లక్ష్మిదేవి ఎక్కడ స్థిరనివాసం ఉంటుంది?
లక్ష్మిదేవి ఎక్కడ స్థిరనివాసం ఉంటుంది? పచ్చని తోరణాలు, ఎంతో అందమైన ముగ్గులు, మంగళవాయిద్యాలు, దీపం, దైవం వున్నచోట్ల మహాలక్ష్మి ఎంతో ఆనందంగా నివసిస్తుంది. పరధనం, పరస్త్రీని, పరుల సొత్తును తృణంగా భావించే వారింట ఆ జగన్మాత నివసిస్తుంది. జీవనదులను, నిండు సరస్సులను, గోవు తోకయును, గోధూళియందును, బిల్వం, తులసి, అశ్వత్థం, మరువం, చంపకం, పారిజాతం, పద్మం, మల్లె, మామిడి, పత్ర పుష్పాదులు శ్రీ మహాలక్ష్మి నివసించు స్థానములు.
అతిథులను ఆదరించేవారు, తల్లిదండ్రులను సేవించేవారు, దానం, ధర్మం కలవారు, వినయవిధేయతలు కలవారు, సత్యశీలురైన విద్వాంసులు కల గృహములందు శ్రీ మహాలక్ష్మి నివసిస్తుంది. పసుపు, పారాణి, కుంకుమ, కాటుకలచే అందమైన ఆభరణాలచే అలరారు ముత్తైదువులు శ్రీ మహాలక్ష్మి స్వరూపులు.
అనాచారాలు, అన్నం వృధా చేయువారు, సూర్యోదయ, సూర్యాస్తమయ సమయంలో నిద్రించేవారు, ఎడమచేతితో ఇచ్చి పుచ్చుకునేవారు, మడి ఆచారం లేనివారు, స్త్రీ సంతాన ఆస్తిని అపహరించువారు, అతిథులను సంతృప్తి పరచనివారు, గురుపత్నిని, అన్నభార్యను, సవతి తల్లిని తల్లిగా భావించనివారు ఇటువంటివారు వున్న గృహములయందు శ్రీ మహాలక్ష్మి ఎటువంటి పరిస్థితులలోను నివసించదు. పరస్త్రీ వ్యామోహం, వ్యభిచారం, చౌర్యం, సోమరితనం, పెద్దలను ధిక్కరించువారు ఉన్నచోట ఆ మహాలక్ష్మి నివసించదు.
ఎవరైతే తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ నిత్యం దీపం వెలిగిస్తూ దేవతారాధన చేస్తూ, సత్యం పలుకుతూ ధర్మబద్ధ జీవితం కొనసాగిస్తూ ఇంటికి వచ్చిన అతిథిని సాక్షాత్తూ శ్రీమన్నారాయణునిగా భావిస్తూ, వారికి సకల మర్యాదలు చేసే వారింట శ్రీ మహాలక్ష్మి ఆనందంగా నివసిస్తుంది.
Note: HTML is not translated!