోపవిష్టుడిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై వున్నాడు. నా సుదర్శనచక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఖిస్తున్నాడు. రాజయినందుకుగాను గో, బ్రాహ్మణరక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా, విప్రుడైవైన నీకు విపత్తు కలిగినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజదాననీతితోనే ధర్మ పరిపాలనం చేయాలి కాని, బ్రాహ్మణుడిని మాత్రం దండించకూడదు.


శ్లో     బ్రాహ్మణో బ్రాహ్మనై రెవ నిగ్రాహ్యో వేదనాదిభి: !
    సత్య ధర్మాది నిరతై: లోభ దంభ వివర్జితై: !!


దోషి అయిన బ్రాహ్మణుడిని -వేదనిదులు, సత్యధర్మ నిరతులు, లోభదంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి. బ్రాహ్మణుడు పాపంచేసి, ప్రాయశ్చిత్తం చేసుకోనప్పుడు వపనం, ధనహరణం, స్థాన భ్రష్టత్వం మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప, రాజు శిక్షించకూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుడిని చంపినా, తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా, ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్యాపాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుచేత, మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడవైన నీకు తనవల్లనే నీకు ప్రాణాపాయకరమైన సుదర్శన వేధ కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు. కాబట్టి, నువ్వు తక్షణమే అంబరీషుడి దగ్గరికి వెళ్ళు. తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది' అని విష్ణువు చెప్పగానే, దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరింపబడింది. భయగ్రస్తుడైన దూర్వాసుడినీ, అతనిమీదకు రానున్న సుదర్శనాన్నీ చూడగానే, అంబరీషుడు ఆ చక్రానికి ఎదురువెళ్ళి "ఓ సుదర్శనచక్రమా! నన్ను మన్నించు. భయభ్రాంతుడైన వాడినీ, అందునా బ్రాహ్మణుడిని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు'' అంటూనే ధనుర్థారియై, ఇంకా ఇలా చెప్పసాగాడు.


                    ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం


                    ఇరవైఎనిమిదవ అధ్యాయం ప్రారంభం 


"ఆగు! ఓ విష్ణుచక్రమా, ఆగు! ఈ బ్రాహ్మణవధ నీకు తగదు. చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు. ఈ దూర్వాసున్ని వదలని పక్షంలో నీతో యుద్ధానికి అయినా సరే నేను సిద్ధంగానే ఉన్నాను. రాజులకి యుద్ధమే ధర్మంగాని, యాచన చేయడం ధర్మం కాదు. విష్ణువు ఆయుధానివైన నీవు నాకు దైవస్వరూపానివే గనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు. అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదురించక తప్పదు. నిన్ను జయించగలిగినది అంటూ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసును. అయినా, నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచిచూడు. మరికొన్నాళ్ళపాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి వుండదలచుకుంటే శరణాగతుడైన దూర్వాసుడిని వదిలిపెట్టి వెళ్ళిపో, లేదంటే నిన్ను ఖచ్చితంగా నేలకూలుస్తాను'' అని క్షత్రియ ధర్మపాలన కోసం తనకీ దూర్వాసుడికీ మధ్య ధనుర్థారియై నిలబడిన అంబరీషుడిని ఆప్యాయంగా చూసి, అతని ధర్మనిర్వహణ మరింత పరీక్షించడం కోసం సుదర్శనచక్రం ఇలా పలుకసాగింది "అంబరీషా! నాతొ యుద్ధం అంటే సంబరం అనుకుంటున్నావా? మహాబలవంతులైన మధుకైటభులను, దేవలందరికీ అజేయులైన మరెందరో రాక్షసులని అవలీలగా నాశనం చేశాను నేను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరిచూడడానికైనా సమస్త ప్రపంచమూ కంపించిపోతుందో, అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుడిప్పుడు ఇలా ధిక్కారధీనుడై అవస్థ పడుతున్నాడు అంటే అది నా ప్రతాపమేనని మరిచిపోకు. ఉభయ తేజస్సంపన్నుడైన దూర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రియ అహంకార కారణం అయిన ఏకైక శివ తెజోమూర్తివి నువ్వు. నువ్వు నన్నేం, చేయగలవు? క్షేమం కోరుకునే వాడు బలవంతుడితో సంధి చేసుకోవాలేగాని, ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణుభక్తుడివి కాబట్టి ఇంతవరకూ నిన్ను సహించాను. లేనిపోని బీరాలకు పోయి, వృధాగా ప్రాణాలు పోగోట్టుకోకు'' ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరుపెక్కాయి. "ఏమిటి సుదర్శనా! ఎక్కువ మాట్లాడుతున్నావు? నా దైవం అయిన హరి ఆయుధానివని ఇంతవరకూ ఊరుకున్నాను గానీ, లేకుంటే నా బాణాలతో నిన్ను ఎప్పుడో నూరుముక్కలు చేసివుండే వాడిని. దేవ, బ్రాహ్మణులపైనా, స్త్రీలూ - శిశువుల మీదా, ఆవులమీదా నేను బాణప్రయోగం చెయ్యను. నువ్వు దేవతవైన కారణంగా నీకింకా నా క్రూర చరణఘాతాల రుచి తెలియపరచలేదు. నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలు ఉంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి (క్షాత్ర)ధర్మయుతంగా పురుషరూపిడివై యుద్ధం చెయ్యి'' అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు. అతని పౌరుషానికీ, ధర్మరక్షణాదీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శనచక్రం నరుడి రూపంలో చిరుదరహాసం చేస్తూ "రాజా! శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నిమంత్రించాడుగాని, నీతో కయ్యానికి కాదు. పరీక్షించేందుకు అలా ప్రసంగించానుగానీ, విష్ణుభక్తులతో నేను ఎప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగతుడు అయిన దూర్వాసున్ని వదిలివేస్తున్నా''నని చెప్పి, అంబరీషుడిని ఆలింగనం చేసుకున్నాడు. అంతటితో అంబరీషుడు ఆనందభరితుడై "సుదర్శనా! నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ, రాక్షసులను సంహరించడంలోనూ, విష్ణుతుల్య ప్రకాశమానమూ, ప్రాణగమన కష్టహారకమూ అయిన నీ ఉత్కృష్టతకి ఇవే నా నమస్కారాలు'' అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. సంతోషించిన సుదర్శనుడు, అంబరీషుడిని లేవనెత్తి, అభినందించి, అదృశ్యం అయ్యాడు. కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా, విన్నా అనేక భోగాలను అనుభవించి, అంత్యాన ఉత్తమ గతులను పొందుతారు.


                    ఇరవైఏడు, ఇరవై ఎనిమిది అధ్యాయాలు సమాప్తం


                    పదమూడవ (త్రయోదశి)నాటి పారాయణం సమాప్తం

 

0 Comments To "Karthika Masam Day 13 Parayanam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!