మంగళసూత్రంలోని నల్లపూసల ప్రాధాన్యత ?
హిందూ సాంప్రదాయంలో స్త్రీలు నల్లపూసల తాడుకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం అనేది ప్రాచీనకాలం నుండి వస్తుంది. నల్లపూసలు ఎంతో విశిష్టమైనవి, పవిత్రమైనవిగా భావించడం మన ఆచార వ్యవహారాలలో ఒక భాగమై పోయింది. వివాహ సమయంలో వధువు అత్తింటివారు, ఒక కన్యతో మంగళసూత్రానికి నల్లపూసలు చుట్టిస్తారు. మంగళసూత్రానికి వధూవరులతో నీలలోహిత గౌరికి పూజలు చేయిస్తారు. ఇలా చేయడం వలన నీలలోహిత గౌరీ అనుగ్రహంతో వధువు సౌభాగ్యం జీవితకాలంపాటు స్థిరంగా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. నీలలోహిత గౌరీ పూజ ప్రారంభించే ముందు నాకు వివాహం, సౌభాగ్యం, భాగ్యం, ఆరోగ్యము, పుత్రలాభం ప్రసాదించెదవు గాక అని ప్రార్థించి 'నీలలోహితే బధ్యతే' అనే మంత్రాన్ని చెప్పి ముత్యాలతోను, పగడాలతోనూ కూర్చబడిన సూత్రాన్ని కట్టాలి. నీలలోహిత గౌరిని పూజించడం వలన ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించడం వలన వధూవరులకి సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయి అని శాస్త్రం తెలియజేస్తుంది. మంగళసూత్రం భర్తకు తప్ప ఇతరులకు కనిపించే విధంగా పైన వేసుకోకూడదు. వేరొకరి దృష్టి పడితే మంచిది కాదు అని పండితులు చెబుతున్నారు. ఆధ్యాత్మికంగా చూసినట్లయితే హృదయ మధ్యభాగంలో అనాహత చక్రం ఉంది. గొంతుభాగంలో సుషుమ్న, మెడ భాగంలో విశుద్ధ చక్రం ఉంది. ఈ చక్రాలపై నల్లపూసలు ఉండడంచేత హృదయం, గొంతుభాగాలలో ఉష్ణం సమతులమై రోగాలు పరిహారం అవుతాయి.